సూర్య జై భీమ్ : కొన్ని కలలు, కన్నీళ్లు - ఎడిటర్స్ కామెంట్

  • జీఎస్ రామ్మోహన్
  • ఎడిటర్, బీబీసీ తెలుగు
జైభీమ్

ఫొటో సోర్స్, Twitter/iandrewdop

నిన్ను నిలువనివ్వక ఆలోచనలతో సతమతం చేసే కళారూపాలు కొన్ని ఉంటాయి. ప్రశ్నల కొడవళ్లై నీ ఎదుట నుల్చొని నిలదీసే కళారూపాలు కొన్నే ఉంటాయి. జై భీమ్ అలాంటి కళ.

75 యేళ్ల స్వతంత్రభారతావనిలో ఇప్పటికీ చదువుకు డబ్బుకు అసుంట ప్రధాన వ్యవస్థ అంచులకు ఆవల పడి ఉన్న వాళ్ల ఉమ్మడి కల. ధర్మం న్యాయంగానే ఉండాలని ఆశించేవాళ్ల సామూహిక స్వప్నం. ధర్మానికి న్యాయానికి చట్టానికి కూడా కులం, డబ్బు, అధికారం, హోదా లాంటి కళ్లద్దాలు సత్యాన్ని చూడనివ్వకుండా ఎలా అడ్డుకుంటాయో వ్యవస్థ నగ్న స్వరూపాన్ని చూపిన సినిమా జై భీమ్.

ఈ సినిమా చూస్తున్నంత సేపూ మరో తమిళ సినిమా విశారణై (తెలుగులో విచారణ) గుర్తుకొస్తూనే ఉంటుంది. వ్యవస్థలో పాతుకుపోయిన క్రూరత్వాన్ని సటిల్‌గా కూడా చూపొచ్చు అని నిరూపించిన మరాఠీ సినిమా కోర్ట్ గుర్తుకొస్తుంది. దాదాపు 30 యేళ్ల క్రితం తెలుగులో ఉమామహేశ్వరరావు తీసిన అంకురం గుర్తుకొస్తుంది.

హీరో హరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది, ఆ బీచ్ పాటలో ఫిజిక్స్ బాగా చూపించారు అని రొడ్డకొట్టుడు బండ కమర్షియల్ పరిభాషలో చెప్పుకునే సినిమా కాదు. అంచులకు ఆవల నెట్టివేయబడిన వాళ్ల ఆక్రందన. కూసింత ఆత్మగౌరవం కోసం పెనుగులాడే వాళ్ల బతుకు చిత్రం.

పొలాల్లో ఎలుకలను పట్టి జీవనం సాగించే వాళ్లు తెలుగునాట ఉన్నారు. తీర ప్రాంతపు జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారు. వారిది పాక్షికమైన సంచార జీవితం. అప్పట్లో ఆ కులాల్లో దొంగలు ఎక్కువగా ఉండేవారని ప్రతీతి. స్టువర్ట్‌పురం మీద కూడా ఆ ముద్ర ఉండేది. బ్రిటీష్ వారు నోటిఫైడ్ ట్రైబ్‌గా నేరపూరిత ట్రైబ్‌గా ముద్ర వేసిన జీవితాలు. స్వతంత్ర భారతంలో కంప్యూటర్ యుగంలో కూడా అదే ముద్రను మోస్తూ బతుకులీడుస్తున్న జీవితాలు. తమిళనాట వీరిని ఇరులర్ అని పిలుస్తారు. వారి జీవితాల్లో 1995లో జరిగిన ఘటన ఆధారంగా తీసిని సినిమా ఇది.

