భారత న్యాయవ్యవస్థలో ‘ఉన్నత వర్గాలు, ఆధిపత్య కులాలు, మెజారిటీ మతానికి చెందిన పురుషులే’ ఎక్కువా?

  • గీతా పాండే
  • బీబీసీ ప్రతినిధి
సుప్రీం కోర్టు మహిళా న్యాయమూర్తులతో చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ (మధ్యలో)

ఫొటో సోర్స్, PTI

ఫొటో క్యాప్షన్,

సుప్రీం కోర్టు మహిళా న్యాయమూర్తులతో చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ (మధ్యలో)

ఇటీవల సుప్రీం కోర్టులో కొత్తగా తొమ్మిదిమంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. అందులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు కూడా ఉన్నారు.

వారిలో, జస్టిస్ నాగరత్న భవిష్యత్తులో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) పదవిని చేపట్టే అవకాశం కూడా ఉందని, అవి చరిత్రలో లిఖించదగ్గ క్షణాలు అవుతాయని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ముగ్గురు మహిళా న్యాయమూర్తులు.. జస్టిస్ నాగరత్న, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బేలా ఎం త్రివేది సెప్టెంబర్ 1న ప్రమాణ స్వీకారం చేశారు.

చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ ఇందిరా బెనర్జీ, కొత్తగా నియమితులైన ముగ్గురు మహిళా న్యాయమూర్తులతో కూడిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వార్త, పలు వార్తా పత్రికల్లో మొదటి పేజీలో చోటు సంపాదించుకుంది.

"జెండర్ ప్రాతినిధ్యం విషయంలో ఇది ఒక చారిత్రక ఘట్టమని" న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు అభివర్ణించారు. "ఇవి గర్వించదగ్గ క్షణాలని" అమెరికాలోని భారత రాయబారి అన్నారు.

కొత్త న్యాయమూర్తులకు శుభాకాంక్షలు తెలుపుతూ, భారత చరిత్రలో ఇదొక ముఖ్యమైన రోజు అంటూ ట్విటర్‌లో ప్రశంసలు వెల్లివిరిశాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఇటీవల ఒక రిటైర్డ్ మహిళా న్యాయమూర్తి భారతదేశ న్యాయవ్యవస్థను "ఓల్డ్ బాయ్స్ క్లబ్"గా అభివర్ణించారు

'అప్పుడే సంబరపడక్కర్లేదు'

భారతదేశ ఉన్నత న్యాయవ్యవస్థలో ఈ నియామకాలు ఆహ్వానించదగ్గ పరిణామమే. ఇవి జెండర్ ప్రాతినిధ్యాన్ని పెంచాయన్న మాట వాస్తవమే అయినప్పటికీ దేశవ్యాప్తంగా మొత్తం న్యాయవ్యవస్థలో జెండర్ అసమానతలు తగ్గనంత కాలం తాజా పరిణామాలకు సంబరాలు జరుపుకోవడం తొందరపాటే అవుతుందని విమర్శకులు అంటున్నారు.

సీజేఐగా తొలి మహిళా న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ఇప్పటి నుంచే ఉత్సాహపడడం తొందరపాటేనని, అన్నీ సవ్యంగా జరిగినా, 2027లో, అదీ రిటైర్ కావడానికి ఒక్క నెల ముందు మాత్రమే జస్టిస్ నాగరత్న సీజేఐ పదవిని అలంకరిస్తారని సీనియర్ లాయరు స్నేహ కలిత అన్నారు.

"చీఫ్ జస్టిస్‌గా ఒక మహిళా న్యాయమూర్తి తొలిసారిగా బాధ్యతలు స్వీకరించడం చారిత్రక ఘట్టమే, సంబరాలు జరుపుకోవలసిన విషయమే. కానీ అది నామమాత్రపు చర్య మాత్రమే. దాని వలన ఎలాంటి ప్రభావం ఉండదు.’’

