INDvsENG: 'రహానేను ఎందుకు తప్పించరు? హనుమ విహారికి ఛాన్స్ ఎందుకు ఇవ్వరు'

హనుమ విహారి

ఫొటో సోర్స్, FACEBOOK/HANUMAVIHARI

ఫొటో క్యాప్షన్,

హనుమ విహారి

భారత జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే పేలవమైన ఫామ్ కొనసాగుతోంది. ఇంగ్లండ్‌తో ఓవల్‌లో ఆడుతున్న నాలుగో టెస్ట్‌ నాలుగో రోజు కూడా అతడు పెద్ద ఇన్నింగ్స్ ఆడడంలో విఫలమయ్యాడు.

మరోవైపు హనుమ విహారి లాంటి ప్రతిభావంతులకు తుది జట్టులో చోటివ్వకుండా బెంచ్‌కే ఎందుకు పరిమితం చేస్తారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, రహానే వైఫల్యం భారత జట్టుకు పెద్దగా నష్టం కలిగించలేదు. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కంటే 99 పరుగులు వెనకబడ్డ భారత్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 466 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

ఈ టెస్టు గెలవాలంటే ఇంగ్లండ్ 348 పరుగులు చేయాల్సి ఉంది.

భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైంది. రహానేతోపాటూ టీమ్ టాప్ ఆర్డర్ ఓవల్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో విఫలమయ్యారు.

కానీ, సెకండ్ ఇన్నింగ్స్‌లో తమ వైఫల్యాన్ని సరిదిద్దుకోవడంలో ఓపెనర్ రోహిత్ శర్మ సహా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అందరూ విజయవంతమయ్యారు.

రోహిత్ శర్మ 127 పరుగులు చేసి అవుట్ కాగా మొదటి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, సెకండ్ ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేశాడు.

మొదటి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన(57) ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా హాఫ్ సెంచరీ(60) చేశాడు.

ఫొటో సోర్స్, PRESS ASSOCIATION

రహానే మళ్లీ విఫలం

కానీ రహానే తన చెత్త ప్రదర్శనకు అడ్డుకట్ట వేయలేకపోయాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 14 పరుగులు చేసిన రహానే సెకండ్ ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు.

ఎనిమిది బంతులాడిన రహానే ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. చివరికి క్రిస్ వోక్స్ బంతికి ఎల్‌బీడబ్ల్యు అయ్యాడు.

ఆ తర్వాత నుంచీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రహానేను ట్రోల్ చేయడం ప్రారంభించారు. అతడు ట్విటర్ టాప్ ట్రెండ్స్‌లో నిలిచాడు.

రహానే ఇంగ్లండ్ పర్యటనలో వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. నాలుగు టెస్ట్ మ్యాచుల్లో ఏడు ఇన్నింగ్స్‌లు ఆడిన ఇతడు ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు.

రహానే నాటింగ్‌హామ్ టెస్టులో 5, లార్ట్స్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 1, సెకండ్ ఇన్నింగ్స్‌లో 61, లీడ్స్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో 18, సెకండ్ ఇన్నింగ్స్‌లో 10 పరుగులు చేశాడు.

లీడ్స్‌ టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఘోర ఓటమి పాలైంది. రహానే మొత్తం నాలుగు టెస్టుల్లో కలిపి 109 పరుగులు చేయగలిగాడు.

"రహానే ఫామ్ చాలా చెత్తగా ఉంది. తర్వాత మ్యాచ్‌లో ఒక బౌలర్‌ను రీప్లేస్ చేస్తారు" అని ఓవెల్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో రహానే అవుటైన తర్వాత ట్విటర్ యూజర్ రమేష్ శ్రీవత్స్ కామెంట్ చేశాడు.

"రోహిత్ 50కి దగ్గరగా ఉన్నప్పుడు అతడి ఫ్యాన్స్ నెర్వస్ అవుతారు. కోహ్లీ 40 పరుగులు చేసినప్పుడు తన ఫ్యాన్స్ నెర్వెస్ అవుతారు. రహానే అభిమానులు ఎప్పుడూ అతడు బ్యాటింగ్‌కు రావడం చూడగానే నెర్వస్ అవుతారు" అని ఉదిత్ అనే మరో ట్విటర్ యూజర్ అన్నాడు.

