తెలంగాణ: ఇన్‌స్టాగ్రామ్ ఫొటోలతో ఫేస్‌బుక్‌లో 34 ఫేక్‌ ప్రొఫైల్స్.. పర్సనల్ చాట్ బయటపెడతానంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్న మహిళ అరెస్ట్

  • ప్రవీణ్
  • బీబీసీ కోసం
ఫేక్ ఐడీలతో మోసం

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణలో కరీంనగర్ కేంద్రంగా ఓ మహిళ సాగించిన హైటెక్ మోసాన్ని పోలీసులు బయటపెట్టారు.

చదువుకున్న యువతీ, యువకులే లక్ష్యంగా ఫేస్‌బుక్ నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి, మొదట స్నేహం, ఆపైన ప్రేమ పేరుతో మోసం చేసిన సదరు మహిళ, ఆ తర్వాత పర్సనల్ చాట్‌లు బహిర్గతం చేస్తానంటూ బాధితుల నుంచి లక్షల రూపాయలు కొల్లగొట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఈ మొత్తం వ్యవహారంలో ఆ మహిళ అమ్మాయిలతో అబ్బాయిలా, అబ్బాయిలతో అమ్మాయిలా గొంతుమార్చి మాట్లాడుతూ మోసం చేశారని పోలీసులు చెప్పారు.

ఈ కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు.

జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రాంతానికి చెందిన ఈ మహిళ(30) మొదటి భర్తతో విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకున్నారు.

ప్రస్తుతం రెండో భర్తతో విడాకుల కేసు కోర్టు విచారణలో ఉంది.

'మిషన్ భగీరథ'లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న ఈమె కరీంనగర్‌లో ఉంటున్నారు.

ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా అకౌంట్ల నుంచి సేకరించిన అందమైన యువతీ, యువకుల ఫోటోలను ప్రొఫైల్ పిక్చర్స్‌గా వాడుతూ ఫేస్‌బుక్‌లో ఫేక్ ఖాతాలతో స్నేహం పేరుతో వల వేసేవారు.

ఆ తర్వాత ఆ స్నేహాన్ని వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకునేవరకూ తీసుకెళ్లి, చివరకు పర్సనల్ చాట్ బయటపెడతానంటూ బ్లాక్ మెయిల్‌కు పాల్పడేవారు. వారి నుంచి డబ్బు వసూలు చేసేవారు.

ఫొటో సోర్స్, KARIMNAGAR POLICE

లేని కుటుంబాన్నీ సృష్టించారు

ఈ మొత్తం వ్యవహారం గురించి కరీంనగర్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ తుల శ్రీనివాస్ రావ్ బీబీసీకి వివరించారు.

'ఈమె మొత్తం 34 నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను క్రియేట్ చేశారు. టార్గెట్ చేసిన వ్యక్తులకు తన ఫేక్ అకౌంట్ల ద్వారా తానే మ్యూచువల్ ఫ్రెండ్‌గా మారి అందరితో చాటింగ్ చేశారు. ఒక్కరే చాలా మందిగా నమ్మించారు. కామన్ ఫ్రెండ్ ఒకరికి ఆరోగ్య సమస్యలు వచ్చాయని, ఆసుపత్రి ఖర్చులకు తాను రూ.2 లక్షలు వేశానంటూ తీసిన బ్యాంక్ అకౌంట్ స్క్రీన్ షాట్‌ను మిగతా ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌కు షేర్ చేసేవారు. వాళ్లు సాయం చేసిన డబ్బును తన బ్యాంక్ అకౌంట్లో పడేలా చూసుకున్నారు"

చివరికి తాను మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషినని తన వేరే ఫేక్ అకౌంట్ నుంచి పొగడ్తలు పోస్ట్ చేసి కామన్ ఫ్రెండ్స్ అందరికీ అదంతా నిజం అని నమ్మించిందని ఆయన తెలిపారు.

'ఆమె తనకు లేని కుటుంబాన్ని ఉన్నట్టుగా ఫేస్‌బుక్‌లో సృష్టించారు. వారి కోసం కూడా నకిలీ ఫొటోలు వాడారు. సమయానికి అనుగుణంగా ఆ ఫోటోలు మారుస్తూ వెళ్లారు.

