బకింగ్‌హాం కెనాల్: కాకినాడ, చెన్నై మధ్య ఒకప్పటి ప్రధాన జలమార్గం ఇప్పుడెందుకు నిరుపయోగంగా మారింది

  • శంకర్ వడిశెట్టి
  • బీబీసీ కోసం
బకింగ్‌హాం కెనాల్

ఇప్పుడంటే రోడ్లు ఉన్నాయి. నదులపై అవసరమైన చోట్ల వంతెనలు కూడా నిర్మించారు. రైలు మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి. రైళ్లు వెళ్లగలిగేలా కృష్ణా, గోదావరి నదులపై భారీ వంతెనలు కూడా నిర్మించారు.

కానీ 200 ఏళ్లకు పూర్వం ఇలాంటివేవీ లేవు. ఇంకా చెప్పాలంటే అసలు ఈ దేశంలో రైళ్లే అందుబాటులో లేవు.

అయినా సరకు రవాణా పెద్ద ఎత్తున సాగేది ఆ కాలంలో. ముఖ్యంగా కాకినాడ నుంచి చెన్నై మధ్య భారీ ఎత్తున రవాణా జరిగేది. ఈ రెండు నగరాల మధ్య సుమారు 650 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ సరకు రవాణా మాత్రం అత్యంత సులభంగా జరుగుతుండేది.

దీనికి ప్రధాన కారణం జల రవాణా. ఈ తరం ఆశ్చర్యపోయే రీతిలో గోదావరి, కృష్ణా కాలువలను వినియోగించుకుని, ఆ తర్వాత ప్రకాశం జిల్లా నుంచి సముద్ర తీరానికి చేరువగా ఉన్న కాలువ ద్వారా ఈ సరకులను పులికాట్ సరస్సు వరకూ రవాణా చేసేవారు.

అక్కడి నుంచి తమిళనాడులోని విల్లుపురం వరకూ అనుసంధానించిన మరో కాలువ ద్వారా సరకు రవాణా పడవలు చెన్నై చేరుకునేవి.

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు వరకూ ఒకప్పుడు ఉన్న ఈ జల రవాణా మార్గాన్ని బకింగ్ హాం కెనాల్ అంటారు.

బకింగ్‌హాం అనే పేరెలా వచ్చింది

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పెదగంజాం నుంచి తమిళనాడులోని మరక్కణం వరకూ బకింగ్‌హాం కాలువ ఉంటుంది. బ్రిటిష్ పాలనలో ఈ కాలువ ఓ వెలుగు వెలిగిందనే చెప్పవచ్చు.

అప్పట్లో రవాణా అవసరాల కోసం పూర్తిగా ఈ కాలువపైనే ఆధారపడేవారు. 1806లో ఈ కాలువ నిర్మాణం ప్రారంభమైంది. తమిళనాడులో 163 కిలో మీటర్ల పొడవున, ఏపీలో మరో 257 కిలోమీటర్ల పొడవున ఈ కాలువ ఉంటుంది.

ఈ కాలువకు 1878లో బకింగ్‌హాం కాలువగా నామకరణం చేశారు. అనాటి గవర్నర్ డ్యూక్ ఆఫ్ బకింగ్‌హాం పేరుతో ఈ కాలువను పిలుస్తున్నారు.

మొదట దీనిని కొక్రేన్ కాలువగా పిలిచేవారని రికార్డుల్లో ఉంది. బ్రిటిష్ వారి నుంచి కాలువ కాంట్రాక్ట్ తీసుకున్న కొక్రేన్ అనే వ్యక్తి అభివృద్ధి చేయడంతో మొదట ఆయన పేరుతో దీనిని పిలిచేవారు.

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్,

బకింగ్‌హాం

1837లో తిరిగి ప్రభుత్వం ఈ కాలువను స్వాధీనం చేసుకుంది. 1852లో పులికాట్ నుంచి దుగరాజపట్నం వరకు దీన్ని పొడిగించినప్పుడు ఈస్ట్ కోస్ట్ కాలువగా పేర్కొన్నారు.

