బిపిన్ రావత్: హెలికాప్టర్ ప్రమాదంపై చైనా అధికార మీడియాలో వెటకారం.. మండిపడుతున్న భారతీయ రక్షణ నిపుణులు

ఫొటో సోర్స్, Getty Images
చైనా విషయంలో దూకుడుగా వ్యవహరించేవారని జనరల్ రావత్ కు పేరుంది.
చైనా విషయంలో దూకుడుగా వ్యవహరించారని జనరల్ బిపిన్ రావత్‌కు పేరుంది. భారత్ అసలైన శత్రువు పాకిస్తాన్ కాదు, చైనా అని ఆయన ఇటీవల వ్యాఖ్యానించారు. వాస్తవాధీన రేఖ వద్ద రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల విషయంలో భారత ప్రభుత్వం చైనా పేరును నేరుగా ఉపయోగించడానికి వెనకాడిన సందర్భంలో కూడా రావత్ చైనాను నేరుగా ప్రస్తావిస్తూ ప్రకటనలు చేశారు.
బహుశా అందుకోసమే కావచ్చు, బుధవారం హెలికాప్టర్ ప్రమాదం, జనరల్ రావత్ మరణాలపై చైనా అధికార మీడియా వెటకారాలు, వెక్కిరింతలకు దిగింది.
జనరల్ రావత్ మరణంపై గ్లోబల్ టైమ్స్ పత్రిక చేసిన వ్యాఖ్యలపై భారతదేశంలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ మౌత్ పీస్‌గా పేరుపడిన గ్లోబల్ టైమ్స్ పత్రిక తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంపై ఒక కథనం ప్రచురించింది. ఆ కథనంలో పలువురు చైనా నిపుణులు భారతదేశపు సైనిక సామర్ధ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేశారు.
''హెలికాప్టర్ ప్రమాదంలో భారతదేశపు ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్’ మరణించడం భారతదేశ సైనిక క్రమశిక్షణ, యుద్ధ సంసిద్ధతనే కాకుండా.. భారత సైన్యం సామర్థ్యాన్నీ బయటపెట్టింది. ఆ దేశ సైనిక విభాగాల ఆధునికీకరణపై వాస్తవాలకు ఇది నిదర్శనం'' అంటూ పలువురు చేసిన వ్యాఖ్యలను గ్లోబల్ టైమ్స్ పత్రిక ప్రచురించింది.
భారత సైన్యం ఆధునికీకరణ ప్రయత్నాలకు ఇది పెద్ద దెబ్బ అని ఆ కథనం పేర్కొంది.
ఫొటో సోర్స్, Getty Images
జనరల్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం జరిగిన ప్రాంతం
‘ఇండియా మారదు’
భారత అత్యున్నత సైనికాధికారి మరణించిన తర్వత కూడా చైనా విషయంలో భారతదేశపు దూకుడు వైఖరి మారదని పేరు చెప్పడానికి ఇష్టపడని విశ్లేషకులు వ్యాఖ్యానించినట్లు గ్లోబల్ టైమ్స్ రాసింది.
‘‘హెలికాప్టర్ కూలిపోవడానికి ప్రతికూల వాతావరణం, ఎంత ఎత్తులో ఎగరాలనే విషయంలో తప్పుడు నిర్ణయాలే కారణమని భారత మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే రష్యాలో తయారైన హెలికాప్టర్‌లో లోపం లేదని, ఇది కచ్చితంగా మానవ తప్పిదమేనని తెలుస్తోంది’’ అని రాసుకొచ్చింది.
రష్యా తయారీ Mi-17 సిరీస్ హెలికాప్టర్లను ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉపయోగిస్తున్నారని కూడా పేర్కొంది. ఈ కథనం గ్లోబల్ టైమ్స్ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి కూడా షేర్ చేశారు. అయితే, ఈ ట్వీట్‌పై భారతదేశంలోని పలువురు ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
గ్లోబల్ టైమ్స్‌లోని ఈ కథనానికి ప్రతిస్పందనగా భారత మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వేద్ మాలిక్ ట్వీట్ చేస్తూ, " ఇది సామాజిక విలువలు, నైతికతలో తీవ్రమైన కొరత. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ చైనా నుంచి మనం ఇంతకన్నా ఏం ఆశించగలం? '' అన్నారు.
'' సిగ్గులేనితనాననికి రూపం ఏదైనా ఉందంటే అది మీ ట్విటర్ హ్యాండిల్‌లా ఉంటుంది '' అని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు.
