అసిస్టెడ్ రీ ప్రొడక్షన్ టెక్నాలజీ చట్టం: వీర్యాన్ని ఎవరు దానం చేయొచ్చు? ఎన్నిసార్లు చేయొచ్చు? చట్టం ఏం చెబుతోంది? మీరు తెలుసుకోవాల్సిన 10 అంశాలు..

 • పద్మమీనాక్షి
 • బీబీసీ ప్రతినిధి
సరోగసీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రతీకాత్మక చిత్రం

లక్ష్మికి వివాహం అయి 5 సంవత్సరాలు అవుతోంది. వారికి పిల్లలు కలగలేదు. మరో వైపు సమాజం నుంచి పెళ్ళై ఇన్నేళ్ళైనా పిల్లలెందుకు కలగలేదనే ప్రశ్నలు వినాల్సి వస్తోంది. ఇవన్నీలక్ష్మికి మానసిక వేదన కలిగించేవి. దీంతో, బంధువులు, కుటుంబ సభ్యులు ఐవీఎఫ్ చికిత్సకు వెళ్ళమని సూచించారు.

ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే అయినా ప్రయత్నించి చూడాలని లక్ష్మి దంపతులు ఐవీఎఫ్ చికిత్సకు వెళ్లారు. అయితే, రెండు సైకిళ్ల చికిత్స తర్వాత వారికి ఐవీఎఫ్ విఫలమయింది. దీంతో, పాటు లక్ష్మి ఆరోగ్యం కూడా క్షీణించింది. ఇంతలో కోవిడ్ లాక్ డౌన్ కూడా విధించారు.

ఈ నేపథ్యంలో వారు పిల్లల్ని కనాలనుకునే ప్రయత్నాలను తాత్కాలికంగా విరమించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన మంగాయమ్మ 73ఏళ్ల వయసులో కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆమెను ‘గొడ్రాలు’ అంటూ చుట్టుపక్కల వాళ్లు నిందించినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె బంధువులు చెప్పారు.

వారికి పిల్లలు కావాలని ఉంది. ఐవీఎఫ్ ద్వారా సాధ్యం కావడం లేదు. ఇటువంటి వారికి ఇటీవల పార్లమెంటు ఆమోదించిన అసిస్టెడ్ రీ ప్రొడక్షన్ టెక్నాలజీ బిల్ 2020 ఆశాజనకంగా మారుతుందా?

వీడియో క్యాప్షన్,

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌‌తో ఐవీఎఫ్ పద్ధతిలో మెరుగైన సంతానోత్పత్తి

1. అసిస్టెడ్ రీ ప్రొడక్షన్ టెక్నాలజీ బిల్లు ఏమి చెబుతోంది?

అసిస్టెడ్ రీ ప్రొడక్షన్ టెక్నాలజీ బిల్లులో పొందుపరిచిన అంశాలు పిల్లలు కావాలనుకునే దంపతులకు సురక్షిత, చట్టబద్ధమైన అసిస్టెడ్ రీ ప్రొడక్టివ్ టెక్నాలజీ ఉపయోగించేందుకు అవకాశాలు కల్పిస్తాయి. పిల్లలు కావాలనుకున్న దంపతులు ఈ అవకాశాన్ని మూడవ వ్యక్తి అవసరం లేకుండా వినియోగించుకోవచ్చు.

ఈ ప్రక్రియలో ట్యూబ్‌ల ద్వారా అండాన్ని ఫలదీకరణం చేయడం, వీర్యాన్ని ఇంజక్షన్ ద్వారా గర్భంలోకి ప్రవేశపెట్టడం లాంటివి చేస్తారు.

ఎవరైనా సంతానోత్పత్తి విషయంలో వైఫల్యం చెంది, సాంకేతికత అవసరమైనప్పుడు మొత్తం ప్రక్రియకు సంబంధించిన నాణ్యతా ప్రమాణాలను ఈ బిల్లు సంరక్షిస్తుందని విశాఖపట్నానికి చెందిన కృష్ణ ఐవీఎఫ్ క్లినిక్ వ్యవస్థాపకులు, గైనకాలజిస్ట్ డాక్టర్ జిఏ రామరాజు బీబీసీకి చెప్పారు.

2. ఈ బిల్ ఉద్దేశ్యం ఏంటి?