అంతేకాదు, ఆమె తన ఫేక్ కుటుంబ సభ్యుల అకౌంట్లలో మ్యూచువల్ ఫ్రెండ్స్‌గా ఉన్నవారితో గొంతు మార్చి కూడా మాట్లాడేవారు.

ఫొటో క్యాప్షన్,

ఏసీపీ తుల శ్రీనివాస్ రావ్

మోసపోయిన వారిలో రూమ్మేట్

ఎవరూ తనతో నేరుగా కలిసేందుకు అవకాశం లేకుండా ఈ మహిళ చూసుకుంది. ఏదో ఒక కారణం చెప్పి కలవడం వాయిదా వేయడం, లేదా పని ఉందంటూ తప్పించుకునేవారని ఏసీపీ తుల శ్రీనివాసరావు బీబీసీకి చెప్పారు.

తుల శ్రీనివాసరావు ఈ కేసు విచారణను పర్యవేక్షించారు.

"ఈ మహిళ తన రూమ్మేట్ అయిన యువతిని కూడా మోసం చేసింది. అందమైన అబ్బాయి ప్రొఫైల్ క్రియేట్ చేసిన ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆమెతో పరిచయం పెంచుకుంది. ఆ తర్వాత పర్సనల్ చాట్ బయటపెడతానంటూ బ్లాక్ మెయిల్ చేసింది. అదే రూంలో పక్కనే ఉంటూ గత 4 ఏళ్లుగా మగ గొంతుతో మాట్లాడుతూ కనిపెట్టకుండా మేనేజ్ చేసింది" అన్నారు.

ఫొటో క్యాప్షన్,

ఏసీపీ కార్యాలయం

పోలీసులకు ఎలా దొరికారు

ఈ మహిళ బాధితుల్లో ఒక యువతికి ఇటీవల వివాహం నిశ్చయమైంది.

దీంతో తనకు డబ్బు ఇవ్వాలని లేదంటే చాట్ విషయం బయటపెడతానంటూ ఆ మహిళ ఆ యువతిని బ్లాక్ మెయిల్ చేశారు.

దాంతో బాధితురాలు తన కాబోయే భర్త సాయంతో పోలీసులను ఆశ్రయించారు. విచారణలో మొత్తం విషయం బయటపడింది.

సదరు మహిళ చేతిలో మోసపోయిన వారిలో ఇంజనీర్లుగా పనిచేస్తున్న వారే ఎక్కువగా ఉన్నారు. మిగతా వారిలో కొందరు మీడియా ప్రతినిధులు, పోలీసులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.

"ఫేస్‌బుక్‌లో తెలీనివారి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే రెస్పాండ్ కావొద్దు. వెనుకాముందు ఆలోచించకుండా యాక్సెప్ట్ చేస్తే నష్టపోయే అవకాశం ఉంది. ఈ మహిళ చేతిలో మోసపోయిన వారిలో ఎక్కువగా ఇంజనీర్లు, ప్రభుత్వ ఉద్యోగులే ఉన్నారు" అని శ్రీనివాసరావు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

"ఆమె పెద్దగా చదువుకోలేదు, ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు. సులభంగా అందరూ బుట్టలో పడుతుండటంతో ఈ పని కొనసాగించారు. మోసపోయిన వారిలో 20 మంది పెళ్లికాని యువతులు కూడా ఉన్నారు. సోషల్ మీడియాలో స్నేహం పట్ల జాగ్రత్తగా ఉండాలి" అన్నారు ఏసీపీ.

బాధితుల నుంచి ఈ మహిళ సుమారు రూ.20 లక్షలు వసూలు చేశారని పోలీసులు చెప్పారు.

ఆమె దగ్గర నుంచి రూ.2.5 లక్షల నగదు, ల్యాప్ టాప్, రెండు సెల్ ఫోన్లు, 10 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

బ్లాక్ మెయిల్ చేసి వసూలు చేసిన డబ్బుతో ఆమె తరచూ హైదరాబాద్ వెళ్లి షాపింగ్ చేసేదని ఈ కేసు దర్యాప్తులో వెల్లడైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)