తిరుమలలో ‘సంప్రదాయ భోజనం’ నిలిపివేత - టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ఏమిటీ ‘సంప్రదాయ భోజనం’, ఎందుకు ప్రారంభించారు? ఎందుకు ఆపేశారు?

  • అరుణ్ శాండిల్య
  • బీబీసీ ప్రతినిధి
సంప్రదాయ భోజనం/Tirumala Balaji

ఫొటో సోర్స్, Ttd

తిరుమలలో ప్రయోగాత్మకంగా మొదలు పెట్టిన 'సంప్రదాయ భోజనం'ను నిలిపివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.

గోఆధారిత ఉత్పత్తులతో తయారు చేసిన సాంప్రదాయ భోజనం భక్తులకు అందించాలని అధికారులు ఆలోచన చేశారని, దీన్ని నిలిపి వేస్తున్నామని ఆయన తెలిపారు.

అయితే, గోఆధారిత ప్రకృతి వ్యవసాయంతో పండించిన ఉత్పత్తులతో వేంకటేశ్వర స్వామికి నిత్యం సమర్పించే ప్రసాదాలను తయారు చేయిస్తున్నామని, మే 1 వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగే ఏర్పాట్లు చేశామన్నారు.

'సంప్రదాయ భోజనం' ఏమిటి?

తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు నిత్య అన్నదానం జరుగుతుంది.

దీనికి అదనంగా.. ఆగస్ట్ 26 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఈ సంప్రదాయ భోజనాన్ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చి పరిశీలిస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.

తొలి రోజు భోజనం చేసినవారి నుంచి మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చిందని, రెండో రోజు (27.08.2021) టీటీడీ ఈవో కూడా ఈ భోజనాన్ని ఆరగించారని అధికారులు చెప్పారు.

ఫొటో సోర్స్, Ttd

సంప్రదాయ భోజనం ఎందుకు?

పూర్తిగా దేశీయ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన ఆహార ఉత్పత్తులతో వండిన భోజనాన్నిభక్తులకు అందించాలని టీటీడీ నిర్ణయించింది.

దీన్నే 'సంప్రదాయ భోజనం' అని పిలుస్తున్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఇలాంటి భోజనాన్ని అందుబాటులో ఉంచారు.

దేశీయ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన పంటలతో వండిన ఆహార పదార్థాలు తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, కోవిడ్ సమయంలో శాస్త్రవేత్తలు కూడా ఇమ్యూనిటీ పెంచే ఆహారం గురించి చర్చిస్తున్నారని తితిదే ఈవో డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి చెప్పారు.

''పట్టణ వాసులతో పోల్చితే గ్రామాల్లో సహజ సిద్ధమైన, కల్తీ లేని ఆహారం తీసుకునే వారిలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆహారం తీసుకోవాల్సి అవసరాన్ని చాటడం కోసం, గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి సంప్రదాయ భోజనాన్ని తిరుమలలో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం'' అన్నారాయన.

లాభాపేక్ష లేకుండా శాశ్వత ప్రాతిపదికన దీన్ని అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు అప్పట్లో ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, TTD

'పూర్తిగా దేశీయ గో ఆధారిత ఉత్పత్తులతోనే'

గోవిందుడికి గో ఆధారిత నైవేద్యం సమర్పించాలని టీటీడీ బోర్డు గతంలో తీర్మానించి అమలు చేస్తోంది. అందులో భాగంగా దేశీయ గోవుల ఆధారంగా సేంద్రియంగా పండించిన బియ్యం, పప్పు దినుసులు, బెల్లం, దేశీయ ఆవు నెయ్యితోనే నైవేద్యం సమర్పిస్తున్నారు.

