‘నా కళ్లతో నేను ఒక్క వ్యక్తినే చూశా.. ఆయన కాలిపోతున్నారు’ - బిపిన్ రావత్ హెలీకాప్టర్ ప్రమాదం ప్రత్యక్ష సాక్షి

ఫొటో సోర్స్, MADAN PRASAD/BBC
''నా కళ్లతో నేను ఒక్క వ్యక్తినే చూశాను. అప్పుడు ఆయన కాలిపోతున్నారు. తర్వాత కిందపడిపోయారు. నాకు భయం వేసింది.''
బుధవారం జరిగిన హెలీకాప్టర్ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన కృష్ణస్వామి చెప్పిన వివరాలివి.
భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ఈ ప్రమాదంలోనే మరణించారు.
బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ సహా హెలీకాప్టర్‌లో ప్రయాణిస్తోన్న మరో 11 మంది ఆర్మీ అధికారులు కన్నుమూశారు.
లాన్స్‌నాయక్ సాయితేజ: హెలీకాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తెలుగు సైనికుడు
గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని ఎయిర్‌ఫోర్స్ తెలిపింది.
68 ఏళ్ల కృష్ణస్వామి హెలీకాప్టర్ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూశారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోనే వారు నివసిస్తుంటారు. ప్రమాదం ఎలా జరిగిందో ఆయన వివరించారు.
ఫొటో సోర్స్, Getty Images
కృష్ణస్వామి ఏం చూశారు?
''నా పేరు కృష్ణస్వామి. నేను నాంజప్ప సైథిరామ్‌లో ఉంటాను. ఇంటి అవసరాల కోసం కలప తీసుకురావడం కోసం నేను బయటకు వచ్చాను. నీటి పైపు పగిలిపోవడంతో ఇంట్లో నీళ్లు అయిపోయాయి. చంద్రకుమార్‌తో కలిసి నేను దాన్ని బాగు చేస్తున్నా. అప్పుడే మాకు భారీ శబ్దం వినిపించింది'' అని ఆయన చెప్పారు.
''ఆ పేలుడు ధాటికి కరెంటు స్తంభాలు కూడా కదిలిపోయాయి. చెట్లు పడిపోయాయి. ఏం జరిగిందో అని మేం చూసేసరికి చుట్టూ పొగ ఆవరించింది. చెట్టు పైభాగంలో మంటలు కనిపించాయి. ఆ మంటలు ఎగిసిపడుతున్నాయి. అప్పుడు నేను ఒక వ్యక్తిని చూశాను. ఆయన మంటల్లో కాలిపోతూ కిందపడ్డారు. నేను వణికిపోయాను. వెంటనే వెనక్కి పరిగెత్తుకొని వచ్చి ఫైర్ ఇంజిన్‌తో పాటు పోలీసులను పిలవమని అక్కడున్నవారికి చెప్పాను. కాసేపటి తర్వాత అధికారులు వచ్చారు. ఆ తర్వాత అక్కడి మృతదేహాలను అధికారులు తరలించడం నేను చూడలేదు. అప్పటికే నేను షాక్‌లో ఉండిపోయా. దాంతో ఇంటికి వచ్చి నిద్రపోయాను'' అని ఆయన వివరించారు.
ఫొటో సోర్స్, Getty Images
తుది ప్రయాణం
భారత వైమానిక దళానికి చెందిన ఎంఐ-17వీ5 హెలీకాప్టర్‌లో జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్యతో కలిపి మొత్తం 14 మంది ప్రయాణించారు. తమిళనాడులోని కూనూర్ ప్రాంతంలో ఈ హెలీకాప్టర్ కూలిపోయింది.
సూలురులోని ఆర్మీ స్థావరం నుంచి బయల్దేరిన ఈ హెలీకాప్టర్, వెల్లింగ్టన్ మిలిటరీ బేస్‌కు ప్రయాణిస్తోన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
తొలి సీడీఎస్
భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా జనరల్ బిపిన్ రావత్ 31 డిసెంబర్ 2019న నియమితులయ్యారు. ఆ మరుసటి రోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు.
త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచి సైన్యాన్ని మరింత పటిష్టం చేయడం, భారత ఆర్మీలోని వివిధ భాగాల్లో సైనిక శక్తిని ఆధునీకరించడం సీడీఎస్ బాధ్యత.
జనరల్ బిపిన్ రావత్ గతంలో భారత ఆర్మీ చీఫ్‌గా పనిచేశారు. భారత ఆర్మీ స్టాఫ్‌కు 26వ చీఫ్‌గా నియమితులైన ఆయన 31 డిసెంబర్ 2016 నుంచి 1 జనవరి 2017 వరకు ఆ పదవిలో ఉన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
తండ్రి లెఫ్టినెంట్ జనరల్
ఉత్తరాఖండ్ రాష్ట్రం పౌడీ జిల్లాలోని ఒక సైనిక కుటుంబంలో 1958 మార్చి 16న బిపిన్ రావత్ జన్మించారు. ఆయన తండ్రి సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్ హోదాలో పనిచేశారు.
భారత సైన్యం వెబ్‌సైట్‌లో పేర్కొన్న ప్రకారం రావత్ 1978లో ఆర్మీలో చేరారు.
సిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్స్ స్కూల్‌లో విద్యాభ్యాసం చేశారు. ఆ తర్వాత ఖడక్‌వాసలాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో సైనిక శిక్షణ తీసుకున్నారు.
శిక్షణ అనంతరం, 11 గోర్ఖా రైఫిల్స్ బృందంలోని ఐదో బెటాలియన్‌కు రెండవ లెఫ్టినెంట్‌గా నియమితులయ్యారు. గోర్ఖా బ్రిగేడ్ నుంచి సైన్యంలో అత్యున్నత స్థాయికి చేరుకున్న నాల్గవ అధికారి ఆయన.
నాలుగు దశాబ్ధాలకు పైగా సైన్యానికి సేవలందించిన రావత్ అనేక విశిష్ట పురస్కారాలను అందుకున్నారు. పరమ విశిష్ట సేవా పతకం, ఉత్తమ యుద్ధ సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, యుద్ధ సేవా పతకం, సేనా పతకం, విశిష్ట సేవా పతకం వంటి అనేక పురస్కారాలు ఆయనకు లభించాయి.
ఇవి కూడా చదవండి:
- జనరల్ బిపిన్ రావత్: గూర్ఖా రైఫిల్స్ నుంచి తొలి సీడీఎస్ వరకు..
- బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో తెలుగు వ్యక్తి మృతి
- ఆంధ్రప్రదేశ్‌లో వరి ధాన్యం సేకరణ ఎలా జరుగుతోంది? తెలంగాణకూ ఏపీకీ తేడా ఏంటి?
- బీబీసీ 100 మంది మహిళలు 2021 - మంజులా ప్రదీప్: దళిత మహిళల హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమకారిణి
- 12ఏళ్ల మిస్టరీ వీడినట్లేనా? బిట్ కాయిన్‌ను కనిపెట్టిన సతోషీ నకమోటో ఈయనేనా?
- అనకాపల్లి బెల్లం మార్కెట్లో వ్యాపారం ఎందుకు తగ్గుతోంది?
- గర్భిణి తల నరికి దారుణంగా హత్య చేసిన తల్లి, తమ్ముడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)