తమిళనాడుకు చెందిన జస్టిస్ చంద్రు అనుభవాల ఆధారంగా ఆయన యాక్టివిప్ట్ లాయర్‌గా ఉన్న రోజుల్లో ఎదుర్కొన్న ఒక ప్రధాన కేసు నేపథ్యంగా నేరేట్ చేసిన స్టోరీ. దొంగతనం నేరం మోపి లాకప్‌లో చంపేసి ఆ తర్వాత ఆ కేసునుంచి తప్పించుకోవడానికి ఇంకెన్ని నేరాలకు పోలీసులు పాల్పడతారు, వారిని రక్షించడానికి ఎన్ని అంగాలు ఎట్లా పనిచేస్తాయి అనేది ఒక వైపు- చేయని నేరానికి భర్త లాకప్ డెత్ లో చనిపోయి సాక్షులుగా ఉన్న బంధువులు ఎక్కడో తెలీని జైలులో మగ్గుతుంటే భర్త ఏమయ్యాడో తెలీక యాతన పడే బాధిత మహిళ హక్కుల న్యాయవాది సహాయంతో ఈ శక్తిమంతమైన వ్యవస్థతో ఎలా పోరాడిందీ అనేది మరోవైపు- రెండు ప్రపంచాల సమాహారం. రెండు ప్రపంచాల మధ్య ఘర్షణ, హింస తాలూకు విశ్వరూపం.

ఆత్మగౌరవం సినిమా ఆత్మ

సినిమా అయిపోయింది అనుకున్నాక ఒక సీన్ ఉంటుంది. బాధిత మహిళ సినతల్లి బిడ్డ కుర్చీలో కూర్చుని న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకుంటుంది. లాయర్ అలా చూడగానే భుజాలు జారవిడిచి వినయం తొడుక్కునే ప్రయత్నం చేస్తుంది. హాయిగా దర్జాగా కూర్చో అన్నట్టు ఒక కనుసైగ చేస్తాడు. ఆ బిడ్డ మళ్లీ భుజాలను ఉప్పొంగించి కాలు మీద కాలు వేసుకుని కూర్చొని పేపర్ చదువుతుంది. ఇదీ సినిమా ఆత్మ. అంబేద్కరైట్ గెశ్చర్. అధికారం ముందు న్యూనత చేసే ప్రదర్శన అది. పోలీస్ స్టేషన్ సరే, అది మూర్తీభవించిన అధికారం. చివరకు బ్యాంకులు, రెవిన్యూ ఆఫీసుల్లో కూడా సన్నకారు రైతులు, దళితులు, పేదలు చేతులు కట్టుకుని సార్ ఎప్పుడు దయ చూస్తారో అన్నట్టు ఉండే దృశ్యాలు చాలా చూసి ఉంటాం.

జార విడవొద్దు భుజాలను. విడవొద్దు లక్ష్యాలను. చూడ్డానికి ఇది చిన్న విషయంలాగానే కనిపించొచ్చు గానీ నిజజీవితంలో చాలా ముఖ్యమైన విషయం. ఈ వ్యవస్థలో నాకు సమానమైన చోటుంది, ఈ ప్రజాస్వామ్యం నాది కూడా అనుకునే విశ్వాసం వచ్చిన రోజు భుజాలు జారిపోవు. అది రావడం అంత సులభం కాదు. ఒకే చోట ఒకే పొజిషన్లో ఉన్న వారిలో కూడా తేడా చూపించగల వనరు ఎక్స్‌పోజర్. ఎక్స్‌పోజర్ ఊరికే రాదు. అపుడపుడే మెట్లెక్కి పై ప్రపంచాన్ని చూస్తున్న తొలి జనరేషన్‌కు అప్పటికే చదువుల్లోనూ ఉద్యోగాల్లోనూ పీఠం వేసుకుని ఉన్నవారికి- పల్లెల నుంచి వచ్చేవారికి పట్నం వారికి- 'పెద్ద' కులాల వారికి 'చిన్న' కులాల వారికి- డబ్బున్న వారికి లేని వారికి అడ్డంగా ఉండే అతి పెద్ద తెర అది. ఆత్మ విశ్వాసం నింపుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఒక తరం పట్టొచ్చు కూడా.

