జనరల్ బిపిన్ రావత్ అనంతరం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయ్యేదెవరు, అర్హతలేమిటి
- సరోజ్ సింగ్
- బీబీసీ కరస్పాండెంట్

ఫొటో సోర్స్, ANI
జనరల్ బిపిన్ రావత్ మరణం తర్వాత భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరిగింది
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆఫ్ ఇండియా జనరల్ బిపిన్ రావత్ అంత్యక్రియలు ముగిశాయి. మరి భారతదేశపు తదుపరి సీడీఎస్ ఎవరు ? ఇప్పుడీ ప్రశ్న రక్షణ వర్గాల్లో విస్తృతంగా వినిపిస్తోంది.
కొత్త సీడీఎస్ పేరు విషయంలో ప్రభుత్వం నుంచి ఇంత వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. ఒకవేళ కొత్త సీడీఎస్ పేరు ప్రకటించినా, ఆయనను పూర్తికాలానికి ప్రకటిస్తారా లేకా ఒక ఏడాదికి కోసం ప్రకటిస్తారా అన్నదానిపై కూడా ఎలాంటి సమాచారం లేదు.
జనరల్ బిపిన్ రావత్ పదవీ కాలం 2023 మార్చి వరకు ఉంది. ఈలోగానే ఆయన ప్రమాదంలో మరణించారు.
తదుపరి సీడీఎస్ ఎవరు అన్నదానిపై ఇప్పటికే సోషల్ మీడియాలో ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఎవరికి అవకాశాలు ఉన్నాయన్న అంశంపై బీబీసీ పలువురు రక్షణ రంగ నిపుణులతో మాట్లాడింది.
‘సంతోషంగా ఉండు’.. భార్యతో సాయితేజ చివరి మాట ఇవే
జనరల్ రావత్ ఎప్పుడు, ఎలా సీడీఎస్ అయ్యారు
సీడీఎస్ ఎంపిక ప్రక్రియ, పోస్టు అర్హతకు సంబంధించిన రూల్ బుక్ గురించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎప్పుడూ బహిరంగంగా వెల్లడించలేదని రక్షణ నిపుణులు చెబుతున్నారు. జనరల్ బిపిన్ రావత్ భారతదేశపు మొదటి సీడీఎస్ అవుతారంటూ డిసెంబర్ 20, 2019న కేంద్ర ప్రభుత్వం ఒక పత్రికా ప్రకటన ద్వారానే ప్రకటించింది.
జనరల్ బిపిన్ రావత్‌కు ఇంకా ఏడాది కంటే ఎక్కువ పదవీ కాలం మిగిలి ఉంది. బహుశా ఆయన పదవీ విరమణ దగ్గరికొచ్చినప్పుడు నిబంధనల గురించి కొన్ని సన్నాహాలు చేయాలని కేంద్రం భావించి ఉండొచ్చు. కానీ, ప్రమాదం కారణంగా ఆ పోస్టు ఒక్కసారిగా ఖాళీ అయింది.
రక్షణ రంగంలో మోదీ ప్రభుత్వం చేసిన మార్పుల్లో ఇదే అత్యంత కీలకమైనదని, దీని కారణంగా ఈ పదవిని ఎక్కువ కాలం ఖాళీగా ఉంచలేమని నిపుణులు భావిస్తున్నారు.
2019లో ఎర్రకోట నుండి ఆగస్టు 15 నాటి తన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కొత్త పోస్ట్ గురించి ప్రస్తావించారు. అదే సంవత్సరం డిసెంబర్ చివరి రోజున ఈ పదవి నియామకం కోసం ఒక ఉత్తర్వు జారీ చేయడం ద్వారా కేంద్రం ప్రభుత్వం దీనికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చిందని భావించవచ్చు.
వాస్తవానికి కార్గిల్ యుద్ధం తర్వాత, ఈ పోస్ట్‌ను సృష్టించాలన్న డిమాండ్ వినిపించింది. ఆ తర్వాత కేబినెట్ మాజీ కార్యదర్శి నరేశ్ చంద్ర నేతృత్వంలోని ఒక కమిటీ కూడా దీనికి సిఫారసు చేసింది. కాన అప్పుడు జరగలేదు. జనరల్ బిపిన్ రావత్ నిష్క్రమణ తర్వాత.. ఈ పదవిని ఎప్పుడు, ఎలా, ఎవరితో భర్తీ చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.

