టీ20 వరల్డ్ కప్: అఫ్గానిస్తాన్‌పై గెలిచినా భారత్‌ సెమీస్ చేరడం అంత సులభం కాదు

  • ఆదేశ్ కుమార్ గుప్తా
  • బీబీసీ కోసం
టీం ఇండియా

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్,

టీం ఇండియా

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021లో బుధవారం అబుదాబిలో భారత్, అఫ్గానిస్తాన్ తలపడ్డాయి.

గెలిస్తే ముందుకు, ఓడితే ఇంటికి అనే స్థితిలో భారత్ బరిలోకి దిగింది.

అఫ్గానిస్తాన్‌పై భారీ విజయం సాధించినా, భారత్ సెమీ ఫైనల్‌కు చేరుకోవడం అంత సులభమేమీ కాదు.

ఇందులో చాలా 'అయినా', 'కానీ'లు ఉన్నాయి.

తదుపరి మ్యాచ్‌లో న్యూజీలాండ్‌పై అఫ్గానిస్తాన్ భారీ విజయం సాధించాలి.

అంతేకాదు నమీబియా, స్కాట్లాండ్‌‌తో ఆడే మ్యాచుల్లో భారత్ ఏకపక్షంగా గెలవాలి, అది కూడా 140-160 పరుగుల తేడాతో విజయం సాధించాలి. స్కాట్లాండ్, న్యూజీలాండ్‌ను ఓడించాలి. ఇన్ని జరిగితేనే భారత్ సెమీస్‌కు వెళుతుంది.

క్రికెట్‌లో గణాంకాలు మారిపోతూనే ఉన్నాయి. 2017లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీనే ఇందుకు నిదర్శనం. ఆ టోర్నమెంటులో పాకిస్తాన్ సమీకరణాలన్నింటినీ పూర్తి చేస్తూ ఫైనల్‌లో విజేతగా నిలిచింది. అది కూడా ఫైనల్లో భారత్‌ను ఓడించి.

సరే జరిగిందేదో జరిగిపోయింది. కానీ, ఈసారి భారత్‌కు కలిసివస్తాయనే సమీకరణలన్నీ విచిత్రంగా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ చేతిలో 10 వికెట్లతో, న్యూజీలాండ్‌తో 8 వికెట్ల తేడాతో ఓడిపోవడం భారత్ ఈ స్థితిలో ఉండడానికి కారణమయ్యింది.

మరోవైపు అఫ్గానిస్తాన్ రెండు విజయాలు, ఒక ఓటమితో భారత్‌తో తలపడింది. అఫ్గాన్ స్కాట్లాండ్‌ను 130 పరుగుల తేడాతో, నమీబియాను 62 పరుగుల తేడాతో ఓడించింది. అది పాకిస్తాన్‌కు గట్టిపోటీ ఇచ్చాక ఐదు వికెట్ల తేడాతో ఓడింది.

అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్ కంటే ముందే రెండు వరుస పరాజయాలతో భారత్ పాయింట్ల పట్టికలో నమీబియా కన్నా కిందకు అయిదవ స్థానంలో ఉండిపోయింది. అప్పటికి భారత్ ఖాతాలో పాయింట్లేవీ లేవు. రన్ రేటు -1.609 ఉంది. అది నమీబియా కంటే తక్కువ.

నమీబియా ఖాతాలో మూడు ఓటమిలు, ఒక విజయంతో 2 పాయింట్లు ఉన్నాయి. దాని రన్ రేటు -1.600 ఉంది.

ఫొటో సోర్స్, Reuters

అఫ్గానిస్తాన్‌పై భారత్ విజయం

టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ ప్రారంభం నుంచీ ఆధిపత్యం కనబరిచింది.

కేఎల్ రాహుల్ 69, రోహిత్ శర్మ 74 పరుగులు చేయగా నిర్ణీత 20 ఓవర్లలో 210 పరుగులు చేసింది.

211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ ఏడు వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేసి, 66 పరుగుల తేడాతో ఓడిపోయింది.

భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ మొదటి నుంచీ తడబడింది. ఓపెనర్ మహ్మద్ షాజాద్ మూడో ఓవర్‌లో పరుగులేవీ చేయకుండానే వెనుదిరిగాడు. మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఆర్.అశ్విన్‌కు క్యాచ్ ఇచ్చాడు.

