టీచర్స్ డే - చంద్రంపాలెం హైస్కూల్: ‘కార్పొరేట్ స్కూల్ మాన్పించి ఈ సర్కారు బడికి పంపిస్తున్నారు’
- లక్కోజు శ్రీనివాస్
- బీబీసీ కోసం

విశాఖపట్నం జిల్లా చంద్రంపాలెంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
అత్యధిక మంది పిల్లలు చదువుతున్న సర్కారు బడిగా రాష్ట్రస్థాయిలో పేరు తెచ్చుకుంది.
ఈ స్కూల్లో 4 వేల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు.
1975లో వంద మంది విద్యార్థులతో ఈ పాఠశాల ప్రారంభమైంది.
ఇప్పుడు సెప్టెంబర్ 3 2021 నాటికి ఇక్కడ విద్యార్థుల సంఖ్య 4019.
దీనికి మరో మూడు వందల మంది అదనంగా చేరే అవకాశం ఉంది.
ఒక సర్కారు బడిలో ఇంత మంది విద్యార్థులు ఉండటం ఒక విశేషం.
ఇంతమంది పిల్లలు ఇక్కడ చదవడానికి ఆసక్తి చూపడానికి కారణాలేంటి?
ఇదే ప్రశ్నను ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయులు రాజబాబును అడిగాం.
"మధురవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక ప్రభుత్వ, కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలున్నాయి. మాది హైస్కూల్ కావడంతో ఆరో తరగతి నుంచే ఉంటుంది. దాంతో ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎక్కడ పూర్తి చేసినా, ఆరో తరగతి నుంచి మా దగ్గరే తమ పిల్లలను చదివించాలని పేరెంట్స్ కోరుకుంటారు. ఏటా జరిగే కొత్త అడ్మిషన్లు 80శాతం పైగా ఆరోతరగతిలోనే ఉంటాయి.
బోధన, క్రీడల్లో శిక్షణ, మౌలిక సదుపాయాలు ఉండటంతో ఈ చుట్టుపక్కల వారికి చంద్రంపాలెం స్కూలంటే ఒక నమ్మకం ఏర్పడింది. మా పాఠశాల చుట్టుపక్కల ఉన్న 20 గ్రామాల్లోని ప్రజలు తమ పిల్లల్ని ఇక్కడే జాయిన్ చేస్తారు" అని రాజబాబు బీబీసీతో చెప్పారు.
"ఏడాదికేడాది విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 1000 మంది కొత్త విద్యార్థులు చేరారు. మరో 300 వందల మంది చేరే అవకాశం ఉంది. పూర్వ విద్యార్థులు సైతం తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్నారు. అలాగే కార్పోరేట్ కంపెనీలు సీఎస్ఆర్ ఫండ్స్‌ను మా స్కూల్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇస్తున్నాయి" అని ఆయన తెలిపారు.
లాంగ్వేజ్ లేబోరేటరీ
ప్రభుత్వ పాఠశాలలంటే సాధారణంగా చిన్నచూపే ఉంటుంది.
"సరైన బోధన, క్రీడలు, లాంగ్వేజ్ స్కిల్స్, టెక్నికల్ నాలెడ్జ్ వంటివి ఇక్కడ ఉండవు. అందుకే తమ పిల్లల భవిష్యత్తు కోసం కార్పొరేట్ స్కూల్స్, ప్రైవేటు స్కూల్స్‌లోనే చదివిస్తున్నాం" అని చెబుతుంటారు చాలామంది తల్లిదండ్రులు.
కానీ చంద్రంపాలెం స్కూల్ విషయంలో మాత్రం అది భిన్నంగా ఉంటుంది. ఈ ప్రభుత్వ పాఠశాలపై తల్లిదండ్రులు ఎందుకు ఆసక్తి చూపుతారో ఇంగ్లీష్ ఉపాధ్యాయులు సోమయాజులు బీబీసీకి వివరించారు.
"నాణ్యమైన బోధన, మౌలిక సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉండవని, కార్పోరేట్ స్కూల్స్ వైపు పేరెంట్స్ చూస్తుంటారు. కానీ మా పాఠశాలకు మాత్రం కార్పోరేట్ స్కూల్ మాన్పించి మరీ మా దగ్గరికి తీసుకుని వస్తున్నారు.
