పీరియడ్ ట్రాకర్: ‘సెమినార్‌కు అరగంట ముందు పీరియడ్స్ ప్రారంభమయ్యాయి.. యూనిఫాంపై రక్తం మరకలు కనిపిస్తుంటే ఏం చేయాలో అర్థం కాలేదు’
- పద్మ మీనాక్షి
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
"నేను ఆ రోజు కాలేజీలో జరిగే సెమినార్ ఏర్పాట్లతో హడావిడిగా ఉన్నాను. సెమినార్‌లో నేను మోడరేటర్‌గా ఉండాల్సి ఉంది. సరిగ్గా, సెమినార్ ప్రారంభం కావడానికి మరో అరగంట సమయం ఉందనగా నాకు పీరియడ్స్ వచ్చేశాయి" అని 20 ఏళ్ల కామ్నా చెప్పారు.
"నా టాప్‌పై రక్తపు మరకలు. ఏం చేయాలో అర్థం కాలేదు. లైట్ కలర్ బ్లూ యూనిఫామ్ రక్తం మరకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి".
"చాలా ఇబ్బందిగా అనిపించింది. నేను తరచుగా బ్యాగులు మారుస్తూ ఉంటాను. దాంతో, శానిటరీ ప్యాడ్స్ కూడా బ్యాగులో లేవు. సెమినార్‌లో ఎవరిని ప్యాడ్స్ కోసం అడగాలో అర్థం కాలేదు".
"కాలేజీ నుంచి మందుల దుకాణానికి వెళ్లి ప్యాడ్స్ తెచ్చుకునేంత టైం లేదు. సెమినార్ హాల్ నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు. అతిథులను స్టేజీ పైకి ఆహ్వానించాలి. అప్పటికప్పుడు ఆ బాధ్యతలను వేరేవాళ్లకు అప్పగించలేను".
"ఒక్క క్షణం ఏడుపు వచ్చేసింది. నాకు పీరియడ్స్ వచ్చే సమయం అని తెలుసు. కానీ, పనుల ఒత్తిడిలో పడిపోయి ప్యాడ్స్ నాతో తెచ్చుకోవడం మర్చిపోయాను".
"సెమినార్ హాల్ కార్పెట్‌పై రక్తపు మరకలు పడతాయేయేమోననే టెన్షన్. టీచర్లు ఏమంటారో, తోటి విద్యార్థులు నన్ను ఎగతాళి చేస్తారేమోననే భయాలు చుట్టుముట్టి చాలా ఆందోళన పడిపోయాను".
"నాకు కలిగిన ఇబ్బంది మాటల్లో చెప్పలేను. ఆ క్షణంలో నాకది జీవన్మరణ సమస్యలా అనిపించింది . నాకు తెలిసిన వారి దగ్గర కూడా శానిటరీ ప్యాడ్స్ దొరకలేదు. చివరకు చేసేది లేక, ఒక స్నేహితుడిని పిలిచి శానిటరీ ప్యాడ్స్ కొని తెమ్మని పంపించాను".
"ఆ రెండు మూడు గంటలూ నా టాప్‌ను దుపట్టాతో కప్పిపెట్టుకుంటూ ఎలాగో ఒకలా మేనేజ్ చేశాను".
ఫొటో సోర్స్, KAMNA
కామ్నా
"నేను కాలేజీకి, ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా తిరిగేందుకు వెళుతూ ఉంటాను. రోడ్డుపై ఉన్నప్పుడు ఇలా జరిగితే నా పరిస్థితి ఏంటి? అనే ఆలోచన వచ్చింది".
"చాలా చోట్ల పబ్లిక్ టాయిలెట్లు కూడా ఉండవు. కొన్ని సార్లు అవి వాడేందుకు సౌలభ్యంగా, పరిశుభ్రంగా ఉండవు. ఈ సమస్యను నా లాంటి చాలా మంది అమ్మాయిలు ఎదుర్కొంటారు. దీనికి పరిష్కారమేమిటా అని ఆలోచించాను".
"ఇంటికి వచ్చిన తర్వాత నేను చేసిన మొదటి పని - "హౌ టూ ట్రాక్ యువర్ పీరియడ్" అని గూగుల్‌లో సెర్చ్ చేశాను.
"మన పీరియడ్ ట్రాక్ చేసుకునేందుకు ఒక యాప్ ఉంటుందని, గూగుల్ సెర్చ్‌లో తెలిసింది. వెంటనే డౌన్‌లోడ్ చేసి వాడటం మొదలుపెట్టాను".
