ఆంధ్రప్రదేశ్‌‌లో వరి ధాన్యం సేకరణ ఎలా జరుగుతోంది? తెలంగాణకూ ఏపీకీ తేడా ఏంటి?

  • వడిశెట్టి శంకర్‌
  • బీబీసీ కోసం...
సన్నరకం వరిని కొనడానికే ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

సన్నరకం వరిని కొనడానికే ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఇప్పటికే వివాదం నడుస్తోంది. విపక్షాలతో పాటుగా తెలంగాణ పాలక పక్షం కూడా ధాన్యం సేకరణ పై ఆందోళనలు సాగిస్తోంది. అదే సమయంలో రబీలో వరి సాగు మానుకోవాలని సూచనలు చేస్తోంది.

ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందోననే చర్చ సాగుతోంది. ఏపీలో కూడా ఖరీఫ్ ఉత్పత్తులు మార్కెట్‌కు వస్తున్నాయి. మరి ధాన్యంతో మార్కెట్‌కు వస్తున్న రైతుల పరిస్థితి ఎలా ఉంది, ప్రభుత్వం ఏ మేరకు కొనుగోళ్లు చేస్తోంది? అని తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నం చేసింది.

ధాన్యం కొంటున్నారు కానీ..

ఖరీఫ్‌లో ఎక్కువ మంది సన్నాలు, పండిస్తుంటారు. వరిలో అత్యధికంగా సాగు చేసే రకాల్లో ఖరీఫ్ లో సన్నాలు, రబీలో బొండాలు ఉంటాయి. బొండా రకం ధాన్యం కొనుగోలుకి ఆసక్తి కనిపించడం లేదు. సన్నాల సేకరణకే ప్రభుత్వం ముందుకొస్తోంది.

ఇప్పుడు కూడా ఖరీఫ్ లో సన్నరకం ధాన్యం పండించిన రైతులకు కొనుగోళ్లలో సమస్య లేదని తూర్పు గోదావరి జిల్లా కరప మండలం వేములవాడకి చెందిన నున్న గణేశ్ అనే రైతు తెలిపారు.

"ధాన్యం కొనుగోళ్లు ఇప్పుడే మొదలయ్యాయి. వాతావరణ మార్పులతో కోతలు, నూర్పిళ్లు ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం రైతు భరోసా కేంద్రాలతో పాటుగా ప్రైవేటు వ్యాపారులు కూడా కొనుగోళ్ల కోసం వస్తున్నారు. మిల్లర్ల దగ్గర గోడౌన్లు ఖాళీగా ఉంటాయి కాబట్టి ప్రస్తుతానికి ధాన్యం సేకరణలో ఆటంకం లేదు. ధరలు మాత్రం ఆశించినట్టుగా లేవు. ఈ సీజన్ లో వర్షాలు రావడం వల్ల కొంత పంట తడిసింది. తేమ శాతం చూపించి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. మద్దతు ధర ప్రకటించినా మార్కెట్లో రైతుకి అందుతున్న ధరతో పొంతన లేదు. 75 కిలోల బస్తాను రూ. 980 వరకూ అమ్ముతున్నాం. పెట్టుబడులకు కూడా సరిపోదు. రబీ చేతికొస్తే కనీసం మా కష్టమయినా మిగులుతుందని అనుకుంటున్నాం'' అని ఆయన బీబీసీ కి వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

తడిసిన ధాన్యం పేరుతో ధర తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు

'ఖర్చులు పెరిగిపోయాయి'

"ధాన్యం కొనుగోళ్లు మొదలెట్టారు. కానీ ధర మాత్రం బాగా తగ్గిపోయింది. తుపాను కారణంగా పంటలు తడిసి పోయాయి. తడిసిన ధాన్యం కొనలేమని కొనుగోలు కేంద్రాల్లో వెనక్కి పంపించేస్తున్నారు. మా ధాన్యం కొనడానికి నిబంధనలు అడ్డుగా ఉన్నాయి. తప్పని స్థితిలో ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకే అమ్ముతున్నాం. ఇప్పుడు సన్నాలకు కనీసంగా రూ. 1200 వస్తుందని అనుకుంటే రూ.వెయ్యి లోపే మాకు దక్కుతోంది'' అని యూ కొత్తపల్లి మండలం నాగులాపల్లి గ్రామానికి చెందిన రైతు అబ్బిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి బీబీసీతో అన్నారు.