అప్పట్లో కాలువ నిర్మాణానికి కేటాయించిన నిధులను ఈస్ట్ కోస్ట్ కాలువ అనే పేరుతోనే విడుదల చేసినట్టు మద్రాస్ ప్రెసిడెన్సీ రికార్డులు చెబుతున్నాయి.

1878లో అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నర్‌గా ఉన్న మూడవ డ్యూక్ ఆఫ్ బకింగ్‌హాం ఈ కాలువను పరిశీలించేందుకు నెల్లూరు ప్రాంతంలో పర్యటించారు. నాటి నుంచి ఈ కాలువను బకింగ్‌హాం కాలువగా ప్రస్తావిస్తున్నారు.

కాలువను ఎందుకు పొడిగించారు..

1860ల నాటికి గోదావరి నదిపై ధవళేశ్వరం దగ్గర బ్యారేజ్‌తో పాటూ విజయవాడ దగ్గర కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజ్ కూడా అందుబాటులోకి వచ్చాయి.

ఈ బ్యారేజీల నుంచి సాగునీటి తరలింపు కోసం కాలువలు కూడా నిర్మించారు. ధవళేశ్వరం నుంచి అటు తూర్పు డెల్టాలో భాగంగా కాకినాడ వరకూ కాలువ సిద్ధమయ్యింది. పశ్చిమ డెల్టాలో ఏలూరు వరకూ కాలువ అందుబాటులోకి వచ్చింది.

అదే విధంగా ప్రకాశం బ్యారేజ్ నుంచి ఏలూరు కాలువ, ఇటు చీరాల వరకూ మరో కాలువ ద్వారా నీటి ప్రవాహం మొదలైంది. దాంతో ఆయా కాలువలను ఉపయోగించుకోవడం ద్వారా జల రవాణాకి అవకాశం కలిగింది.

అదే సమయంలో 1876 నుంచి రెండేళ్ల పాటు మద్రాస్ ప్రాంతంలో తీవ్రమైన కరవు ఏర్పడింది. నిత్యావసరాల కొరత అందరినీ వేధించింది. ప్రజలను కరవు కష్టాల నుంచి గట్టెక్కించేందుకు రకరకాల మార్గాల్లో సరకుల రవాణా అవసరమైంది. గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాల నుంచి ఆహార పదార్థాల సరఫరాకి వీలుగా బకింగ్‌హాం కాలువను పొడిగించాల్సిన అవసరం ఏర్పడింది.

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్,

బకింగ్‌హాం కెనాల్ మ్యాప్

అనుసంధానం ఎలా జరిగింది

కాకినాడ నుంచి గోదావరి కాలువ ద్వారా ధవళేశ్వరం బ్యారేజీకి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి గోదావరిని దాటి పశ్చిమాన ఏలూరు కాలువలోకి చేరుతారు. ఏలూరు కాలువ ద్వారా నిడదవోలు, తాడేపల్లిగూడెం ప్రాంతాలు దాటి ఏలూరు వరకూ వచ్చిన తర్వాత ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చిన ఏలూరు కాలువకి కలిపారు.

ఏలూరు కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజ్ ఎగువన కృష్ణా నదిలోకి పడవలు రావడానికి మార్గం సిద్ధం చేశారు.

ప్రకాశం బ్యారేజ్ నుంచి తెనాలి వైపు వెళ్లే కాలువను చీరాల వరకూ వెళ్లడానికి అనుగుణంగా తీర్చిదిద్దారు. అక్కడి నుంచి రొంపేరు ద్వారా చినగంజాం మండలం పెదగంజాంలో బకింగ్‌హాం కాలువలోకి ప్రవేశించేలా అనుసంధానం జరిగింది. అక్కడి నుంచి నేరుగా పులికాట్ సరస్సు, ఆ తర్వాత చెన్నై వరకూ ఉన్న కాలువల మార్గం జలరవాణాకి అనువుగా ఉండడంతో ఈ మార్గం ఎంతో ఉపయోగపడింది.

కాకినాడ నుంచి చీరాల వరకూ సాగునీటి కాలువల ద్వారా జలరవాణా జరిగితే, ఆ తర్వాత ఉప్పునీటి కాలువ ద్వారా ఈ సరుకు రవాణా సాగించేవారు.

