ముజఫర్‌నగర్‌ కిసాన్ మహా పంచాయత్‌: భవిష్యత్ కార్యాచరణపై రైతు సంఘాల దృష్టి

కిసాన్ మహా పంచాయత్

ఫొటో సోర్స్, REUTERS/Adnan Abidi

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో కిసాన్ మహా పంచాయత్‌ నిర్వహిస్తున్నారు.

తరలివస్తున్న రైతులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చూసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అటు జిల్లా పరిపాలనా యంత్రాంగం, ఇటు రైతు సంఘాలూ కలిసి ఈ ఏర్పాట్లు చేస్తున్నాయి.

ముజఫర్‌నగర్‌లోని జీఐసీ కాలేజీ గ్రౌండ్‌లో జరగుతున్న ఈ మహా పంచాయత్‌కు చాలా రాష్ట్రాలకు చెందిన రైతులు రాబోతున్నారని రైతు సంఘం నాయకులు చెబుతున్నారు.

‘‘దేశంలోని నలుమూలల నుంచి రైతులు ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు’’ అని భారతీయ కిసాన్ యూనియన్ మీడియా ఇన్‌ఛార్జి ధర్మేంద్ర మలిక్ బీబీసీతో చెప్పారు.

‘‘దాదాపు 5 లక్షల మంది రైతులు ఈ కార్యక్రమానికి తరలివస్తున్నారు. ఇక్కడ చోటు సరిపోకపోయినా ఎలాంటి ఇబ్బందీ లేకుండా రైతులు కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేశాం. చాలాచోట్ల మైక్‌లు, ఎల్‌ఈడీలు సిద్ధంచేశాం’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Shahbaz Anwar/BBC

అయితే, ఈ కార్యక్రమానికి 50,000 మంది వరకు వచ్చే అవకాశముందని ముజఫర్‌నగర్ ఎస్‌డీఎం సాదర్ దీపక్ కుమార్ అంచనా వేస్తున్నారు.

వేరే ప్రాంతాల నుంచి తరలివస్తున్న రైతులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చూసేందుకు దేవాలయాలు, మసీదులు, గురుద్వారాల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఏడాది నుంచి నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవసాయ చట్టాలతోపాటు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ కిసాన్ మహా పంచాయత్‌లో దృష్టి సారిస్తారు.

‘‘దేశ వ్యాప్తంగా మా నిరసనలను కొనసాగించేందుకు వ్యూహాలను ఈ కార్యక్రమంలో చర్చిస్తాం’’ అని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికైత్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)