మా పాఠశాల క్వాంటీటీలోనే కాదు, క్వాలిటీలోనూ కూడా టాప్. ఆటలు, చదువు, డిసిప్లిన్ మా పాఠశాలలో ప్రత్యేకం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ కోసం ప్రత్యేక లాంగ్వేజ్ లేబోరేటరీ కూడా ఉంది" అని సోమయాజులు చెప్పారు.
"ప్రభుత్వ పాఠశాల పిల్లలకు సహజంగా ఇంగ్లీష్ భాషపై పట్టు కుదరదు. ఈ స్కూల్లో బీబీసీ లెర్నింగ్ వీడియోస్ ద్వారా ఇంగ్లీష్ నేర్పుతాం. పదాల ఉచ్చారణ, స్పష్టత కోసం ముఖ కవళికలు ఏ విధంగా ఉండాలో వీడియోల ద్వారా చూపిస్తాం. ఇంగ్లీష్ భాషపై పట్టు పెరగడం ద్వారా అన్లైన్లో అందుబాటులో ఉండే అనేక మంది నిపుణులతో విద్యార్థులే నేరుగా మాట్లాడుతున్నారు. ఇటువంటిది మరే ప్రభుత్వ పాఠశాలలో లేదు" అని సోమయాజులు తెలిపారు.
డిజిటల్ టెక్నాలజీపై కూడా
ప్రస్తుతం ప్రతి పనికి డిజిటల్ టెక్నాలజీపైనే ఆధారపడుతున్నాం. అటువంటి టెక్నాలజీపై పిల్లలను స్కూల్ స్థాయి నుంచే నాలెడ్జ్ అందిస్తున్నాం. అందుకే మా పాఠశాలలో డిజిటల్ టెక్నాలజీకి సంబంధించిన తరగతులను సైతం పిల్లలకు నిర్వహిస్తున్నామని కంప్యూటర్ ఉపాధ్యాయుడు కిరణ్ కుమార్ బీబీసీతో చెప్పారు.
"మా పాఠశాలలో 50కంప్యూటర్లతో పెద్ద ల్యాబ్ ఉంది. అలాగే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కూడా తరగతులు నిర్వహిస్తాం. ఇది విద్యార్థులకు ఎంతో ఆసక్తిగా ఉంటుంది. సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో విద్యార్థి దశ నుంచే సైబర్ టెక్నాలజీపై అవగాహన కల్పించేందుకు సైబర్ స్మార్ట్ పేరుతో తరగతులు నిర్వహిస్తాం. ఇ-మెంటరింగ్ పేరుతో ప్రపంచంలోని ఏ సబ్జెట్ ఎక్స్పర్ట్తోనైనా మాట్లాడే అన్లైన్ ప్రోగ్రాం కూడా ఉంది" అని కిరణ్ చెప్పారు.
క్రీడలకు కేరాఫ్ చంద్రంపాలెం స్కూల్
చంద్రంపాలెం పాఠశాల పేరు చెప్పగానే చాలా మందికి క్రీడలు గుర్తొస్తాయి. ఈ పాఠశాలలో వీటికి అంత ప్రాధాన్యత ఇస్తారు. ఈ స్కూలుకున్న ఐదెకరాల గ్రౌండ్ కూడా పెద్ద ఆకర్షణే. ఇక్కడి విద్యార్థులు క్రీడల్లో బాగా రాణిస్తున్నారని స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ చెప్పారు.
'బాస్కెట్ బాల్, కబడ్డీ, రగ్బీ, కోకో, వాలీబాల్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, త్రోబాల్, హాకీ, సైకిల్ పోలో, కేరమ్స్, చెస్ వంటి మొత్తం 26 రకాల క్రీడల్లో శిక్షణ ఇస్తాం. విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తిని గమనించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి వారికి ఇష్టమైన వాటిలో ఆరు నెలల శిక్షణ ఇస్తాం. ఆ తర్వాత పోటీలకు పంపిస్తాం. అలా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మా విద్యార్థులు ప్రతిభ చూపించి పతకాలు గెలుకున్నారు" అని స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ పెంటకోట రాము బీబీసీతో చెప్పారు.
"ఇక్కడ క్రీడలతో పాటు బుక్ రీడింగ్, స్టోరీ టెల్లింగ్ వంటి అంశాలపై కూడా శిక్షణ ఉంటుంది. చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివీటిస్లో కూడా మా స్కూల్ టాపే" అని రాము అన్నారు.