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్,

అలనాటి బకింగ్‌హాం కెనాల్

ఆరేడు దశాబ్దాల పాటు ప్రధాన మార్గమదే..

1880 నుంచి 1950ల వరకూ తక్కువ ఖర్చుతో సరకు రవాణా చేయడానికి ఈ జలమార్గం ఉపయోగపడింది.

ఆ కాలంలో ఆహారపదార్థాలు సహా వివిధ ఉత్పత్తులను కూడా చెన్నై, కాకినాడ మార్గంలో రవాణా చేసేవారు. సముద్రమార్గంలో అటు కాకినాడ పోర్టుకి గానీ, ఇటు మద్రాస్ పోర్టుకి గానీ వచ్చిన ఓడల నుంచి సరుకులను బకింగ్‌హాం కెనాల్ ద్వారా వివిధ ప్రాంతాలకు తరలించేవారు. బ్రిటిష్ సైన్యం అవసరాలకు కూడా ఈ కాలువను ఉపయోగించేవారు.

ఒకనొక సమయంలో రోజుకు కోటి టన్నుల బరువైన సరకులను ఈ కాలువ ద్వారా రవాణా చేసేవారంటే ఆశ్చర్యం అనిపిస్తుంది.

అంతేగాకుండా, శ్రీహరికోట నుంచి మద్రాసు నగరానికి అవసరమైన వంట చెరకును ఈ కాలువ ద్వారానే భారీగా ఎగుమతి చేసేవారు.

ఈ సరకు రవాణా సమయంలో అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకోడానికి కాలువ ఒడ్డున మద్రాసు నుంచి కాకినాడ వరకు 50కి పైగా ట్రావెల్‌ బంగ్లాలు సైతం నిర్మించారు.

అంతేకాదు, కాలువ భద్రత, పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. తీరం పొడవునా దాదాపు 150 మందికి పైగా ఇన్‌స్పెక్టర్లు కాలువ ప్రవాహం వేగాన్ని సమీక్షిస్తూ ప్రతి రోజూ బ్రిటిష్‌ ప్రభుత్వానికి నివేదికలు అందించేవారు.

కాలువ మధ్యలో గేట్ల దగ్గర మరికొంతమంది సిబ్బంది విధుల్లో ఉండేవారు. కాలువ వినియోగం తగ్గిపోయిన తర్వాత ఆ సిబ్బందిని నీటిపారుదల శాఖలో విలీనం చేశారు.

తాము చిన్నతనంలో తెరచాప పడవల ద్వారా ఆ కాలువలో సరుకులు తరలించడం చాలాసార్లు చూశామని పెదగంజాంకు చెందిన రావి వెంకటేశ్వర్లు చెప్పారు. అప్పుడు ఎంతో సందడిగా ఉండేదని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు.

"రొంపేరు నుంచి ఆ కాలువలో కాలువలోకి మారే చోట ఓ హాల్ట్ కూడా ఉండేది. చాలా వ్యాపారాలు జరిగేవి. రానురాను అంతా మారిపోయింది. ఇప్పుడు కాలువను కూడా ఉప్పు మళ్లు, రొయ్యల చెరువుల పేరుతో ఆక్రమించేశారు. కొందరు కాలువపై ఇళ్లు కూడా కట్టేశారు. గతవైభవం చూసిన మాకు ఇప్పుడీ కాలువ దుస్థితి బాధేస్తోంది" అని ఆయన బీబీసీకి చెప్పారు.

రైల్వేల రాక, తుఫాన్ల తాకిడి...

మద్రాస్ నుంచి కోల్‌కతా మధ్య రవాణాకి అనుగుణంగా రైల్వే లైన్ అందుబాటులోకి రావడంతో ఆ కాలువలో కెనాల్ ప్రాభవం కోల్పోతూ వచ్చింది.

1900లో గోదావరి నదిపై మొదటి రైలు వంతెన హేవలాక్ వంతెన సిద్ధమయ్యింది. అదే సమయంలో కృష్ణా నదిపై కూడా మొదటి వంతెన నిర్మించారు.