 • ఏఆర్‌టీ ద్వారా అందుబాటులోకి వచ్చే సేవల నియంత్రణ, మహిళలు, పిల్లలు దోపిడీకి గురి కాకుండా చూడటం
 • వీర్య, అండ దాతలకు ఇన్సూరెన్సు కల్పన
 • ఒక వ్యక్తి నుంచి అనేకసార్లు అండాలను సేకరించకుండా చూడటం
 • రీ ప్రొడక్టివ్ టెక్నాలజీ ద్వారా పుట్టిన పిల్లలకు హక్కుల కల్పన
 • వీర్యం, అండాలు, ఇతర జీవకణాల సంరక్షణ విషయంలో నియంత్రణ
 • ఫలదీకరణం జరగక ముందే జన్యు పరీక్షల నిర్వహణ
 • ఏఆర్ టీ క్లినిక్‌లు, బ్యాంకుల నమోదు క్రమబద్ధీకరణ చేయడం

"ఏ విధానానికైనా ఒక నిర్దిష్టమైన ప్రక్రియ, మార్గదర్శకాలు ఉండటం అవసరం. పుట్టబోయే సంతానానికి సంబంధించిన అంశాలు, హక్కులను కాపాడే దిశగా ఉండటంతో ఇది మిగిలిన బిల్లుల కంటే భిన్నమైనది అని చెప్పవచ్చు" అని డాక్టర్ రామరాజు అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

3. ఏఆర్‌టీ బిల్ ఆవశ్యకత ఏంటి? దీనిని ఎవరు ఉపయోగించుకోవచ్చు?

ప్రపంచంలోనే అత్యధికంగా ఏఆర్‌టీ క్లినిక్‌లు భారతదేశంలో ఉన్నాయి. మెడికల్ టూరిజం అభివృద్ధిలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

భారతదేశంలో సుమారు 1000 సరోగసీ క్లినిక్‌లు ఉండగా, ఏఆర్‌టీ క్లినిక్‌లు మాత్రం 40,000 ఉండవచ్చని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. భారతదేశ మెడికల్ టూరిజం మార్కెట్ విలువ ఏడాదికి 450 మిలియన్ డాలర్లు( రూ. 33,750 కోట్లు) ఉండవచ్చని అంచనా వేశారు.

అయితే, ఈ బిల్లు చట్టరూపం దాల్చడం ద్వారా మెడికల్ టూరిజం రంగం విస్తరిస్తుందని నూరు శాతం కచ్చితంగా చెప్పలేమని డాక్టర్ రామరాజు అన్నారు.

ఏఆర్‌టీ ప్రక్రియను వివాహం అయిన దంపతులు, వివాహం కాని మహిళలు, విదేశీయులు కూడా ఉపయోగించుకోవచ్చు.

కానీ, ఈ బిల్లులో ఎల్జీబీటీక్యూ వర్గాలు, వివాహం కాని పురుషుల గురించి ప్రస్తావన లేదని హైదరాబాద్ కు చెందిన మ్యాట్రిమోనియల్ న్యాయవాది బిందు నాయుడు అన్నారు.

ఫొటో సోర్స్, SCIENCE PHOTO LIBRARY

4. ఏఆర్‌టీ బ్యాంక్ అంటే ఏంటి?

మానవ శరీరంలో అంతర్గతంగా జరగాల్సిన ప్రక్రియను వెలుపల నిర్వహించి అండాన్ని మహిళ గర్భంలో ప్రవేశపెట్టేందుకు పాటించాల్సిన చట్టబద్ధమైన ప్రక్రియలను ఈ బిల్లులో పొందుపరిచారు.

ఏఆర్‌టీ బ్యాంకులలో పురుషుల వీర్యం, లేదా అండాలను దానం ఇచ్చే దాతల వివరాలను పొందుపరుస్తారు.

ఈ సేవలను వినియోగించుకునేందుకు స్త్రీలకు 18 -50 సంవత్సరాలు, పురుషులకు 21-55 సంవత్సరాలు ఉండాలి.

5. ఏఆర్‌టీ సేవలనెలా నియంత్రిస్తారు?

నేషనల్ బోర్డు: ఈ బిల్లులో పొందుపరిచిన అంశాల విషయంలో కేంద్రానికి సలహా ఇస్తుంది. ఈ బిల్లులో పొందుపరిచిన నియమ నిబంధనలను ఎప్పటికప్పుడు సమీక్షించి, అవసరమైతే మార్పులను సూచిస్తుంది.

ఏఆర్‌టీ క్లినిక్‌లలో ఉపయోగించే పరికరాలు, ల్యాబ్, ఇతర చికిత్సా పరికరాలకు ఉండాల్సిన కనీస ప్రమాణాలు, సిబ్బంది నైపుణ్యం గురించి కూడా నియమాలను పొందుపరుస్తుంది.