కోత మిషన్లకు, ట్రాక్టర్లకు అద్దె పెరిగిందని, ఖర్చులు పెరిగి రైతులకు నష్టమే మిగులుతోందని ఆయన అన్నారు.

ప్రభుత్వం తేమ శాతం నిబంధనలతో ధరలు పడిపోతున్నాయని సూర్య ప్రకాశ్ రెడి అన్నారు. తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని ఆయన కోరారు.

ప్రైవేటుదే పెద్ద పాత్ర

ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ రైతులు ఎక్కువగా ప్రైవేటు వ్యాపారుల మీద ఆధారపడాల్సి వస్తోందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ అన్నారు. నిబంధనలు, ధరలు, చెల్లింపుల్లో జాప్యం వంటి కారణాలతో రైతులు ప్రైవేటు వ్యాపారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆయన వివరించారు.

"ఆర్‌బీకే (రైతు భరోసా కేంద్రం)లో ధాన్యాన్ని కొని కనీస మద్దతు ధర కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం ఎ-గ్రేడ్‌ రకం ధాన్యం ఒక క్వింటాలుకి రూ.1960, కామన్‌ రకం ధాన్యం క్వింటాలు రూ.1940 కనీస మద్దతు ధర ప్రకటించింది. కానీ, తేమ శాతం ఎక్కువగా ఉందని క్వింటాలుకి రూ.1600 లోపు మాత్రమే రైతులకు ఇస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్టుగా రైతుల వద్ద నుండి ధాన్యం సేకరించిన నాటి నుండి 21 రోజుల్లో రైతుకు డబ్బు వారి ఖాతాల్లో జమ చేయాలి. అంతకాలం వేచి చూడాలంటే కౌలుదారులు, రైతులు దాళ్వా పెట్టుబడుల పరిస్థితి ఏమిటి? గత ఏడాది మూడు, నాలుగు నెలలైనా చెల్లింపులు జరగలేదు. ఈ కష్టాలు పడడం కన్నా ఎంతో కొంత వెంటనే వస్తుందని ప్రైవేటు వ్యాపారులకే ధాన్యం అమ్ముకోవాల్సిన స్థితి వస్తోంది" అని శ్రీనివాస్ తెలిపారు.

ఫొటో క్యాప్షన్,

బోండాలు రకం వరిని సాగు చేయవద్దని ఏపీ ప్రభుత్వం సూచిస్తోంది

రబీ సాగు సాధ్యమేనా

బియ్యం నిల్వలు పేరుకుపోతున్న తరుణంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)సహా, ప్రభుత్వం ద్వారా ధాన్యం సేకరణ రానురాను తగ్గిపోతోంది. అయితే ఏపీలో మాత్రం గడిచిన రెండేళ్లలో ధాన్యం సేకరణ పెరిగింది.

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో ఏపీలో 39.35 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. సుమారు 80 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా. కనీసంగా 50 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కనీస మద్దతు ధరకు సేకరించాలని ప్రభుత్వం నిర్దేశించింది.