ఇది గవర్నమెంట్ స్కూలంటే నమ్మలేం
ఇతర పాఠశాలలతో పోల్చితే చంద్రంపాలెం స్కూల్ భిన్నంగా ఉండటంతో తమ పిల్లల్ని ఇక్కడే చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. అలాగే ఇక్కడ పరిసరాలు, బోధన చూస్తే ఇది గవర్నమెంట్ స్కూలంటే నమ్మలేమని పేరెంట్స్ అంటున్నారు.
"మా బాబుని ఆరో తరగతిలో ఇక్కడ జాయిన్ చేశాను. మా పాప వేరే స్కూల్లో నాలుగో తరగతి చదువుతోంది. ఆరవ తరగతికి రాగానే ఇక్కడే వేస్తాను. కార్పోరేట్ స్కూల్ కంటే చదువు, సౌకర్యాలు, ల్యాబ్స్, స్పోర్ట్స్ ఇక్కడే బాగున్నాయి. మా బాబు కూడా ఒక్క రోజు కూడా బడి మానకుండా వెళ్తాడు. అన్నీ బాగుంటే ఏ పిల్లలైనా స్కూల్ మానడానికి ఇష్టపడరు" అని కొమ్మాది గ్రామానికి చెందిన మున్సీసా బేగం చెప్పారు.
టీచర్స్ బడిలోనే ఎక్కువ గడుపుతారు
ఈ పాఠశాల ఉపాధ్యాయులు వాళ్ల ఇంటి కంటే బడి కోసమే ఎక్కువ ఆలోచిస్తారని ప్రధానోపాధ్యాయులు రాజబాబు చెప్పారు. వారి కృషి, తల్లిదండ్రుల సహకారంతో ఈ పాఠశాలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు.
"ఇంటి కంటే బడిలోనే ఎక్కువ సమయం గడిపే ఉపాధ్యాయులుండటం మా బలం. ఎప్పటికప్పుడు తల్లిదండ్రులతో సమావేశాలు పెట్టి పిల్లలు భవిష్యత్తు గురించి చర్చిస్తాం. వారి సలహాలు తీసుకుంటాం. సంఖ్య ప్రధానం కాదు, నాణ్యమైన విద్యను అందించడమే ప్రధాన లక్ష్యం. దానిని నిలబెట్టుకోవడం వలనే చంద్రంపాలెం స్కూల్ రాష్ట్రంలోనే గుర్తింపు పొందింది" అని హెడ్మాస్టర్ రాజబాబు చెప్పారు.
"ఈ స్కూల్ ఇతర పాఠశాలలకు ఆదర్శం. కార్పోరేట్ స్కూల్ కంటే ఇక్కడే తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని తల్లిదండ్రులు అనడం సంతోషాన్ని ఇస్తుంది. ప్రతి ఏటా ఇక్కడ ప్రవేశాలు పొందే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. దానిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్న 52 తరగతి గదులకు అదనంగా మరిన్ని తరగతి గదులు నిర్మించేందుకు ప్రతిపాదనలున్నాయి" అని జిల్లా విద్యాశాఖాధికారి లింగేశ్వరరెడ్డి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- పంజ్‌షీర్‌లో తాలిబాన్లు, ప్రతిఘటన ఫైటర్ల మధ్య హోరాహోరీ
- నసీరుద్దీన్ షా: తాలిబాన్లపై కామెంట్, మండిపడుతున్న ముస్లింలు
- మీ పీఎఫ్ వడ్డీపై ఆదాయపు పన్ను కట్టాల్సిందేనా? కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి?
- 413 టెస్టు వికెట్లు తీసిన అశ్విన్ తుది జట్టులో ఎందుకు ఆడించడం లేదు?
- తాలిబాన్లు ఇకపై భారత్ దృష్టిలో తీవ్రవాదులు కారా
- ‘చెత్తను చెల్లించి వైద్యం పొందే రోజు వస్తుందని ఊహించలేదు’
- తాలిబాన్ల చేతికి చిక్కిన అమెరికా అత్యాధునిక ఆయుధాలు ఇవే..
- ఇంటి అద్దె వద్దు.. సెక్స్ కావాలంటున్నారు
- పాకిస్తాన్‌లోని క్వెట్టా నగరం 'హజారాల స్మశానం' ఎందుకైంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)