ఈ నియమావళిని అమలు చేసేందుకు రాష్ట్ర బోర్డులు నేషనల్ బోర్డుతో సమన్వయం చేస్తాయి.

ఇవన్నీ ఆహ్వానించదగిన అంశాలని డాక్టర్ రామరాజు అభిప్రాయపడ్డారు. అయితే, అంశాల అమలు సదరు వ్యక్తులు పాటించే క్రమశిక్షణ పై ఆధారపడి ఉంటుందని అన్నారు.

నేషనల్ రిజిస్ట్రీ: నేషనల్ రిజిస్ట్రీలో దేశంలో ఉన్న క్లినిక్‌లు , బ్యాంకుల గురించి ఒక కేంద్రీకృత డేటా బేస్‌ను నిర్వహిస్తుంది.

ఇందులో అవి అందించే సేవలు, స్వరూపం, వాటి వల్ల కలిగే ఫలితాలకు సంబంధించిన వివరాలు ఉంటాయి. దీనికి సంబంధించిన విధానాలు, నియమావళి రూపొందించేందుకు ఈ సమాచారాన్ని నేషనల్ బోర్డుకు అందచేస్తారు. నేషనల్ బోర్డుకు సివిల్ కోర్టుకుండే అధికారాలుంటాయి.

రిజిస్ట్రేషన్ అథారిటీ: ఇందులో ఒక చైర్ పర్సన్ , వైస్-చైర్ పర్సన్ ఉంటారు. వీరికి ఆరోగ్య శాఖలో జాయింట్ సెక్రెటరీ, జాయింట్ డైరెక్టర్ కంటే ఒక స్థాయి పై అధికారాలుంటాయి. మహిళా సంస్థలకు సంబంధించిన ఒక ప్రతినిధి, ఒక న్యాయ శాఖకు చెందిన అధికారి, ఒక గుర్తింపు పొందిన వైద్యులు ఇందులో సభ్యులుగా ఉంటారు.

రిజిస్ట్రేషన్ అథారిటీ ఏఆర్‌టీ కేంద్రాల నమోదు, ఆమోదం, రద్దు, ప్రమాణాల అమలు, చట్టం అమలయ్యేలా చూడటం, ఫిర్యాదుల విచారణ, ఏఆర్‌టీ ని దుర్వినియోగం చేసేవారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం, స్వతంత్ర విచారణలు నిర్వహించడం లాంటి పనులు చేస్తుంది. టెక్నాలజీ, సామాజిక పరిస్థితుల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా బిల్లు నియంత్రణల్లో మార్పులు, చేర్పులు చేసేందుకు జాతీయ, రాష్ట్ర బోర్డులకు సూచనలు చేస్తుంది.

రిజిస్ట్రేషన్ అథారిటీ ఏఆర్‌టీ కేంద్రాల నమోదు, ఆమోదం, రద్దు, నాణ్యతా ప్రమాణాల అమలు, చట్టం అమలయ్యేలా చూడటం, ఫిర్యాదుల విచారణ, ఏఆర్ టీ ను దుర్వినియోగం చేసేవారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం, స్వతంత్ర విచారణలు నిర్వహించడం లాంటి పనులు చేస్తుంది.

టెక్నాలజీ, సామాజిక పరిస్థితుల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా బిల్లులో ఉన్న అంశాల్లో మార్పులు, చేర్పులు చేసేందుకు జాతీయ, రాష్ట్ర బోర్డులకు సూచనలు చేస్తుంది.

"ఈ బిల్లు ద్వారా నియమించే బోర్డుకు కూడా చట్టబద్ధమైన అధికారాలు ఉంటాయని, ఈ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే, నేరానికి తగినట్లుగానే శిక్ష కూడా తీవ్రంగానే ఉంటుంది. ఒకసారి ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే, దీనికి సంబంధించిన మార్గదర్శకాలు, నిబంధనలు తెలుస్తాయి" అని డాక్టర్ రామరాజు వివరించారు.

2015లో జారీ చేసిన నోటిఫికేషన్ విదేశీయులను సరోగసీ ద్వారా పిల్లలను కనడాన్ని నిషేధించింది. కానీ, భారతీయ పౌరసత్వం ఉన్న ప్రవాస భారతీయులు సరోగసీ ద్వారా పిల్లలను కనవచ్చు.

అయితే, ఏఆర్‌టీ సర్వీసెస్ మాత్రం విదేశీయులు కూడా పిల్లల్ని కనేందుకు అవకాశం కల్పిస్తోంది.

