ఆంధ్రప్రదేశ్ పరిస్థితి 'అప్పు చేసి పప్పుకూడు...'లా మారిందా, రాష్ట్ర ప్రభుత్వం రుణాల ఊబిలో ఎందుకు కూరుకుపోతోంది? 11 ప్రశ్నలు - జవాబులు

  • పృథ్వీరాజ్
  • బీబీసీ ప్రతినిధి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

ఫొటో సోర్స్, BUGGANA RAJENDRANATH REDDY/FACEBOOK

ఫొటో క్యాప్షన్,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చిన నిధులను విద్యుత్ బకాయిల కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జమ చేసుకుందని.. పంచాయతీల్లో అభివృద్ధి పనులకు చిల్లి గవ్వ లేకుండా పోయిందని సర్పంచులు గగ్గోలు పెడుతున్నారు.

రోడ్లు మరమ్మతులు చేయటానికి ప్రభుత్వం టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదు. ఇప్పటివరకూ చేసిన పనులకు ముందు బిల్లులివ్వండని డిమాండ్ చేస్తున్నారు.

రెండున్నరేళ్లుగా వేతన సవరణ చేపట్టలేదని ప్రభుత్వ ఉద్యోగులు మండిపడుతున్నారు. తక్షణమే పీఆర్‌సీ అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

అన్నిటికీ మించి, ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు అందటం లేదని.. వారం పది రోజులు ఆలస్యంగా వస్తున్నాయని వాపోతున్నారు.

రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని ఇటు ప్రతిపక్ష పార్టీల నాయకులు గగ్గోలు పెడుతున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి విషమిస్తోందని ఆర్థిక నిపుణులూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

జీతాలకే డబ్బులు లేని పరిస్థితుల్లో వేల కోట్లు అప్పులు చేసి నగదు బదిలీ పథకాలకు ఖర్చు చేస్తున్నారని.. 'ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అప్పు చేసి పప్పుకూడు.. అన్న సామెత తీరుగా ఉంద'ని ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.

2018లో ఆంధ్రప్రదేశ్ అప్పులపై బీబీసీ ప్రచురించిన కథనాలు..

వీడియో క్యాప్షన్,

వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండున్నరేళ్ల పాలన ఎలా సాగింది?

ఓవైపు ఇవన్నీ కొనసాగుతుండగానే..అప్పుల పరిమితి మించిపోవటంతో కొత్త రుణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తిప్పలు పడుతోంది. ఎంతోకొంత ఆదాయం పెంచుకోవటానికి వినూత్న మార్గాలను అన్వేషిస్తోంది.

ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌ పేరుతో నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థను స్థాపించటం నుంచి.. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి సవరణ చేయటంలాంటివి ఇందులో కొన్ని.

ఇలాంటి గడ్డు పరిస్థితుల్లోకి ఆంధ్రప్రదేశ్ ఎందుకు వెళ్లింది? అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ప్రభుత్వ ఆదాయ వ్యయాల పద్దులు ఏం చెప్తున్నాయి? అప్పుల భారం ఎలా పెరుగుతోంది? అసలేం జరుగుతోంది?

రాష్ట్ర బడ్జెట్ పత్రాలు, కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆడిట్ నివేదికలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదికలు ఏం చెప్తున్నాయి?

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

కరెన్సీ నోటు

1. రాష్ట్ర ఆదాయం తగ్గిందా? పెరిగిందా?

రాష్ట్ర ఆదాయంలో రాష్ట్ర పన్నులు, కేంద్ర పన్నుల్లో వాటా, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు ప్రధానమైనవి.

రాష్ట్ర విభజన అనంతర ఏడాది 2015-16లో రాష్ట్ర పన్ను ఆదాయం దాదాపు 40 వేల కోట్లుగా ఉంటే.. 2020-21 నాటికి ఆ ఆదాయం 81 వేల కోట్లు దాటిపోయింది. అంటే కోవిడ్ మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ వంటి సమస్యలు ఎదురైనా కూడా రాష్ట్ర పన్నుల ఆదాయం రెట్టింపైంది.

రాష్ట్ర పన్ను ఆదాయంలో సింహ భాగం.. స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (ఎస్‌జీఎస్‌టీ), అమ్మకం, వాణిజ్య పన్నుల ద్వారా లభిస్తోంది. ఆ తర్వాత స్టేట్ ఎక్సైజ్ సుంకాలు, స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజుల ద్వారా ఆదాయం లభిస్తోంది. వాహన పన్ను, భూమి శిస్తులతో పాటు.. ఇతర పన్నుల నుంచీ కొంత ఆదాయం లభిస్తోంది.

