కోవిడ్-19: తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న కొత్తరకం కరోనావైరస్.. డెల్టా ప్లస్ ఏవై.12పై వైద్యుల ఆందోళన - ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
‘‘తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ డెల్టా ప్లస్ వేరియంట్‌లో ఏవై.12 అనే మరో ఉపరకం మరింత సమస్యాత్మకంగా మారింది. ఇది మరింత వేగంగా వ్యాప్తి చెందుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు’’ అని ఈనాడు ఓ కథనం ప్రచురించింది.
‘‘ఏవై.12 రకం తొలి కేసు ఉత్తరాఖండ్‌లో ఆగస్టు 30న వెలుగు చూసింది. వారం రోజుల్లోనే తెలుగు రాష్ట్రాలకూ ఇది వ్యాపించింది. ఏవై.12 కేసులు దేశంలోని 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 178 నమోదైతే ఏపీలో 18, తెలంగాణలో 15 చొప్పున వచ్చాయి.
ఈ కేసుల నమోదులో ఉత్తరాఖండ్‌తో కలిసి ఏపీ మూడో స్థానంలో ఉంది. ఈ వివరాలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ తెలియచేస్తూ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.
వివిధ రాష్ట్రాల నుంచి సేకరించిన నమూనాలను ర్యాండమ్ పద్ధతిలో పరీక్షించినప్పుడు ఏవై.12 కేసులు బయటపడ్డాయి.
సాధారణంగా ప్రతి ఆర్టీపీసీఆర్ ల్యాబ్ నుంచి 15 రోజులకోసారి 15 నమూనాలను సీసీఎంబీ, ఇతర చోట్లకు పంపుతున్నారు. వీటిని పరీక్షించి వైరస్ ఉత్పరివర్తనాన్ని గుర్తిస్తున్నారు. కొత్త ఉత్పరివర్తనాలు వచ్చినప్పుడల్లా తమవద్ద ఉన్న నమూనాలను మళ్లీ పరీక్షిస్తున్నారు.
ఫొటో సోర్స్, Getty Images
డెల్టా ప్లస్ ఉత్పరివర్తనంతో వ్యాప్తి వేగం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఊపిరితిత్తుల కణాల్లో అది బలంగా అతుక్కుపోతుందని, మోనోక్లోనల్ యాంటీబాడీ స్పందనను తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
జన్యు క్రమ పరీక్షల్లో డెల్టా ప్లస్ కేసులు వెలుగులోకి వస్తుండటంతో జాగ్రత్తగా ఉండటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి రాకపోకలు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతున్నాయి. విద్య, విహారం, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం ఇతర దేశాల నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇతర దేశాలకు వెళ్లేవారు క్రమంగా పెరుగుతున్నారు. దీంతో వ్యాధి సంక్రమణకు అవకాశాలు పెరుగుతున్నాయి.
ఏప్రిల్ నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ కేసులు అడపాదడపా బయటపడుతూనే ఉన్నాయి. మరోవైపు... మ్యుటేషన్లతో డెల్టా ప్లస్‌లోనూ మరికొన్ని ఉపరకాలు పుట్టుకొచ్చాయి. వీటిని ఏవై.1, ఏవై.2, ఏవై.3.. పేర్లతో పిలుస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తాజాగా పంపిన సమాచారంలో ఏవై.12 కేసులు 178 వచ్చినట్లు తెలిపింది. దీన్ని కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్‌గా (వీఓసీ)’ ప్రకటించింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఈ కేసులు బయట పడినందున మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి ఆర్తి అహూజా లేఖ రాశారు.
ఫొటో సోర్స్, Getty Images
దీపావళి తర్వాతే హుజూరాబాద్ ఉప ఎన్నిక
తెలంగాణలో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక దీపావళి పండుగ తర్వాతే జరుగనుందని సాక్షి ఓ కథనం ప్రచురించింది.
‘‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు.. ప్రస్తుతం హుజూరాబాద్ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
‘కొద్దిరోజులుగా కురుస్తున్న వానలు, పలుచోట్ల వరదలు పోటెత్తుతుండటం, వరుసగా పండుగలు రానుండడంతోపాటు కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో.. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని తెలంగాణ సహా 11 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, సలహాదారులు ఈసీ దృష్టికి తెచ్చారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో నిర్వహించాల్సిన ఉప ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయడం లేదు’ అని ఈసీ తెలిపింది.
ఉప ఎన్నికలకు సంబంధించి ఈ నెల ఒకటిన ఆయా రాష్ట్రాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అభిప్రాయాలు తెలుసుకున్నామని ఈసీ వివరించింది. అధికారులు ఆయా రాష్ట్రాల్లో ఉప ఎన్నికల నిర్వహణలో ఉన్న సవాళ్లను వివరించారని.. పండుగల సీజన్ ముగిశాకే ఉప ఎన్నికలు నిర్వహించాలని కోరారని వెల్లడించింది.
అక్టోబర్ నుంచి కరోనా మూడో వేవ్ ప్రారంభం కావచ్చని కేంద్రం, పలు పరిశోధన సంస్థలు, సాంకేతిక నిపుణుల కమిటీలు అంచనా వేసిన విషయాన్ని తమ దృష్టికి తెచ్చారని పేర్కొంది.
ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, ప్రస్తుతానికి ఉప ఎన్నికలు నిర్వహించవద్దని నిర్ణయించినట్టు ప్రకటించింది’’అని సాక్షి తెలిపింది.
