బైజూస్: మెరుపు వేగంతో వృద్ధి వెనుక ‘చీకటి నిజం’.. ఆందోళనలో కస్టమర్లు, ఉద్యోగులు
- నిఖిల్ ఇనాందార్
- బీబీసీ కరస్పాండెంట్

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచంలోనే అత్యధిక పేరు ప్రఖ్యాతులున్న ఆన్‌లైన్ ఎడ్‌టెక్ స్టార్టప్ బైజూస్ నుంచి ఫీజ్ రీఫండ్ కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్నట్లు దిగంబర్ సింగ్ చెప్పారు. తన కొడుకుకు మ్యాథ్స్, సైన్స్ క్లాసుల కోసం బైజూస్‌కు రూ.5000 నేరుగా చెల్లించానని, అదే సంస్థ సహకారంతో రూ.35 వేల రూపాయలు లోన్ కూడా పొందానని దిగంబర్ సింగ్ చెప్పారు.
''ఒక సేల్స్ రిప్రజెంటెటివ్ మా ఇంటికి వచ్చి నా కొడుకుని వాడు సమాధానం చెప్పలేనంత కష్టమైన ప్రశ్నలు అడిగాడు. మా వాడు చెప్పలేకపోయాడు. అతను వచ్చి వెళ్లి తర్వాత మేం పూర్తి నిరుత్సాహంలో మునిగిపోయాం'' అని దిగంబర్ సింగ్ చెప్పారు.
కానీ, వాళ్ల దగ్గర కోర్సు తీసుకున్నందుకు తర్వాత తాను సిగ్గుపడ్డానని దిగంబర్ సింగ్ వ్యాఖ్యానించారు.
''వాళ్లు అందిస్తామన్న ఏ కోర్సూ సరిగా చెప్పలేదు. ఫేస్ టు ఫేస్ క్లాసులు అన్నారు. మా అబ్బాయి చదువుల్లో డెవలప్‌మెంట్ మీద కౌన్సెలర్ నుంచి కాల్స్ వస్తాయన్నారు. ఫేస్ టు ఫేస్ క్లాసులు లేవు. కొద్ది నెలల తర్వాత కౌన్సెలర్ నుంచి కూడా కాల్స్ ఆగిపోయాయి. మేం కాల్ చేసినా సమాధానం లేదు'' అని సింగ్ వివరించారు.
తమ క్లాసులు నచ్చకపోతే 15 రోజుల తర్వాత మానేయవచ్చని, ఫీజు రీఫండ్ ఇస్తామని, ఎలాంటి ప్రశ్నలు అడగబోమని బైజూస్ చెబుతోంది. ఒక విద్యార్ధి క్లాసులతోపాటు టాబ్లెట్ లెర్నింగ్ ఆప్షన్‌ను కూడా ఎంచుకుంటే, ఎప్పుడు మానేసినా రీఫండ్ ఇస్తామని బైజూస్ నిబంధనలు చెబుతున్నాయి.
15 రోజుల గడువు ముగిశాక అయ్యాక దిగంబర్ సింగ్ రీఫండ్ అడిగారని, అందువల్లే ఇవ్వలేదని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. దిగంబర్ సింగ్ కేసును బీబీసీ వారి దృష్టికి తీసుకెళ్లగానే, వారు మొత్తం రీఫండ్ ఇవ్వడానికి అంగీకరించారు.
ఫొటో సోర్స్, Getty Images
బైజు రవీంద్రన్ 2011లో ఈ కంపెనీని స్థాపించారు
బైజు ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. '' ఇవి నిరాధారమైనవి, దురుద్దేశంతో చేసినవి'' అని పేర్కొంది. దిగంబర్ సింగ్‌తో తరువాతి కాలంలో చాలాసార్లు మాట్లాడామని బైజూస్ సంస్థ ప్రతినిధులు బీబీసీకి చెప్పారు.