కానీ.. బడ్జెట్ అంచనాల కన్నా రాష్ట్ర పన్ను ఆదాయం తక్కువగానే ఉంటోంది. ఉదాహరణకు.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో లక్ష కోట్లకు పైగా పన్ను ఆదాయం లభిస్తుందని బడ్జెట్‌లో అంచనా వేయగా.. వాస్తవానికి 80 వేల కోట్ల మేరకే వచ్చింది.

కోవిడ్ వల్ల 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 8,000 కోట్లు, 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 14 వేల కోట్లు ఆదాయం తగ్గిందని.. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా బ్యాంకర్లతో భేటీలో చెప్పారు. కోవిడ్ నియంత్రణ కోసం అదనంగా రూ. 8,000 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని.. దీంతో మొత్తంగా రూ. 30,000 కోట్ల భారం రాష్ట్రంపై పడిందని పేర్కొన్నారు.

2. కేంద్ర పన్నుల్లో వాటా, కేంద్ర గ్రాంట్ల పరిస్థితి ఏమిటి?

కేంద్ర పన్నుల్లో వాటా కూడా బడ్జెట్ అంచనాల కన్నా తక్కువగా ఉంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే కార్పొరేషన్ పన్ను, కస్టమ్స్ సుంకం, ఆదాయ పన్ను, వస్తువులు, సేవలపై ఇతర పన్నులు, సుంకాలు, సేవా పన్ను, సంపద పన్ను, కేంద్ర ఎక్సైజ్ సుంకాలు, సీజీఎస్‌టీ, ఐజీఎస్‌టీ పన్నుల్లో రాష్ట్రానికి వాటా లభిస్తుంది.

గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ. 22 వేల కోట్లు వస్తాయని బడ్జెట్‌లో అంచనా వేయగా.. నిజానికి రూ.17 వేల కోట్ల మేరకే వచ్చాయి.

ఇక కేంద్రం నుంచి లభించే గ్రాంట్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ప్రణాళికేతర గ్రాంట్లు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు, రాష్ట్ర ప్రణాళికా పథకాలకు గ్రాంట్లు, కేంద్ర ప్రణాళికా పథకాలకు గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు గ్రాంట్లు తదితరాల కింద కేంద్రం నుంచి నిధులు విడుదలవుతాయి.

గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రూ.53 వేల కోట్లకు పైగా గ్రాంట్లు వస్తాయని అంచనా వేసుకుంటే.. నిజానికి రూ.32 వేల కోట్ల లోపే లభించాయి. ఈ భారీ తేడాల వల్ల బడ్జెట్ కేటాయింపులు తారుమారవటమే కాకుండా.. నిధుల సర్దుబాటు సమస్య కూడా తలెత్తుతోంది.

వీడియో క్యాప్షన్,

లోన్ యాప్స్: అధిక వడ్డీలకు అప్పులు.. కట్టడం ఆలస్యమైతే బూతులు

3. జీతాలు, పెన్షన్లు, వడ్డీల ఖర్చులు ఎంత పెరిగాయి?

రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా, పన్నేతర వసూళ్ల ద్వారా వచ్చే రాబడుల కన్నా.. ఖర్చులు ఎక్కువగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా.. తప్పనిసరిగా చెల్లించాల్సిన జీతాలు, వేతనాలు, పెన్షన్లు, సబ్సిడీలు, అప్పులపై వడ్డీలు ఏటేటా పెరుగుతూ పోతున్నాయి. కానీ ఆ స్థాయిలో ఆదాయం పెరగకపోవటంతో ఖజానాపై భారం పడుతోంది.

ఉదాహరణకు.. విభజన సమయంలో రూ. 27,686 కోట్లుగా ఉన్న జీతాలు.. 2020-21 నాటికి రూ.40 వేల కోట్లకు పెరిగింది. అలాగే.. పెన్షన్ల భారం రూ. 9,971 కోట్ల నుంచి రూ.17,470 కోట్లకు పెరిగింది.