తెలంగాణ గురుకుల విద్యాలయాల బాధ్యులుగా ఉన్నపుడు ప్రవీణ్ కుమార్ చేసిన పనుల్లో ఇది ముఖ్యమైనదేమో అనిపిస్తుంది. ఎక్కడికిపోయినా చెప్పులు విడిచి చేతులు కట్టుకుని వినయాన్ని ప్రదర్శించకండి అనే ట్రైనింగ్ ఉంది చూశారూ అది అతి పెద్ద ఎలిమెంట్. ఆయన ఆధ్వర్యంలో పనిచేసే కార్యాలయాలు, స్కూల్స్ అన్నింటా రాసి పెట్టిన టెన్ కమాండ్మెంట్స్‌లో ఈ వాక్యం కీలకం. కేవలం ఆదివాసీ విద్యార్థులను ఎవరెస్ట్ పైకి పంపడమో జేఎన్‌యూ యూనివర్సిటీలకు పంపడం మాత్రమే కాదు. అంతకుమించి విశ్వాసం అనే వనరు ఇచ్చే బలం ముఖ్యమైనది.

ఫొటో సోర్స్, Twitter/Suriya_offl

కులం, మతం, ప్రాంతం, డబ్బు, హోదా, అధికారం వంటివాటితో సంబంధం లేకుండా మనిషికి ఒకటే విలువ అని నమ్ముతూ ఎదుటి వ్యక్తి కళ్లలోకి కళ్లు పెట్టి సమానమైన స్థాయిలో మాట్లాడే రోజు కదా మనం నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నామని చెప్పుకోగలిగేది. పైనున్న వారిలో కొందరు వ్యవస్థమీదా అందులోని అంగాల మీద ఆధిపత్యం చెలాయిస్తూ కిందివారు అందులో ప్రవేశించకుండా నిలదొక్కుకోకుండా కిందే ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కిందివారు ఎలాగోలా అందులో చోటు దక్కించుకోవడానికి దిస్ బిలాంగ్స్ టు మీ టూ అని నిరూపించుకోవడానికి పెనుగులాడుతూ ఉంటారు. అదొక నిరంతర ఘర్షణ. కిందినుంచి వచ్చిన వారిలో కూడా డబ్బు, హోదా, అధికారం తలకెక్కిన తర్వాత ఇదే తేడా కనిపించవచ్చును. అపుడు కూడా అదే సూత్రం.

మనిషికి ఒకటే విలువ అనేది ఆచరణాత్మకంగా సాధించుకునే వరకూ ఇదొక సుదీర్ఘ ప్రయాణం. రాజ్యాంగం ఆర్టికల్ 14లో ఈక్వాలిటీ బిఫోర్ లా అనే కాదు, ఈక్వల్ ప్రొటెక్షన్ బై లా అనేది కూడా ఉంటుంది. ఆచరణలో అలా ఉన్నదా లేకపోతే ఎందుకు లేదు అనేది మనం వేసుకోదగిన ప్రశ్న.

సినిమాతో సంబంధం లేని ఒక అంశం చూద్దాం. శిక్ష పడి జైలు కెలుతున్న వాళ్లలో గ్రాడ్యుయేట్స్ లేదా దాంతో సమానమైన చదువు చదివిన వారు కేవలం ఒక్కశాతమే. 99 శాతం మంది ఖైదీలు నిరక్షరాస్యులు లేదా తక్కువ చదువుకున్న వాళ్లు. నిరక్ష్యరాస్యులు, తక్కువ చదువుకున్న వారు ఏ సామాజిక శ్రేణుల్లో ఎక్కువ ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది మన సమాజంలో పాతుకు పోయిన ,మనం చూడదల్చుకోని అనేక అసమానతలను బట్ట బయలు చేస్తున్నది. 2005 నుంచి 2018 మధ్యలో పోలీసు కస్టడీలో హింసల వల్ల 500 మంది చనిపోయినట్టు కేసులు నమోదైతే అందులో 58 మంది పోలీసుల మీద చార్జిషీట్ కూడా దాఖలు అయినా అందులో ఒక్క పోలీస్ కు కూడా శిక్ష పడలేదని నేషనల్ క్రైం బ్యూరో రికార్డులు చెపుతున్నాయి. లాకప్‌లో చనిపోయే వారిలో అత్యధికులు మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, వెనుకబడినవారు, ముస్లింలు అని నివేదికలు చెపుతున్నాయి.