దాంతో పడవల ద్వారా సరకు రవాణా కంటే, వేగంగా రైళ్ల ద్వారా సరకులు పంపించే అవకాశం దక్కింది. అలా మెల్లమెల్లగా జలరవాణా తగ్గిపోయింది.

దానికితోడు 1965, 1978 నాటి పెను తుపానుల తాకిడి కూడా ఈ కాలువ స్వరూపాన్ని మార్చేసింది. ఒకప్పుడు 32 మీటర్ల వెడల్పులో కనిపించిన ఈ కాలువ ప్రస్తుతం పట్టుమని 10 మీటర్లు కూడా లేదు.

సముద్ర తీరం వెంబడి సాగే ఈ కాలువ 2004 నాటి సునామీ సమయంలో ఎన్నో తీర ప్రాంత గ్రామాలకు ముప్పు రాకుండా అడ్డుకోడానికి కొంత తోడ్పడిందని భావిస్తారు.

రెండు దశాబ్దాలుగా మళ్లీ ప్రతిపాదనలు

గత 7 దశాబ్దాలుగా జలరవాణా నిలిచిపోవడంతో ప్రస్తుతం ఈ మార్గం సరుకు రవాణాకి వీలులేని స్థితికి చేరుకుంది.

ఆ కాలువలో కెనాల్ మార్గాన్ని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఆక్వా సాగుదారులు, ఇతరులు ఆక్రమించేశారు. దాంతో కాలువ కుచించుకుపోయింది.

ఒకప్పుడు పెద్ద పడవలు సైతం సులువుగా ప్రయాణించిన ఈ కాలువను ఇప్పుడు గట్టిగా ప్రయత్నించి దూకితే, ఒక మనిషి దాటేయగలిగే స్థితికి తీసుకొచ్చారు.

అయితే, ఇన్ లాండ్ వెజల్స్ యాక్ట్ 2021 పేరుతో జలరవాణా పునరుద్దరణ కోసం మొన్నటి వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో ఒక చట్టం రూపొందించారు. ఇంధన ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో జలరవాణా మార్గాల వినియోగంపై మళ్లీ దృష్టి పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రభుత్వ నివేదికల ప్రకారం ఓ లీటర్ ఇంధనంతో రోడ్డు మార్గంలో అయితే 24 టన్నులు, రైల్లో 85 టన్నులు రవాణా చేసే వీలుంటుంది. అదే ఒక లీటరు ఇంధనంతో జలరవాణా ద్వారా 105 టన్నుల వరకూ సరుకులు తరలించవచ్చు అనే అంచనాలున్నాయి. దాంతో జలరవాణాకు ప్రాధాన్యం ఇవ్వడం కీలకమమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

2007లోనే యూపీఏ హయంలో బకింగ్‌హాం కెనాల్ పునరుద్దరణ కోసం నిపుణుల కమిటీ ఓ రిపోర్ట్ అందించింది.

అప్పట్లో రూ.1400 కోట్లు కేటాయిస్తే, దానిని జలరవాణాకి అనుగుణంగా మార్చవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా కాలువ పునరుద్దరణకు ఆక్రమణల తొలగింపు తప్ప కొత్తగా భూసేకరణ అవసరం లేదు.

అదే సమయంలో కొత్తగా వచ్చిన ప్రాజెక్టుల వల్ల గతం కన్నా భిన్నంగా ఏడాది పొడవునా కాలువల్లో నీటి ప్రవాహానికి ఢోకా లేకుండా చూసుకునే అవకాశం కూడా ఉంది.

జాతీయ జలమార్గాల చట్టం 2016 ప్రకారం దేశంలో ఇలాంటి 111 మార్గాలను గుర్తించారు. అందులో ఇన్ లాండ్ వెజల్స్ వే 4గా బకింగ్‌హాం కెనాల్‌ని పేర్కొన్నారు.

పారిశ్రామిక అవసరాలు కూడా తీరవచ్చు, కానీ...

ఇటీవల కేంద్ర ప్రభుత్వం గోదావరి, కావేరీ నదుల అనుసంధానంపై పలు ప్రతిపాదనలు చేసింది. వాటిపై వివిధ రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వచ్చాయి.