మరోవైపు హజ్రతుల్లా జజాయ్ 13 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. దాంతో, అఫ్గాన్ జట్టు 13 పరుగులకే ఓపెనర్లిద్దరినీ కోల్పోయింది.

తరువాత వచ్చిన రహ్మానుల్లా గుర్బాజ్ కేవలం పది బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు కొట్టి మ్యాచ్‌లో ఉత్కంఠ రేపినప్పటికీ, త్వరగానే వికెట్ కోల్పోయాడు.

తర్వాత అశ్విన్ గుల్బదిన్ నైబ్‌ను అవుట్ చేశాడు. గుల్బదిన్ 20 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు చేసి వెనుదిరిగాడు.

10 ఓవర్లు ముగిసే సరికి అఫ్గానిస్తాన్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 61 పరుగులు. అప్పటికి జట్టు టాప్ ఆర్డర్ కుప్పకూలింది.

ఆ తర్వాత అశ్విన్ నజీబుల్లాను బౌల్డ్ చేయడంతో అఫ్గానిస్తాన్ ఐదో వికెట్ కోల్పోయింది. అతడు 11 పరుగులు చేశాడు. 17వ ఓవర్లో అఫ్గానిస్తాన్ అతి కష్టం మీద 100 పరుగులు పూర్తి చేసింది.

ఆఖరి మూడు ఓవర్లో అఫ్గానిస్తాన్ విజయం కోసం 102 పరుగులు చేయాల్సొచ్చింది. శార్దూల్ ఠాకూర్ వేసిన 18వ ఓవర్‌లో కెప్టెన్ మహ్మద్ నబీ తన బ్యాట్ ఝళిపించి వరుసగా ఓ సిక్సర్, ఫోర్ బాది 16 పరుగులు సాధించాడు.

మరింత వేగం పెంచే క్రమంలో అప్గానిస్తాన్ 19వ ఓవర్లో రెండు వికెట్లను కోల్పోయింది. షమీకే ఈ రెండు వికెట్లు దక్కాయి. తొలి బంతికి నబీ (32 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్స్) డీప్ మిడ్ వికెట్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చాడు.

ఆరో వికెట్‌కు 57 పరుగుల ముఖ్యమైన భాగస్వామ్యం జతచేసి, భారీ తేడాతో గెలవాలన్న భారత్ ఆశలపై నీళ్లు జల్లారు.

ఇక పాండ్యా వేసిన చివరి ఓవర్‌లో కరీమ్ 4, 6 బాదడంతో 14 పరుగులు వచ్చాయి. దీంతో 66 పరుగులతో భారత్‌ విజయం సాధించింది. చివరి 30 బంతుల్లో అఫ్గానిస్తాన్ 56 పరుగులు సాధించింది.

భారత్ బౌలర్లలో మహ్మద్ షమీ 32 పరుగులకు 3 వికెట్లు, ఆర్ అశ్విన్ 14 పరుగులకు 2 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా 25 పరుగులకు 1 వికెట్, రవీంద్ర జడేజా 19 పరుగులిచ్చి వికెట్ తీశారు.

ఫొటో సోర్స్, Ani

భారత్‌ గట్టి ఆరంభం

ఓపెనింగ్ జోడీ కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు భారత్‌కు శుభారంభాన్ని అందించారు. పది ఓవర్లు ముగిసేసరికి భారత్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 85 పరుగులు చేసింది.

అప్పటికి రోహిత్ శర్మ 32 బంతుల్లో 44 పరుగులు, కేఎల్ రాహుల్ 29 బంతుల్లో 44 పరుగులు చేశారు.

అఫ్గానిస్తాన్ బౌలర్లలో షరాఫుద్దీన్‌ అష్రఫ్, నవీన్ ఉల్ హఖ్ వరుసగా రెండేసి ఓవర్లలో 25 పరుగులు, 24 పరుగులు ఇచ్చారు.

నవీన్ ఉల్ హఖ్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అదే ఓవర్‌లో స్క్వేర్ లెగ్‌లో సిక్సర్ కొట్టి భారత్‌ను వంద పరుగులు దాటించాడు.