వీడియో క్యాప్షన్,

సూర్య జై భీమ్ : కొన్ని కలలు, కన్నీళ్లు - వీక్లీషో విత్ జీఎస్‌

ఆధిపత్య సంబంధాలు: లౌడ్ అండ్ బిగ్గర్ స్టేట్‌మెంట్స్

మరాఠీ సినిమా కోర్ట్ అధికారాన్ని ఉల్లిపాయలాగా పొరలు పొరలుగా సైలెంట్‌గా విప్పుతూ పోతే ఈ సినిమా లౌడ్‌గా నువ్వు తప్పించుకోలేని రీతిలో అరిచి చెపుతుంది. సినిమా తొలి సీన్ ‌లోనే జైలులోంచి బయటకు వచ్చే వారికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అనేది ఒకింత నాటకీయంగానే చూపిస్తారు. కులాలను బట్టి విడుదల చేయడం, చేయకపోవడం, దళితులు, సంచారజాతుల వారైతే వారిని మళ్లీ ఏదో ఒక కేసు పెట్టి అక్కడికక్కడే లోపల తోయడం అనేది ఎంత క్రూరంగా ఉంటుందో చూపిస్తారు.

ఇవాళ పరిస్థితి అంత పచ్చిగా లేకపోయినా అది పూర్తిగా అవాస్తవమని చెప్పగలిగే స్థితిలో మన పోలీస్ వ్యవస్థ గానీ ప్రజాస్వామ్యం గానీ ఉన్నాయా అనేది ఇక్కడ ఎదురయ్యే ప్రశ్న. లాకప్‌లో హింసవల్ల మనిషి చనిపోయాడా బతికున్నాడా అనేది తెలుసుకోవడానికి పోలీసులు కళ్లలో కారం వేసిచూస్తారు చూడూ ఆ దృశ్యం పవర్ రిలేషన్స్ లోని క్రూరత్వానికి సంబంధించిన మరో స్టేట్‌మెంట్. అలాగే డీజీపీ నుంచి ఫొన్ రాగానే సినతల్లిని ఇంటిదగ్గర విడిచిపెడతామని బతిమిలాడుతూ ఆమె నడిచిపోతుంటే ఇంటిదాకా కారులో వెంటబడతారు కదా, అది మరొక్క లౌడ్ స్టేట్మెంట్. అధికార సంబంధాలు ఎలా పనిచేస్తాయి అని చెప్పడానికి డైరక్టర్ జ్ణానవేల్ ఈ దృశ్యాలను శక్తిమంతంగా వాడుకున్నాడు.

సింగం కాదు, వకీల్ సాబ్ కాదు

ఇందులో సూర్య అన్యాయాలకు ఎదురొడ్డి వందలాది రౌడీలను మట్టి కరిపించే సింగం కాదు. కీలుకు కీలు కాలుకు కాలు తీసి కాలర్ ఎగరేసే వకీల్ సాబ్ అసలే కాదు. హింసను నార్మలైజ్ చేసే లెజ్టిమైజ్ చేసే పోకడ ఆ చిత్రాల్లో కొంత ఉంటుంది. ఇది భిన్నమైనది. హింస ఎంత భయానకమైనదో చూపించే చిత్రం ఇది. సూర్య పియుసిఎల్ అనే సంఘం తరపున పోరాడే హక్కుల కార్యకర్త. హీరోయిజం మచ్చుకు కూడా లేకుండా జాగ్రత్త పడ్డారు. స్టార్ ఇమేజ్ తన ఫెర్మార్మెన్స్‌కి అడ్డు పడకుండా జాగ్రత్తపడ్డాడు. సినిమా ఆసాంతం అతని కళ్లలో అలజడి, కోపం కనిపించేట్టు చేశారు.