"ఇవి ఇంట్లో క్యాలెండర్‌లో కూడా నోట్ చేసుకోవచ్చు. లేదా డైరీలో రాసి పెట్టుకోవచ్చు. కానీ, డిజిటల్ యుగంలో నా లాంటి అమ్మాయిలెవరైనా పొద్దున్న లేవగానే మొబైల్ ఫోన్ చూస్తాం. ఫోన్ మా జీవితంలో భాగం. అదెప్పుడూ మా చేతిలోనే ఉంటుంది. దాంతో, పీరియడ్స్ తేదీ అలర్ట్స్‌ను మిస్ అయ్యే అవకాశం ఉండదు" అని కామ్నా అన్నారు.
వీటిలో కూడా చాలా రకాలున్నాయి.
ఫొటో సోర్స్, PERIODPAL
పీరియడ్ ట్రాకర్
ఫ్లో ఓవులేషన్ పీరియడ్ ట్రాకర్, పీరియడ్ పాల్ లాంటి రకరకాల ట్రాకర్లు ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఇవి చాలా వరకూ ఉచితంగా లభిస్తాయి. దీని ద్వారా గైనకాలజిస్టులు, న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకోవాలంటే మాత్రం ఆ సేవలకు తగినంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
పీరియడ్స్ సమయంలో అమ్మాయిలకు అవసరమయ్యే ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకునే అవకాశం కూడా ఉంది.
ఇటీవల సినీ నటి ‘తాప్సీ పన్ను’ పీరియడ్ ట్రాకర్‌ల ప్రాముఖ్యాన్ని, అవసరాన్ని వివరిస్తూ 'లెట్స్ నార్మలైజ్ పీరియడ్స్' అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని వీడియోలను విడుదల చేశారు. పీరియడ్స్‌ను ఉండటాన్ని సాధారణంగా చూడాలని ఆమె ఈ వీడియోలలో అన్నారు.
"స్నేహ బంధాలు రక్త సంబంధాల కంటే బలమైనవని అంటారు. మరి రక్తసంబంధంతోనే బంధం ఏర్పడితే ఆ స్నేహం ఎలా ఉంటుంది?" అని ప్రశ్నిస్తూ తాప్సీ పన్ను పీరియడ్ ట్రాకర్ అవసరాన్ని ప్రచారం చేశారు.
ఫొటో సోర్స్, iStock
పీరియడ్ ట్రాకర్ అంటే ఏంటి?
మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న పీరియడ్ ట్రాకర్ అమ్మాయిలకు పీరియడ్ తేదీలు, సమయాన్ని అలర్ట్ చేస్తుంది. ఇది ముఖ్యంగా స్కూలుకు, కాలేజీలకు, ఆఫీసులకు, పనుల మీద బయటకు వెళ్లేవారికి ఉపయోగకరంగా ఉంటుంది.
ఇందుకోసం ముందుగా ఫోన్‌లో పీరియడ్ ట్రాకర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. నెలసరి వచ్చిన తేదీని అందులో ఫీడ్ చేయాలి. ఇక ఆ తర్వాత, ఆ ట్రాకర్ నెలసరి సమయాన్ని మానిటర్ చేసి రుతుస్రావం రావడానికి నాలుగు రోజుల ముందు నుంచే మీకు పీరియడ్ వచ్చే అవకాశం ఉందని చెబుతూ అలర్ట్స్ పంపిస్తుంది.
దీంతో పాటు, పీరియడ్స్ సమయంలో తీసుకోవలసిన పోషకాహారం, నీటి మోతాదు గురించి కూడా చెబుతూ ఉంటుంది.
కొన్ని ట్రాకర్‌లలో వైద్యులు, న్యూట్రిషనిస్ట్‌లకు సంబంధించిన సమాచారం కూడా ఉంటుంది.
నెలసరి ముగిసిన తర్వాత శరీరంలో అండం విడుదలయ్యే తేదీలు, సమయాన్ని కూడా అలెర్ట్ చేస్తుంది. దీంతో, ఇది ప్రెగ్నన్సీ ప్రణాళిక చేసుకునేందుకు కూడా పనికొస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.
అయితే, నెలసరి సక్రమంగా వచ్చే వారికి ఈ పీరియడ్ ట్రాకర్ ఉపయోగపడుతుంది.
పీసీఓడీ, థైరాయిడ్, పెరీమెనోపాజ్, ప్రీ-మెనోపాజ్ లాంటి సమస్యలతో బాధపడేవారికి ఒక నిర్ణీత రుతుక్రమం ఉండదు. అలాంటి వారికి ఇది ఉపయోగపడుతుందా?