ఫొటో సోర్స్, Getty Images
జనరల్ రావత్ తొలి సీడీఎస్‌గా ఎంపికయ్యారు
సీడీఎస్ బాధ్యతలేంటి?
ఆర్మీ, నేవీ, వాయుసేనల పనిని మెరుగ్గా సమన్వయం చేయడం, దేశ సైనిక శక్తిని బలోపేతం చేయడం సీడీఎస్ విధి అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.రక్షణ మంత్రికి ప్రధాన సైనిక సలహాదారుగా సీడీఎస్ బాధ్యతలు నిర్వహిస్తారు. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ), డిఫెన్స్ ప్లానింగ్ కమీషన్ (డీపీసీ) వంటి ముఖ్యమైన రక్షణ మంత్రిత్వ శాఖ గ్రూపుల్లో సీడీఎస్‌కు స్థానం ఉంటుంది.
''సీడీఎస్ నియామకానికి సంబంధించి బయటకు తెలిసిన ఎలాంటి నియమాలు ఇప్పటికి లేవు'' అని లెఫ్టినెంట్ జనరల్ సతీశ్ దువా బీబీసీతో అన్నారు. ఆయన చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్‌గా పని చేసి రిటైరయ్యారు.
అందువల్ల కొత్త సీడీఎస్ నియామకం ఎలా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది చెప్పడం కష్టమని దువా వ్యాఖ్యానించారు.
"నాకు తెలిసి రక్షణ మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన సూచన మేరకు తదుపరి సీడీఎస్ నియమించడానికి అర్హులైన ప్యానెల్ ను భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీకి పంపాలి. దీనిని కమిటీ ఆమోదించాల్సి ఉంటుంది. అయితే స్వయంగా ప్రధాని నేతృత్వంలో జరిగే సీసీఎస్ సమావేశంలోనే తుది నిర్ణయం తీసుకుంటారు'' అన్నారు దువా.
ఈ ప్యానెల్‌ను సిద్ధం చేయడంలో సాధారణంగా సీనియారిటీని ప్రధానంగా చూస్తారు. ఈ పోస్ట్‌లో పనిచేసే వ్యక్తి త్రివిధ దళాలతో కలిసి పని చేయవలసి ఉంటుంది కాబట్టి, తదుపరి సీడీఎస్ ఈ మూడు దళాలకు చెందిన వారిలో ఎవరో ఒకరు కావచ్చు'' అని ఆయన తెలిపారు.
సీడీఎస్ అయ్యేందుకు అర్హతలేంటి?
జనరల్ బిపిన్ రావత్ సీడీఎస్‌గా ఎంపికైనప్పుడు ఆర్మీ చీఫ్‌గా పని చేస్తున్నారు. పదవీ విరమణకు చేరువగా ఉన్నారు. మూడేళ్లపాటు సీడీఎస్‌గా నియమితులయ్యారు. ఆయన పదవీ విరమణ పరిమితిని 65 ఏళ్లకు పెంచారు.
దీని ఆధారంగా ఇకపై సీడీఎసీ పదవీ కాలం 3 సంవత్సరాలు, వయో పరిమితి 65 సంవత్సరాలుగా ఉండొచ్చని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలా చూసినప్పుడు, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలు కాబట్టి, మూడు సర్వీసుల చీఫ్‌లు ఈ పోస్టుకు అర్హులు. కాబట్టి ఈ మూడు దళాల అధిపతులు దీనికోసం పోటీ పడవచ్చు.
సీనియారిటీ పరంగా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే భారతదేశ త్రివిధ దళాల అధిపతులలో అత్యంత సీనియర్. అయితే, ఈ పదవికి ఎవరిని ఎంపిక చేయాలనేదానిపై కేంద్ర ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకుంటుంది.

