పోర్న్ చూడడం, షేర్ చేయడం నేరమా... చైల్డ్ పోర్న్ ఫోన్లో ఉంటే ఎలాంటి శిక్షలు విధిస్తారు?
- రాజేశ్ పెదగాడి
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
ట్విటర్ సీఈవో జాక్ డోర్సీ, ఆ సంస్థ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరిలపై చర్యలు తీసుకునేందుకు అనుమతించాలని దిల్లీలోని ఓ సెషన్సు కోర్టును పోలీసులు కోరారు.
ట్విటర్ పేజీలపై షేర్ అవుతున్న బాలలపై లైంగిక వేధింపులు, అశ్లీల దృశ్యాలు (చైల్డ్ పోర్నోగ్రఫీ)కి సంబంధించి ఇప్పటికే ట్విటర్‌పై దిల్లీ పోలీసులు ప్రాథమిక విచారణ నివేదిక (ఎఫ్ఐఆర్)ను కూడా నమోదు చేశారు.
నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్) ఫిర్యాదుపై పోలీసులు ఈ చర్యలు తీసుకుంటున్నారు.
మరోవైపు అశ్లీల చిత్రాలను నిర్మిస్తున్నారనే ఆరోపణలపై నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబయి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
కొన్ని సబ్స్క్రిప్సన్ ఆధారిత మొబైల్ యాప్‌లు, వెబ్సైట్లకు అశ్లీల దృశ్యాలను అందిస్తున్నారని కుంద్రాపై పోలీసులు ఆరోపణలు మోపారు.
దీంతో అసలు పోర్న్ చూడొచ్చా? ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయొచ్చా? చైల్డ్ పోర్న్ ఫోన్లో ఉంటే ఎలాంటి శిక్షలు విధిస్తారు? లాంటి అంశాలపై మీడియాలో చర్చ జరుగుతోంది.
ఫొటో సోర్స్, Reuters
నిషేధం అమలులో ఉన్నా పోర్న్ చూస్తున్నారా?
భారత్‌లో చాలా పోర్న్ వెబ్సైట్లపై నిషేధం అమలులో ఉంది. కొన్ని వెబ్సైట్లు ‘‘మొరాలిటీ, డీసెన్సీ’’ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని చెబుతూ.. జులై 2015న 857 వెబ్సైట్లను భారత టెలికమ్యూనికేషన్ల విభాగం బ్యాన్ చేసింది. 2018లో ఈ బ్యాన్‌ను మళ్లీ పొడిగించింది. ప్రస్తుతం ఈ వెబ్సైట్లపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.
అంటే, ఈ వెబ్సైట్లు ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
నిషేధం అమలులో ఉన్నప్పటికీ భారత్‌లో పోర్న్ చూసే వారి సంఖ్య ఏమీ తగ్గలేదని 2018లో విడుదల చేసిన ఓ నివేదికలో పోర్న్ వెబ్సైట్ ‘‘పోర్న్‌హబ్’’ వెల్లడించింది.
గూగుల్, యూట్యూబ్ తరహాలోనే పోర్న్‌హబ్ కూడా తమ యూజర్ల డేటాను విడుదల చేస్తుంది. 2020లో 2018నాటి గణాంకాలను పోర్న్‌హబ్ వెల్లడించింది.
ఫొటో సోర్స్, SOPA Images
పోర్న్‌హబ్ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా మొదటి స్థానంలో ఉంది. రెండు, మూడు స్థానాల్లో బ్రిటన్, భారత్ ఉన్నాయి. ఈ రెండింటి మధ్య తేడా చాలా తక్కువగా ఉంది.
సగటు భారతీయులు ఒక్కో వీడియోపై 8.23 నిమిషాలు వెచ్చిస్తున్నట్లు పోర్న్‌హబ్ తెలిపింది. మరోవైపు పోర్న్చూసే వారిలో 44 శాతం మంది 18 నుంచి 24ఏళ్ల వయసు వారేనని తెలిపింది. మరో 41 శాతం మంది 25 నుంచి 34ఏళ్ల మధ్య వయసువారని వెల్లడించింది. మొత్తంగా భారత్‌లో పోర్న్చూసేవారి సగటు వయసు 29ఏళ్లు.
పోర్న్‌హబ్ చూస్తున్న భారతీయుల్లో 30 శాతం మంది మహిళలు ఉన్నట్లు ఆ సంస్థ తెలిపింది.
