మంగళసూత్ర, కర్వాచౌత్ ప్రకటనలు: మహిళా సాధికారతా... మార్కెటింగ్ మాయాజాలమా?
- దివ్య ఆర్యా
- బీబీసీ కరస్పాండెంట్

ఫొటో సోర్స్, SOCIAL MEDIA
సవ్యసాచి తన యాడ్ ను వెనక్కి తీసుకుంది.
ఇటీవల వివాదాస్పదంగా మారిన రెండు అడ్వర్టయిజ్‌మెంట్ల కథలో అసలు మహిళలకు పనికొచ్చే విషయం ఏదైనా ఉందా ? మహిళా సాధికారతకు ప్రతీకలుగా తమ ప్రకటనలు ఉన్నాయని చెప్పుకున్న రెండు కంపెనీలు, విమర్శల కారణంగా తమ యాడ్స్‌ను వెనక్కి తీసుకున్నాయి.
ఇందులో మొదటిది ఫ్యాషన్ బ్రాండ్ సవ్యసాచి 'మంగళసూత్ర' యాడ్. ఇందులో మహిళలు తమ పార్ట్‌నర్‌తో చాలా సన్నిహితంగా కనిపిస్తారు. రెండోది డాబర్ వారి కర్వాచౌత్ యాడ్.
ముఖ సౌందర్యానికి వాడే బ్లీచ్ క్రీమ్‌పై తీసిన ఈ ప్రకటనలో ఉత్తరాదిలో జరిగే కర్వాచౌత్ పండగకు సంబంధించిన అంశాలుంటాయి.
కర్వాచౌత్ పండుగ సంప్రదాయంలో మహిళలు సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. చంద్రోదయం అయ్యాక జల్లెడ గుండా చంద్రుడిని, ఆ తర్వాత భర్తను చూస్తారు. భర్త ఇచ్చే నీరు తాగి ఉపవాస దీక్షను ముగిస్తారు.
అయితే, డాబర్ ప్రకటనలో భార్యాభర్తలకు బదులుగా ఇద్దరు స్త్రీలు చంద్రుడిని, తర్వాత ఒకరికొకరు ముఖాలు చూసుకుంటూ, నీరు తాగించుకుంటూ ఉపవాస దీక్ష ముగించినట్లు చూపించారు.
ఈ యాడ్‌లు హిందూ విశ్వాసాలు, సంప్రదాయాలపై దాడి అని ఒక వర్గం వాదించింది. 'మంగళసూత్ర' ప్రకటన వివాహిత స్త్రీ 'లైంగికతను' స్వేచ్ఛగా బహిర్గతం చేస్తున్నట్లు ఉండగా, కర్వాచౌత్ ప్రకటన స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఉందని విమర్శలు వచ్చాయి.
ఈ రెండు ప్రకటనలు సంప్రదాయాలనే చూపించాయి. అయితే, తమ యాడ్‌లో మహిళా సాధికార స్ఫూర్తి ఉందని ‘సవ్యసాచి’ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
కానీ, చాలామంది మహిళలు దీనిని అంగీకరించడం లేదు. మంగళసూత్రం ధరించడం, బొట్టు పెట్టుకోవడం, కర్వాచౌత్‌లాంటి సంప్రదాయాలను పాటించడం సమాజంలో స్త్రీ పురుషుల మధ్య ఉన్న అసమానతలకు నిదర్శనమని వారు అంటున్నారు.
వివాహ వ్యవస్థలో పురుషాధిక్యతకు ఇది నిదర్శనంగా నిలుస్తుంటారు.
పెళ్లైనట్లు సూచించే ఎలాంటి చిహ్నాలను, ఆభరణాలను పురుషులు ధరించరు. అలాగే, తన భార్య దీర్ఘాయువు కోసం ఏ భర్తా ఉపవాసం చేయాలని కోరుకోరు.పెళ్లయ్యాక ఇంటి పేరును మార్చుకోవాల్సిన భర్తకు అవసరం లేదు. కుటుంబాన్ని వదిలిపెట్టి భార్య ఇంట్లో ఉండాల్సిన అవసరమూ రాదు.
ఫొటో సోర్స్, VIDEO STILL
డాబర్ ప్రకటన స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేలా ఉందని విమర్శలు వచ్చాయి..
