తమిళనాడు: ‘48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం, విషమంగానే గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఆరోగ్యం’

గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్

ఫొటో సోర్స్, ANI

తమిళనాడులోని కూనూర్‌లో భారత వాయుసేన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది మరణించగా.. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. మరో 48 గంటలు గడిస్తే ఆయన ఆరోగ్యం గురించి స్పష్టంగా చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు.

వరుణ్ సింగ్ ఉత్తర్ ప్రదేశ్‌లోని దేవరియా జిల్లా రుద్రపూర్ తహసీల్‌లోని ఖోర్మా కన్హోలీ గ్రామానికి చెందిన వారు. ఆయన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారనే విషయం తెలిసినప్పటి నుంచి గ్రామస్థులు, కుటుంబీకులు ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నారు.

వరుణ్ సింగ్ చిన్నాన్న అఖిలేశ్ ప్రతాప్ సింగ్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే. ఆయన వరుణ్ సింగ్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పారు.

''బుధవారం రాత్రి కొన్ని కీలక శస్త్రచికిత్సలు చేశారు. ప్రస్తుతం ఐసీయూలోకి మార్చారు. రానున్న 48 గంటలు కీలకం అని వైద్యులు చెప్పారు'' అని ఆయన వెల్లడించారు.

గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ తండ్రి కృష్ణ ప్రతాప్ సింగ్ భారత ఆర్మీలో కల్నల్‌గా పనిచేసి రిటైరయ్యారు.

వరుణ్ సింగ్ దిల్లీలో జన్మించారని కృష్ణ ప్రతాప్ సింగ్ అన్నయ్య దినేశ్ ప్రతాప్ సింగ్ చెప్పారు.

''తండ్రి ఆర్మీలో పనిచేసినందున వరుణ్ సింగ్ పలు ప్రాంతాల్లో చదువుకున్నారు. ప్రస్తుతం ఆయన తల్లిదండ్రులు భోపాల్‌లో నివసిస్తున్నారు. వరుణ్ సింగ్‌కు వెల్లింగ్టన్‌లో పోస్టింగ్ లభించడంతో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆయన అక్కడే ఉంటున్నారు.''

''గత ఏడాది, ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన కొత్త ఫైటర్ విమానం ఎల్‌సీఏ తేజస్‌లో సాంకేతిక సమస్యల కారణంగా అత్యవసర పరిస్థితి తలెత్తింది. ఆ సమయంలో వరుణ్ సింగ్ ఎంతో ధైర్యసాహసాలతో తేజస్‌ను సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీనికిగానూ ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాన శౌర్య చక్ర పురస్కారాన్ని అందుకున్నారు'' అని దినేశ్ ప్రతాప్ సింగ్ చెప్పారు.

వాయుసేన హెలికాప్టర్ ప్రమాదం గురించి గురువారం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్‌లో ప్రకటన చేశారు. వరుణ్ సింగ్ పరిస్థితి విషమంగానే ఉందని, కానీ ప్రస్తుతానికైతే నిలకడగా ఉన్నారని ఆయన చెప్పారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్‌ను కాపాడేందుకు అన్ని రకాల వైద్య సహాయం అందిస్తున్నామని అన్నారు.

సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌ను తీసుకొచ్చేందుకు గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ సులూర్ వెళ్లారు. తమిళనాడు వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజీ క్యాడెట్లను ఉద్దేశించి జనరల్ బిపిన్ రావత్ ప్రసంగించాల్సి ఉంది. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో వెల్లింగ్టన్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

''దురదృష్టవశాత్తు జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ గారి ధైర్యానికి, చైతన్యానికి వందనాలు. ఆయన త్వరగా కోలుకోవాలని నేను శ్రీరాముడిని ప్రార్థిస్తున్నాను'' అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)