’’చీఫ్ జస్టిస్‌గా నియామకం జరిగిన తరువాత, ఆ బాధ్యతలు స్వీకరించి ఆ పదవిలో స్థిరపడడానికి కొంత సమయం పడుతుంది. మొదటి రెండు నెలలు అడ్మినిస్ట్రేటివ్ పనులకే సరిపోతాయి. అలాంటిది ఒక్క నెలలో ఆమె ఏం చేయగలరు? ఒక మహిళ, సీజేఐ అయ్యారని చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తుంది తప్పితే మరే లాభం ఉండదు" అని లాయరు కలిత అన్నారు.

ఫొటో సోర్స్, NurPhoto

ఫొటో క్యాప్షన్,

లైంగిక వేధింపుల కేసులో భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌కు క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు ప్రజాగ్రహం వెల్లువెత్తింది

కోర్టుల్లో మహిళలకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మహిళా న్యాయవాదుల బృందంలో స్నేహ కలిత కూడా ఉన్నారు.

భారతదేశంలో 1950లో సుప్రీం కోర్టును స్థాపించిన నాటినుంచి ఒక మహిళను సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమించేందుకు 39 సంవత్సరాలు పట్టింది.

1989లో ఫాతిమా బీవీ, సుప్రీం కోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా ఎన్నికయ్యారు.

"అప్పటివరకు మూసి ఉన్న తలుపులను నేను తెరిచాను" అంటూ జస్టిస్ ఫాతిమా బీవీ 2018లో 'స్క్రోల్' న్యూస్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

అయితే, అక్కడితో జెండర్ సమస్యలు తీరిపోయాయనుకుంటే పొరపాటే. గత 71 సంవత్సరాలలో సుప్రీం కోర్టు జడ్జిలుగా నియమితులైన 256 మందిలో కేవలం 11 మంది ( 4.2 శాతం) మాత్రమే మహిళలు.

ప్రస్తుతం 34 మంది సభ్యులతో కూడిన సుప్రీం కోర్టు న్యాయమూర్తుల బృందంలో నలుగురు మహిళలు ఉన్నారు. ఇప్పటివరకూ ఇదే అత్యధికం.

వివిధ రాష్ట్రాలలోని 25 హైకోర్టులలోని 677 మంది జడ్జిలలో 81 మంది మహిళలు ఉన్నారు. అయిదు హైకోర్టుల్లో ఒక్క మహిళా న్యాయమూర్తి కూడా లేరు.

ఫొటో సోర్స్, Getty Images

'కోర్టుల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి'

ఈ మధ్యనే ఒక రిటైర్డ్ మహిళా న్యాయమూర్తి భారతదేశ న్యాయవ్యవస్థను "ఓల్డ్ బాయ్స్ క్లబ్"గా అభివర్ణించారు.

"ఉన్నత న్యాయ వ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం అధ్వానంగా ఉంది. దేశ జనాభాలో సగం మంది మహిళలే ఉన్నప్పుడు, న్యాయవ్యవస్థలో సగ భాగం మాకెందుకు లేదు?" అంటూ లాయరు కలిత ప్రశ్నిస్తున్నారు.

‘‘జడ్జిలను నియమించే కొలీజియం, జిల్లా న్యాయస్థానాలలో అర్హత గల న్యాయమూర్తులను కనుగొనలేకపోతే.. సుప్రీం కోర్టు బార్ నుంచి మహిళా న్యాయమూర్తులను ఎంచుకోవాలి. అక్కడ దక్షత గల మహిళా న్యాయవాదులు ఎంతోమంది ఉన్నారు’’అని ఆమె అన్నారు.

మహిళా న్యాయమూర్తుల సంఖ్య పెరగాలని ప్రస్తుత చీఫ్ జస్టిస్ రమణతో సహా పలువురు న్యాయ నిపుణులు, న్యాయమూర్తులు ఇటీవల పిలుపునిచ్చారు.

"స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ల తరువాత, న్యాయవ్యవస్థలోని అన్ని స్థాయిలలో కనీసం 50 శాతం మహిళా ప్రాతినిధ్యం ఉండాలని ఆశించవచ్చు. కానీ ఇప్పటివరకు, అతి కష్టం మీద 11 శాతం ప్రాతినిధ్యాన్ని మాత్రమే సుప్రీం కోర్టులో సాధించగలిగాం. ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకురావాలి. దీనిపై చర్చ జరగాలి" అని ఇటీవల జస్టిస్ రమణ వ్యాఖ్యానించారు.