ఫొటో సోర్స్, Getty Images
న్యాయ వ్యవస్థలో మహిళలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదు –సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
న్యాయ వ్యవస్థలో, న్యాయవాద వృత్తిలో మహిళలకు తగినంత ప్రాధాన్యం దక్కడం లేదని.. ఈ పరిస్థితిని మార్చాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆకాంక్షించారని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.
‘‘ఇటీవల కొంత ప్రయత్నం తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో మహిళల వాటాను 11 శాతానికి పెంచగలిగామన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) శనివారం ఆయనను దిల్లీలో సత్కరించింది.
ఈ సమావేశంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెణ్ రిజిజు, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా న్యాయస్థానాలు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల కొరత, ఇబ్బందులపై వారంలోనే కేంద్రానికి ఒక సవివరమైన నివేదిక అందిస్తానని ఈ సందర్భంగా జస్టిస్ రమణ చెప్పారు.
‘మౌలిక సదుపాయాల కొరత, సిబ్బంది కొరత, భారీ స్థాయిలో జడ్జి పోస్టుల ఖాళీలు... న్యాయ వ్యవస్థ ఇలాంటి అనేక కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. నిర్దిష్ట కాల పరిమితిలో కోర్టుల్లో వసతుల సమస్యను పరిష్కరిస్తాం. ఇందులో భాగంగానే జాతీయ న్యాయ మౌలిక సదుపాయాల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాం’ అని తెలిపారు.
దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టుల్లో కలిపి 41 శాతం జడ్జిల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటిని భర్తీ చేయడం అతి పెద్ద సవాలు అని తెలిపారు. తాజాగా రికార్డు స్థాయిలో ఒకేసారి 12 కోర్టులకు 68 మంది జడ్జిలను నియమించాలని కొలీజియం చేసిన సిఫారసుల గురించి జస్టిస్ రమణ ప్రస్తావించారు’’ అని ఆంధ్రజ్యోతి తెలిపింది.
తెలంగాణలో ఐపీఎస్‌లను పెంచండి – అమిత్ షాతో కేసీఆర్
తెలంగాణలో ఐపీఎస్ పోస్టుల అదనపు కేటాయింపు త్వరగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కోరారని నమస్తే తెలంగాణ ఓ కథనం ప్రచురించింది.
‘‘శనివారం కేంద్ర హోంమంత్రితో భేటీ అయిన సీఎం ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ఐపీఎస్ క్యాడర్ పోస్టుల సంఖ్యను 139 నుంచి 195కు పెంచాలని కోరారు. సీనియర్ డ్యూటీ అధికారుల సంఖ్య ప్రస్తుతం 76గా ఉందని, దాన్ని 105కు పెంచాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర హోంశాఖ 2016లో ఐపీఎస్ క్యాడర్‌ను రివ్యూ చేసిందని తెలిపారు. ఆ సమయంలో తెలంగాణకు 76 సీనియర్ డ్యూటీ పోస్టులు సహా మొత్తం 139 ఐపీఎస్ పోస్టులను మంజూరు చేసిందని పేర్కొన్నారు.
తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత రాష్ట్రంలో అధికారుల అవసరం పెరిగిందని వివరించారు. పోలీస్ జిల్లాల సంఖ్య 20కి, పోలీస్ కమిషనరేట్ల సంఖ్య 9కి పెరిగిందని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అదనపు పోస్టులు కేటాయించాలని కోరుతూ ఈ ఏడాది జూన్ 24న హోంశాఖకు ప్రతిపాదనలు పంపినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ అమిత్‌షాకు గుర్తుచేశారు.
కొత్తగా ఏర్పడిన జోన్లు, మల్టీజోన్లు, పోలీస్ జిల్లాల్లో శాంక్షన్డ్ క్యాడర్ పోస్టులు లేవని, కొత్తగా పోస్టుల మంజూరుతో ఈ సమస్య తీరుతుందని పేర్కొన్నారు.
ఐపీఎస్ క్యాడర్ రివ్యూను అత్యవసర అంశంగా పరిగణించాలని, వీలైనంత త్వరగా పోస్టులు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ అమిత్‌షాను కోరారు’’అని నమస్తే తెలంగాణ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- మోదీ తీసుకొస్తున్న ‘బలవర్ధక బియ్యం’ ఏంటి?
- బీబీసీతో అమ్రుల్లా సలేహ్: ‘నేను పారిపోలేదు.. పంజ్‌షీర్ వ్యాలీలోనే ఉన్నా.. మా పోరాటం ఆగదు’
- VPN అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వం నిజంగానే దీనిని బ్యాన్ చేయాలనుకుంటోందా?
- గల్ఫ్ స్కై: యూఏఈలో అదృశ్యమైన ఈ నౌక ఇరాన్‌కు ఎలా చేరింది? అసలేం జరిగింది?
- పాకిస్తాన్‌లోని క్వెట్టా నగరం 'హజారాల స్మశానం' ఎందుకైంది?
- పంజ్‌షీర్‌లో తాలిబాన్లు, ప్రతిఘటన యోధుల మధ్య హోరాహోరీ పోరాటం.. ‘వందల్లో మృతులు’
- అఫ్గాన్ నుంచి సేనల ఉపసంహరణతో భారత్‌లో అమెరికా విశ్వసనీయత తగ్గిందా?
- ఆధునిక విలువల వైపు ఉందామా, లేక గడ్డ కట్టిన రాజకీయమతాన్ని ఆహ్వానిద్దామా.-ముస్లిం సమాజంలో చర్చ రేపిన నసీరుద్దీన్ వ్యాఖ్యలు..
- 'ఎండెమిక్' అంటే ఏంటి? కరోనావైరస్ ఎండెమిక్ అయితే ప్రమాదం తగ్గిపోతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)