అదే రీతిలో భక్తులకు కూడా గోఆధారిత వ్యవసాయ ఉత్పత్తులతో ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఈ సంప్రదాయ భోజనాన్ని తీసుకొస్తున్నట్లు తితిదే పీఆర్‌వో టి.రవి 'బీబీసీ'తో చెప్పారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ''తితిదే ఆద్వర్యంలో పలమనేరులో సుమారు 450 ఎకరాల్లో దేశీ గోశాల ఉంది. సేంద్రియ ఎరువులు, పంచగవ్య వంటివన్నీ ఈ గోశాల నుంచి ఉత్పత్తవుతాయి. దీంతో పాటు చిత్తూరు జిల్లా రైతులలోనూ ఈ దిశగా అవగాహన కల్పించేందుకు కూడా తితిదే కృషి చేస్తోంది'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Ttd

ఫొటో క్యాప్షన్,

సంప్రదాయ భోజనాన్ని పరిశీలిస్తున్న టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి, ఇతర అధికారులు

తొలి రెండు రోజుల్లో...

ట్రయల్ రన్‌లో భాగంగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనాలలో వివిధ రకాల ఆహార పదార్థాలు వడ్డించారు.

కాలా బాత్ ఉప్మా, కుల్లకారు బియ్యం ఇడ్లీ.. రెడ్ రైస్‌తో వంటకాలు చేశారు. కొర్రలు, సామలు వంటి చిరుధాన్యాలతో వండిన పదార్థాలను వడ్డించారు. కొబ్బరి అన్నం, పులిహోర, పూర్ణాలు, పచ్చి పులుసు, దోశకాయ పప్పు వంటివి ఇప్పటికి 15 రకాలకు పైగా వంటకాలను భక్తులకు అందించారు.

భక్తుల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందని అధికారులు చెప్పారు.

ఈ ట్రయల్ రన్‌లో తితిదేతో పాటు పనిచేస్తున్న చిరుధాన్యాల ఆహార నిపుణుడు రాంబాబు మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టులో భాగంగా దేశీయ ఆవు నెయ్యి, గానుగ నూనె, సేంద్రియ చెరకు పంట నుంచి తయారుచేసిన బెల్లంతో వంటలు వండుతున్నట్లు చెప్పారు.

ఫొటో సోర్స్, Ttd

ఉచిత భోజనం ఉన్నప్పటికీ...

తిరుమలలో చాలాకాలంగా భక్తులకు ఉచితం భోజన సదుపాయం ఉంది. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో నిత్యం పెద్ద ఎత్తున ఉచిత అన్నదానం జరుగుతుంది.

అన్నమయ్య భవనంలో 'సంప్రదాయ భోజనం'ను కొన్ని రోజుల పాటు డబ్బులు వసూలు చేయకుండానే అందించారు.

''వారం రోజుల ట్రయల్ రన్ తరువాత దీనిపై సమీక్షించుకుని బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. లాభాపేక్ష లేకుండా శాశ్వత ప్రాతిపదికన అమలు చేయడానికి విధివిధానాలు రూపకల్పన చేస్తారు'' అని టి.రవి చెప్పారు.

అయితే, ఎంత వసూలు చేయాలనుకుంటున్నదీ స్పష్టంగా చెప్పలేదు. ట్రయల్ రన్ పూర్తయితే దీనిపై బోర్డు నిర్ణయం తీసుకోవాలన్నది ఆలోచన. కానీ, దానికంటే ముందే దీన్ని నిలుపుదల చేశారు.

ఫొటో సోర్స్, Ttd

కాగా, అన్నమయ్య భవనంలో ఇంతకుముందు ప్రైవేట్ నిర్వహణలోని క్యాంటీన్ ఉండేది. ఆ కాంట్రాక్ట్ ముగియడంతో టీటీడీయే స్వయంగా ఇక్కడ భక్తులకు ఆహార శాల నిర్వహించాలనే ఆలోచన చేసింది.

అయితే, లాభాపేక్ష లేకుండా అయిన ఖర్చుల మేరకు భక్తుల నుంచి సంప్రదాయ భోజనం చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించినప్పటికీ.. టీటీడీ ఉచిత అన్నదాన కార్యక్రమం కొనసాగుతున్నప్పటికీ.. దీనిపై విమర్శలు వచ్చాయి.

దీంతో సెప్టెంబర్ 2వ తేదీ వరకు కొనసాగాల్సిన ‘సంప్రదాయ భోజనం’ ప్రయోగం నాలుగు రోజుల ముందే ఆగిపోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)