ఫొటో సోర్స్, DR RAMARAJU

ఫొటో క్యాప్షన్,

డాక్టర్ జిఏ రామరాజు

6. క్లినిక్‌లు అనుసరించాల్సిన నియమాలేంటి?

 • ఏఆర్‌టీ ప్రక్రియను ఉపయోగించుకోవాలనుకునే దంపతులు, మహిళలు, దాతలు ఈ ప్రక్రియ అవలంబించేందుకు అర్హులయి ఉండాలి.
 • దాతలకు వైద్య పరీక్షలు నిర్వహించాలి.
 • ఏఆర్‌టీ సాధించే ఫలితాల గురించి, ప్రభావం గురించి ముందుగానే ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ ఇవ్వాలి.
 • వీటితో ఉన్న లాభాలు,నష్టాలు, ఖర్చు, ప్రతికూల ప్రభావాలు, ముప్పు గురించి ముందుగానే తెలియచేయాలి.
 • ఫిర్యాదులను స్వీకరించేందుకు ఫిర్యాదుల సెల్ ను కూడా ఏర్పాటు చేయాలి.

ఏఆర్‌టీ ద్వారా పుట్టబోయే పిల్లలకుండే హక్కుల గురించి కూడా ఏఆర్‌టీ క్లినిక్‌లు వివరించాలి. ఏఆర్‌టీ ద్వారా జన్మించిన పిల్లలకు కూడా సాధారణ ప్రసవం ద్వారా జన్మించిన బిడ్డల మాదిరిగానే అన్ని హక్కులు ఉంటాయి.

అలాగే, వారికి సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి. వీర్య, అండ దాతలకు బిడ్డ మీద ఎటువంటి హక్కులు ఉండవు. వారికున్న హక్కులను పూర్తిగా వదులుకోవాలి.

ఏఆర్‌టీ అమలు వల్ల సంతానోత్పత్తి కోసం అయ్యే ఖర్చు మరింత పెరగడంతో పాటు నాణ్యత కూడా పెరుగుతుందని డాక్టర్ రామరాజు చెప్పారు.

ఈ బిల్లులో ఉన్న కొన్ని వివాదాస్పద అంశాల గురించి ప్రస్తావిస్తూ, అండం లేదా వీర్య దాతలను ఎలా సంప్రదించాలి అనే అంశం గురించి, దాతలకు చెల్లించాల్సిన రుసుము గురించి స్పష్టత లేదన్నారు.

ఫొటో సోర్స్, BINDU NAIDU

ఫొటో క్యాప్షన్,

బిందు నాయుడు

7. బిల్లులో పొందుపర్చిన అంశాల నియంత్రణ ఎలా?

ఏఆర్‌టీ ప్రక్రియ ద్వారా పిల్లలకు జన్మనివ్వాలనుకునే వ్యక్తుల రాతపూర్వక అంగీకారం లేకుండా క్లినిక్‌లు ఎటువంటి చికిత్స లేదా ప్రక్రియను మొదలుపెట్టకూడదు.

పిల్లల్ని కనాలనుకునే దంపతులు దాతలకు పూర్తి ఇన్సూరెన్సును కల్పించాలి. ఈ ప్రక్రియ ద్వారా ఏదైనా ముప్పు, నష్టం వాటిల్లినా, సమస్యలు తలెత్తినా, లేదా ఈ ప్రక్రియలో దాత మరణించినా ఇన్సూరెన్సు ఉపయోగపడుతుంది.

ఇన్సూరెన్సు మొత్తం, రుసుము, పరిధి గురించి మరింత స్పష్టత రావాలని బిందు నాయుడు అన్నారు.

8. వీర్యాన్ని ఎవరు, ఎన్నిసార్లు దానం చేయొచ్చు?

ఈ చట్టం కింద స్వతంత్రంగా రిజిస్టర్ అయిన బ్యాంకు మాత్రమే దాతల నుంచి వీర్యాన్ని, అండాలను సేకరించాలి. దాతల నుంచి వీర్యం, అండాలు సేకరించే ముందు వారికి నిర్ణీత వైద్య పరీక్షలు చేయాలి.

ఈ దాతల వివరాలను జాతీయ రిజిస్టర్ తరహాలో నమోదు చేయాలి. ఈ వివరాలను కనీసం నెల రోజుల పాటు భద్రపరచాలి.

21 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వయసుగల వ్యక్తుల నుంచే వీర్యాన్ని సేకరించాలి.