ఫొటో సోర్స్, Getty Images
'నెలసరిలో ఉన్న ఏ మహిళతో కొద్ది సేపు గడిపినా నాకు పీరియడ్ మొదలవుతుంది'
పీరియడ్స్‌పై వివక్ష
49 సంవత్సరాల లలిత ప్రీ మెనోపాజ్ సమస్యతో సతమతమవుతున్నారు. ప్రతి 15 రోజులకు ఆమెకు పీరియడ్స్ వస్తున్నాయి. వాటి పై నియంత్రణ ఉండటం లేదు. కనీసం పీరియడ్స్ వచ్చే ముందు సాధారణంగా ఉండే కాళ్ళ నొప్పులు, నడుం నొప్పి లాంటి సూచనలు కూడా ఉండటం లేదు.
దీంతో, పనుల నిమిత్తం బయటకు వెళ్ళినప్పుడు ఆమెకు చాలా సమస్యగా ఉంటోంది.
ఇటీవల ఆమెకు ఎదురైన ఒక అనుభవాన్ని బీబీసీతో పంచుకున్నారు.
"బంధువుల ఇంట్లో ఒక ఫంక్షన్‌కు పిలిస్తే వెళ్ళినప్పుడు, అకస్మాత్తుగా పీరియడ్స్ మొదలయిపోయాయి. ఎలా చెప్పాలో అర్ధం కాలేదు. ఆ ఇంటి వాళ్లకు చాదస్తం. పూజ చేసుకుంటుంటే,శానిటరీ ప్యాడ్ అడుగుతున్నానని, నా పీరియడ్స్ ను అశుభ సూచకంగా చూస్తారేమోనని భయం వేసింది" అని చెప్పారు.
"అందరూ ఉండగానే, అర్జెంట్ పని పడిందని చెప్పి, వెంటనే ఇంటికి వచ్చేసాను. కానీ, ఈ లోపు క్యాబ్‌లో ఎక్కడ బ్లీడింగ్ అయి కారు సీటు కవర్లు పాడవుతాయోననే సందేహం. అదొక ఇబ్బందికరమైన పరిస్థితి" అని చెప్పారు.
"మరో వైపు అలా అకస్మాత్తుగా ఎందుకు వెళ్లిపోయావంటూ ఫోన్లు వస్తుంటే ఏమి చెప్పాలో అర్ధం కాలేదు" అని అన్నారు.
దేశంలో చాలా ప్రాంతాల్లో పీరియడ్స్ సమయంలో వివక్షను చూపించే అలవాటు కొనసాగుతోంది. నగరాల్లో నివసిస్తున్న అమ్మాయిలు ఇటువంటి ఆచారాలను సవాలు చేస్తున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాలు,పట్టణాల్లో మాత్రం పీరియడ్స్ లో ఉన్న మహిళలను అపవిత్రంగా భావిస్తూ ఉంటారు. నెలసరిలో ఉన్న అమ్మాయిలను సామాజిక,ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొననివ్వరు. ఆలయాల్లోకి, వంట గదుల్లోకి అనుమతించరు.
కొన్ని గ్రామీణ తెగల్లో ప్రసవం అయిన తరువాత బాలింతలను, నెలసరి సమయంలో మహిళలను అపవిత్రంగా భావిస్తూ ఊరవతల ఉంచుతారు. అనంతపురం జిల్లా రొల్ల మండలం గంతగొల్లహట్టి గ్రామంలో నెలసరి సమయంలో మహిళలు ఇంటి బయటే ఉండాలి. అదే బాలింతలైతే దాదాపు 3 నెలలు ఊరి బయట పొలిమేరలో ఉండాలి. దీనికి సంబంధించిన వార్తా కథనాన్ని బీబీసీ తెలుగు ప్రచురించింది.
ఫొటో సోర్స్, GETTY IMAGES
పీరియడ్స్
పీసీఓడీ, మెనోపాజ్‌లో ఉన్న మహిళలకు పీరియడ్ ట్రాకర్లు ఉపయోగపడతాయా?
పీసీఓడీ , ప్రీ, పెరీమెనోపాజ్ సమస్యలతో బాధపడేవారికి పీరియడ్ ట్రాకర్లు ఉపయోగపడవని బీబీనగర్ ప్రభుత్వ ఆసుపత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ దాక్షాయణి పూరిణి చెప్పారు.
"హార్మోన్ల అసమతుల్యత శరీరంలో అంతర్గతంగా జరిగే రసాయనిక చర్య. పీసీఓడీ , హైపో థైరాయిడ్ లాంటి సమస్యలున్న వారికి రుతుక్రమం క్రమ పద్ధతిలో ఉండదు. అటువంటి వారు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిందే తప్ప ట్రాకర్లు పని చేయవు" అని చెప్పారు.
