సాయిపల్లవి: 'తెలంగాణలో స్థిరపడాలని ఉంది' - ప్రెస్ రివ్యూ

సాయిపల్లవి

ఫొటో సోర్స్, facebook/saipallavi

తెలంగాణలో స్థిరపడాలనుంది

'సమాజంలో నెలకొన్న సమస్యల పట్ల గళాన్ని వినిపించడానికి సినిమా నాకో చక్కటి వేదికగా ఉపయోగపడుతున్నది' అని నటి సాయిపల్లవి చెప్పారని 'నమస్తే తెలంగాణ' కథనం రాసింది.

''సాయిపల్లవి హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం 'లవ్‌స్టోరి'. నాగచైతన్య హీరోగా నటించారు. శేఖర్‌ కమ్ముల దర్శకుడు. ఈ నెల 24న విడుదలకానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో సాయిపల్లవి పాత్రికేయులతో మాట్లాడారు.

ఫిదాతో పాటు ఈ సినిమా కోసం తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో షూటింగ్‌ చేయడం ఎలాంటి అనుభూతిని పంచిందని విలేకరులు ప్రశ్నించగా... 'ఈ సినిమాలోని ప్రధాన ఘట్టాలను నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ సమీపంలోని పిప్రిలో తెరకెక్కించాం. అక్కడి ప్రజలు మమ్మల్ని తమ కుటుంబసభ్యుల్లో ఒకరిగానే భావించారు. మాతో కలిసి సరదాగా ముచ్చటించారు' అని అన్నారు.

'స్వార్థం లేని స్వచ్ఛమైన ప్రేమ వారిది. ఇతరులకు సాయం చేయడమే తప్పితే ఏది ఆశించేతత్వం వారిలో కనిపించలేదు. బాన్సువాడలో షూటింగ్‌ చేస్తున్న సమయంలో తాము తయారు చేసిన చీరను నాకు బహుమతిగా ఇచ్చారు. ఇక్కడి ప్రజల ప్రేమను చూసిన తర్వాత తెలంగాణలోనే స్థిరపడాలనే భావన కలిగింది' అని సాయిపల్లవి చెప్పారని ఆ కథనంలో రాశారు.

ఫొటో సోర్స్, facebook/YVSubbaReddy

వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే వెంకన్న దర్శనం

తిరుమల వెంకన్న దర్శనం కోసం వచ్చే భక్తులపై టీటీడీ ఆంక్షలు విధించిందని 'ఆంధ్రజ్యోతి' కథనం రాసింది.

''కరోనా వ్యాప్తి నేపథ్యంలో భక్తులు రెండు డోసులు వ్యాక్సీన్‌ వేయించుకున్నట్లుగా సర్టిఫికెట్‌ తప్పనిసరిగా తీసుకురావాలని, అది లేకపోతే దర్శన సమయానికి మూడురోజుల ముందు కరోనా పరీక్షలో నెగెటివ్‌ అని తేలిన సర్టిఫికెట్‌ అయినా ఉండాలని టీటీడీ స్పష్టం చేసింది.

కోవిడ్‌ నియంత్రణ కోసం తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కోరారు.

శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను ఈ నెల 25వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని ప్రకటించారు.

26 నుంచి అక్టోబరు 31 వరకు రోజుకు 8 వేల టోకెన్ల చొప్పున ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామన్నారు. సర్వదర్శనం టోకెన్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చిన తర్వాత తిరుపతిలో ఆఫ్‌లైన్‌ ద్వారా ఇస్తున్న టోకెన్ల జారీని ఆపివేస్తామన్నారు.

కాగా, అక్టోబరు నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను 24వ తేదీ ఉదయం 9గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామన్నారు' అని ఆ కథనంలో రాశారు.