గోదావరి, కృష్ణా, పెన్నా డెల్టాలతో పాటుగా వరి సాగు చేసే ప్రాంతాలకు చెందిన 6,884 ఆర్బీకే లలో ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ధాన్యం సేకరణ, మిల్లింగ్, పంపిణీకి సంబంధించి ఏపీ మార్క్‌ఫెడ్, పౌర సరఫరాల శాఖలకు బాధ్యతలు అప్పగించారు. ఆర్బీకేలలో సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్‌ సామర్థ్యం ప్రకారం కస్టమ్‌ మిల్లింగ్, సీఎంఆర్‌ డెలివరీ కోసం రైస్‌ మిల్లులకు కేటాయిస్తారు. బ్యాంకు గ్యారంటీ సమర్పించిన రైసు మిల్లులు సంబంధిత ప్రొక్యూర్‌మెంట్‌ ఏజెన్సీతో ఎంవోయూ పొందుతాయి. కస్టమ్‌ మిల్లింగ్‌ చేయడం, నిర్ణీత గడువులోగా బట్వాడా చేయడం వంటివి జరగాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది.

అదే సమయంలో రబీలో వరి సాగు నియంత్రణ మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యంగా బోండాల సాగు మానుకోవాలని ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సూచించారు. బోండా రకం వరి కొనుగోలు చేసే అవకాశం లేనందున రైతులు పునరాలోచన చేయాలని ఆయన పిలుపునిచ్చారు

దానికి తోడుగా గోదావరి, కృష్ణా డెల్టాల పరిధిలో సాగు నీటి సమస్యల కారణంగా పూర్తి ఆయకట్టుకి నీరు అందించడం కష్టమని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల సాగునీటి సలహా మండళ్లు మాత్రం పూర్తిగా రబీకి సాగునీరు అందించాలని నిర్ణయించాయి. దాంతో రబీలో సాగునీటి ఎద్దడి ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉన్నట్టు కనిపిస్తోంది.

సాగు నీటి సమస్య కారణంగానైనా ఆరుతడి పంటలు లేదా అపరాల సాగు వైపు రైతులు మొగ్గు చూపితే వరి దిగుబడులు నియంత్రించే అవకాశం ఉంటుందని అధికారుల అంచనా వేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

గిట్టుబాటు ధర రావడం లేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి

చిరు ధాన్యాలు సాగు చేస్తే ప్రోత్సాహకాలు అంటున్న సీఎం

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రైతులకు సూచించారు. వరి సాగుకి బదులుగా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇటీవల వ్యవసాయ శాఖ సమీక్షా సమావేశంలో చిరు ధాన్యాల సాగువైపు మళ్లాలని సూచన చేశారు.

"ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన పెరగాలి. బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగయ్యేలా రైతుల్లో అవగాహన కల్పించాలి. అలాంటి పంటలు పండించిన వారికి ప్రోత్సాహం ఉండాలి. ప్రత్యామ్నాయ పంటల వల్ల రైతులకు మంచి ఆదాయం వచ్చేలా చూడాలి" అని అధికారులను సీఎం ఆదేశించారు.

"వరి పండిస్తే వచ్చే ఆదాయమే ధాన్యాలు పండించినా వచ్చేలా చూడాలి. రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి. మిల్లెట్స్‌ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి. వీటిని అధికంగా సాగు చేస్తున్న ప్రాంతాల్లో ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలి" అని సీఎం సూచించారు.

ఫొటో సోర్స్, @YSRCP

ఫొటో క్యాప్షన్,

చిరు ధాన్యాలకు ప్రాధాన్యమివ్వాలని సీఎం జగన్‌ రైతులుకు సూచించారు

శాశ్వత పరిష్కారం అదేనంటున్న ఎగుమతిదారులు

తెలంగాణాతో పోలిస్తే ఏపీలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో సమస్య లేకపోవడానికి కారణం బాయిల్డ్ రైస్‌ ని తెలంగాణాలో ఎక్కువగా ఉత్పత్తి చేయడమేనని ఇండియన్ రైస్ ఎక్స్ పోర్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ అంటున్నారు. ఏపీలో రా రైస్ (ముడి బియ్యం) ఉత్పత్తి అవుతుండగా, తెలంగాణాలో పారా బాయిల్డ్ ఉత్పత్తి అనూహ్యంగా పెరగడంతో సమస్య ఏర్పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

"కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ధాన్యం కొనుగోళ్లు రాజకీయ వివాదంగా మారితే ప్రయోజనం ఉండదు. సమస్యకి మూలం పారా బాయిల్డ్ రైస్ కాబట్టి దానిని రా రైస్ గా మార్చేందుకు కొంత ప్రయత్నం జరగాలి. ఆ క్రమంలో నూకలు ఎక్కువగా వస్తాయి కాబట్టి మిల్లర్లు నష్టపోకుండా ప్రభుత్వాలు ఆ నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. రెండోది ఎగుమతులు పెంచేందుకు అవకాశం ఉంది. కానీ అంతర్జాతీయ మార్కెట్లో మన బియ్యం ఎగుమతులు జరగాలంటే క్వింటాల్ కి రూ.1600 మించి కొనుగోలు చేయలేం. వియత్నాం, థాయిలాండ్ వంటి దేశాల మార్కెట్లతో పోటీ పడడం వల్ల మన దగ్గర కనీస మద్దతు ధరగా నిర్ణయించిన రూ.1960 చెల్లించలేము. కాబట్టి ఎక్స్‌పోర్ట్స్ పెరగాలంటే అంతర్జాతీయ మార్కెట్ ధరలు పోనూ మిగిలిన మొత్తాన్ని కేంద్రం, రాష్ట్రం, మిల్లర్లు, ఎక్స్‌పోర్టర్లు భరించేలా ఓ అంగీకారానికి రావాలి. దాని వల్ల రైతుకి మేలు జరుగుతుంది. సమస్య శాశ్వతంగా పరిష్కారానికి వీలుంటుంది" అని శ్రీనివాస్ బీబీసీకి తెలిపారు.

ఎగుమతులు మాత్రమే పెంచాలంటే సాధ్యంకాదు కాబట్టి పారా బాయిల్డ్ రైస్‌లో సగం రా రైస్‌ గా మార్చుకునేలా ఏర్పాటు చేసి, మిగిలిన మొత్తం ఎగుమతులకు అనుగుణంగా ధరల విషయంలో అంగీకారానికి సిద్ధమయితే పెరిగిన వరి దిగుబడుల సమస్య నుంచి గట్టెక్కవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో క్యాప్షన్,

పోలవరం ప్రాజెక్టు

ఇప్పుడే ఇలా ఉంటే కొత్త ప్రాజెక్టులు వచ్చిన తర్వాత..

"తెలంగాణాలో కాళేశ్వరం వంటివి అందుబాటులోకి రావడంతో ఒక్కసారిగా వరి దిగుబడులు పెరిగాయి. ఏపీలో పోలవరం, వెలిగొండ సహా వివిధ ప్రాజెక్టులు రాబోయే రెండు మూడేళ్లలో అందుబాటులోకి వస్తాయి. అప్పుడయినా సమస్య రావచ్చు" అని వ్యవసాయ శాస్త్రవేత్త పి.ఆదినారాయణ అభిప్రాయపడ్డారు.

"ధాన్యం మాదిరిగానే ఏ పంట పండించినా ప్రభుత్వం తగిన మార్కెట్ సదుపాయం కల్పిస్తుందనే విశ్వాసం ఉండాలి. అప్పుడే ప్రత్యామ్నాయం పంటల సాగు పెరగడానికి ఆస్కారం ఉంటుంది" అని ఆయన అన్నారు.

మార్కెట్‌లో కనీస మద్ధతు ధర కారణంగానే ఎక్కువమంది వరి సాగు చేస్తున్నారని చెబుతున్న ఆయన ఇతర పంటలకు కూడా అలాంటి ధీమా కల్పిస్తే దేశానికి అవసరమైన నూనెగింజలు, పప్పు దినుసులు అందుతాయని ఆదినారాయణ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)