‘‘దేశం కోసం ఏదైనా చేయాలనే తపన బిపిన్‌ను ఈ స్థాయికి తీసుకెళ్లింది’’

  • సురేఖ అబ్బూరి
  • బీబీసీ ప్రతినిధి
కల్నల్ పీవీ దుర్గాప్రసాద్
ఫొటో క్యాప్షన్,

కల్నల్ పీవీ దుర్గాప్రసాద్

బిపిన్ రావత్ రెండు సార్లు మృత్యువు నుంచి తప్పించుకున్నారు. ఒకసారి ఆయన ధైర్యాన్ని చూసి మేమే ఆశ్చర్య పోయాం. ప్రమాదం తరువాత ఆయన చిరునవ్వుతో .. నాకు ఇంకా టైం రాలేదు లే, అప్పుడే వెళ్లిపోను అన్నారు’’ అంటూ సికింద్రాబాద్‌లో నివసిస్తున్న రిటైర్డ్ కల్నల్ పీవీ దుర్గాప్రసాద్ బీబీసీతో చెప్పారు.

దుర్గాప్రసాద్, బిపిన్ రావత్‌లు చాలాకాలంగా మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి పనిచేశారు.

తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో తన మిత్రుడు బిపిన్ చనిపోవడంపై ఆవేదన చెందిన దుర్గాప్రసాద్ ఆయనతో తనకున్న అనుబంధాన్ని ‘బీబీసీ’తో పంచుకున్నారు.

‘‘దేశం కోసం ఏదైనా చేయాలనే తపన, ధైర్యం బిపిన్‌ను ఈ స్థాయికి తీసుకెళ్లింది’’ అని చెప్పిన దుర్గాప్రసాద్ ఆర్మీ పట్ల బిపిన్‌ రావత్‌కు ఉన్న అంకితభావం, స్నేహితుల పట్ల ఆప్యాయతనూ వివరించారు.

మిత్రుడు బిపిన్ రావత్ గురించి దుర్గాప్రసాద్ ఏం చెప్పారో ఆయన మాటల్లోనే..

ఫొటో సోర్స్, DurgaPrasad

ఫొటో క్యాప్షన్,

బిపిన్ రావత్, దుర్గాప్రసాద్

‘‘మా స్నేహం ఇప్పటిది కాదు. 1978లో మొదలైంది. అప్పుడు నేను అమృత్‌సర్‌లో పనిచేస్తూ ఉండేవాడిని. అప్పుడు బిపిన్ రావత్‌ను కమిషన్ చేశారు. ఆయన ఆర్డర్ అఫ్ మెరిట్‌లో ఉండేవారు. తనకు స్వార్డ్ ఆఫ్ ఆనర్ కూడా ఉండేది.

అమృత్‌సర్‌లో పనిచేస్తున్న కాలంలోనే ఇద్దరం మిత్రులయ్యాం. మేమే కాదు మా కుటుంబాలూ కలిసిపోయాయి. చాలామంది కల్నల్ స్థాయికి చేరి రిటైర్ అయిపోతారు. కానీ కొందరు మాత్రం ఇంకా పైస్థాయి వరుకు చేరుకుంటారు. అలాంటి వారిలో బిపిన్ కూడా ఒకరు.

బ్రిగేడియర్, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్, చీఫ్ ఆఫ్ ఆర్మీ... ఆ తరువాత దేశానికి మొట్టమొదటి సీడీఎస్ అయ్యారు’’ అంటూ తమ ఇద్దరి మైత్రి, బిపిన్ రావత్ ఎదుగుదల గురించి చెప్పారు దుర్గా ప్రసాద్.

ఫొటో సోర్స్, DurgaPrasad

‘మృత్యువు నుంచి రెండు సార్లు తప్పించుకున్నారు’

‘1984లో అనుకుంటాను. నేను ‘ఉరి’లో ఫ్రంట్‌లైన్‌లో సీవోగా ఉండేవాడిని. బిపిన్ నాకంటే 15 - 20 కిలోమీటర్ల దిగువన బేస్‌లో ఉండేవారు. ఆ రోజు ఏవో కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చారు. ఇద్దరం కలిసి భోజనం చేసిన తరువాత వేరే కమాండ్ నుంచి వచ్చిన ఆఫీసర్‌ని కలవాల్సి ఉన్నందున నేను అక్కడి నుంచి వెళ్లిపోయాను. ఆ రాత్రి అక్కడే ఉండిపోవాలని బిపిన్‌ను కోరినా ఆయన కూడా పని ఉందంటూ వెళ్లిపోయారు. మేం అక్కడి నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఐఈడీ(ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్) పేలింది. బిపిన్ కానీ అక్కడ ఉండి ఉంటే చనిపోయేవారు. అప్పుడే అనుకున్నాం.. ఆయన చేయాల్సింది ఇంకా చాలా ఉందని’’

‘‘ఇంకోసారి కూడా మృత్యవు నుంచి ఆయన తప్పించుకున్నారు. నాగాలాండ్‌లోని ‘జీవోసీ 3 కోర్’లో బిపిన్ ఎక్కిన హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. బిపిన్ గాయపడ్డారు. కానీ, గాయాలను లెక చేయకుండా అక్కడి నుంచే మరో హెలికాప్టర్ రప్పించి అందులో తాను వెళ్లాల్సిన చోటికి వెళ్లారు.