ఇక అప్పులపై వడ్డీ చెల్లింపుల భారం కూడా.. విభజన ఏడాదిలో చెల్లించిన వడ్డీలు రూ. 10 వేల కోట్లుగా ఉంటే.. 2020-21 నాటికి 20 వేల కోట్లకు పెరిగిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన వడ్డీలు 22 వేల కోట్లకు పైగా బడ్జెట్ గణాంకాలు చెప్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఏపీలో నెలాఖరుకు జీతాలు ఇవ్వడమే కష్టంగా మారింది.

4. రెవెన్యూ లోటు ఎలా పెరుగుతోంది?

వస్తున్న ఆదాయానికి మించి చేస్తున్న ఖర్చులు పెరిగిపోతుండటంతో.. రాష్ట్ర రెవెన్యూ లోటు విపరీతంగా పెరిగిపోతోంది. ఉదాహరణకు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు రూ. 5,000 కోట్లుగా ఉంటుందని ప్రభుత్వం బడ్జెట్‌లో అంచనా వేసింది. కానీ ఏప్రిల్ నుంచి అక్టోబరు నెలాఖరు వరకు.. ఏడు నెలల్లోనే రెవెన్యూ లోటు రూ. 40,828 కోట్లు దాటిపోయింది. ఇది బడ్జెట్‌లో ప్రతిపాదించిన రెవెన్యూ లోటు కన్నా.. 816 శాతం అధికం. ఇంకా ఐదు నెలలు మిగిలి ఉండటంతో ఈ లోటు మరింతగా పెరిగే అవకాశముంది.

నిజానికి గత ఏడేళ్లుగా రెవెన్యూ లోటు అంతకంతకూ పెరుగుతూనే ఉంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 7,302 కోట్లుగా ఉన్న రెవెన్యూ లోటు.. 2020-21 నాటికి దాదాపు 35 వేల కోట్లకు పెరిగిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లోనే ఈ లోటు 40 వేల కోట్లు దాటేసింది.

5. కొత్త అప్పులతో పాత అప్పులు తీరుస్తున్నారా?

ఆదాయానికి, వ్యయానికి అంతరం ఎక్కువవుతున్న కొద్దీ.. దానిని పూడ్చటానికి చేస్తున్న అప్పులు కూడా పెరుగుతూ పోతున్నాయి. అయితే.. ప్రభుత్వం కొత్తగా చేస్తున్న అప్పుల్లో చాలా భాగం పాత అప్పులు, వడ్డీలు తీర్చటానికే ఖర్చవుతోంది.

2015-16 నుంచి 2019-20 మధ్య ఐదేళ్లలో ప్రభుత్వం చేసిన కొత్త అప్పుల్లో 65 శాతం నుంచి 81 శాతం పాత అప్పు తీర్చటానికే సరిపోయిందని కాగ్ విశ్లేషించింది.

ఉదాహరణకు.. 2015-16లో 77,265 కోట్లు అప్పు చేయగా.. అందులో 50,859 కోట్లు పాత అప్పులు తీర్చటానికి ఖర్చయ్యాయి. 2019-20లో 1,57,859 కోట్లు అప్పు చేస్తే.. పాత అప్పులు తీర్చటానికి 1,13,197 కోట్లు చెల్లించారు.

6. అప్పులు ఎలా పెరుగుతూ వచ్చాయి?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగేటప్పటికి - అంటే 2014 జూన్ 1వ తేదీ నాటికి 1,66,522.32 కోట్ల అప్పు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పద్దులో ఉంది. ఆ అప్పును జనాభా ప్రాతిపదికన విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు పంచారు.

దీంతో తెలంగాణ రాష్ట్ర ఖాతాలో 69,479.48 కోట్లు, ఆంధ్రప్రదేశ్ ఖాతాలో రూ. 97,123.93 కోట్లుగా అప్పులను విభజించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వ హయాంలో.. 2019 ఆర్థిక సంవత్సరాంతానికి రూ. 2,64,451 కోట్లకు అప్పు పెరిగింది.

వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 జూన్‌లో అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వ హయాంలో రెండేళ్లలో 2021 మార్చి నాటికి అప్పు 3,55,839 కోట్లకు పెరిగింది. ఈ అప్పు 2022 మార్చి నాటికి దాదాపు 4 లక్షల కోట్లకు చేరుతోందని బడ్జెట్ అంచనా.

ఇవిగాక.. రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీలు ఇచ్చిన అప్పులు మరో రూ. 91,330 కోట్లు ఉన్నాయని ఆర్‌బీఐ నివేదిక వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం.. రాష్ట్ర విభజన అనంతరం 2015లో రూ. 10,675 కోట్లుగా ఉన్న ఈ గ్యారెంటీ రుణాలు.. 2019 నాటికి 54,252 కోట్లకు పెరిగాయి. అవి 2021 మార్చి నాటికి రూ. 91,330 కోట్లకు చేరాయి.