వీటి అవసరాన్ని కొట్టి పారేయడానికి లేదని అంటూ నెలసరి 28-32 రోజుల సైకిల్‌లో నిర్ణీత క్రమంలో వచ్చే వారికి బాగా పనికొస్తాయని చెప్పారు.
"ఆధునిక జీవన శైలి, ఆహార విషయాల్లో చేకూరిన మార్పుల వల్ల ఇటీవల కాలంలో 10-11 సంవత్సరాలకే అమ్మాయిలు రజస్వల అయిపోతున్నారు. వారికి రుతుక్రమం గురించి ఎక్కువగా అవగాహన ఉండదు".
"ఈ వయసులో పిల్లలు స్కూలుకు, కాలేజీలకు వెళుతూ ఉంటారు కాబట్టి అటువంటి వారికి పీరియడ్ ట్రాకర్‌లు బాగా పని చేస్తాయి. వారు స్కూలుకు లేదా కాలేజీకి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా పీరియడ్స్ వస్తే ఇబ్బంది పడకుండా వారికి ఉపయోగపడుతుంది. ఇది వర్కింగ్ విమెన్‌కు కూడా పనికొస్తుంది" అని అన్నారు.
భారతదేశంలో 71% మంది యుక్తవయసు అమ్మాయిలకు తమకు స్వయంగా రుతుక్రమం వచ్చేవరకు నెలసరి గురించి అవగాహన ఉండదని ఒక అధ్యయనం పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.3 కోట్ల మంది అమ్మాయిలు రుతుక్రమం మొదలైన తర్వాత స్కూలుకు వెళ్లడం మానేస్తారని దస్ర అనే స్వచ్చంద సంస్థ 2014లో నిర్వహించిన సర్వేలో తేలింది.
స్కూలులో టాయిలెట్ సౌకర్యం లేకపోవడం, శానిటరీ ఉత్పత్తుల కొరత కూడా ఇందుకు కారణమని అధ్యయనం పేర్కొంది.
మెన్స్ట్రువల్ హెల్త్ పట్ల దృష్టి కేంద్రీకరించాలని, పీరియడ్ ట్రాకర్ ఒక స్నేహితురాలిలా వెన్నంటి ఉంటే పీరియడ్స్ సమయాన్ని సునాయాసంగా దాటేయవచ్చని తాపసీ అంటారు. పీరియడ్స్‌ను ఒక రుగ్మతలా చూడటం మానేయాలని ఆమె అంటారు.
గుజరాత్‌లో ఒక హాస్టల్‌లో అమ్మాయిలు నెలసరిలో ఉన్నారో లేరోనని తెలుసుకునేందుకు వారి లోదుస్తులు తీయించి చెక్ చేసిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.
ఇవి కూడా చదవండి:
- సెక్సువల్ ఫ్లూయిడిటీ: ఇందులో పురుషుల కంటే మహిళలే ముందున్నారు, ఎందుకు?
- పీఎంఎస్: కొందరిలో పీరియడ్లకు ముందు ఆత్మహత్యా ఆలోచనలు ఎందుకొస్తాయి?
- #UnseenLives: పీరియడ్స్ సమయంలో గుడికి వెళ్తే తేనెటీగలు కుడతాయా?చైనా నిర్మిస్తున్న ఈ గ్రామాల గురించి భారత్ ఎందుకు ఇబ్బంది పడుతోంది?
- ‘నువ్వొక పెయిడ్ ఆర్టిస్ట్‌వి.. ఆ పార్టీ ప్రముఖులతో నీకు సంబంధాలున్నాయి అంటూ వేధించారు’
- హెర్పెస్: ప్రసవం అయిన వెంటనే ఇద్దరు బాలింతల ప్రాణాలు తీసిన ఇన్ఫెక్షన్
- 'ప్యాడ్ మ్యాన్’ తెలుసు.. మరి ‘ప్యాడ్ వుమన్’ తెలుసా?
- అమ్మాయిలు నలుగురిలో చెప్పుకోలేని ఆ విషయాలు!
- పూజకు ముందు.. పీరియడ్లను వాయిదా వేసే పిల్ తీసుకుంటున్నారా?
- ఈ ఇంజెక్షన్ తీసుకుంటే 3 నెలలు గర్భం రాదు
- మోదీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలపై ఎందుకు యూ-టర్న్ తీసుకుందంటే...
- సోషల్ మీడియాలో సిక్కుల పేర్లతో సిక్కులపైనే దుష్ప్రచారం... నకిలీ నెట్వర్క్ గుట్టు రట్టు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)