అయితే బకింగ్‌హాం కెనాల్ పునరుద్దరణ జరిగితే తడ సెజ్ ప్రాంతంలో పారిశ్రామిక అవసరాలకు నీటిని తరలించవచ్చనే ప్రతిపాదనలున్నాయి.

ఈ కాలువల ద్వారా విదేశాల్లో ఉన్నట్లు వస్తు రవాణా ప్రారంభిస్తే పర్యాటకంగానూ అభివృద్ధికి అవకాశాలున్నాయని అంటున్నారు.

కానీ, బకింగ్‌హాం కెనాల్ పునరుద్దరణ ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. దానికి చాలా పెద్ద ప్రయత్నమే జరగాల్సి ఉంటుందని ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు.

కాలువను పునరుద్ధరిస్తే ఏపీకి చాలా మేలు జరుగుతుంది అని ఇరిగేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ బాణోతు రాంబాబు బీబీసీతో అన్నారు.

"ఒకప్పుడు పడవలు సులువుగా ప్రయాణించేలా ఇరిగేషన్ లాకుల వద్ద ప్రత్యేకంగా మార్గం ఉండేది. సుమారు 80 ఏళ్లుగా వాటిని వినియోగించని కారణంగా అవన్నీ శిథిలమయిపోయాయి. పునరుద్దరణకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే కేంద్రం పలుమార్లు పరిశీలన చేసింది. కొన్ని ప్రతిపాదనలు కూడా వచ్చాయి. కొత్త చట్టం ప్రకారం బకింగ్‌హాం కెనాల్ పునరుద్దరణ జరిగితే ఏపీకి చాలా మేలు జరిగి, కాకినాడ- చెన్నై పారిశ్రామిక కారిడర్ పురోగతికి తోడ్పడుతుంది. అలాంటి ప్రయత్నం జరగాలని ఆశిద్దాం" అని రాంబాబు చెప్పారు.

కొత్త పోర్టులతో అనుసంధానం చేస్తే..

ఏపీలో బకింగ్‌హాం కాలువ మార్గంలో కాకినాడతో పాటూ కృష్ణపట్నం పోర్టు కూడా అందుబాటులోకి వచ్చిది. రామాయపట్నం దగ్గర పోర్టు నిర్మాణం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మచిలీపట్నం పోర్టుకి టెండర్లు కూడా పిలిచారు. ఈ నేపథ్యంలో సముద్ర మార్గానికి అనుబంధంగా అంతర్గత జలరవాణాని అందుబాటులోకి తీసుకురాగలిగితే ఎంతో ఉపయోగం ఉంటుందనేది నిపుణుల అభిప్రాయం.

పునరుద్ధరణ కోసం కొత్త చట్టం ప్రకారం కేంద్రం నిర్ణయం తీసుకోవడం వల్ల అన్ని విధాలుగా ప్రయోజనం ఉంటుందని కాకినాడ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి అడబాల రమణారావు అన్నారు.

"ఒకనాడు సాగునీటి కోసం నిర్మించిన నీటి ప్రాజెక్టులను జలరవాణాకి అనుగుణంగా మార్చడం ఆనాటి పాలకుల ముందుచూపుని చెబుతోంది. రానురాను నిర్లక్ష్యం వహించడంతో అనేక చోట్ల బకింగ్ హాం కాలువ కనుమరుగయ్యే దశలో ఉంది. కానీ, కాలువలను ఆనుకుని ఉన్న ప్రాంతాలు ఆనాటి అభివృద్ధిలో ముందంజ వేయడానికి తోడ్పడ్డాయన్నది మరవకూడదు. ఇప్పుడు దీనిని మళ్ళీ పునరుద్దరణ కోసం కేంద్రం కొత్త చట్టం ప్రకారం నిర్ణయం తీసుకోవాలి" అని ఆయన చెప్పారు.

కాకినాడ, చెన్నై మార్గంలో బకింగ్‌హాం కెనాల్ పునరుద్దరణ ప్రకటనలకే పరిమితం కాకుండా చూడాలన్నది చాలామంది అభిప్రాయంగా వస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)