7. ఎక్కడి నుంచి అప్పులు తెస్తున్నారు?

ఆర్‌బీఐ తాజాగా ప్రచురించిన నివేదిక ప్రకారం.. 2021 మార్చి చివరి నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ. 3,60,333.40 కోట్లుగా ఉన్నాయి. ఇందులో అంతర్గత రుణాలు 2,56,088.40 కోట్లుగా ఉన్నాయి. ఈ అప్పులు 2022 మార్చి చివరి నాటికి రూ. 3,98,903.60 కోట్లకు పెరుగుతాయనేది బడ్జెట్ అంచనాగా ఆర్‌బీఐ నివేదిక తెలిపింది.

వచ్చే ఏడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 1,10,010 కోట్లు అప్పు తీర్చాల్సి ఉంటుందని కాగ్ నివేదిక వెల్లడించింది.

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్,

పంచాయితీల నిధులు దారి మళ్లిస్తున్నారంటూ సర్పంచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

8. అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలకు వెచ్చిస్తున్నారా?

ప్రభుత్వ ఆదాయాన్ని బడ్జెట్ పరిభాషలో రెండు రకాలుగా ఖర్చు చేస్తారు. ఒకటి రెవెన్యూ వ్యయం. రెండోది పెట్టుబడి వ్యయం.

పెట్టుబడి వ్యయం అంటే.. భూములు, భవనాలు, యంత్రాలు, పరికరాలు సమకూర్చుకోవటం; ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టటం, వాటికి రుణాలు, అడ్వాన్సులు ఇవ్వటం వంటి భౌతిక, ఆర్థిక ఆస్తులను అందించే రంగాల్లో ఖర్చు చేయటం.

రెవెన్యూ వ్యయం అంటే.. భౌతిక, ఆర్థిక ఆస్తులను కల్పించని మిగతా మొత్తం వ్యయాన్నీ రెవెన్యూ వ్యయం పద్దులో చేరుస్తారు. ప్రభుత్వ నిర్వహణకు అయ్యే ఖర్చు నుంచి జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు, అప్పుల చెల్లింపు, వడ్డీల చెల్లింపు, వివిధ సంస్థలకు ఇచ్చే గ్రాంట్లు తదితరాలతో పాటు.. సంక్షేమ పథకాలు కూడా ఈ పద్దులోకే వస్తాయి.

కాగ్ లెక్కల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 7 నెలల మొత్తం రాబడులు 1,25,111 కోట్లు దాటగా.. అందులో దాదాపు సగం నిధులు సామాజిక, సంక్షేమ రంగాల కోసం ఉపయోగించారు. పాత అప్పుల మీద వడ్డీలు చెల్లించటానికి, సబ్సిడీ బిల్లులు, ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం మిగతా సగం నిధులు ఖర్చయ్యాయి. కేవలం 8,739 కోట్లు మాత్రమే పెట్టుబడి వ్యయం చేశారు.

అలాగే.. 2019-20 ఆర్థిక సంవత్సరంలో.. రెవెన్యూ లోటు రూ. 1,799 కోట్లుగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో అంచనా వేయగా.. వాస్తవంలో అది రూ. 26,441 కోట్లకు పెరిగిపోయింది. దీనికి ప్రధాన కారణం.. 2019-20 సంవత్సరంలో కొత్తగా అమలులోకి తెచ్చిన సంక్షేమ పథకాలేనని కాగ్ చెప్పింది.

అమ్మ ఒడి (6,349 కోట్లు), వైఎస్‌ఆర్ తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ సరఫరా (4,920 కోట్లు), వైఎస్ఆర్ రైతు భరోసా వంటి కొత్త పథకాలు, కేటాయింపుల వల్ల రెవెన్యూ వ్యయం 6.93 శాతం పెరిగిందని కాగ్ నివేదిక తెలిపింది.