స్త్రీలపై పురుషుల హక్కులు
మంగళసూత్రం ధరించడం, కర్వాచౌత్ ఉపవాసం పాటించడం పెద్ద విషయాలు అనిపించవు. కానీ వాటి అర్థం లోతైనది. డాబర్ ప్రకటనలో, స్వలింగ సంపర్క సంబంధాన్ని చూపించారు. దానికి కర్వాచౌత్ ఉపవాసంతో ముడిపెట్టారు.
''దీనినే పింక్ వాషింగ్ లేదా హోమో సెక్సువాలిటీ పేరుతో మార్కెటింగ్ అంటారు'' అని రచయిత, సినీ నిర్మాత పరోమితా వోహ్రా అభిప్రాయపడ్డారు.
వివాహంతో ముడిపడి ఉన్న వారసత్వం, కులం, సమానత్వం వంటి సమస్యలను తీర్చే ప్రయత్నం చేయకుండా, వివాహపు చట్రం పరిధిలోనే సమాజం కొత్త సంబంధాలను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోందని పరోమిత తన వ్యాసంలో పేర్కొన్నారు.
భారతదేశంలో స్వలింగ సంపర్కం చట్టవిరుద్ధం కాదు, కానీ స్వలింగ వివాహం ఇంకా చట్టబద్ధం కాలేదు.
సంప్రదాయలు అసమానతలను పోషిస్తాయి తప్ప ప్రశ్నించవని రచయిత మధుర చక్రబర్తి అన్నారు. ఆమె గ్రామీణ, వెనకబడిన వర్గాలతో కలిసి పని చేస్తూ వారు సొంతంగా తమ అనుభవాలను రాసేందుకు ప్రోత్సహిస్తుంటారు.
పెళ్లయిన స్త్రీ ఒక మగాడి ఆస్తి అనడానికి మంగళ సూత్రం, కుంకుమ బొట్టు సాక్ష్యంగా నిలుస్తాయని, భార్య హక్కులకు భర్తలలో ఎలాంటి సూచికలు లేవని ఆమె అన్నారు.
ఫొటో సోర్స్, SABYASACHIOFFICIAL
తమ యాడ్‌లో మహిళా సాధికారత ఉందని సవ్యసాచి వెల్లడించింది.
మంగళసూత్రమా లేదా మెడకు తాడా?
ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇంటర్నేషనల్ లగ్జరీ జ్యుయెలరీ బ్రాండ్ బల్గారీ తన బ్రాండ్‌నేమ్ 'మంగళసూత్ర' తో భారతీయ మార్కెట్‌లో అడుగుపెట్టింది.
నటి ప్రియాంక చోప్రా ఈ బ్రాండ్ ప్రారంభోత్సవం రోజున మీడియాతో మాట్లాడుతూ 'ఇది ఆధునిక, స్వేచ్ఛాయుత మహిళల కోసం' అని పదేపదే అన్నారు.
ఫ్యాషన్ హిస్టారియన్ జరా అఫ్తాబ్ ఈ మాటలను కొట్టిపారేశారు. ''ఇది ఒక మార్కెటింగ్ గిమ్మిక్'' అన్నారామె.
"ఒక సమాజంగా మనం భార్య, తల్లి అనే మూస పద్ధతిని విడిచి పెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఈ ఇటాలియన్ బ్రాండ్ భారతదేశంలోని ఆధునిక మహిళలు పాత పద్ధతిలోనే ఉండాలని కోరుకోవడం కలవరపెడుతోంది" అన్నారామె.
ఫేస్‌బుక్ పోస్ట్‌లో మంగళసూత్రాన్ని కుక్క, పిల్లి జాతితో పోల్చినందుకు గోవా కాలేజీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌పై గత సంవత్సరం ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
పితృస్వామ్యం, సంప్రదాయవాదం నేపథ్యంలో చేసిన ఈ పోస్ట్‌కు ఆమె క్లారిటీ ఇస్తూ, వివాహిత మహిళలకు, పురుషులకు వేర్వేరు సంప్రదాయాలు ఎందుకని, మహిళల్లాగే పురుషులకు కొన్ని చిహ్నాలు ఎందుకుండవో అర్ధం చేసుకోవడానికి చిన్నప్పటి నుంచి ప్రయత్నిస్తున్నానని అన్నారామె.
