Pew Research: భారత్‌లో గత 70 ఏళ్లల్లో ఏ మతస్థుల జనాభా ఎంత పెరిగింది?
- సౌతిక్ బిశ్వాస్
- ఇండియా కరస్పాండెంట్

ఫొటో సోర్స్, AFP
భారత్‌లోని అన్ని మతాల ప్రజలలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గిందని 'ప్యూ రీసెర్చ్ సెంటర్' అధ్యయనం గుర్తించింది.
దీంతో 1951 నుంచి దేశంలో జనాభాపరంగా మత కూర్పులో పెద్దగా తేడాలు రాలేదు.
120 కోట్ల జనాభా గల భారతదేశంలో రెండు అతి పెద్ద మత సమూహాలైన హిందువులు, ముస్లింలు కలిపి 94 శాతం ఉన్నారు.
క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు కలిపి 6 శాతం ఉన్నారు.
పదేళ్లకోసారి చేసే జనగణన, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్) డాటాను పరిశీలించిన ప్యూ రీసెర్చ్ సెంటర్ భారత్‌లో మత కూర్పులో చోటుచేసుకున్న మార్పులు, అందుకు దారి తీసిన కారణాలను విశ్లేషించింది.
1951లో 36.1 కోట్లుగా ఉన్న భారత్ జనాభా 2011 నాటికి 120 కోట్లకు పెరిగింది.
స్వతంత్ర భారతదేశంలో తొలి జనగణన 1951లో నిర్వహించగా చివరి జనగణన 2011లో జరిగింది. 2011 తరువాత 2021లో జనగణన జరగాల్సి ఉన్నప్పటికీ కోవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా పడింది.
ఈ 60 ఏళ్ల వ్యవధిలో భారత్‌లోని అన్ని మతాల జనాభా పెరిగింది.
హిందువుల జనాభా 30.4 కోట్ల నుంచి 96.6 కోట్లకు... ముస్లింల జనాభా 3.5 కోట్ల నుంచి 17.2 కోట్లకు పెరిగింది.
క్రైస్తవుల జనాభా 80 లక్షల నుంచి 2.8 కోట్లకు పెరిగింది.
ఫొటో సోర్స్, AFP
ఇండోనేసియా తరువాత అత్యధిక సంఖ్యలో ముస్లింలు ఉన్నది భారత్‌లోనే
భారత్‌లో మతాల కూర్పు ఇలా
(2011 జనాభా లెక్కల ప్రకారం)
* 120 కోట్ల భారత జనాభాలో హిందువులు 79.8 శాతం ఉన్నారు. ప్రపంచ హిందూ జనాభాలో 94 శాతం భారత్‌లోనే నివసిస్తున్నారు.
* భారతదేశ మొత్తం జనాభాలో ముస్లింల శాతం 14.2. ఇండోనేసియా తరువాత అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం భారత్.
* క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైనులు భారత జనాభాలో 6 శాతం ఉన్నారు.
* 30 వేల మంది తమను తాము నాస్తికులుగా చెప్పుకొన్నారు.
* హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ, సిక్కు, జైన మతాలకు చెందనివారు 80 లక్షల మంది భారత్‌లో ఉన్నారు.
* ప్రధానమైన ఈ ఆరు మతాలు కాకుండా మరో 83 మతాలు భారత్‌లో ఉన్నాయి.
* భారత్‌లో నెలకు సగటున 10 లక్షల జననాలు నమోదవుతాయి. ఈ జననాల రేటు ప్రకారం చూస్తే ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల చైనాను 2030 నాటికి భారత్ అధిగమించే అవకాశముంది.
ముస్లింలలోనే అధిక సంతానోత్పత్తి రేటు
2015 గణాంకాల ప్రకారం భారత్‌లో ముస్లింలలో అత్యధిక సంతానోత్పత్తి రేటు 2.6 ఉంది. అంటే సగటున ప్రతి 100 మంది ముస్లిం మహిళలు 260 మంది పిల్లలను కంటున్నారు.
హిందువుల్లో ఈ సంతానోత్పత్తి రేటు 2.1 గా ఉంది. అంటే సగటున ప్రతి 100 మంది హిందూ మహిళలు 210 మంది పిల్లలను కంటున్నారు.
ప్రధానమైన ఆరు మతాలలో జైనుల్లో సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉంది. వీరిలో సంతానోత్పత్తి రేటు 1.2గా ఉంది.
1992తో పోల్చితే సంతానోత్పత్తి రేటులో తగ్గుదల నమోదైంది.
1999లో ముస్లింలలో సంతానోత్పత్తి రేటు 4.4, హిందువులలో సంతానోత్పత్తి రేటు 3.3గా ఉండేది.
జనగణన ప్రారంభమైన తరువాత రెండుమూడు దశాబ్దాలలో హిందువుల కంటే ముస్లింలలో జనాభా వృద్ధి రేటు అధికంగా ఉన్నప్పటికీ క్రమంగా ముస్లింలలో జనాభా వృద్ధి రేటు తగ్గుతూ వచ్చిందని ప్యూ రీసెర్చ్ అధ్యయనం గుర్తించింది.
ముస్లింలలోని ఒక తరంలో 25 ఏళ్ల లోపు మహిళలో సంతానోత్పత్తి రేటు దాదాపు సగానికి తగ్గడం ఆశ్చర్యకరంగా ఉందని ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనకర్త స్టెఫానీ క్రామర్ చెప్పారు.