13వ ఓవర్లో తొలి బంతిని బౌండరీకి తరలించి రాహుల్ కూడా అర్ధసెంచరీ పూర్తి చేశాడు. టీ20 ప్రపంచ కప్‌లో ఇదే రాహుల్‌కు తొలి అర్ధసెంచరీ.

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తొలి వికెట్‌కు 140 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

కరీమ్ జానత్ వేసిన బంతిని సిక్స్ కొట్టే ప్రయత్నంలో రోహిత్ శర్మ (47 బంతుల్లో 74; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అవుటయ్యాడు.

కేఎల్ రాహుల్, రోహిత్ శర్మల 140 పరుగుల భాగస్వామ్యం.. టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ నెలకొల్పిన అతిపెద్ద భాగస్వామ్యంగా నిలిచింది.

ఫొటో సోర్స్, Ani

అంతకుముందు, 2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ ఇంగ్లండ్‌పై 136 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

147 పరుగుల దగ్గర కేఎల్ రాహుల్ (48 బంతుల్లో 69; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) గుల్బదిన్ నైబ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

భారత్ 18వ ఓవర్ ఆడుతున్నప్పుడు మెరుపులాంటి వార్త ఒకటి వచ్చింది.

భారత మాజీ కెప్టెన్, మిస్టర్ వాల్‌గా పేరుపొందిన రాహుల్ ద్రవిడ్‌ను భారత హెడ్ కోచ్‌గా బీసీసీఐ నియమించినట్లు తెలిసింది.

ఈ టీ20 ప్రపంచ కప్‌లో పేలవమైన ఫామ్‌లో ఉన్నాడంటూ విమర్శలకు గురైన హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో తన బ్యాట్ ఝళిపించాడు.

18వ ఓవర్‌లో హార్దిక్ 3 ఫోర్లతో చెలరేగాడు. దీంతో ఈ ఓవర్‌లో కూడా 15 పరుగులు వచ్చాయి. తరువాత నవీన్ ఉల్ హఖ్ ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టాడు.

మరోవైపు క్రీజులోకి వచ్చిన వెంటనే రిషబ్ పంత్ కూడా రెండు బలమైన సిక్సర్లు బాదాడు. చివరికి, హార్దిక్ పాండ్యా 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టి 27 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, రిషబ్ పంత్ 13 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు కొట్టి 27 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

20 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్కోరు ఇదే.

అంతకుముందు, స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ నాలుగు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.

అఫ్గాన్ బౌలర్లలో గుల్బదిన్ 39 పరుగులు, కరీమ్ జానత్ ఏడు పరుగులిచ్చి ఒక్కో వికెట్ తీశారు. నవీన్ ఉల్ హఖ్ అందరికంటే ఎక్కువగా 59 పరుగులిచ్చాడు. అతడికి ఒక్క వికెట్ కూడా పడలేదు.

ఫొటో సోర్స్, Ano

భారత జట్టులో రెండు మార్పులు

ఈ మ్యాచ్‌లో భారత జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి.

ఇషాన్ కిషన్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్థానంలో ఆర్.అశ్విన్ జట్టులోకి వచ్చారు.

దీనికి ముందు అశ్విన్ 2017లో వెస్టిండీస్‌లో టీ20 ఇంటర్నేషనల్‌ టోర్నమెంట్ ఆడాడు. ఆ తరువాత అతడు మళ్లీ ఇప్పుడే జట్టులో ఆడాడు.

హాప్ సెంచరీ చేసిన తరువాత కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. మ్యాచ్‌కు ముందు రోహిత్‌తో పెద్దగా ఏమీ చర్చించలేదని, వాళ్లిద్దరూ ఎప్పటినుంచో కలిసి ఆడుతుండడంతో క్రీజులో రోహిత్ ఏమి ఆశిస్తాడో తనకు తెలుసునని, రోహిత్ గొప్ప బ్యాట్స్‌మన్ అని చెప్పాడు.

రెండు ఓటముల తరువాత ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనుకున్నామని, రన్ రేటు మెరుగుపరుచుకోవడం భారత్‌కు ముఖ్యమని, రాహుల్ గొప్ప ఆటగాడని రోహిత్ శర్మ చెప్పాడు.