బైజూస్ వ్యవహారంలో వస్తున్న ఆరోపణలకు సంబంధించి బీబీసీ చాలామంది పేరెంట్స్ తో మాట్లాడింది. వాళ్లు ఇచ్చిన ఫేస్ టు ఫేస్ క్లాసులు, కౌన్సెలర్ కాల్స్ హామీలలో ఏదీ నెరవేరలేదని వారు చెప్పారు. మూడు వేర్వేరు కేసుల్లో విద్యార్ధులకు ఫుల్ రీఫండ్ ఇవ్వాలని వినియోగదారుల కోర్టులు(కన్స్యూమర్ ఫోరం) బైజూస్‌ను ఆదేశించాయి. చట్టపరమైన సమస్యలను తాము పరిష్కరిస్తున్నామని, ఈ కేసుల్లో 98% పరిష్కారం సాధిస్తున్నామని కంపెనీ ప్రతినిధులు బీబీసీకి తెలిపారు.
బైజూస్‌లో పని చేసిన మాజీ అధికారులు, కస్టమర్లతో ఇంటర్వ్యూల ఆధారంగా బీబీసీ పరిశోధన సాగింది. తమను తప్పుదోవపట్టించేలా సేల్స్ ఏజెంట్లు హామీలు ఇచ్చారని చాలామంది పేరెంట్స్ ఆరోపించారు. హడావుడి పెట్టి కాంట్రాక్టులు చేయించుకున్నారని అన్నారు.
''పేమెంట్స్ జరిగిన తర్వాత.. రీఫండ్ ఇవ్వాల్సి వస్తే ఆ ఏజెంట్లు ఏమాత్రం పట్టించుకోరు'' అని బైజూస్ మాజీ ఉద్యోగి ఒకరు అన్నారు.
ఏజెంట్లు తమ టార్గెట్‌లు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తారని, ఇక్కడ ఒత్తిడితో కూడిన సేల్స్ కల్చర్ ఉంటుందని మాజీ ఉద్యోగులు చెప్పారు. ఆన్‌లైన్ కన్స్యూమర్ అండ్ ఎంప్లాయిస్ ఫోరమ్‌ల నుంచి కంపెనీ పై అనేక ఆరోపణలు ఉన్నాయని కొందరు మాజీ ఉద్యోగులు వెల్లడించారు.
అయితే, బైజూస్ దీనిని తోసిపుచ్చింది. కోర్సుకు వ్యాల్యూ ఉందని నమ్మకం కలిగినప్పుడే పేరెంట్స్ తమతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంటారని, సేల్స్ కోసం ఎలాంటి ఒత్తిళ్లు ఉండవని బైజూస్ ప్రతినిధులు చెప్పారు.
''పేరెంట్స్ మీద మా ఉద్యోగుల దురుసు ప్రవర్తనగానీ, ఒత్తిళ్లు గాని ఉండవు. ఇలాంటి వాటిని కట్టడి చేయడానికి మాకు ఎక్కడికక్కడ మెకానిజం ఉంది'' అని కంపెనీ వెల్లడించింది.
ఫొటో సోర్స్, Getty Images
బైజూస్‌ను 2011లో బైజు రవీంద్రన్ ప్రారంభించారు. దీనికి ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ఆధ్వరంలో నడిచే చాన్ జుకర్‌బర్గ్, టైగర్ గ్లోబల్ అండ్ జనరల్ అట్లాంటిక్ లాంటి సంస్థలు ప్రధాన ఫండింగ్ కంపెనీలు.
కరోనా కారణంగా స్కూళ్లు మూతపడటంతో భారతదేశంలో అనేకమంది విద్యార్థులు బైజూస్ లాంటి ఆన్‌లైన్ క్లాసుల వైపు మళ్లారు. ఇదే ఆ సంస్థకు వరంగా మారింది.
కరోనా మహమ్మారి రాకతో కంపెనీ విలువ రాకెట్‌లా దూసుకుపోయింది. 85శాతం రెన్యువల్ రేటును కూడా సాధించింది. 60 లక్షలమందికి పైగా విద్యార్ధులు రిజిస్టర్ అయ్యారని ఆ సంస్థ తెలిపింది.
అత్యంత నాణ్యమైన విద్యనందిస్తామని బైజూస్ హామీ ఇచ్చిందని చాలామంది పేరెంట్స్ బీబీసీకి తెలిపారు.