ఈ వ్యవహారంపై రాష్ట్రీయ హిందూ యువ వాహిని ఫిర్యాదుతో ఆ ప్రొఫెసర్ క్షమాపణలు చెప్పారు.
పాత ఆలోచన-కొత్త సందేశం
ప్రస్తుత సమాజంలో ఏ రకం వస్తువును మార్కెట్ చేసుకోవాలన్నా మహిళల శరీరాల లైంగిక వర్ణనలు వందల సార్లు ఉపయోగిస్తున్నారు.
2017లో ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ అమెజాన్ ఒక యాష్-ట్రే ని తీసుకువచ్చింది. ఇది బాత్‌టబ్‌లో ఒక స్త్రీ నగ్నంగా కాళ్లు చాచి ఉంచినట్లు కనిపిస్తుంది.
సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావడంతో అమెజాన్ తన వెబ్‌సైట్ నుండి యాష్-ట్రేని తొలగించింది. సవ్యసాచి కంపెనీ ప్రకారం వారి ప్రకటన మహిళా సాధికారతకు సంబంధించినది. ఇటు డాబర్ ప్రకటన కూడా అందం గురించి చెప్పేదే. స్వలింగ సంపర్క భావనను చూపిస్తూ, తాము ప్రగతి శీలతను కోరుతున్నామని చెబుతోంది.
ఫొటో సోర్స్, SOCIAL MEDIA/SABYASACHI
సవ్యసాచి విడుదల చేసిన ప్రకటన
ఇక్కడ సమస్య మహిళల దృక్కోణంలో చూడటం కాకుండా మతాన్ని కించపరిచారన్న అంశంపై వాదోపవాదాలకు దారి తీసింది.
ఇందులో మరింత తీవ్రమైన వాదన ఏంటంటే, ఒక రాష్ట్ర హోంమంత్రి ఈ కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చివరకు రెండు కంపెనీలు తమ ప్రకటనలను ఉపసంహరించుకున్నాయి.
గోవా ప్రొఫెసర్‌పై కేసు తర్వాత, ఇది భారతీయ సంప్రదాయంలో మహిళలపై నియంత్రణకు నిదర్శనమని, ఇది అన్ని మతాలలో ఉందని రచయిత రామ్ పునియాని వ్యాఖ్యానించారు.
ప్రపంచవ్యాప్తంగా మతపరమైన జాతీయవాదానికి ప్రాచుర్యం పెరుగుతోందని, అలాంటి పద్ధతులకు ఎక్కువ ప్రాధాన్యతతో పాటు సామాజిక ఆమోదం కూడా లభిస్తోందని పునియాని ఒక కథనలో పేర్కొన్నారు.
అంటే, కంపెనీల ప్రకటనలు ప్రజల దృష్టిని ఆకర్షించడానికి కొత్త సందేశాలతో వస్తున్నాయి. కానీ, అవి సంప్రదాయ వివాహ వ్యవస్థ పరిధిలోనే ఉంటున్నాయి.
ఇవి కూడా చదవండి:
- వాతావరణ కాలుష్యానికి ధనవంతులే కారణమా
- ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్ విద్యా సంస్థల మూసివేత ‘బలవంతమా.. బాగు కోసమా’
- డాక్టర్ సుధ: బద్వేలులో భారీ విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి
- హుజూరాబాద్ ఎన్నిక తర్వాత ఇప్పుడు తెలంగాణలో ఏం జరగబోతోంది?
- 18 రోజుల తర్వాత తాళం వేసి ఉన్న ఇంట్లో దొరికిన నాలుగేళ్ల చిన్నారి
- నిత్యావసర సరుకులను నిల్వ చేసుకోవాలని ప్రజలను కోరిన చైనా, కారణమేంటి?
- ఫేస్‌బుక్: ‘ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌ను ఇక ఉపయోగించం’
- టీఆర్పీలు, ఆదాయం కోసం ఐసీసీ వేసిన ప్లాన్ భారత్ కొంపముంచిందా?
- చరిత్ర: దీపావళి టపాసులు భారత్‌లోకి ఎలా వచ్చాయి?
- డాక్టర్‌ను సంప్రదించకుండా ఇంటర్నెట్లో సెర్చ్ చేసి మందులు వాడటం మేలేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)