మరోవైపు కరోనావైరస్ వ్యాప్తి కట్టడికి లాక్డౌన్ విధించిన సమయంలో మొదటి మూడు వారాల్లో పోర్న్ ట్రాఫిక్ భారత్‌లో 95 శాతం పెరిగిందని ఏప్రిల్ 2020లో పోర్న్‌హబ్ వెల్లడించింది.
భారత్‌లో నిషేధం అమలులోనున్న ఉన్నప్పటికీ వీపీఎన్‌లు, ప్రోక్సీల ద్వారా నెటిజన్లు పోర్న్‌ను చూస్తున్నట్లు ఐటీ నిపుణులు చెబుతున్నారు.
‘‘ఉదాహరణకు పోర్న్‌హబ్, ఎక్స్‌వీడియోస్ లాంటి సైట్లను తీసుకోండి. వీటిని జియో, ఎయిర్టెల్ లాంటి సర్వీస్ ప్రొవైడర్లు బ్యాన్ చేశాయి. అయితే, వీపీఎన్‌లు, డీఎన్ఎస్ సర్వర్ ఛేంజ్, ప్రోక్సీల సాయంతో చాలా మంది ఈ వెబ్సైట్లను చూడగలుగుతున్నారు. దీని కోసం గూగుల్ క్రోమ్, మోజిల్లా ఫైర్ఫాక్స్కు బదులుగా.. అంతగా ప్రాచుర్యంలోలేని బ్రౌజర్లను వాడుతుంటారు’’అని హైదరాబాద్‌కు చెందిన ఐటీ నిపుణుడు ప్రవీణ్ కుమార్ రెజెట్ తెలిపారు.
ఫొటో సోర్స్, Getty Images
పోర్న్ చూడొచ్చా?
పోర్న్ వీక్షకులపై ఆంక్షలు విధించేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టం-2020, ప్రొటక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోస్కో) చట్టం-2012, భారత శిక్షా స్మృతి (ఐపీసీ)లో నిబంధనలు ఉన్నాయి.
సంక్షిప్తంగా చెప్పాలంటే భారత్‌లో పోర్న్ చూడటం అనేది చట్ట విరుద్ధమైన చర్యేమీ కాదు. 2015 జులైలో సుప్రీం కోర్టు ఇదే విషయాన్ని స్పష్టంచేసింది. ‘‘తన సొంత గదిలో పోర్న్ చూడటం అనేది సదరు వ్యక్తి 'వ్యక్తిగత స్వేచ్ఛ' పరిధిలోకి వస్తుంది’’అని కోర్టు చెప్పింది.
‘‘వ్యక్తిగత స్వేచ్ఛ గురించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో పేర్కొన్నారు. ఈ స్వేచ్ఛపై ఏమైనా ఆంక్షలు విధించాలని భావిస్తే, కేంద్ర ప్రభుత్వం చట్టాలు తీసుకురావచ్చని రాజ్యాంగం చెబుతోంది. ఇలా ఆంక్షలు విధించేందుకు సూచించిన షరతుల్లో ‘‘మొరాలిటీ, డీసెన్సీ’’ కూడా ఒకటి’’అని ఐటీ, పోక్సో చట్టాలపై అధ్యయనం చేస్తున్న హర్షవర్ధన్ పవార్ అన్నారు.
2015లో ‘‘మొరాలిటీ, డీసెన్సీ’’ కిందే టెలికమ్యూనికేషన్ల విభాగం ఆంక్షలు విధించింది. అయితే, ఈ ఆంక్షలను బాలల అశ్లీల దృశ్యాల(చైల్డ్ పోర్నోగ్రఫీ)ను కట్టడిచేసేందుకు తీసుకొచ్చామని, వీటిని తాత్కాలికంగానే తీసుకొచ్చామని టెలికమ్యూనికేషన్ల విభాగం తెలిపింది.
‘‘పోర్న్ వెబ్సైట్లు కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన సైట్ల సంఖ్య వెయ్యి కంటే తక్కువే ఉంది. ఇంకొక విషయం ఏమిటంటే, ఎప్పటికప్పుడు పోర్న్ వెబ్సైట్లు తమ ఐపీ అడ్రస్‌లను మారుస్తుంటాయి. ఇలా ఎన్నింటిని బ్యాన్ చేయగలం? పైగా ఈ వెబ్సైట్లను దొంగ దారుల్లో నెటిజన్లు చూస్తూనే ఉన్నారు. పోర్న్‌తో ఎంత సమయం వృథా అవుతోందో యువతే గుర్తించాలి. ముఖ్యంగా పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుందో అవగాహన కల్పించాలి. అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది’’అని హర్షవర్ధన్ అన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
శిక్షలు ఏమిటి?
ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో ఎక్కువగా కనిపించే పోర్న్ నియంత్రణకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ – (ఐటీ యాక్ట్) 2020లో నిబంధనలు ఉన్నాయి. సెక్స్ సమాచారాన్ని పబ్లిష్ చేసినా, ట్రాన్స్మిట్ చేసినా నేరంగా పరిగణించేలా ఈ నిబంధనలను సిద్ధంచేశారు.
ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 67 ప్రకారం.. శృంగార చర్యలను రికార్డుచేసి ఎలక్ట్రానిక్ రూపంలో పబ్లిష్ చేసినా, ట్రాన్స్మిట్ చేసినా ఐదేళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.10లక్షల వరకు ఫైన్ కూడా విధించే అవకాశముంది. రెండోసారి కూడా పట్టుబడితే గరిష్ఠంగా ఏడేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధిస్తారు.
అదే సమయంలో, సెక్షన్ 66-ఇ ప్రకారం, సదరు వ్యక్తి అనుమతి లేకుండా ఆమె లేదా అతడి ప్రైవేటు భాగాల ఫోటోలు, వీడియోలను ‘‘కావాలని లేదా అనుకుకోకుండా’’ గానీ పబ్లిష్ చేసినా లేదా ట్రాన్స్మిట్ చేసినా గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.2 లక్షల వరకు జరిమానా కూడా విధించే అవకాశముంది.
మరోవైపు ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ (ప్రొహిబిషన్) చట్టం-1986 కూడా ప్రచురణలు, వ్యాసాలు, పెయింటింగ్‌ల, దృశ్యాల కోసం మహిళల్ని అభ్యంతరకరంగా చూపించడాన్ని నేరంగా పరిగణిస్తోంది.
అయితే, ఐటీ చట్టం ప్రధానంగా సర్వీస్ ప్రొవైడర్లే లక్ష్యంగా తీసుకొచ్చారని హర్షవర్ధన్ అన్నారు. ‘‘ఇక్కడ పోర్న్ సైట్ల బ్యాన్‌ను అమలు చేయాల్సింది సర్వీసు ప్రొవైడర్లే. అయితే, సమస్య అంతా యూజర్లతోనే ఉంది. సర్వీస్ ప్రొవైడర్లు బ్యాన్ చేస్తున్నా యూజర్లకు పోర్న్ అందుబాటులో ఉంటోంది. అదే సమయంలో పోర్న్ విషయంలో ప్రభుత్వ నిబంధనలను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ప్రధానంగా చైల్డ్ పోర్నోగ్రఫీనే లక్ష్యంగా నిబంధనలు తీసుకొచ్చినట్లు చెబుతోంది. ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. పోర్న్ చూడటం నేరం కాదు.. అయితే, చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం తీవ్రమైన నేరం. చైల్డ్ పోర్నోగ్రఫీతో చిక్కుల్లో పడే అవకాశముంది’’అని హర్షవర్ధన్ చెప్పారు.
ఫొటో సోర్స్, Getty Images
చైల్డ్ పోర్నోగ్రఫీ చట్ట వ్యతిరేకమా?
చైల్డ్ పోర్నోగ్రఫీ చట్ట వ్యతిరేకమని భారత ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు స్పష్టంచేసింది. భారత చట్టాలు చైల్డ్ పోర్నోగ్రఫీని తీవ్రమైన నేరంగా పరగిణిస్తున్నాయి. పబ్లికేషన్, ట్రాన్స్‌మిషన్‌తోపాటు బాలల అశ్లీల సమాచారం మీ దగ్గరున్నా, దాన్ని షేర్ చేసినా చట్టపరమైన చర్యలను ఎదుర్కొనే అవకాశముంది.
బాలల అశ్లీల దృశ్యాలను అడ్డుకోవడానికి ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫమ్ సెక్షువల్ అఫెన్సెస్ (పోక్సో)లో ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. పిల్లల్ని లైంగిక కోణంలో చూపించే ఫోటోలు, వీడియోలు, కంప్యూటర్లో రూపొందించిన, మార్పులుచేసిన ఇమేజెస్ కూడా బాలల అశ్లీల సమాచారం కిందకే వస్తుందని దీనిలో కేంద్ర స్పష్టీకరించింది.
