చంద్రబాబు OSDగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఇంట్లో సీఐడీ సోదాలు.. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ అక్కడికి ఎందుకెళ్లారు - ప్రెస్ రివ్యూ

ఏపీ సీఐడీ

ఫొటో సోర్స్, YT/ntv

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ నివాసంలో ఏపీ సీఐడీ సోదాల సమయంలో హైడ్రామా చోటు చేసుకుందని ఈనాడు ఒక కథనం రాసింది.

ఆ కథనం ప్రకారం.. శుక్రవారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని లక్ష్మీనారాయణ ఇంటికి సీఐడీ చేరుకుంది. అయితే, నోటీసులు ఇవ్వకుండా, వారెంట్ లేకుండా ఎవరినీ ఇంట్లోకి రానివ్వబోమని లక్ష్మీనారాయణ, ఆయన కుటుంబ సభ్యులు సీఐడీ అధికారులను అడ్డుకున్నారు. ఆ తర్వాత సీఐడీ అధికారులు తమ వద్ద ఉన్న పత్రాలను చూపించడంతో అనుమతించారు.

లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాల గురించి తెలుసుకున్న టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఇతర టీడీపీ నేతలు అక్కడికి వెళ్లారు. సీఐడీ పేరుతో కుట్రకు పాల్పడుతున్నారని, గో బ్యాక్ సీఐడీ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ నేతలను శాంతింప చేసి పోలీసులు అక్కడి నుంచి పంపించి వేశారు.

ఇదే సమయంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ అక్కడికి వచ్చారు. 'మీరు ఇక్కడ ఉంటే లక్ష్మీనారాయణ సహకరిస్తారు. త్వరగా పని పూర్తి చేసుకుని వెళ్తాం' అని సీఐడీ అధికారులు కోరడంతో ఆయన అక్కడ కొద్దిసేపు ఉండి వెళ్లిపోయారు.

అనంతరం సీఐడీ అధికారులు లక్ష్మీనారాయణను ప్రశ్నించడం కొనసాగించారు. సోదాల్లో భాగంగా కంప్యూటర్ హార్డ్ డిస్క్, కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

విచారణ సందర్భంగా లక్ష్మీనారాయణ కళ్లు తిరిగి పడిపోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ తర్వాత ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.

ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చేపట్టిన సీమెన్స్ ప్రాజెక్టుకు సంబంధించి 241 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలపై లక్ష్మీనారాయణ, మరికొందరిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.

ఫొటో సోర్స్, sakshi

సాక్షి ఏం చెప్పింది?

లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు చేస్తున్న సీఐడీ అధికారులను టీడీపీ నేత పయ్యావుల కేశవ్, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, అడ్డుకునే ప్రయత్నం చేశారని సాక్షి పత్రిక రాసింది.

ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో రాధాకృష్ణ అక్కడే ఉండటం గమనార్హం. విధి నిర్వహణలో ఉన్న సీఐడీ అధికారులను అడ్డుకోవడంతో పాటు ఏబీఎన్ చానల్ కెమేరామెన్‌లతో తనిఖీలను వీడియో తీయించడం వివాదాస్పదంగా మారింది. దర్యాప్తు అధికారులను బెదిరింపులకు గురి చేసేలా ప్రవర్తించిన రాధాకృష్ణ వ్యవహారంపై సీఐడీ ఉన్నతాధికారులు ఆగ్రహంగా ఉన్నారని సాక్షి పత్రిక పేర్కొంది.

ఆంధ్రజ్యోతి ఏం చెప్పింది?

మరోవైపు, సీఐడీ అధికారులను ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ అడ్డుకున్నారంటూ అవాస్తవాలు రాశారని ఆంధ్రజ్యోతి పత్రిక పేర్కొంది.

రాధాకృష్ణకు లక్ష్మీనారాయణ చిరకాల మిత్రుడు. ఏపీ సీఐడీ అధికారులు ఆయన నివాసంలో సోదాలు చేస్తున్నారని, అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉందని తెలిసి, లక్ష్మీనారాయణను కలిసి ధైర్యం చెప్పేందుకు రాధాకృష్ణ అక్కడికి వెళ్లారు.

నిజానికి రాధాకృష్ణ వెళ్లేసరికే సీఐడీ అధికారులు లక్ష్మీనారాయణ ఇంటి లోపల ఉన్నారు.

మరి సీఐడీని అడ్డుకున్నది ఎవరు అని ఆంధ్రజ్యోతి కథనం ప్రశ్నించింది.

ఫొటో క్యాప్షన్,

ప్రతీకాత్మక చిత్రం

వరి సాగు వద్దన్నారని ఆత్మహత్య

వరి పంట వేయొద్దంటున్నందుకు తెలంగాణలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడని వెలుగు పత్రిక కథనం రాసింది.

ఆ కథనం ప్రకారం.. వరి సాగుపై గందరగోళం.. మరోవైపు పండించిన వరి పంటకు మద్దతు ధర దొరక్కపోవడం... వీటికి తోడు చేతికి అందివచ్చిన కొడుకు ఉద్యోగం రాక ఖాళీగా ఉండడం తదితర కారణాలు ఆ రైతు ఉసురు తీశాయి.

