ఆయుష్మాన్ భారత్ కంటే మోదీ ప్రతిష్టను పెంచే పథకాలపై ప్రచారాలకే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టిందా?

  • అర్జున్ పర్మార్
  • బీబీసీ న్యూస్ గుజరాతీ
మోదీ

ఫొటో సోర్స్, Getty Images

తాము ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఆరోగ్య బీమా పథకం కంటే కూడా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ జనాభా పట్టిక (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ - ఎన్ పీఆర్), వ్యవసాయ చట్టాలు లాంటి వివాదాస్పద చట్టాలపై తమ వైఖరిని ప్రచారం చేసుకోవడానికే కరోనావైరస్ విజృంభణ సమయంలో భారత ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో సొమ్మును ఖర్చుపెట్టింది.

2020లో భారత్‌లో కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్నప్పుడు కొన్ని లక్షల మంది ప్రజల వైద్య ఖర్చుల కోసం ఆయుష్మాన్ భారత్ - ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ -పీఎంజేఏవై) ద్వారా ఆర్ధిక సహకారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

మహమ్మారి విజృంభణ సమయంలో మోదీ ప్రభుత్వం ప్రకటనల కోసం వెచ్చించిన సొమ్ముకు ఇచ్చిన ప్రాధాన్యత గురించి బీబీసీ న్యూస్ గుజరాతీ‌కి చెందిన అర్జున్ పర్మార్ ఆర్టీఐ దాఖలుచేశారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ప్రచారం కోసం ఏప్రిల్ 2020 - జనవరి 2021 మధ్యలో రూ.212 కోట్లను ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అందులో కేవలం 0.01% అంటే రూ. 2,49,000 మాత్రమే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరోగ్య బీమా పథకం కింద వెచ్చించింది. ఈ సమాచారంలో అవుట్ డోర్ మీడియా ప్రచారం కోసం ఖర్చుపెట్టిన సొమ్ము వివరాలు లేవు.

ప్రపంచంలో ఆరోగ్య బీమా సదుపాయం సగటున 7.23% ఉంటే భారతదేశంలో అది కేవలం 3.76% మాత్రమే ఉన్నట్లు భారత ప్రభుత్వ తాజా ఆర్ధిక సర్వే చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

జార్ఖండ్‌లో ఓ మహిళకు ఆయుష్మాన్ భారత్ కార్డును అందిస్తున్న మోదీ

ప్రభుత్వం ఎలా వెచ్చించింది?

మోదీ ప్రభుత్వం ప్రచారం కోసం అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు పెడుతోందని చాలా సార్లు ఆరోపణలు ఎదుర్కొంది. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జనవరి 2021 వరకు కేవలం ప్రకటనల కోసం రూ.5749 కోట్లను ప్రభుత్వం ఖర్చు పెట్టింది.

ప్రస్తుత ప్రభుత్వం ఈ ధనాన్ని ఎక్కడ ఖర్చు పెడుతుందో తెలుసుకునేందుకు ఇండియన్ గవర్నమెంట్ బ్యూరో ఆఫ్ అవుట్ రీచ్ అండ్ కమ్యూనికేషన్ దగ్గర బీబీసీ ఆర్టీఐ నమోదు చేసింది. ప్రభుత్వ ప్రచార వ్యవహారాలను ఈ బ్యూరో నిర్వహిస్తుంది.

ఆర్టీఐకు సమాధానంగా బ్యూరో 2000 పేజీల పత్రాలను పంపించింది. అందులో మే 2004 - జనవరి 2021 వరకు ప్రింట్, టీవీ, డిజిటల్, అవుట్ డోర్ ప్లాట్ ఫార్మ్స్‌పై ప్రభుత్వం వెచ్చించిన ఖర్చుకు సంబంధించిన వివరాలున్నాయి.

అయితే, ఈ పత్రాలను పరిశీలిస్తే, దేశంలో మహమ్మారి తలెత్తినప్పుడు ప్రభుత్వం కోవిడ్ పట్ల అవగాహన పెంచడానికి బదులు తాము ప్రవేశపెట్టిన వివాదాస్పద చట్టాలను సమర్ధించుకోవడం కోసం అధిక మొత్తంలో ఖర్చు పెడుతోందని అర్ధమయింది.

Please wait...