హింస మోతాదు ఎక్కువే

ఈ సినిమాలో హింస పాలు ఎక్కువే. ఈ విషయంలో మరో తమిళ సినిమా విశారణై కి కొనసాగింపుగా అనిపిస్తుంది. అయితే ఈ హింసను గ్లామరైజ్ చేయకుండా ప్రభావం కోసం ఎలాబరేట్గా చూపినట్టు అనిపిస్తుంది. కొన్ని సార్లు మరీ ఇంత హింసా అనిపిస్తుంది కానీ సర్దార్ ఉదంసింగ్ లో జలియన్ వాలాబాగ్ ఉదంతాన్ని ఆ హింసను ఎఫెక్ట్ కోసం డీటైల్డ్‌గా ఎలా చూపించారో ఈ సినిమాలో అలా వాడుకున్నారు. చూపించినవి పూర్తిగా వాస్తవ విరుద్ధమైనవి అనడానికి కూడా ఏమీ లేదు. తెలుగు నాట అలాంటి చిత్రహింసలు అనుభవించిన వారి ఉదంతాలు, లాకప్ డెత్ ఉదంతాలు చాలానే ఉన్నాయి.

ఫొటో సోర్స్, fb/Suriya Sivakumar

మార్క్స్ వర్సెస్ అంబేద్కర్ కాదు, మార్క్స్ అండ్ అంబేద్కర్

మిగిలిన వాళ్ల కులాలను బహిరంగంగానే చర్చించిన సినిమా లాయర్ కులాన్ని మాత్రం చెప్పదు. టాక్టికల్ మూవ్ కావచ్చు. ఎందుకంటే ఆర్టికల్ 15 సినిమాలో హీరో అగ్రవర్ణానికి చెందిన పోలీస్ అఫీసర్ కావడం వల్ల రక్షకుడు ఉండాల్సిందేనా? అతను పైన్నుంచి రావాల్సిందేనా అనే చర్చకు తావిచ్చింది. ఇక్కడ అది అవాయిడ్ చేశారు. లేదా మరొక కారణం కూడా ఉండొచ్చును. జస్టిస్ చంద్రు కులం గురించి తమిళ పాత్రికేయుల్లోనే చాలామందికి తెలియని స్థితి ఉన్నదంటే ఆయనకు కులాన్ని బయటపెట్టడం ఇష్టం లేకపోయి ఉండొచ్చు అనిపిస్తుంది. కమ్యూనిస్టు కుటుంబం నుంచి వచ్చిన కార్యకర్త. ఆ పాత విలువలేవో ఉండొచ్చును. దర్శకులు దాన్ని గౌరవించి ఉండొచ్చు.

సినిమా ఆసాంతం లాయర్ వెనుక మార్క్స్, ఏంగెల్స్లు కనిపిస్తూ ఉంటారు. సినిమా పొడవునా అక్కడక్కడా ఎర్రజెండాలు రెపరెపలాడుతూనే ఉంటాయి. ఇలాంటి సినిమాకు జై భీమ్ అనే పేరు పెట్టడం వ్యూహాత్మకం. బహుశా రెండు స్రవంతుల మధ్య స్పర్థ కంటే సామీప్యత ఎక్కువున్నదని చెప్పే ప్రయత్నం కావచ్చును.