మొత్తంగా చూసుకుంటే భారతదేశంలో మహిళల సంతానోత్పత్తి రేటు 1990లో 3.4గా ఉంటే 2015 నాటికి అది 2.2కి తగ్గింది. ముస్లింలలో అది 4.4 నుంచి 2.6కి తగ్గింది. అంటే.. సగటున ప్రతి ముస్లిం మహిళ 1990 నాటితో పోల్చితే 2015 నాటికి ఇద్దరు పిల్లలను తక్కువగా కంటున్నట్లు లెక్క.
60 ఏళ్ల కాల వ్యవధిలో భారత దేశ జనాభాలో ముస్లింల వాటా 4 శాతం పెరిగింది, హిందువుల వాటా దాదాపు అంతే స్థాయిలో తగ్గింది.
మిగత మతాల జనాభా వాటాలో పెద్దగా మార్పు లేదు.
మిగతా భారతీయ మహిళల కంటే ముస్లిం మహిళలు ఎక్కువ మంది సంతానాన్ని కనడం మొత్తం మత కూర్పులో చోటుచేసుకున్న స్వల్ప మార్పునకు కారణమని స్టెఫానీ క్రామర్ అన్నారు.
కుటుంబ పరిమాణంలో మార్పులకు అనేక కారణాలుంటాయి.. సంతానోత్పత్తి రేట్లకు మతానికి సంబంధం ఉందని కచ్చితంగా చెప్పలేం అని ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం అభిప్రాయపడింది.
అనేక ఇతర దేశాల మాదిరిగా కాకుండా భారతదేశంలో జనసంఖ్యలో మార్పులపై వలసలు, మతమార్పిడుల ప్రభావం పెద్దగా లేదు.
మతపరంగా జనాభా కూర్పులో వ్యత్యాసాలకు సంతానోత్పత్తి రేటు కొంత వరకు కారణం కావొచ్చు.
ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం ప్రకారం 2020 నాటికి హిందువుల సగటు వయసు 29 కాగా ముస్లింల సగటు వయసు 24, క్రిస్టియన్ల సగటు వయసు 31.
యువత ఎక్కువగా ఉన్న మత సమూహాలలో మహిళల సగటు ఎక్కువగా ఉండడం, వారు తమ సంతానోత్పత్తి దశలోకి ప్రవేశించడం ఆయా మత జనాభా రేటు పెరగడానికి కారణమని ఈ అధ్యయనం విశ్లేషించింది.
చదువుకున్నవారు, సంపన్నులలో తక్కువ సంతానం
మహిళల విద్యాస్థాయి కూడా జనాభా మార్పులకు కారణమవుతుంది. ఉన్నత విద్యావంతులైన మహిళలు సాధారణంగా మిగతా మహిళల కంటే ఆలస్యంగా వివాహం చేసుకుంటారు. అందుకు అనుగుణంగానే వారు తమ తొలి సంతానాన్ని కనడమనేది మిగతా మహిళల కంటే ఆలస్యంగా జరుగుతుంది.
అలాగే, పేదల కంటే సంపన్నులలోనూ సంతానం తక్కువగా ఉంటుంది.
గత కొన్ని దశాబ్దాలుగా చూసుకుంటే మతాలకు అతీతంగా భారత్‌లో సంతానోత్పత్తి రేటు వేగంగా తగ్గుతోంది. సగటు భారతీయ మహిళ సంతానోత్పత్తి రేటు 2.2గా ఉంది.
అయితే, అమెరికా (1.6) కంటే ఇది ఎక్కువే.
భారత్‌లో ప్రస్తుత సంతానోత్పత్తి రేటు గతంతో పోల్చితే బాగా తగ్గింది. 1950లో 5.9, 1992లో 3.4 గా ఉండేది.
ఏ మతానికీ చెందనివారు భారత్‌లో తక్కువే..
తాము ఏ మతానికీ చెందం అని చెప్పినవారు భారత్‌లో తక్కువే. మిగతా దేశాల్లో ఇలాంటివారు ఎక్కువగా ఉంటారు.
అలాగే కొన్ని మతాల ప్రపంచ జనాభాలో అత్యధిక శాతం భారత్‌లోనే ఉంది.
ప్రపంచంలోని హిందువుల్లో 94 శాతం మంది భారత్‌లోనే ఉన్నారు. అలాగే, ప్రపంచంలోని సిక్కు మతస్థులలో 90 శాతం భారత్‌లోనే ఉన్నారు. అందులోనూ పంజాబ్ రాష్ట్రంలో మరింత ఎక్కువగా ఉన్నారు.
ఇక జైనులు కూడా భారత్‌లోనే ఎక్కువగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్ విషయంలో తాలిబాన్లు పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వరు - ఐఎస్ఐ మాజీ చీఫ్
- అఫ్గానిస్తాన్: 'మహిళల చదువుపై నిషేధం ఇస్లాం వ్యతిరేకం' - పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
- హెరాయిన్ కేసు: నిందితుడు సుధాకర్ ఎవరు, ఆయన వెనుక ఎవరున్నారు?
- కాకినాడ: ప్రపంచ బియ్యం ఎగుమతుల హబ్‌గా మారుతోందా
- మోదీ తీసుకొస్తున్న ‘బలవర్ధక బియ్యం’ ఏంటి? ఈ అన్నం తింటే దేశ ప్రజల ఆరోగ్యం మెరుగవుతుందా?
- అఫ్గానిస్తాన్: గత 20 ఏళ్లలో ఏం మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)