‘సంతోషంగా ఉండు’.. భార్యతో సాయితేజ చివరి మాట ఇవే

‘సంతోషంగా ఉండు’.. భార్యతో సాయితేజ చివరి మాట ఇవే

భారత వైమానిక దళ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన లాన్స్‌ నాయక్‌ సాయితేజ కుటుంబం విషాదంలో ఉంది. చిన్న వయసులోనే సాయితేజ దూరం కావడాన్ని భార్య, తల్లితండ్రులు, సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. బంధుమిత్రులే కాకుండా చుట్టపక్కల వారు పెద్ద ఎత్తున సాయితేజ కుటుంబాన్ని పరామర్శించడానికి చిత్తూరు జిల్లా కురబల కోట మండలం ఎగువ రేగడ గ్రామంలోని ఆయన ఇంటికి వస్తున్నారు.

‘‘ఎప్పుడూ ధైర్యంగా ఉండు అని చెప్పేవాడు. మొన్న మాత్రం హ్యాపీగా ఉండు అని మెసేజ్ పెట్టాడు. ఫోన్ చేసి మాట్లాడాడు. ఒకసారి పాపను వీడియో కాల్‌లో చూపించు అన్నాడు. చూపించా’’ అని సాయితేజ భార్య శ్యామల బీబీసీతో చెప్పారు.

అన్నీ అనుకూలిస్తే బెంగళూరు బదిలీ చేయించుకుని భార్యను అక్కడికే తీసుకెళ్లాలనుకున్నారు సాయితేజ. నిత్యం ఫోన్లో టచ్‌లో ఉండే భర్తను చివరిసారిగా సెప్టెంబరు 11న కలిశారు భార్య శ్యామల. ఎప్పుడూ లేనిది చనిపోయే రోజు తనకు... హ్యాపీగా ఉండు.. అని మెసేజ్ పంపినట్లు చెప్పారు శ్యామల.

సైన్యంలో కింది స్థాయిలో విధుల్లో చేరిన సాయితేజ, కఠినమైన శిక్షణ తీసుకుని ఒక్కో మెట్టూ ఎక్కుతూ డ్రైవింగ్ నుంచి పారా విభాగం వరకూ వచ్చారు. ఆ శిక్షణ వల్ల తీవ్రమైన బ్యాక్ పెయిన్‌తో బాధపడిన సాయితేజ... ఒక దశలో సైన్యాన్ని వదిలేయాలనుకున్నారు. కానీ మొండి పట్టుదలతో విధుల్లో కొనసాగినట్టు ఆయన కుటుంబ సభ్యులు బీబీసీతో చెప్పారు. సాయి తేజ తన సోదరుడు సహా చాలా మందిని సైన్యంవైపు ప్రోత్సహించారు. సైన్యంలోనే పనిచేసే తన స్నేహితుడు కార్తీక్ రెడ్డి మరణించినప్పుడు ఆయన కుమిలిపోయారని వారు వివరించారు. సరిహద్దుల్లో కంటే దిల్లీలో ఉంటే తమ వాడు భద్రంగా ఉంటాడనుకున్న సన్నిహితుల ఆశ నిరాశే అయింది. ఎంతో స్నేహంగా ఉండే సాయి మరణం సన్నిహితులను కలిచివేసింది.

తెలిసిన వారు.. తెలియని వారు ఎందరో సాయి కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నారు. ఆ ఊరి వారు సాయితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

సాయితేజ పిల్లలకు ఉచిత విద్య ఇవ్వడానికి ముందుకు వచ్చారు మంచు విష్ణు.

మృతదేహం గుర్తించడానికి వీలు లేకపోవడంతో డీఎన్ఏ పరీక్షలు చేయనున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)