బట్టీపట్టుడు చదువులకు నెలవైన దేశంలో, అత్యున్నత ప్రమాణాలతో చదువులు చెబుతామంటూ ప్రకటనలు చేసిన బైజూస్, టెక్నాలజీని విరివిగా వాడుకుని లబ్ధిపొందింది.
మార్చి 2020 నుండి బైజూస్ $1 బిలియన్( రూ.7500 కోట్లు) కంటే ఎక్కువ వసూళ్లు చేయగలిగింది. డజన్ల సంఖ్యలో పోటీదారులు ఉన్నప్పటికీ, కోడింగ్ క్లాస్‌ల నుండి పోటీ పరీక్షల కోచింగ్ వరకు ప్రతి కోర్సును అందించే ఒక అతి పెద్ద ఆన్‌లైన్ టీచింగ్ కంపెనీగా ఎదిగింది.
బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకుని, ఇండియన్ టీవీ ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపించే బ్రాండ్‌గా బైజూస్ నిలబడింది.
విపరీతమైన మార్కెటింగ్ విధానాలు, పేరెంట్స్‌ను అభద్రతా భావంలోకి నెట్టి వారిని అప్పుల్లో మునిగేలా చేయడం ద్వారానే కంపెనీ ఇంత ఎదిగిందని కొందరు విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు.
విపరీతంగా మార్కెటింగ్ ఫోన్ కాల్స్ చేస్తూ, బైజూస్ క్లాసులు వినకపోతే మీ పిల్లలు వెనకబడిపోతారంటూ తల్లిదండ్రులకు ఊదరగొట్టి భయపెట్టడం ద్వారా బైజూస్ తమ ప్రోడక్ట్‌లను అమ్ముకుంటోందని వారు ఆరోపించారు.
బైజూస్ అమ్మే క్లాసుల ధరలు కూడా సామాన్య భారతీయులకు అందుబాటులో ఉండవు. ఉదాహరణకు బైజూస్‌లో బేసిక్ కోర్సుల ఫీజులే సుమారు 50 డాలర్లు అంటే రూ.3750 వరకు ఉంటాయి.
ఫొటో సోర్స్, Getty Images
పిల్లలకు అవి అవసరమా, తల్లిదండ్రులు వాటి ఫీజులు భరించగలరా అన్నదానితో నిమిత్తం లేకుండా బైజూస్ క్లాసులు అంటగడుతుందని ఆ సంస్థ మాజీ ఉద్యోగి ఒకరు వెల్లడించారు.
''క్లాసులను కొనుక్కునే వ్యక్తి రైతా, రిక్షా పుల్లరా, ఉద్యోగం చేసేవాడా అన్నది కూడా చూడకుండా ఒక్కొక్కరికి ఒక్కో రేటు చెప్పుకుంటూ వెళతారు. వారు భరించలేరని తెలిసినప్పుడు రేటు తగ్గిస్తారు'' అని నితీశ్ రాయ్ బీబీసీతో అన్నారు. ఆయన బైజూస్‌లో బిజినెస్ డెవలప్‌మెంట్ అసోసియేట్‌గా పని చేసి రాజీనామా చేశారు.
అయితే బైజూస్ మాత్రం కస్టమర్ల అవసరాలకు తగ్గట్లుగా ప్రోగ్రామ్‌లు డిజైన్ చేసి, వాటికి తగ్గట్టుగా ఫీజులు వసూలు చేస్తామని చెబుతోంది. సేల్స్ ఎగ్జిక్యుటివ్‌లకు ధరల మీద ఏమాత్రం నిర్ణయాధికారం లేదని కూడా ఆ సంస్థ చెబుతోంది.
బైజూస్‌లో సేల్స్ రిప్రజెంటేటివ్‌ల కష్టసాధ్యమైన టార్గెట్‌లు విధిస్తుంటారని ఆ సంస్థలో పని చేసిని మాజీ ఉద్యోగులు చెబుతున్నారు. దీనికి సంబంధించి గత ఏడాది ఓ మేనేజర్, సేల్స్ ఎగ్జిక్యుటివ్ మధ్య జరిగి ఫోన్ సంభాషణ ఆన్ లైన్‌లో లీకైంది.