ఫొటో సోర్స్, FACEBOOK/BUGGANA RAJENDRANATH REDDY

ఫొటో క్యాప్షన్,

గత ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసిందని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తోంది

లక్ష కోట్లకు పైగా నగదు బదిలీ చేశాం: ఆర్థికమంత్రి

కాగ్ నివేదికను కొద్ది రోజుల కిందట శాసనసభలో ప్రవేశపెట్టిన సమయంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి ప్రసంగిస్తూ.. తమ ప్రభుత్వం ఈ రెండేళ్లలో చేసిన రూ. 1,27,105.81 కోట్లలో రూ. 1,05,102.22 కోట్లను.. వివిధ ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల కింద రైతులు, మహిళలు, విద్యార్థులు, పెన్షనర్లకు అందించినట్లు చెప్పారు.

టీడీపీ ప్రభుత్వం 39 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే.. తమ ప్రభుత్వం 59.8 లక్షల మందికి పెన్షన్లు ఇస్తోందన్నారు. బడ్జెట్ వ్యయాలను చూస్తే.. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ. 26,403.57 కోట్లు ఖర్చు చేస్తే తమ సర్కారు 27 నెలల్లోనే 37,461.89 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు.

9. అభివృద్ధి వ్యయం తగ్గిపోతోందా?

'తీసుకున్న అప్పులను ఆదాయాన్నిచ్చే ఆస్తులు సృష్టించటానికి, అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చుచేయాలి కానీ.. అవసరాలు తీర్చుకోవటానికి, అప్పులు, వడ్డీలు చెల్లించటానికి ఖర్చు చేయటం.. ఆర్థిక అస్థిరతకు దారితీస్తుంది' అని కాగ్ తన నివేదికలో హెచ్చరించింది.

రాష్ట్రం ఆర్థికంగా బలపడటానికి కీలకం పెట్టుబడి వ్యయం. కానీ ఏడేళ్లలో బడ్జెట్ వ్యయం రెట్టింపయినా కానీ.. పెట్టుబడి వ్యయం మాత్రం పెరగటం లేదు. బడ్జెట్‌లో పెట్టుబడి వ్యయానికి కేటాయింపులు పెంచుతున్నప్పటికీ.. వాస్తవ ఖర్చు మాత్రం ఆమేరకు ఉండటం లేదు.

ఉదాహరణకు.. 2021-22 సంవత్సరంలో రూ. 31,198 వేల కోట్లు పెట్టుబడి వ్యయం చేస్తామని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. కానీ.. ఇప్పటివరకూ ముగిసిన ఏడు నెలల్లో చేసిన ఖర్చు రూ. 8,739 కోట్లు మాత్రమే.

ఇక 2018-19 సంవత్సరంతో పోలిస్తే 2019-20 సంవత్సరంలో కూడా ఆస్తుల కల్పన మీద ఖర్చు 38.72 శాతం తగ్గినట్లు కాగ్ ఉటంకించింది.

10. కేంద్ర నిధులను రాష్ట్రం దారి మళ్లిస్తోందా?

కేంద్ర పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న గ్రాంట్లను.. ''రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లిస్తోంద''ని, దానివల్ల కొన్ని ప్రభుత్వ పథకాల లక్ష్యాలు పూర్తిగా నెరవేరలేదని కాగ్ తన నివేదికలో తప్పుపట్టింది.

కేంద్ర ప్రభుత్వం తన పథకాల నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌కు 2018-19లో రూ. 16,608 కోట్లు విడుదల చేయగా కేవలం రూ. 4,514 కోట్లు మాత్రమే ఆ పథకాల కోసం ఖర్చు చేశారని, అలాగే 2019-20లో కేంద్రం తన పథకాల కోసం రూ. 11,781 కోట్లు విడుదల చేస్తే.. అందులో రూ. 5,961 కోట్లు మాత్రమే వాటికోసం ఖర్చచేశారని కాగ్ లెక్కతేల్చింది. ఇలా కేంద్ర నిధులను మళ్లించటం.. రాష్ట్ర ప్రభుత్వానికి వాటి తర్వాత అందాల్సిన గ్రాంట్ల విడుదల మీద ప్రభావం చూపుతోందని చెప్పింది.

మరోవైపు.. గ్రామ పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులు రూ.344 కోట్లు, 15వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులు రూ.965 కోట్లను ప్రభుత్వం దారి మళ్లించిందని సర్పంచులు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. కానీ టీడీపీ హయాం నుంచీ పేరుకుపోయిన విద్యుత్ బకాయిలకోసం.. విద్యుత్ సంస్థలు పంచాయతీ నిధుల నుంచి జమ చేసుకుంటున్నాయని ప్రభుత్వం చెప్తోంది.