''చైనా ఈ ప్రపంచానికి ఎప్పటికీ నాయకత్వం వహించలేదనడానికి ఈ ట్వీట్ ఒక నిదర్శనం. అది పాకిస్తాన్, ఉత్తరకొరియాలాంటి దేశాలను మాత్రమే ఆకర్షించగలదు'' అని జర్నలిస్ట్ అభిజిత్ మజుందార్ విమర్శించారు.
గ్లోబల్ టైమ్స్ తన కథనంలో ఇండియన్ ఆర్మీపై అనేక వ్యాఖ్యలను చేర్చింది. "భారతదేశం విశృంఖలమైన, క్రమశిక్షణ లేని సైనిక సంస్కృతికి ప్రసిద్ధి'' అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ చైనా రక్షణ నిపుణుడు వ్యాఖ్యానించినట్లు పేర్కొంది.
''భారత సైనికులు ప్రమాణాలు, నిబంధనలను పాటించరు. దీని కారణంగా గతంలో కూడా భారతదేశంలో అనేక ప్రమాదాలు జరిగాయి. 2019లో భారత్‌కు చెందిన విమానం మంటల్లో చిక్కుకోగా, 2013లో పేలుడు సంభవించింది. వీటన్నింటికీ మానవ తప్పిదాలే కారణం'' అని ఆయన పేర్కొన్నట్లు వెల్లడించింది.
''చైనా సరిహద్దుల్లో మకాం వేసిన భారత సైనికులు తరచూ రెచ్చగొట్టే పని చేస్తుంటారు. కానీ నిజమైన ఘర్షణ జరిగినప్పుడు మాత్రం నిలదొక్కుకోలేరు. జనరల్ రావత్ మరణంనంతరం, భారత సైన్యం ఆధునీకరణ ప్రయత్నాలు వెనకబడవచ్చు'' అని మరో విశ్లేషకుడు పేర్కొన్నట్లు తెలిపింది.
"చైనా-భారత్ సరిహద్దు వివాదం ఇప్పుడు సైనిక సమస్య నుండి రాజకీయ సమస్యకు మారింది. సరిహద్దు వివాదంపై భారత్ ఏం చేస్తుందో మోదీ ప్రభుత్వ విధానంపై ఆధారపడి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, ఈ ప్రమాదం కారణంగా చైనాతో సరిహద్దు వివాదంపై భారత దేశం తన విధానాన్ని మార్చుకోదు. మార్చుకున్నా మార్చుకోకపోయినా, ఇది మాత్రం భారత్‌కు శరాఘాతం'' అని జిన్హువా యూనివర్సిటీ నేషనల్ స్ట్రాటజీ ఇన్‌స్టిట్యూట్‌లోని రీసెర్చ్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ కియాన్ ఫెంగ్ అన్నట్లు గ్లోబల్ టైమ్స్ కథనం పేర్కొంది.
‘తప్పుదోవ పట్టించేలా రీట్వీట్లు’
జనరల్ రావత్ మరణం విషయంలో భారతదేశపు ప్రసిద్ధ వ్యూహ నిపుణుడు బ్రహ్మ చెలానీ, గ్లోబల్ టైమ్స్ మధ్య ట్విటర్‌లో వాగ్వాదం జరిగింది. డిసెంబర్ 8న బ్రహ్మ చెలాని రెండు ట్వీట్లు చేశారు. ఈ రెండు ట్వీట్లను గ్లోబల్ టైమ్స్ గుర్తించలేదు. బ్రహ్మ చెలాని తన ట్వీట్‌లో ఇలా రాశారు.
"జనరల్ రావత్ మరణం 2020 ప్రారంభంలో హెలికాప్టర్ ప్రమాదంలో తైవాన్ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ షెన్ యి-మింగ్, మరో ఏడుగురి మరణం లాంటిది. ఆ ప్రమాదంలో ఇద్దరు మేజర్ జనరల్స్ కూడా చనిపోయారు. చైనీయులపై దూకుడుగా పోరాడుతున్న వారు హెలికాప్టర్ ప్రమాదాల్లో చనిపోయారు''
'' ఈ రెండు ప్రమాదాలు ఒకేలా ఉన్నాయంటే, ఈ ప్రమాదాలలో బయటి వ్యక్తుల హస్తం ఉందని అర్థం కాదు. ఇలాంటి ప్రమాదాల తర్వాత ఉన్నత సైనికాధికారులు ప్రయాణించే హెలికాప్టర్ల నిర్వహణపై దృష్టిపెట్టాలి'' అని చెలానీ పేర్కొన్నారు.
అయితే, గ్లోబల్ టైమ్స్ పత్రిక ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ, దీనికి అమెరికాకు లింక్ పెట్టింది.
''భారతదేశం, రష్యా లు S-400 క్షిపణి రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నందున మీ వ్యాఖ్యలు అమెరికాపై సందేహాన్ని కలిగిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఒప్పందాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకించింది'' అంటూ గ్లోబల్ టైమ్స్ పత్రిక తన ట్వీట్‌లో పేర్కొంది.