మరోవైపు, మంచు పడుతుండడంతో ముందు బౌలింగ్ చేయడమే మంచిదని భావించి ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు అఫ్గాన్ కెప్టెన్ నబీ తెలిపాడు.

అశ్విన్ బౌలింగ్ పట్ల కోహ్లీ సంతృప్తి

ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌ శుభారంభం ఇస్తే, తరువాత పరుగులు చేయడం సులువవుతుందని మ్యాచ్‌లో గెలిచిన తరువాత మాట్లాడిన కోహ్లీ అన్నాడు.

ఆర్.అశ్విన్ బౌలింగ్ పట్ల సంతోషం వ్యక్తం చేసిన కోహ్లీ, మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో రన్ రేట్ గురించి టీమ్ మీటింగ్‌లో చర్చించామని, వాటిల్లోనూ జట్టు సత్తా చాటుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు.

"భారత్ చాలా బలమైన జట్టు. అయినా, ఈ టోర్నీలో కష్టపడి పోరాడాల్సిన స్థితి వచ్చింది. రోహిత్, కేఎల్ రాహుల్ మంచి బ్యాట్స్‌మన్ అని మళ్లీ నిరూపించారు. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో బౌలర్లు కూడా బాగా రాణించారు. రాబోయే మ్యాచుల్లో స్కాట్లాండ్, నమీబియాలపై భారీ విజయం సాధిస్తారనే ఆశిస్తున్నాం" అని మాజీ ఆల్ రౌండర్, సెలెక్టర్ మదన్ లాల్ అన్నారు.

అఫ్గానిస్తాన్ కన్నా న్యూజీలాండ్ చాలా బలమైన జట్టు. అది అంత సులువుగా ఓడిపోదని, భారత్‌కు సెమీస్ దారి సులువు కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

అఫ్గాన్ మ్యాచ్‌లో భారత బౌలర్లు ఇంకాస్త కట్టడి చేసుండాల్సిందని, అఫ్గాన్‌కు కొన్ని పరుగులు అనవసరంగా ఇచ్చేశారని మదన్‌లాల్ అన్నారు.

ఫొటో సోర్స్, Ani

ఇప్పుడు భారత్ ముందున్న పరిస్థితి?

అఫ్గాన్‌పై విజయం తరువాత, 0.073 రన్ రేట్‌తో గ్రూప్ 2లో భారత్ నాలుగో స్థానంలో ఉంది. పాకిస్తాన్ వరుసగా నాలుగు విజయాలతో సెమీ ఫైనల్‌కు చేరుకుంది.

అఫ్గానిస్తాన్, భారత్‌తో ఓడిపోయినా, నాలుగు పాయింట్లు, 1.481 రన్ రేట్‌తో రెండవ స్థానంలో ఉంది.

న్యూజీలాండ్ ఆడిన మూడు మ్యాచుల్లో రెండు గెలిచి, ఒకటి ఓడిపోయి, నాలుగు పాయింట్లతో, 0.816 రన్ రేట్‌తో మూడో స్థానంలో ఉంది.

ఒకవేళ, అఫ్గానిస్తాన్, న్యూజీలాండ్‌ను ఓడిస్తే ఆ జట్టు ఖాతాలో ఆరు పాయింట్లు చేరుతాయి.

న్యూజీలాండ్ తన చివరి మ్యాచ్ గెలిస్తే, దానికి కూడా ఆరు పాయింట్లు వస్తాయి.

మిగిలిన రెండు మ్యాచ్‌లూ గెలిస్తే, భారత్‌కు కూడా ఆరు పాయింట్లు దక్కుతాయి. భారత్‌కు ఉన్న ఏకైక అవకాశం ఇదే.

అయితే, ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ భారీ స్కోరుతో గెలవాలి. మిగిలిన రెండు జట్ల కంటే రన్ రేట్ మెరుగ్గా ఉండాలి.

దాని కోసం నవంబర్ 7 వరకూ వేచి చూడాలి. అఫ్గాన్ చేతిలో న్యూజీలాండ్ ఓడిపోవాలని కోరుకోవాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)