మెదక్ జిల్లా హావేలిఘనపూర్ మండలం బోగడ భూపతి పూర్‌లో రైతు కర్ణం రవి పొలానికి పుష్కలంగా నీళ్లుండడంతో వర్షాకాలంలో సన్నరకం వరి వేశాడు.

దిగుబడి తక్కువగానే వచ్చింది. చేతికి వచ్చిన పంటకు మద్దతు ధర పలకడం లేదు. ఇప్పుడు యాసంగి లో పుష్కలంగా నీరున్నా ఏం పండించాలనేది అర్థం కాని గందరగోళం.

దాంతో వరి తప్ప వేరే పంట పండని పరిస్థితి ఉంది.. నేను ఏం చేయాలని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నిస్తూ లేఖ రాసి తన పొలంలోనే ఆ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రతీకాత్మక చిత్రం

భార్యను చంపి, తలతో పోలీస్ స్టేషన్‌కు..

భార్యను చంపేసి ఆమె తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడని ఈనాడు ఒక కథనం రాసింది.

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో ఉండే మహ్మద్ పర్వేజ్, షమీమ్ బేగంలకు 14 సంవత్సరాల క్రితం వివాహమైంది. పర్వేజ్ పెట్రోల్ బంక్‌లో పని చేసేవాడు. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ ఆయన భార్య 2016లో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

జైలు నుంచి బయటకు వచ్చాక కొద్దికాలం దూరంగా ఉన్న భార్యా భర్తలు పెద్దలు సర్దుబాటు చేయడంతో కలిసి ఉంటున్నారు. ఆమెపై అనుమానం పెంచుకున్న పర్వేజ్ మద్యం తాగొచ్చిన ప్రతిసారీ గొడవ పడేవాడు. రెండు మూడు రోజులుగా గొడవలు తారాస్థాయికి చేరాయి.

గురువారం ఉదయం పాతనగరంలో కత్తి కొనుగోలు చేశాడు. మద్యం తాగి రాత్రికి ఇంటికి వచ్చాడు. భార్య, పిల్లలు నిద్రపోయేంత వరకు మెలకువగా ఉన్నాడు. అర్థరాత్రి దాటాక నిద్రిస్తున్న భార్య మెడపై వేటు వేశాడు. తల మొండెం వేరయ్యేంత వరకూ 30 -40సార్లు నరికాడు. ఆ తర్వాత భార్య తలతో ఔట్‌పోస్ట్‌కు వెళ్లి లొంగిపోయాడు.

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

'రాయుడును తీసుకోవాల్సింది'

2019 వన్డే వరల్డ్‌కప్‌ కోసం అంబటి రాయుడును పక్కనబెట్టి విజయ్‌ శంకర్‌ను తీసుకోవడంపై మాజీ కోచ్ రవిశాస్త్రీ స్పందించారని ఆంధ్రజ్యోతి కథనం రాసింది.

2019 వన్డే వరల్డ్‌కప్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టుపై అప్పట్లో కాస్త వివాదం నెలకొంది. ఫామ్‌లో ఉన్న అంబటి రాయుడును పక్కనబెట్టి విజయ్‌ శంకర్‌ను తీసుకోవడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. దీంతో అలిగిన రాయుడు కెరీర్‌కే ముగింపు పలికాడు.

ఆ జట్టు ఎంపికపై మాజీ కోచ్‌ రవిశాస్త్రి తాజాగా స్పందించాడు.

ముగ్గురు కీపర్లను సెలెక్టర్లు జట్టులో చేర్చడం సరైన నిర్ణయం కాదని స్పష్టం చేశాడు. దాని బదులు రాయుడు లేక శ్రేయాస్‌ అయ్యర్‌ను తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు.

'టీమ్‌ ఎంపికలో నేను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. కానీ వరల్డ్‌కప్‌నకు ముగ్గురు కీపర్లను తీసుకోవడం నాకు నచ్చలేదు. కచ్చితంగా అంబటి, శ్రేయాస్‌లలో ఒకరు ఎంపిక కావాల్సింది. కీపర్లుగా ధోనీ, పంత్‌, కార్తీక్‌ ఒకే జట్టులో ఉండాల్సిన అవసరం ఏముంది?' అని శాస్ర్తి ప్రశ్నించాడు.

వరల్డ్‌కప్‌ కోసం ప్రకటించిన జట్టులో ముందుగా ధోనీ, దినేశ్‌ కార్తీక్‌లను కీపర్లుగా తీసుకున్నా.. మధ్యలో ధవన్‌ గాయంతో పంత్‌ జట్టులోకి వచ్చాడు. అయితే భారత జట్టు ఆ ప్రపంచకప్‌ గ్రూప్‌దశను ఒక్క ఓటమితోనే ముగించినా.. సెమీస్‌లో ఓడడం తీవ్రంగా నిరాశ పరిచిందని శాస్త్రి తెలిపాడు.

వీడియో క్యాప్షన్,

తెలంగాణ: ‘‘ఈ మొలకలెత్తిన ధాన్యాన్ని ఇప్పుడు ఎవరు కొంటారు?’’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)