సోనూసూద్ ఎందుకు కేజ్రీవాల్‌కు దగ్గరయ్యారు, ఇది రాజకీయాల్లోకి 'సాఫ్ట్‌లాంచ్‌' అనుకోవచ్చా?

సోనూసూద్, అరవింద్ కేజ్రీవాల్

ఫొటో సోర్స్, TWITTER@AAMAADMIPARTY

ప్రముఖ నటుడు సోనూసూద్ ఇటీవల సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ పతాక శీర్షికల్లో నిలుస్తున్నారు. ఆయన తాజాగా అరవింద్ కేజ్రీవాల్‌తో ఒక వేదికపై కనిపించారు.

సోనూ సూద్‌ను దిల్లీ ప్రభుత్వం ఒక కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించడం వెనుక అంత ప్రాధాన్యం ఏముంది?

కరోనా మహమ్మారి వ్యాపించిన సమయంలో చేసిన సామాజిక సేవతో దేశవ్యాప్తంగా చర్చల్లో నిలిచిన సోనూసూద్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతారా, లేదా అప్పుడే చెప్పలేం. కానీ, ఆయన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి ఒక వేదికపై కనిపించడం మరోసారి చర్చనీయాంశమైంది.

సోనూ సూద్‌ను 'దేశ్ కే మెంటర్' అనే కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటారని ఆ వేదికపై ప్రకటించారు. ఆ కార్యక్రమం ద్వారా స్కూలు పిల్లలకు భవిష్యత్ గురించి మార్గనిర్దేశం చేస్తారు. దిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం సెప్టెంబర్ మధ్య నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించనుంది.

ఈ సందర్భంగా జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన సోనూసూద్ తనకు రాజకీయాల్లోకి రావాలని ఎలాంటి ఉద్దేశం లేదని, తను బ్రాండ్ అంబాసిడర్ కావడానికి, రాజకీయాలకు ఏ సంబంధం లేదని చెప్పారు.

కానీ, ఈ కార్యక్రమం అరవింద్ కేజ్రీవాల్‌కు కచ్చితంగా రాజకీయ ప్రయోజనం చేకూరుతుందని ఆయనకు తెలిసే ఉంటుంది.

ఫొటో సోర్స్, ANI

రాజకీయ చర్చలు జరగలేదు

"మీరు సోనూసూద్‌తో రాజకీయాలపై కూడా చర్చించారా?" అని ప్రెస్ కాన్ఫరెన్స్ సమయంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను మీడియా అడిగినపుడు, ఆయన "లేదు లేదు మా మధ్య ఎలాంటి రాజకీయ చర్చలూ జరగలేదు" అన్నారు.

మరోవైపు "పిల్లల భవిష్యత్తు అనేది రాజకీయాల కంటే పెద్ద అంశం. చాలా కాలం నుంచీ రాజకీయాల్లో అడుగుపెట్టడానికి నాకు అవకాశాలు వస్తున్నాయి. కానీ, నాకు వాటిపై ఆసక్తి లేదు. నాకు అలాంటి ఉద్దేశమేదీ లేదు. ఈ కార్యక్రమం ఆలోచన మంచిది. దీనివల్ల కచ్చితంగా విద్యార్థులకు ఒక దిశానిర్దేశం లభిస్తుంది" అని సోనూ సూద్ కూడా చెప్పారు.

సోనూ సూద్ కరోనా మహమ్మారి సమయంలో నిస్సహాయ స్థితిలో ఉన్న ఎంతోమందికి నిత్యావసరాలు అందించడం, వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కూలీలను వారి స్వస్థలాలకు చేర్చడం లాంటి పనులతో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా సోషల్ మీడియాలో చర్చల్లో నిలిచారు.

కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆయన సాయానికి సంబంధించి ఎన్నో వీడియోలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో ఆయన స్వయంగా ఆక్సిజన్ సిలిండర్లు డెలివరీ చేయడం కనిపించింది. కరోనా బాధితులకు సాయం చేయాలని పిలుపునిచ్చిన ఆయన ఒక పెద్ద మొత్తాన్ని కూడా సేకరించగలిగారు.

ఫొటో సోర్స్, ANI

ఆమ్ ఆద్మీ పార్టీ ఆశలు

అందుకే ఆయనకున్న ఆ ఇమేజ్ రాజకీయంగా లబ్ధి చేకూరుస్తుందని, ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టవచ్చని కూడా అనుకున్నారు. సోనూసూద్‌ను చాలాసార్లు పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రశ్నలు కూడా అడిగారు. కానీ ఆయన వాటికి స్పష్టమైన సమాధానం చెప్పలేదు.

చాలాసార్లు ఆయన అధికార భారతీయ జనతా పార్టీలో చేరవచ్చనే ఊహాగానాలు కూడా వచ్చాయి. కానీ తాజాగా, అరవింద్ కేజ్రీవాల్‌, సోనూ సూద్ ఒకే వేదికపై కనిపించడం కచ్చితంగా అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఆమ్ ఆద్మీ పార్టీ ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగడానికి సన్నద్ధం అవుతోంది. పంజాబ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై కూడా కన్నేసింది.

సోనూ సూద్ పంజాబ్‌లోని మోగా జిల్లాలో పుట్టారు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీకి దగ్గరవడం వల్ల ఆ రాష్ట్రంలో అరవింద్ కేజ్రీవాల్ పార్టీ పరిస్థితి మళ్లీ మెరుగుపడవచ్చని భావిస్తున్నారు.

గత రండు ఎన్నికల్లో ఆశించిన దానికంటే మెరుగైన ప్రదర్శన ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీలో తర్వాత తీవ్ర విభేదాలు బయటపడ్డాయి.

పంజాబ్‌లో ఒక విధంగా ఆ పార్టీ చెదిరిపోయింది. ఇప్పుడు సోనూసూద్ వల్ల దానికి ఎంత లబ్ధి చేకూరుతుంది. ఈయన ప్రభావం ఏ మేరకు ఉంటుంది తెలియాలంటే, వేచిచూడాల్సి ఉంటుంది.

సోనూసూద్ తెలుగు, తమిళం, హిందీలో ఎన్నో హిట్ చిత్రాల్లో రకరకాల పాత్రలతో పాపులర్ అయ్యారు.

అయితే 2010 తర్వాత ఆయన హిందీ సినిమా కెరిర్ అంత జోరుగా నడవలేదు. దాంతో ఆయన హిందీ చిన్న బడ్జెట్ సినిమాలతోపాటూ వరసగా తెలుగు సినిమాలకు పరిమితం అయ్యారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)