కొంతమంది ట్విటర్ యూజర్లు రహానే రిటైర్మెంట్ తీసుకోవాలని సలహా ఇస్తుంటే, మరికొందరు ఆయన ప్లేస్‌లోకి తీసుకోవాల్సిన ఆటగాళ్ల పేర్లను సూచిస్తున్నారు.

వీరిలో అశ్విన్, సూర్య కుమార్ యాదవ్, హనుమ విహారి పేర్లు కూడా ఉంటున్నాయి.

కమాన్ క్రికెట్ అనే ఒక ట్విటర్ హాండిల్లో రహానే, అశ్విన్ కొన్ని ఇన్నింగ్స్ గణాంకాలు పోల్చి చూపించారు. రహానే కంటే అశ్విన్ మంచి బ్యాట్స్‌మెన్ అని చెప్పే ప్రయత్నం చేశారు.

మరోవైపు కొందరు అభిమానుల నుంచి ఆంధ్రప్రదేశ్ ఆటగాడు హనుమ విహారికి జట్టులో ఎందుకు స్థానం కల్పించడం లేదనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

అజింక్య రహానే లాంటి ఆటగాళ్లు వరుసగా విఫలమవుతున్నా, ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపికైన హనుమ విహారిని తుది జట్టులో స్థానం కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

"సూర్యకుమార్ డెబ్యూ కోసం చూస్తున్న వారందరూ జట్టులో హనుమ విహారి అనే ఆటగాడు కూడా గత పది టెస్టులుగా బెంచ్‌కే పరిమితం అయ్యాడనేది గుర్తుంచుకోవాలి" అని శుభమ్ సింగ్ అనే ఒక ట్విటర్ యూజర్ అన్నాడు.

"చివరగా సిడ్నీ టెస్టులో ఆడిన హనుమ విహారి ఆ టెస్ట్ డ్రా చేయడానికి కారణం అయ్యాడు. ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడించడానికి టాటూ ఉండడమే అదనపు అర్హత కాకూడదు" అని చురకలు వేశాడు.

హనుమ విహారికి జట్టులో స్థానం కల్పించాలంటూ నాలుగో టెస్టుకు జట్టు ఎంపికకు ముందే స్వరా అనే యూజర్‌ ట్వీట్ చేశారు.

"4వ టెస్ట్‌ కోసం భారత జట్టులో మార్పులు జరుగుతాయని చర్చ జరుగుతోంది. మీరు ఆ పనిలో ఉంటే మీరు ఏ బ్యాట్స్‌మెన్‌ను మార్చాలనుకున్నా, హనుమ విహారిని ప్రధాన ప్రత్యామ్నాయంగా తీసుకోండి"

"చివరగా తను బ్యాటింగ్ చేసిన టెస్టులో భారత్ కోసం విహారి తన కెరీర్‌నే పణంగా పెట్టాడు" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

సిడ్నీ టెస్ట్ మ్యాచే చివరిది

హనుమ విహారి చివరిసారిగా ఆడిన టెస్ట్ 2021 జనవరి 7 నుంచి 11 వరకూ సిడ్నీలో జరిగింది.

ఈ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 4 పరుగులకే అవుటైన విహారి రెండో ఇన్నింగ్స్‌లో క్రీజులో పాతుకుపోయి మ్యాచ్ డ్రా అయ్యేలా చేశాడు.

272 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన సమయంలో అశ్విన్‌, హనుమ విహారి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి భారత్‌ను గట్టెక్కించారు.

అప్పుడు హనుమ విహారి 161 బంతులు ఎదుర్కుని 23 పరుగులు చేయగా, అశ్విన్ 128 బంతులు ఆడి 39 పరుగులు చేశాడు.

ఆ తర్వాత టెస్టు జట్టులో స్థానం దొరికినా తుది జట్టులో హనుమ విహారికి స్థానం దక్కలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)