ఫొటో సోర్స్, ANI
కొత్త సీడీఎస్ నియామకం కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
ఒక పదవి, మూడు బాధ్యతలు
జనరల్ రావత్ మరణంతో ఏకకాలంలో మూడు పోస్టులు ఖాళీ అయినట్లయింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మూడు బాధ్యతలను నిర్వహిస్తారు. మొదటిది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, రెండోది చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ, మూడోది డీఎంఏ సెక్రటరీ.
ఎయిర్ చీఫ్ మార్షల్ (రిటైర్డ్) అరూప్ రాహ అయిదేళ్ల కిందట పదవీ విరమణ చేశారు. తదుపరి సీడీఎస్ ఎవరు అన్నదానిపై ఆయన తన అంచనాలను బీబీసీతో పంచుకున్నారు.
''సీడీఎస్ పోస్ట్‌కు ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్‌లో పని చేసిన అనుభవం ఉండాలి. దీనినిబట్టి ముగ్గురు సర్వీస్ చీఫ్‌లలో ఎవరైనా దీనికి పోటీ పడవచ్చు'' అన్నారాయన.
''సీడీఎస్ విధుల్లో సైన్యంతో మాత్రమే కాకుండా ప్రభుత్వం, బ్యూరోక్రసీతో కూడా సమన్వయం చేయాల్సిన అవసరం ఉంటుంది. దీని కారణంగా, ప్రభుత్వం కోరుకుంటే, సీడీఎస్ నియామకపు ప్యానెల్ ను విస్తరించవచ్చు. అందులో వైస్ చీఫ్‌కు అవకాశం ఇవ్వవచ్చు'' అన్నారు అనూప్ రాహ.
వాస్తవానికి త్రివిధ దళాల మాదిరిగానే సీడీఎస్‌లో నంబర్ టూగా ఎవరూ పనిచేయలేదు. దీని కారణంగా, తదుపరి సీడీఎస్ పేరు ముందుగానే నిర్ణయం కాలేదు.
ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ కాకుండా, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ (ఐడీఎస్) సర్వీస్ కూడా ఉంది. దీని గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇది కార్గిల్ యుద్ధం తరువాత ఏర్పడింది. ఇప్పటికి ఈ సర్వీస్ ఏర్పడి 20 సంవత్సరాలైంది.
ఐడీఎస్ చీఫ్ కూడా మిగిలిన ఆర్మీ చీఫ్ స్థాయి ఉంటుంది కాబట్టి, ఆ సంస్థ చీఫ్‌ను కూడా సీడీఎస్ పోస్టుకు అర్హుడిగా తీసుకుంటారా అన్న అంశంపై రక్షణ రంగ నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీంతో సీడీఎస్ నియామకంపై సస్పెన్స్ నెలకొని ఉంది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని రక్షణ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
లాన్స్‌నాయక్ సాయితేజ: హెలీకాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తెలుగు సైనికుడు
ఇవి కూడా చదవండి:
- బిపిన్ రావత్ మరణం: చైనా విషయంలో భారత విధానంపై ప్రభావం పడుతుందా?
- ‘నీ సెక్స్ జీవితం ఎలా ఉంది అని అడిగారు, రేప్ చేసి చంపేస్తామనీ బెదిరించారు’
- ఆంధ్రప్రదేశ్: పంచాయతీ నిధులను దారి మళ్లించారా, సర్పంచుల ఆందోళన ఎందుకు, ప్రభుత్వ వాదన ఏంటి?
- పల్నాడు: ఈ పేరు ఎలా వచ్చింది, పల్నాడు ఉత్సవాల వెనుక కథ ఏంటి?
- 12ఏళ్ల మిస్టరీ వీడినట్లేనా? బిట్ కాయిన్‌ను కనిపెట్టిన సతోషీ నకమోటో ఈయనేనా?
- ఎండ తగిలితే కాళ్లకు వాపు వస్తోంది
- అనకాపల్లి బెల్లం మార్కెట్లో వ్యాపారం ఎందుకు తగ్గుతోంది?
- గర్భిణి తల నరికి దారుణంగా హత్య చేసిన తల్లి, తమ్ముడు
- బీబీసీ 100 మంది మహిళలు 2021 - మంజులా ప్రదీప్: దళిత మహిళల హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమకారిణి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)