ఇందులో టార్గెట్‌లను చేరుకునే విషయంలో మేనేజర్ సేల్స్ ఎగ్జిక్యుటివ్ మీద ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సంభాషణలు ఉన్నాయి. అయితే, ఈ సంభాషణలు 18 నెలల కిందటివని, వాటికి బాధ్యులైన వ్యక్తుల మీద చర్యలు తీసుకున్నామని బైజూస్ సంస్థ వెల్లడించింది. అందులో దురుసుగా వ్యవహరించిన మేనేజర్‌ను తొలగించామని కూడా కంపెనీ చెబుతోంది.
తమ సంస్థలో దురుసు ప్రవర్తన, వేధింపులకు స్థానంలేదని, ఈ ఘటనలో బాధితులైన ఉద్యోగులు ఇప్పటికీ తమ వద్దే పని చేస్తున్నారని కూడా సంస్థ తెలిపింది.
#గమ్యం: పరీక్షల ఒత్తిడిని జయించడం ఎలా?
సేల్స్ విషయంలో కంపెనీ పెట్టే ఒత్తిడిని భరించలేక ముగ్గురు వ్యక్తులు మానసికంగా దెబ్బతిన్నారని కూడా ఓ మాజీ ఉద్యోగి వెల్లడించారు. తాను తీవ్రమైన ఆందోళనకు లోనయ్యానని, బైజూస్‌లో పని చేస్తున్న కాలంలో తనకు బీపీ, షుగర్‌లు కూడా ఎటాక్ అయ్యాయని ఓ మాజీ ఉద్యోగి వెల్లడించారు.
చాలామంది ఉద్యోగులు తాము 12-15 గంటలు పని చేయాల్సి వచ్చేదని, అక్కడ అన్నిగంటలు పని చేయడం సర్వసాధారణమని తెలిపారు. కనీసం రెండు గంటలపాటు కస్టమర్లతో మాట్లాడని వారిని ఆబ్సెంట్‌గా గుర్తిస్తారని, ఆ రోజుకు జీతం కూడా ఇవ్వరని వారు తెలిపారు.
''ఇది నాకు కనీసం వారానికి రెండుసార్లు జరుగుతుండేది. నా టార్గెట్ చేరుకోవడానికి నేను రోజుకు దాదాపు 200మందితో మాట్లాడాల్సి వచ్చేది'' అని ఓ మాజీ ఉద్యోగి తెలిపారు.
లక్ష్యాన్ని చేరుకోవడం చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే అతనికి ఛేజింగ్‌కు కొన్ని లీడ్‌లే ఇస్తారు. పైగా సగటు కాల్ తరచుగా రెండు నిమిషాల కంటే తక్కువ ఉంటుందని ఆయన వెల్లడించారు.
అయితే, బైజూస్ మాత్రం, టార్గెట్‌లు చేరుకోనివారికి జీతాలు తగ్గించడం, లేదంటే ఆబ్సెంట్‌లు వేశామని చెప్పడం నిజాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడమేనని వాదిస్తోంది.
''అన్ని సంస్థల్లాగే ఉద్యోగుల విషయంలో మాకు కొన్ని నిబంధనలున్నాయి. మేం వాటిని పాటిస్తున్నాం'' అని ఆ కంపెనీ చెప్పింది. ఉద్యోగుల ఆరోగ్యం, సంక్షేమం కోసం అనేక సదుపాయాలు, శిక్షణలు ఇస్తున్నట్లు తెలిపింది.
''మా దగ్గర కొన్ని వేలమంది పని చేస్తున్నారు. వారిలో ఎవరికి ఇబ్బంది కలిగినట్లు తెలిసినా వెంటనే బాధ్యుల పై చర్యలు తీసుకుంటాం'' అని కంపెనీ వెల్లడించింది.
ఈ ఏడాది ఆరంభంలోనే తాను కంపెనీకి రాజీనామా చేశానని, సంస్థను నడుపుతున్న తీరు తనకు నచ్చలేదని, చాలా ఇబ్బందిగా ఫీలయ్యానని రాయ్ అన్నారు. ఆయన, ముంబయిలో ఓ వీధి బడిలో పిల్లలకు పాఠాలు చెబుతున్నారు.
''ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించారు. కానీ, ఇప్పుడు డబ్బులు రాబట్టే మెషీన్‌లాగా తయారు చేశారు'' అన్నారాయన.