గ్లోబల్ టైమ్స్ చేసిన ఈ ట్వీట్‌పై బ్రహ్మ చెలానీ స్పందించారు. " చైనా కమ్యూనిస్ట్ పార్టీ మౌత్‌పీస్ నా ట్వీట్‌కు తప్పుడు అర్థాలు ఆపాదిస్తోంది. భారత్, రష్యాల మధ్య జరిగిన ఎస్-400 ఒప్పందంపై ఆగ్రహంతో అమెరికా హెలికాప్టర్ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని నేను అన్నట్లు చెబుతోంది. ఈ ట్వీట్‌ను బట్టి గ్లోబల్ టైమ్స్ అనారోగ్య మనస్తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు'' అని ఆయన తన ట్వీట్‌లో విమర్శించారు.
"చెలానీ వంటి చైనా వ్యతిరేక శక్తులు తప్పుడు కథనాలను రూపొందించడంలో నిమగ్నమై ఉన్నాయి. ఇటువంటి శక్తులు భారతదేశపు అన్ని సమస్యలకు చైనానే బాధ్యులను చేస్తాయి'' అని జిన్హువా యూనివర్సిటీ నేషనల్ స్ట్రాటజీ ఇనిస్టిట్యూట్‌లోని రీసెర్చ్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ కియాన్ ఫెంగ్ పేర్కొన్నట్లు గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
ప్రపంచమంతా సంతాపం తెలుపుతుంటే..
జనరల్ రావత్ మరణం పై ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుండి సంతాప సందేశాలు వచ్చాయి. పలు దేశాల ప్రధానులు, అధ్యక్షులు కూడా సంతాపం వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు. ఆఖరికి పాకిస్తాన్ కూడా సంతాపం వ్యక్తం చేసింది. కానీ చైనా అగ్ర నాయకత్వం కానీ విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి అలాంటి సంతాప సందేశం అందలేదు.
"హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆఫ్ ఇండియా, ఆయన భార్య, మరికొందరు మరణించడం చాలా బాధాకరం. మృతులందరికీ నా ప్రగాఢ సానుభూతి'' అని భారత్‌లోని చైనా రాయబారి సన్ వీడాంగ్ ట్వీట్ ద్వారా సంతాపం తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- బిపిన్ రావత్ మరణం: చైనా విషయంలో భారత విధానంపై ప్రభావం పడుతుందా?
- ‘నీ సెక్స్ జీవితం ఎలా ఉంది అని అడిగారు, రేప్ చేసి చంపేస్తామనీ బెదిరించారు’
- ఆంధ్రప్రదేశ్: పంచాయతీ నిధులను దారి మళ్లించారా, సర్పంచుల ఆందోళన ఎందుకు, ప్రభుత్వ వాదన ఏంటి?
- పల్నాడు: ఈ పేరు ఎలా వచ్చింది, పల్నాడు ఉత్సవాల వెనుక కథ ఏంటి?
- 12ఏళ్ల మిస్టరీ వీడినట్లేనా? బిట్ కాయిన్‌ను కనిపెట్టిన సతోషీ నకమోటో ఈయనేనా?
- ఎండ తగిలితే కాళ్లకు వాపు వస్తోంది
- అనకాపల్లి బెల్లం మార్కెట్లో వ్యాపారం ఎందుకు తగ్గుతోంది?
- గర్భిణి తల నరికి దారుణంగా హత్య చేసిన తల్లి, తమ్ముడు
- బీబీసీ 100 మంది మహిళలు 2021 - మంజులా ప్రదీప్: దళిత మహిళల హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమకారిణి
- ఆ రోజు ఈ ఫొటో తీసింది ఎవరు? కసబ్ గురించి ఆ ఫొటో జర్నలిస్టు ఏమంటున్నారు?
- గ్రీన్ టీ: ఉదయాన్నే ఓ కప్పు తాగారా... అందులోని పోషకాలను కనిపెట్టిన మిషియో సుజిమూర కథేంటో తెలుసుకుంటారా?
- ‘కార్లను అమ్మడం మొదలుపెట్టి నెల కూడా కాలేదు.. కానీ మార్కెట్ విలువలో ఫోర్డ్ మోటార్స్‌ను దాటేసింది’
- హిట్లర్ కోసం విషం రుచిచూసే మహిళల కథ
- హనుమ విహారి ఫౌండేషన్, ఎన్టీఆర్ ట్రస్టు మధ్య గొడవేంటి? ఈ క్రికెటర్ ట్విటర్ నుంచి ఎందుకు తప్పుకున్నాడు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)