ఒక మహిళకు ఒక సైకిల్ చికిత్స చేస్తున్నప్పుడు ఒకరి కంటే ఎక్కువ మంది నుంచి సేకరించిన అండాలు, వీర్యాన్ని ప్రవేశపెట్టకూడదు.

ఒక సింగిల్ డోనర్ వీర్యాన్ని ఒకరికి మించి ఇచ్చేందుకు వీలు లేదు.

అలాగే, మూడు కంటే ఎక్కువ బీజకణాలను స్త్రీ గర్భంలో ప్రవేశపెట్టేందుకు వీలు లేదు.

ఈ ప్రక్రియలో చికిత్స చేసేందుకు ఇద్దరు వ్యక్తుల వీర్యాన్ని కలపకూడదు.

9. అండాలను భద్రపరిచేందుకు, మహిళ గర్భంలో ప్రవేశపెట్టే అండాల సంఖ్య విషయంలో నిబంధనలు

23 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసుగల మహిళల నుంచే అండం సేకరించాలి.

ఆమె జీవితంలో ఒక్కసారి మాత్రమే అండాన్ని దానం చేయాలి. ఆమె నుంచి 7కు మించి అండాలను వెలుపలకు తీయకూడదు.

అలాగే, అండాన్ని లేదా బీజ కణాన్ని 10 సంవత్సరాలకు మించి నిల్వ చేయకూడదు.

కవల పిల్లలను పుట్టించేందుకు అండాలను చీల్చకూడదు.

ఈ బిల్లు ఆసుపత్రులు, బ్లడ్ బ్యాంకులను వేరు చేసినట్లు ఏ ఆర్ టీ బ్యాంకులు, క్లినిక్ లను వేరు చేసిందని డాక్టర్ రామరాజు చెప్పారు. వీర్యం, అండం దానం చేసే దాతల ఆధార్ వివరాలను కూడా నమోదు చేయాల్సి ఉంటుందని, ఈ చట్టం ప్రకారం ఒకరు ఒకసారి మాత్రమే వీర్యం, అండం దానం చేయగలరని ఆయన తెలిపారు. దాతలకు బీమా సదుపాయం కూడా ఉంటుందని చెప్పారు.

దాతలకు ఫీజు చెల్లింపు కూడా బ్యాంకుల ద్వారానే జరపాల్సి ఉంటుందని, అయితే.. ఫీజు ఎంత చెల్లించాలి అన్న అంశంపై మాత్రం చట్టంలో పేర్కొనలేదని డాక్టర్ రామరాజు తెలిపారు.

వీడియో క్యాప్షన్,

ఆన్‌లైన్‌లో ఈవీఎఫ్

10. జన్యు పరీక్షలు ఎందుకు?

అండానికి వారసత్వంగా సంక్రమించే జన్యుపరమైన రోగాల గురించి తెలుసుకునేందుకు అండాన్ని గర్భంలోకి ప్రవేశపెట్టక ముందే జన్యు పరీక్షలు నిర్వహించాలి. ఈ పరీక్ష ద్వారా అండాల్లో ఉన్న జన్యుపరమైన లోపాలను కనిపెట్టవచ్చని డాక్టర్ రామరాజు వివరించారు. .

"పునరుత్పత్తి వైఫల్యాలను రీప్లేస్‌మెంట్ చికిత్సల నుంచి వేరు చేసిన ఏఆర్‌టీ ద్వారా నియంత్రణలు రావడం స్వాగతించాల్సిన విషయం. కానీ, ఇది ఈ ప్రక్రియతో కూడుకున్న భాగస్వాములందరినీ కాపాడే విధంగా ఉండాలి" అని డాక్టర్ రామరాజు అభిప్రాయపడ్డారు. వైద్య బృందాలు, నియంత్రణ అధికారులు కలిసి మార్గదర్శకాలు రూపొందించాలని సూచించారు.

ఈ బిల్లు సక్రమంగా అమలయ్యేందుకు మొత్తం ప్రక్రియకయ్యే ఖర్చు, దాతల గోప్యత, నాణ్యతా ప్రమాణాలకు సంబంధించిన అంశాలను మరింత వివరంగా పేర్కొనాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఈ బిల్లు ద్వారా పిల్లలు కావాలనుకునే దంపతులకే ఎక్కువ ప్రయోజనం ఉందని అంటూ, సమాజం, వ్యవస్థ మాత్రం బిల్లులో పొందుపరిచిన అంశాలను దోపిడీ చేసేందుకు చూడకూడదని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)