బిపిన్ ఏమాత్రం భయపడకపోవడం చూసి అందరం ఆశ్చర్యపోయాం. ఆయన మాత్రం నవ్వుతూ... ‘మేరా అభీ నహీ ఆయా , ఇత్నీ జల్దీ నహి జావూంగా ( నా టైం ఇంకా రాలేదు లే , అప్పుడే వెళ్లిపోను ..." ) అని అన్నారు. నాకు ఆ మాటలు ఇంకా గుర్తున్నాయి’’ అన్నారు దుర్గాప్రసాద్.

ఫొటో సోర్స్, DurgaPrasad

ఫొటో క్యాప్షన్,

దుర్గాప్రసాద్, బిపిన్ రావత్

‘బిపిన్, మధు ఇద్దరూ అందరితో చాలా ఆప్యాయంగా ఉండేవారు’

‘‘బిపిన్ ఎంత పనిలో ఉన్నా తనని కలవడానికి ఎవరైనా పాత స్నేహితులు కానీ, తనతో పని చేసినవారు కానీ వచ్చారంటే తప్పకుండా సమయం కేటాయించేవారు.

ప్రత్యేకంగా గెరిల్లా రైఫిల్స్ యూనిట్ ఆఫీసర్స్ ఎవరైనా వచ్చారంటే ఆయన చూపే ఆప్యాయత వేరేలా ఉండేది.

ఉన్నత స్థాయికి ఎదిగినవారిలో కొందరు గతంలో తమతో పనిచేసినవారిని మర్చిపోవడం వంటిది జరుగుతుంటుంది. కానీ, బిపిన్ అలాంటివారు కాదు.

బిపిన్, మధు ఎప్పుడూ అంతే ఆప్యాయతతో కనబర్చేవారు. డిసెంబర్ 4న కూడా ఒకప్పుడు తనతో పనిచేసిన అధికారి ఒకరు అమెరికా నుంచి రాగా బిపిన్ ఆయనతో చాలా సమయం గడిపారు’’

ఫొటో క్యాప్షన్,

దుర్గాప్రసాద్

‘నాకంటే బాగా నన్ను అర్థం చేసుకునేవారు’

‘బిపిన్ తండ్రి కూడా గోర్ఖా రైఫిల్స్‌ 511లో కమాండింగ్ ఆఫీసర్‌గా పనిచేశారు. బిపిన్ కూడా 511 గోర్ఖా రైఫిల్స్‌లోనే తన తండ్రి లాగానే కమాండింగ్ ఆఫీసర్‌గా పని చేయడం ప్రత్యేకం. గాడ్వాల్ ప్రాంతానికి చెందిన వారికీ ఆర్మీ అంటే చాలా మక్కువ ఉంటుంది.

నేను ఒకానొక సమయంలో ఆర్మీ నుంచి రిటైర్మెంట్ తీసుకొని మా నాన్న పనిచేస్తున్న లీగల్ ప్రొఫెషన్ ఎంచుకోవాలనుకున్నాను.

అప్పుడు బిపిన్... ‘నీ మనస్తత్వం నాకు తెలుసు నువ్వు ఆర్మీ లో ఉండడమే కరెక్ట్ , ఇక్కడే ఉండిపో’ అన్నారు. ఆయన చెప్పిన తరువాత ఆలోచన మార్చుకుని ఆర్మీలోనే కొనసాగాను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నానని నాకు ఎప్పుడూ అనిపిస్తుంది’’

‘బిపిన్ చనిపోవడం చాలా దురదృష్టకరం. చివరగా ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు నాతో మాట్లాడుతూ... రిటైర్ అయ్యాక డెహ్రాడూన్‌లో కానీ పౌడి గాడ్వాల్‌లో కానీ స్థిరపడతానని చెప్పారు. కానీ ఉత్తరాఖండ్‌లోని రాణిఖేత్‌లో ఉంటే ఆర్మీ క్యాంప్‌కి దగ్గరుగా ఉంటావు కదా అని నేను అన్నాను’’ అంటూ దుర్గాప్రసాద్ గుర్తు చేసుకున్నారు.

‘‘బిపిన్ అమెరికా రాయబారిగా వెళ్తారని మా స్నేహితులందరం ఎప్పుడూ అనుకునేవాళ్లం. ప్రపంచంలోని వివిధ దేశాల ఆర్మీలు ఎలా పని చేస్తాయనేది బిపిన్‌కి బాగా అవగాహన ఉండేది.

బిపిన్ భారత ఆర్మీలో చాల మార్పులు తీసుకొనివచ్చారు. థియేటర్ కమాండ్‌లో ఆయన తీసుకురావాలన్న మార్పులు చాల మంచివి. దేశ ఆయుధ శక్తిని పెంచడంలో బిపిన్ పాత్ర ఎంతో ఉంది. దేశం కోసం తాను చేయాలనుకున్న పనులు ఇంకా చాలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వాటిని పూర్తి చేస్తే బాగుంటుంది. బిపిన్ మరణంతో నాకు వ్యక్తిగతంగా జరిగిన నష్టం కంటే దేశానికి జరిగిన నష్టం ఇంకా ఎక్కువ’’ అన్నారు దుర్గాప్రసాద్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)