పథక ప్రయోజనాలు ఎవరికి తెలుసు?

నెలవారీ ఆదాయం రూ. 10,000 కంటే తక్కువ ఉన్న ఆదాయ వర్గాల వారి కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ 2018లో ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రవేశపెట్టిన ఆరోగ్య బీమా 'ఒబామా కేర్'‌తో ఈ పథకాన్ని పోలుస్తూ దీన్ని 'మోదీ కేర్' అని మీడియాలో పిలవడం మొదలుపెట్టారు.

అయితే, దేశంలో కోవిడ్-19 కేసులు విజృంభించినప్పుడు, లోపాలతో కూడుకున్న ప్రభుత్వ ప్రజారోగ్య వ్యవస్థ చాలా మందిని ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకునేలా ప్రేరేపించింది. దీంతో, చాలా మంది వైద్య ఖర్చుల కోసం సతమతమయ్యారు. ఆ సమయంలో ప్రభుత్వం అందించే ఆరోగ్య బీమా పథకం చాలా మందికి ఉపయోగపడి ఉండేది.

ఆయుష్మాన్ పథకం కింద కోవిడ్ -19 రోగులకు చికిత్స చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 2020లో ప్రకటించింది.

ఈ పథకం కింద, లబ్ధిదారులు క్యాష్ లెస్ చికిత్సను పొందడం మాత్రమే కాకుండా ఈ కార్డుతో ఆసుపత్రిలో చేరినప్పుడు రూ. 5లక్షల వరకు చికిత్స ఉచితంగా అందిస్తారు.

అయితే, 2018 చివరి నుంచి 2020 ప్రారంభం వరకు వరకు ప్రభుత్వం పీఎంజేఏవై పథకం గురించి ప్రచారం చేయడానికి రూ.25 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఆర్టీఐ సమాచారం తెలుపుతోంది. కానీ, మహమ్మారి సమయంలో ఈ పథకం పై పెట్టే ఖర్చును బాగా తగ్గించి, ప్రభుత్వ ప్రతిష్ఠను పెంచుకునేందుకు చేసే వివిధ ప్రచారాల కోసం ఎక్కువ మొత్తాన్ని కేటాయించింది. ఉదాహరణకు ప్రధాని మోదీ చుట్టూ తిరిగిన 'ముమ్కిన్ హై" (సాధించగలం) లాంటి ప్రచారాలకు ఎక్కువ మొత్తాన్ని వెచ్చించారు.

అయితే, ఈ వివాదాస్పద చట్టాలపై ప్రచారంతోపాటు, ఆరోగ్య బీమా పైవెచ్చించిన మొత్తం గురించి మాట్లాడేందుకు బీజేపీ జాతీయ ప్రతినిధి నలిన్ కోహ్లీ తిరస్కరించారు.

ఫొటో సోర్స్, Getty Images

మోదీ కేర్

రాజస్థాన్‌లోని శిఖర్ గ్రామానికి చెందిన రాజేంద్ర ప్రసాద్ కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకంలో తన పేరును నమోదు చేసుకున్నప్పటికీ ఆసుపత్రి బిల్లులు చెల్లించడం తప్పలేదు.

ప్రసాద్ సోదరుడు సుభాష్ చంద్‌కు కూడా ఏబీ-పీఎంజేఏవై కార్డు ఉంది. ఆయన ఈ ఏడాది మేలో కోవిడ్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు.

అయితే, ఈ పథకం కింద చికిత్స అందించే ఎంప్యానెల్ ఆసుపత్రుల వివరాలు తమకు తెలియదని ప్రసాద్ కొన్ని రోజుల క్రితం బీబీసీ ప్రతినిధి సరోజ్ సింగ్‌తో చెప్పారు.

"ఆసుపత్రిలో డాక్టర్లు ఈ కార్డును తీసుకోవడానికి, నా సోదరునికి ఉచిత వైద్యాన్ని అందించడానికి నిరాకరించారు"అని ఆయన చెప్పారు. ‘‘ఈ కార్డు వల్ల ఇక ఇప్పుడు ఉపయోగం లేదని అనిపిస్తోంది" అని ఆయన అన్నారు.