బ్రిటన్‌లో 32 శాతం మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. అమెరికాలో 34 శాతం రాష్ట్ర స్థాయి న్యాయమూర్తులు మహిళలే.

అంతర్జాతీయ న్యాయస్థానం (ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్)లో 15 మంది జడ్జిల బెంచ్‌లో ముగ్గురు మహిళలు ఉన్నారు. అంటే 20 శాతం మహిళా న్యాయమూర్తులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

"లైంగిక హింసకు సంబంధించిన కేసులలో మరింత సమతుల్యం, సానుభూతితో కూడిన విచారణ జరగాలంటే సుప్రీం కోర్టులో మహిళా న్యాయమూర్తుల ప్రాతినిధ్యం పెరగాలి"అని భారత న్యాయ నిపుణులు, అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఒక మహిళపై వేధింపులకు పాలపడిన ఓ వ్యక్తిని ఆమె ఇంటికెళ్లి స్వీట్లు ఇచ్చి, క్షమాపణ కోరాలని ఒక హైకోర్టు జడ్జి ఆదేశించిన సంఘటన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అత్యాచార కేసుల్లో బాధితులను అవమానించడం లేదా రాజీపడాలని సూచించిన కోర్టు ఆదేశాలను అనేకసార్లు, అనేక సందర్భాల్లో మహిళా న్యాయవాదులు సవాలు చేశారు.

అయితే, మహిళా న్యాయమూర్తుల సంఖ్య పెరిగితే, కోర్టుల్లో పురుషాధిక్యతకు కళ్లెం పడుతుందని భావించలేమని జెండర్ నిపుణులు అంటున్నారు.

"మహిళా న్యాయమూర్తులు బాధిత స్త్రీల పట్ల ఎప్పుడూ సానుభూతి చూపిస్తారని ఆశించలేం. నేరుగా శరీరాలతో సంబంధం జరగలేదని చెప్తూ, ఒక్క చిన్నపిల్లను వేధించిన 39 ఏళ్ల వ్యక్తిపై లైంగిక వేధింపుల ఆరోపణలను కొట్టివేసినది ఒక మహిళా న్యాయమూర్తే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల కేసులో క్లీన్ చిట్ ఇచ్చిన ముగ్గురు సభ్యుల కమిటీలో ఇద్దరు మహిళా న్యాయమూర్తులే" అంటూ నమితా భండారే ఇటీవల 'హిందుస్తాన్ టైమ్స్' పత్రికలో రాశారు. నమిత.. 'ఆర్టికల్ 14' న్యూస్ వెబ్‌సైట్ జెండర్ ఎడిటర్‌గా ఉన్నారు.

న్యాయవ్యవస్థ.. "ఉన్నత వర్గాల, ఆధిపత్య కులాల, మెజారిటీ మతానికి చెందిన పురుషుల" సొత్తుగా ఉండిపోకూడదని, అన్ని వర్గాల గొంతులూ వినిపించేలా, ప్రజాస్వామ్యానికి అద్దం పడుతూ కొనసాగాలని ఆమె అన్నారు.

మహిళలందరూ ఉత్తమ న్యాయమూర్తులు కాకపోవచ్చుగానీ, న్యాయవాద వృత్తిని చేపట్టే దిశలో మహిళలను ప్రోత్సహించాలని లాయరు స్నేహ కలిత అభిప్రాయపడ్డారు.

"మనకు స్వేచ్ఛాయుత దేశం కావాలంటే, న్యాయవ్యవస్థలో జెండర్ సమానత్వం సాధించాల్సిందే. ఉన్నత న్యాయ స్థానాలలో మహిళల ప్రాతినిధ్యం పెరిగితే ఈ వృత్తిని చేపట్టేందుకు మరింతమంది మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ధర్మాసనంలో జెండర్ సమానత్వం సాధించడం అనేది సమాజానికి ఎంతో మేలు చేస్తుంది" అని స్నేహ కలిత అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)