''వేగంగా ఎదిగేందుకు ఈ సంస్థ తీవ్రంగా ప్రయత్నిస్తోంది'' అని ప్రదీప్ సాహ అన్నారు. ఆయన మార్నింగ్ కాంటెక్ట్స్ సహ వ్యవస్థాపకుడు. ఇది భారతదేశంలో స్టార్టప్‌ల గురించి రిపోర్ట్ చేసే ఒక పరిశోధనా సంస్థ.
ఫొటో సోర్స్, Getty Images
బైజూ రవీంద్రన్
అయితే, ఇది కేవలం బైజూస్ సమస్య ఒక్కటే కాదని, మొత్తం ఎడ్-టెక్ రంగమే అలా ఉందని ఆయన అన్నారు.
అలాగే, ఆ సంస్థ మీద వస్తున్న ఆరోపణలు దానిని ఏమాత్రం మార్చలేవని కూడా సాహ అన్నారు.
''ఈ ఆరోపణలన్నీ గుర్తింపు లేకుండా వెళ్లిపోతాయి. ఏవో కొన్ని మాత్రం కనిపిస్తాయి. రెవిన్యూ గురించి ఆలోచించేటప్పుడు ఈ ఆరోపణలు, విమర్శలను పట్టించుకోవడం తెలివి తక్కువపని''అని ఆయన అభిప్రాయపడ్డారు.
కానీ, వీటిపై నియంత్రణ తెచ్చే చట్టాలు రావాలని డిమాండ్‌లు వినిపిస్తున్నాయి.
ప్రస్తుత ఎడ్-టెక్ రంగం బీజింగ్ మోడల్‌లోకి రావాలని డాక్టర్, ఇన్వెస్టర్ అయిన అనిరుద్ధ మల్పానీ అన్నారు. చైనా ఇటీవలే ఎడ్-టెక్ రంగాన్ని లాభాపేక్ష లేని రంగంగా మార్చేలా నిబంధనలను తీసుకొచ్చింది. నెట్‌ఫ్లిక్స్ మోడల్‌లా, ఎప్పుడైనా క్లాసుల నుంచి వైదొలగేలా చట్టాలు రూపొందించవచ్చునని డాక్టర్ మల్పానీ అన్నారు.
భారత ప్రభుత్వం ఇంకా ఇందులో జోక్యం చేసుకోలేదు. కానీ తల్లిదండ్రుల ఆవేదనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కాబట్టి, త్వరలో జ్యోక్యం చేసుకోవాల్సి రావచ్చు. ఈ రంగాన్ని నియంత్రించాలని ప్రభుత్వాన్ని కోరుతూ కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు డాక్టర్ మల్పానీ చెప్పారు.
''వాళ్లు ఎన్నికోట్లు సంపాదించారు, ఎన్ని రికార్డులు సృష్టించారు అన్నది ముఖ్యం కాదు. చదువును మన ఆరోగ్య వ్యవస్థలాగే అలా వదిలేయలేం'' అన్నారు డాక్టర్ మల్పాని.
ఇవి కూడా చదవండి:
- మనుషులు సెక్స్ ఎందుకు కోరుకుంటారు... లైంగిక సంబంధాల్లో విప్లవం రాబోతోందా?
- ఈ కుక్కలను కొనొద్దని పశు వైద్యులు ఎందుకు చెబుతున్నారు
- అగ్నిపథ్: ఇలాంటి సైనిక నియామకాల పథకం ఏఏ దేశాల్లో ఉంది? అక్కడి నియమ నిబంధనలు ఏమిటి
- విజయవాడలో బిల్డర్లకు అక్రమంగా లైసెన్సులు ఇస్తున్నారా... ఫ్లాట్స్ కొనుక్కున్న వారి పరిస్థితి ఏంటి?
- బ్లడ్ గ్రూప్స్ గురించి మీకేం తెలుసు... వాటిలో చాలా అరుదుగా దొరికే రక్తం రకాలు ఏంటి?
- ఇళ్లలోనే పుట్టగొడుగుల పెంపకంతో మహిళల జీవితాలు ఎలా మారుతున్నాయంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)