ఆదాయం పెరగకుండా, ఖర్చులు పెరిగిపోతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం నిధుల కోసం చాలా ఇబ్బందులు పడుతోంది. కొత్త పన్నుల కోసం, కొత్త అప్పుల కోసం దారులు వెదుకుతోంది. ఈ క్రమంలో చేస్తున్న ప్రయత్నాలపై విమర్శలు, వివాదాలు తలెత్తుతున్నాయి.

ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1.94 కోట్లు రోజు వారీ కనీస నిల్వ ఉంచాల్సి ఉండగా.. 2020-21 సంవత్సరంలో 221 రోజుల పాటు ఆ నిల్వ కూడా ఉంచలేదని, కేవలం 145 రోజుల పాటే ఆ నిల్వను ఉంచగలిగిందని కాగ్ వెల్లడించింది.

ఫొటో సోర్స్, FACEBOOK/YSRCPOFFICIAL

ఫొటో క్యాప్షన్,

సంక్షేమ పథకాలకే నిధులు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని ఆర్ధిక నిపుణులు అంటున్నారు.

11. ఆర్థిక పరిస్థితి ఇలా దిగజారటానికి కారణం ఎవరు?

''అప్పులను కేవలం సంక్షేమ పథకాల కోసమే ఖర్చుచేస్తే.. మౌలికవసతుల అభివృద్ధి సంగతేమిటి?'' అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు ప్రశ్నించారు. రోడ్లు రిపేరు చేయటానికి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని ఆయన వ్యాఖ్యానించారు.

ఆయన కొద్ది రోజుల కిందట మీడియాతో మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల మీద ఖర్చు చేయటం నేరం కాదని, కానీ మొత్తం బడ్జెట్‌లో ఆ ఖర్చు 10 శాతానికి మించరాదని అభిప్రాయపడ్డారు.

''జగన్ ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేస్తూ పోతోంది. కేవలం అప్పుల మీదే ఇంకెంత కాలం ఆధారపడుతుందో ఎవరికీ తెలీదు. ఇంకెంత మొత్తం అప్పు చేస్తుందో, ఆ అప్పులను ఎలా తీరుస్తుందో ప్రభుత్వం స్పష్టం చేయాలి. అప్పులు తిరిగి చెల్లించటానికి ప్రభుత్వం దగ్గర ఒక కార్యాచరణ ప్రణాళిక ఉండాలి'' అని డిమాండ్ చేశారు.

వీడియో క్యాప్షన్,

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాల్సిన పరిస్థితి వచ్చిందా?

ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు: టీడీపీ

''వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలన పూర్తయ్యేసరికి రూ. 6 లక్షల కోట్ల అప్పును రాష్ట్రానికి బహుమతిగా అందించే దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకెళుతోంది. అప్పుల కోసం ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట సవరణ చేసి, గ్యారంటీల పరిమితి రెట్టింపు చేసి ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు'' అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు.

కొద్ది రోజుల కిందట ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదలకు పథకాల పేరుతో 5 రూపాయలు ఇచ్చి, పన్నులు రూపంలో 10 గుంజుకుంటున్నారని ఆరోపించారు.

టీడీపీ విచక్షణా రహిత అప్పులే కారణం: బుగ్గన

అయితే.. ''రాష్ట్ర అప్పులు అనుమతించిన పరిమితుల పరిధిలోనే ఉన్నాయి. మునుపటి టీడీపీ ప్రభుత్వపు ఆర్థిక క్రమశిక్షణారాహిత్యం, లెక్కలేకుండా చేసిన అప్పులే ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి కారణం'' అని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ ఇటీవల శాసనసభలో మాట్లాడుతూ ఆరోపించారు.

రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ అప్పుల వాటా రూ. 1,18,544.34 కోట్లుగా ఉంటే.. చంద్రబాబు ప్రభుత్వం 2014-19 మధ్య రూ. 2,57,509.85 కోట్లు అప్పులు చేసిందన్నారు.

''మొత్తంగా గత టీడీపీ ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల మీద రూ. 1 లక్ష కోట్ల వరకూ అప్పులు తెచ్చింది. ఆపైన తన ఐదేళ్ల పాలనలోని చివరి రెండు సంవత్సరాల్లో.. రెండు, మూడు సంవత్సరాల మారటోరియంతో భారీ మొత్తంలో అప్పులు చేసింది. ఆ అప్పులు చెల్లించే భారం మా ప్రభుత్వం మీద పడింది'' అని ఆయన ఆరోపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)