అయితే, ఆయుష్మాన్ భారత్ కార్డు ఉన్న వారందరికీ మొబైల్ ఫోన్ ద్వారా ఈ ఆసుపత్రుల జాబితాను పంపామని రాజస్థాన్ రాష్ట్ర ఆరోగ్య బీమా పథకం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అరుణ రాజోరియా చెప్పారు.

కానీ, తనకు అటువంటి మెసేజ్ ఏమి రాలేదని చంద్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

కోవిడ్ చికిత్స తీసుకునేందుకు ఎంత మంది ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారని తెలుసుకునేందుకు బీబీసీ మరో ఆర్టీఐను నమోదు చేసింది.

ఆగస్టు 18, 2021 వరకు కేవలం 7.08 లక్షల మంది మాత్రమే ఈ పథకం కింద కోవిడ్ చికిత్స తీసుకున్నట్లు తెలిసింది.

భారతదేశంలో 3.3 కోట్ల కరోనావైరస్ కేసులు నమోదు కాగా, సెప్టెంబరు 2, 2021 వరకు మొత్తం 440,000 మరణాలు చోటు చేసుకున్నాయి.

భారతదేశంలో సుమారు 13 కోట్ల మందికి ఏబీ -పీఎంజేఏవై కార్డు ఉంది.

ప్రభుత్వ సమాచారం ప్రకారం, ఈ పథకం కింద దేశవ్యాప్తంగా మొత్తంగా 10.74 కోట్ల కుటుంబాలకు, 50 కోట్ల మందికి ఆరోగ్య బీమా సదుపాయం అందుతుంది.

ఈ పథకం కింద దేశ జనాభాలో 40 శాతమైన ఆర్థికంగా బలహీన వర్గాలకు అందుతుంది.

ఈ ఆరోగ్య బీమా పథకం గురించి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం వెచ్చించిన మొత్తం గురించి మాట్లాడేందుకు నేషనల్ హెల్త్ అథారిటీను సంప్రదించినప్పుడు, వారు ఈ విషయంపై స్పందించలేదు.

ఫొటో సోర్స్, Getty Images

ప్రాధాన్యత దేనికి?

ఈ కేంద్ర పథకం ప్రయోజనాలపై లబ్ధిదారులకు అవగాహన లేకపోవడం పట్ల ఆరోగ్య, కుటుంబ సంక్షేమ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి నేతృత్వం వహిస్తున్న రాజ్యసభ సభ్యుడు రామ్ గోపాల్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు.

ఈ పథకం కింద కోవిడ్ చికిత్స, పరీక్షలు ఉచితంగా చేయించుకోవచ్చనే విషయం చాలా మంది ఏబీ-పీఎంజేఏవై లబ్ధిదారులకు తెలియదని అంటూ ఈ కమిటీ నవంబరు 2020లో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. మహమ్మారి సమయంలో ఈ పథకం గురించి ప్రచారం చేసేందుకు మరిన్ని ప్రయత్నాలు చేయాలని సూచించింది.

"దేశంలో 40శాతం మంది జనాభాకు క్యాష్ లెస్ ఆసుపత్రి సేవలను అందించే పథకం సమాజంలో అట్టడుగు వర్గాల్లో ఉన్నప్రజలకు ఒక వరంలా పని చేసి ఉండేది" అని పబ్లిక్ హెల్త్ పాలసీ, మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిపుణులు డాక్టర్ చంద్రకాంత్ లహరియా అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఈ పథకం గురించి సరైన అవగాహన కల్పించకపోవడంతో పాటు, దీని ప్రయోజనాలు చాలా మందికి తెలియకపోవడం వల్ల ఈ పథకం విఫలమయినట్లు లహరియా భావిస్తున్నారు.

2021-22 కేంద్ర బడ్జెట్ లో ప్రభుత్వం పీఎంజేఏవై పథకం అమలు కోసం రూ.6,400 కోట్ల రూపాయిలను కేటాయించింది.

గత రెండేళ్ల బడ్జెట్ పరిశీలిస్తే, (2019-20, 2020-2021) బడ్జెట్‌లో కూడా ఈ పథకానికి ఇదే మొత్తాన్ని కేటాయించారు.

ఇది ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు కేటాయించిన మొత్తం బడ్జెట్ లో 8.98 శాతం.

ఈ పథకం ప్రవేశపెట్టిన సంవత్సరంలో మాత్రం దీని కోసం రూ.2400 కోట్లను కేటాయించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)