ఫొటో సోర్స్, GangavaramPortLtd

గంగవరం పోర్టులో ఏపీ వాటా రూ. 645 కోట్లకు అదానీకి అమ్మకం పూర్తి

గంగవరం పోర్టులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఉన్న 10.4 శాతం వాటాను రూ.645 కోట్లకు సొంతం చేసుకున్నట్లు అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ లిమిటెడ్‌ వెల్లడించిందని 'ఈనాడు' కథనం తెలిపింది.

''ఈ కొనుగోలుతో గంగవరం పోర్టును పూర్తిగా సొంతం చేసుకున్నట్లు అవుతోందని బుధవారం ఒక ప్రకటనలో అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ తెలియజేసింది.

గంగవరం పోర్టును అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌లో విలీనం చేయనున్నారు. ఈ ప్రతిపాదనకు రెండు కంపెనీల డైరెక్టర్ల బోర్డులు ఆమోదముద్ర వేశాయి.

దీని ప్రకారం గంగవరం పోర్టు వాటాదార్లకు ప్రతి 1,000 షేర్లకు, 159 అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ షేర్లను కేటాయిస్తారు. గంగవరం పోర్టులో ప్రమోటర్లు అయిన డీవీఎస్‌ రాజు, ఆయన కుటుంబానికి 58.1 శాతం వాటా ఉన్న విషయం తెలిసిందే.

ఈ విలీనం ఫలితంగా ఇదే నిష్పత్తిలో డీవీఎస్‌ రాజు, ఆయన కుటుంబానికి అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ షేర్లు కేటాయిస్తారు. దీని ప్రకారం డీవీఎస్‌ రాజు, ఆయన కుటుంబానికి 4.8 కోట్ల షేర్లు (అదానీ పోర్ట్స్‌లో 2.2% వాటా) లభిస్తాయి.

అదానీ పోర్ట్‌ షేరు ధర ప్రస్తుతం స్టాక్‌మార్కెట్లో రూ.758 ధర పలుకుతోంది. ఇదే ధర ప్రకారం లెక్కిస్తే 4.8 కోట్ల షేర్ల విలువ రూ.3,604 కోట్ల వరకు ఉంటుంది.

గంగవరం పోర్ట్‌లో వార్‌బర్గ్‌ పింకస్‌ సంస్థకు 31.5 శాతం వాటాను ఇంతకుముందే అదానీ పోర్ట్స్‌ కొనుగోలు చేసింది.

ఈ లావాదేవీల ప్రకారం గంగవరం పోర్టుకు రూ.6200 కోట్ల విలువ లభించినట్లయింది. దేశానికి తూర్పు తీరంలో విస్తరించడానికి గంగవరం పోర్టు ద్వారా తమకు అవకాశం దక్కిందని అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ సీఈఓ కరణ్‌ అదానీ అన్నారని ఆ కథనంలో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images

స్పెషల్‌కు టీకాల్లేవు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కరోనా టీకాల ప్రత్యేక డ్రైవ్‌కు ఆటంకం ఏర్పడిందని 'సాక్షి' కథనం రాసింది.

''ఆరు రోజుల పాటు ఉధృతంగా కొనసాగిన ప్రత్యేక వ్యాక్సినేషన్‌ వేగం తగ్గింది. వ్యాక్సీన్ల కొరతే దీనికి కారణమని, కేంద్రం నుంచి సరిపడా వ్యాక్సిన్లు సరఫరా కావడం లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.

ఈ నెలాఖరుకల్లా కోటి టీకాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. వ్యాక్సీన్ల కొరతతో అది నెరవేరే పరిస్థితి కనిపించడం లేదని పేర్కొన్నాయి.

ప్రస్తుతమున్న టీకాలతో సాధారణ స్థాయిలో వ్యాక్సినేషన్‌ కొనసాగిస్తామని వెల్లడించాయి. ప్రత్యేక డ్రైవ్‌ కోసం రాష్ట్రానికి 50 లక్షల టీకాలు పంపించాలని కేంద్రానికి లేఖ రాసినట్టు తెలిపాయ''ని ఆ కథనంలో రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)