అశ్లీల సమాచారం కోసం పిల్లల్ని ఉపయోగించుకుంటే ఐదేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించవచ్చని పోక్సో చట్టంలోని సెక్షన్ 14 చెబుతోంది.
రెండోసారి కూడా ఈ చట్టం కింద నేరం రుజువైతే ఈ శిక్షను ఏడేళ్లకు పెంచుతారు. జరిమానా దీనికి అదనంగా విధిస్తారు.
వేరే వారికి పంపడానికి, షేర్ చేయడానికి లేదా చూడటానికి, పబ్లిష్ చేయడానికి పిల్లల అశ్లీల దృశ్యాలను మన దగ్గర దాచుకున్నా కూడా నేరమేనని ఈ చట్టం చెబుతోంది. దీనికి జరిమానాలతోపాటు జైలు శిక్షలు కూడా విధించే అవకాశముంది. రూ. 5000ల నుంచి మొదలయ్యే ఈ జరిమానాలకు గరిష్ఠ పరిమితి అంటూ ఏమీలేదు. అంటే నేరం తీవ్రత ఆధారంగా ఈ జరిమానాలు ఉంటాయి.
ముఖ్యంగా వెబ్సైట్లలో పెట్టేందుకు ఈ దృశ్యాలు, ఫోటోలను సేకరిస్తే, మూడు నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది.
ఫొటో సోర్స్, Science Photo Library
బాలల అశ్లీల దృశ్యాల విషయంలో కలెక్టింగ్, బ్రౌజింగ్, డౌన్లోడింగ్, ప్రమోటింగ్, డిస్ట్రిబ్యూటింగ్లపైనా నిషేధం అమలులో ఉంది.
అయితే, అధికారులకు సాక్ష్యంగా చూపించేందుకు ఈ దృశ్యాలను మన దగ్గర ఉంచుకోవచ్చు.
పోక్సో చట్టం కింద కఠినమైన నిబంధనలు అమలులో ఉన్నప్పటికీ, బాలల అశ్లీల దృశ్యాలకు సంబంధించిన కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి.
ఒక్క నాగ్పుర్లోనే గత ఎనిమిది నెలల్లో చైల్డ్ పోర్నోగ్రఫీ నిబంధనల కింద 38 కేసులు రికార్డు చేశామని, వీటికి సంబంధించి 30 మందిని అరెస్టు చేశామని గత జూన్‌లో నాగ్‌పుర్ సీపీ అమితేశ్ కుమార్ తెలిపారు.
భారత్‌లో పోర్న్ చూడటంపై నిషేధం లేనప్పటికీ.. పబ్లికేషన్, క్రియేషన్, డిస్ట్రిబ్యూషన్‌పై ఆంక్షలు అమలులో ఉన్నాయి. పిల్లల అశ్లీల సమాచారంపై సంపూర్ణ నిషేధం అమలులో ఉంది.
ఇవి కూడా చదవండి:
- బాలాపూర్ అంటే లడ్డూయే కాదు, అక్కడ ఈ ప్రసాదాలు కూడా ప్రత్యేకమే
- వీడియో: ఘనా రాజధాని అక్రాలో వినాయక చవితి, గణేశ్ నిమజ్జనం
- పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ
- హైదరాబాద్ నిజాం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, పిసినారి కూడా..
- నాగ చైతన్యతో విడాకుల రూమర్స్‌పై మీడియా ప్రశ్న.. ‘గుడికి వచ్చి.. బుద్ధుందా?’ అన్న సమంత
- Pak Vs NZ: పాకిస్తాన్ పర్యటన రద్దు చేసుకోవాలంటూ న్యూజీలాండ్‌కు నిఘా సమాచారం ఇచ్చిందెవరు
- AUKUS ఒప్పందం ఏంటి? అమెరికా, ఆస్ట్రేలియాపై ఫ్రాన్స్ ఆగ్రహం ఎందుకు? చైనా ఎందుకు భయపడుతోంది?
- సమంత అక్కినేని: నన్ను భయపెట్టే పాత్రలనే చేస్తా
- బ్రసెల్స్: కొత్తగా నిర్మిస్తున్న వీధికి ఒక సెక్స్ వర్కర్ పేరు.. ఎందుకంటే..
- 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఇక సాధారణమైపోతాయా - బీబీసీ విశ్లేషణలో ఏం తేలింది
- వికీపీడియాలో చొరబాటు: చైనా లక్ష్యాలను ప్రమోట్ చేసేలా కంటెంట్ నియంత్రణ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)