అసదుద్దీన్ ఇంటిపై దాడి, అయిదుగురు హిందూసేన కార్యకర్తల అరెస్ట్ - ప్రెస్‌రివ్యూ

Asaduddin Owaisi

ఫొటో సోర్స్, Getty Images

మజ్లిస్‌ చీఫ్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ దిల్లీ నివాసంపై హిందూ సేనకు చెందిన కార్యకర్తలు దాడి చేశారని 'ఆంధ్రజ్యోతి' కథనం రాసింది.

ఈ దాడిలో ఆయన నివాసం పాక్షికంగా ధ్వంసమైంది.

దిల్లీలోని అశోకా రోడ్డులో ఉన్న ఒవైసీ ఇంటిపై ఈ దాడి జరిగింది.

ఈ ఘటనకు పాల్పడిన ఐదుగురు హిందూ సేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నామని డీసీపీ దీపక్‌ యాదవ్‌ తెలిపారు.

కాగా తన నివాసంపై జరిగిన దాడిని ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఖండించారు. గూండాలను రెచ్చగొట్టి తన ఇంటిపై దాడి చేయించారని ఆయన ట్వీట్‌ చేశారు.

దేశ రాజధానిలో ఓ ఎంపీ నివాసం సురక్షితంగా లేకపోతే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఏం జవాబు ఇస్తారని ఆయన ప్రశ్నించారు.

'నేను లేని సమయంలో ఢిల్లీలో గూండాలు ఆయుధాలతో గుంపులుగా వెళ్లి, నా ఇంటిపై కర్రలు, గొడ్డళ్లతో దాడి చేసి పారిపోయారు. ఈ దాడిలో నా ఇంటి కాపలాదారు గాయపడ్డాడు. దాడులతో భయపెట్టలేరు. మజ్లిస్‌ అంటే ఏమిటో ఆ గూండాలకు తెలీదు' అని ఒవైసీ అన్నార''ని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, facebook/nimmalaramanaidu

అచ్చెన్నాయుడు, రామానాయుడులకు రానున్న రెండున్నరేళ్లు మైక్ కట్

టీడీపీ శాసనసభాపక్ష ఉప నేతలు అచ్చెన్నాయుడు, రామానాయుడులకు ప్రస్తుత శాసన సభ ఉన్నన్నాళ్లూ మైక్ ఇవ్వరాదని ఏపీ శాసనసభ హక్కుల సంఘం తీర్మానించిందని 'ఈనాడు' కథనం రాసింది.

''వీరిద్దరిపై ఈ చర్య తీసుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రతిపాదించగా మరో ఎమ్మెల్యే విష్ణు బలపరిచినట్లు తెలిసింది. ఈ విషయాన్ని కమిటీ సభ్యుడు, టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ధ్రువీకరించారు. ఆయన మంగళవారం రాత్రి ఈ విషయం ట్వీట్ చేశారు.

సభాహక్కుల సంఘం అసెంబ్లీ కమిటీ హాలులో మంగళవారం సమావేశమైంది. చైర్మన్ కాకాని గోవర్థన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.

గతంలో శాసనసభలో చర్చ సందర్భంగా చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అప్పట్లో ఫిర్యాదు చేశారు.

పింఛన్ల సంఖ్య విషయంలో అప్పట్లో ముఖ్యమంత్రి జగనే సభా హక్కుల ఉల్లంఘత తీర్మానం ప్రవేశపెట్టారు.

ఈ ఫిర్యాదులపై అచ్చెన్నాయుడు, రామానాయుడు సరైన వివరణ ఇవ్వనందున వారిపై చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించిందని కాకాణి గోవర్థన్ రెడ్డి మీడియాకు చెప్పారు.

వచ్చే సమావేశాలలో ఈ తీర్మాన ప్రతిని శాసనసభ ముందుంచుతారు'' అని ఆ కథనంలో రాశారు.

ఫొటో సోర్స్, CMO, Telangana

గట్టెక్కించండి.. మరో మార్గం లేదు

విద్యుత్, ఆర్టీసీ బస్సు చార్జీలను త్వరలో తెలంగాణ ప్రభుత్వం పెంచనుందని సాక్షి కథనం తెలిపింది.

''కోవిడ్‌తో ఈ రెండు విభాగాలు బాగా దెబ్బతిని తీవ్ర నష్టాలు వాటిల్లిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో ఆ సేవలు ప్రజలకు సాఫీగా అందాలంటే చార్జీలు తక్షణం పెంచాల్సిన అవసరం ఉందని విద్యుత్, ఆర్టీసీ అధికారులు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దృష్టికి తెచ్చారు.

కోవిడ్‌ తర్వాత పరిస్థితులు, వాటితో సంస్థలకు వాటిల్లిన నష్టాలను ఆయనకు వివరించారు.

దీంతో చార్జీల పెంపు ఎంతవరకు ఉండొచ్చో.. రెండుమూడు ప్రతిపాదనలను వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి అందిస్తే, ఆ భేటీలో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు.

మంగళవారం ప్రగతి భవన్‌లో ఆర్టీసీ, విద్యుత్‌ విభాగాల అధికారులతో కేసీఆర్‌ సుదీర్ఘంగా సమీక్షించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి పొద్దుపోయేవరకు ఆయన చర్చించార''ని ఆ కథనంలో రాశారు.

ఫొటో సోర్స్, KTR/facebook

‘రేవంత్ ఇక ఆపు’

మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులో మంత్రి కల్వకుంట్ల తారకరామారావుపై ఎలాంటి విమర్శలు, వ్యాఖ్యలు చేయరాదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు ఆదేశించిందని 'నమస్తే తెలంగాణ' కథనం రాసింది.

''కేటీఆర్‌.. రేవంత్‌పై దాఖలు చేసిన పరువు నష్టం దావాను విచారించిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

పత్రికలు, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా మంత్రి కేటీఆర్‌ పరువు, ప్రతిష్ఠలను దెబ్బతీసేలా ఎలాంటి పోస్టులు పెట్టవద్దని, మాట్లాడవద్దని.. రేవంత్‌, ఆయన అనుచరులను ఆదేశించింది.

డ్రగ్స్‌ కేసుతో ముడిపెట్టి.. కేటీఆర్‌కు అపకీర్తి ఆపాదించేలా నోటికి ఏది వస్తే అది మాట్లాడరాదని సిటీ సివిల్‌ కోర్టు మూడో అదనపు జిల్లా చీఫ్‌ జడ్జి కల్యాణ్‌చక్రవర్తి.. రేవంత్‌కు ఇన్‌జంక్షన్‌ ఆర్డర్‌ ఇచ్చారు.

కేటీఆర్‌ దాఖలుచేసిన పరువు నష్టం దావాను కోర్టు విచారణకు స్వీకరించి, ప్రతివాది రేవంత్‌కు నోటీసులు జారీ చేసింది. కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని రేవంత్‌ను ఆదేశించింద''ని ఆ కథనంలో రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)