వాస్తవానికి ఈ సినిమా కథాంశం మనకు కొత్తదేమీ కాదు. లాకప్ హత్యలు తెలుగు నేలకు కొత్తవేమీ కావు. ట్రైబల్స్ మీద, దళితులమీద అత్యాచారాలు కొత్తవేమీ కావు. అలాగే బాధితుల తరపున వ్యవస్థలోని చీకటికోణాలమీద పోరాటం చేసిన బాలగోపాల్ లాంటి న్యాయవాద హక్కుల కార్యకర్తలు తెలుగు నేలమీద ఉన్నారు. కాకపోతే ఒక విషయాన్ని ఇంత బలంగా రాజీ లేకుండా చిత్రించిన సినిమాలు తక్కువ. అలాంటి సినిమాలను వెతుక్కోవాల్సిందే. సూర్య లాంటి స్టార్ ఇలాంటి పాత్రను చేయడం మనకు కొత్త. తెలుగు హీరోలు సందేశాత్మక చిత్రాలను తీస్తున్నారనగానే వారి మార్కెట్‌ని అభిమాన గణాన్ని దృష్టిలో పెట్టుకుని కథకు మసాలాలు అద్దడం టోన్ డౌన్ చేయడం ఆనవాయితీ.

వీడియో క్యాప్షన్,

మొగిలయ్య పాడిన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ అసలు పాట ఏంటి

జరిగింది జరిగినట్టుగా చెప్పు, ఎక్కువా చెప్పొద్దు, తక్కువా చెప్పొద్దు అని లాయర్ సినతల్లిని అడిగే దృశ్యం ద్వారా డైరెక్టర్ తాను ఈ సబ్జెక్టుతో ఎలా డీల్ చేశారో మనకు చెప్పే ప్రయత్నం చేస్తారు. అయితే వాస్తవికత సినిమా రూపం ధరించేసరికి కొంచెమైనా ఎగ్జాగరేట్ కాకుండా ఉంటుందా అనేది సందేహం.

సినతల్లిగా నటించిన మళయాళీ నటి లిజోమో జోస్ గురించి చాలా వినబోతాం. అనేక అవార్డు వార్తలు వినబోతాం. ఆమె భర్తగా నటించిన మణికణ్ణన్ గురించి కూడా.

పంటికింద రాయిలాగా పడే సీన్లు రెండు మూడు ఉన్నప్పటికీ అవేమీ పెద్దగా అడ్డొచ్చేవి కావు. పియుసిఎల్ వంటి ఆర్గనైజేషన్లో పనిచేస్తూ తన ఎదురుగా కూర్చున్నది ఇరులర్ కమ్యూనిటీకి చెందిన కూలీ మహిళ అని తెలిసి కూడా ఆమె సంతకం పెట్టకుండా వేలిముద్ర కోసం అటూ ఇటూ చూస్తున్నపుడు ఆ లాయర్ ఆశ్చర్యపోతాడు చూడూ అలాంటివన్నట్టు. అలాగే తమిళ్ వర్షన్తో పోలిస్తే తెలుగు వెర్షన్ ఇబ్బందిగా ఉంది. డబ్బింగుతో వచ్చిన ఇబ్బందులు చాలానే ఉన్నాయి. చివరకు కొంతమంది తెలుగు హీరోలతో పోల్చినా మెరుగైన తెలుగు మాట్లాడే ప్రకాశ్ రాజ్ కు కూడా డబ్బింగ్ చెప్పించారు. కానీ సినిమా రచన అయితే శక్తిమంతమైనది. మీరిచ్చేది కేవలం తీర్పు కాదు. ఆశ అనే చోట ఇంకా అలాంటి అనేక చోట్ల ఎమోషన్ పతాక స్థాయిని చేరుతుంది.

కాలుమీద కాలు వేసుకుని న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకున్న పాప తర్వాత ఏమైంది. ఎక్కడిదాకా ఎదిగింది అనేది ఆసక్తి కరమైన అంశం. సినతల్లిలాగా అందరు బాధితులకు యాక్టివిస్టులాయర్ అండ దొరకదు కదా, మరి ఆ పాపలాంటి వాళ్లు ఎదిగి తమ హక్కుల కోసం తాము నిలబడే స్థాయికి ఎంత వరకు చేరారు అనేది దీనికి కొనసాగింపు అనదగిన ప్రశ్న.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)