రైతుల ఉద్యమం తాత్కాలికంగా వాయిదాపడింది.. నరేంద్ర మోదీ ఇమేజ్ పెరిగిందా? తగ్గిందా?

  • సరోజ్ సింగ్
  • బీబీసీ ప్రతినిధి
రైతుల ఆందోళన

ఫొటో సోర్స్, ANI PHOTO

నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుమారు ఏడాది పాటు దిల్లీ సరిహద్దుల్లో కొనసాగించిన నిరసనలను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు రైతులు ప్రకటించారు.

రైతులు చేసిన ఐదు డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇచ్చింది.

ప్రభుత్వం ఇచ్చిన హామీలను, ఆ దిశగా జరుగుతున్న పురోగతిని వచ్చే జనవరి నుంచి ప్రతి నెల సమీక్షిస్తామని యునైటెడ్ కిసాన్ మోర్చా చెబుతోంది.

"రైతులు కోల్పోయిన ఆత్మగౌరవాన్ని తిరిగి పొందారు. రైతులు ఒక్కతాటిపై నిలిచారు. అన్నదాతలు తమ సత్తా చాటారు" అని యునైటెడ్ కిసాన్ మోర్చా నాయకుడు యోగేంద్ర యాదవ్ మీడియాతో అన్నారు.

"ఉద్యమం ఇక్కడితో ముగియలేదు. మేము దీన్ని వాయిదా వేశాం. జనవరి 15న యునైటెడ్ కిసాన్ మోర్చా సమావేశమై ఉద్యమ భవిష్యత్ కార్యచరణపై సమీక్షిస్తుంది" అని రైతు నాయకుడు బల్బీర్‌ రాజేవాల్ చెప్పారు.

ఈ ఉద్యమంతో కేంద్ర ప్రభుత్వం రైతుల ముందు తలవంచాల్సిన పరిస్థితి వచ్చిందని రైతు నాయకులు చెబుతున్నారు. అయితే, ఈ ఉద్యమంలో తాము 700 మంది రైతులను కోల్పోయామని అన్నారు.

ఆ చట్టాలతో రైతులకు మేలు జరుగుతుందని చెబుతూ వచ్చిన బీజేపీ ప్రభుత్వం.. ఇప్పుడు ఆ వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంది. రైతుల మరో ఐదు డిమాండ్లపై కూడా సానుకూలంగా స్పందించింది.

ఈ నేపథ్యంలో ఈ ఏడాది కాలంలో బీజేపీ ఏం సాధించినట్టు?

ఫొటో సోర్స్, BJP

వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా బీజేపీ ప్రభుత్వం ఎన్నో వాదనలు వినిపించింది.

ఈ చట్టాల వల్ల రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని పలువురు బీజేపీ నాయకులు చెప్పారు.

రైతుల నిరసనలను విపక్ష నాయకులు నడిపిస్తున్న రాజకీయ ఉద్యమం అని మరికొందరు అభివర్ణించారు.

ఇది కేవలం పంజాబ్, పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌ రైతుల ఉద్యమంగా ఇంకొన్నిసార్లు అభివర్ణించారు.

కానీ వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న తీరుపై పంజాబ్ బీజేపీ నాయకులు మాత్రం సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

"రైతుల ఉద్యమం ముగిసిన తీరు బాగుంది. ఆందోళనలకు దిగిన రైతులపై గతంలో కాల్పులు జరిగేవి లేదా వారిని జైళ్లలో పెట్టేవారు. కానీ ఈసారి అలాంటిదేమీ జరగలేదు" అని పంజాబ్ బీజేపీ అధికార ప్రతినిధి సుభాష్ శర్మ బీబీసీ హిందీతో చెప్పారు.

"రైతుల డిమాండ్లకు ఒప్పుకుని మా ప్రభుత్వం ఈ ఉద్యమానికి ముగింపు పలికింది. ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఈ ఉద్యమంలో కోల్పోయిందిగానీ లేదా సాధించిందిగానీ ఏమీ లేదు. మోదీ ఏం చేసినా రైతుల మంచి కోసమే చేశారు. భవిష్యత్తులో కూడా వారి మేలు కోసమే పని చేస్తారు" అని ఆయన తెలిపారు.

"మాపై కొందరు రైతుల్లో ఇదివరకు కొంత ఆగ్రహం ఉండేది. కానీ సాగు చట్టాలను ఉపసంహరించుకోవడంతో రైతుల్లో మాపై ఉన్న కోపం పోయింది. రైతుల కోపం చల్లారడంతో సమస్య పరిష్కారం దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. తమ మంచి కోరే పార్టీ బీజేపీ ఒక్కటేనని రైతులు త్వరలోనే అర్థం చేసుకుంటారు" అని సుభాష్ శర్మ చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters

కానీ సుభాష్ శర్మ వాదనతో సీనియర్ జర్నలిస్ట్ అదితి ఏకీభవించడం లేదు.

బీజేపీ వాదనను రైతులు అంగీకరించడం లేదని ఆమె చెప్పారు. ఈ ఉద్యమంతో తన పరిధి ఏంటో బీజేపీ గ్రహించిందని అన్నారు.

తన వాదనను ఒక ఉదాహరణతో వివరించే ప్రయత్నం చేశారు అదితి.

మీరు మీ ఇల్లు అమ్ముదామనుకున్నారు. కానీ దాని వాస్తవ విలువెంతో మీకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మీరు హడావుడిగా ఆ ఇల్లును విక్రయించారు. ఆ తర్వాత మీ ఇంటికి ఇంకాస్త ఎక్కువ ధర రావొచ్చని మీకు తెలిసింది. అప్పుడు మీరు నష్టపోయానని అనుకుంటారు.

కానీ ఈ మొత్తం ప్రక్రియలో ఒక మంచి విషయం ఏమిటంటే.. మీ ఇంటి వాస్తవ విలువెంతో మీకు తెలుస్తుంది. ఈ ఉద్యమంలో బీజేపీ విషయంలో కూడా దాదాపు ఇలాగే జరిగింది.

వీడియో క్యాప్షన్,

సింఘు బోర్డర్‌లో వ్యవసాయ చట్టాల రద్దును హర్షిస్తూ రైతుల సంబరాలు

ఈ ఉద్యమం కారణంగా తన పరిధి ఏంటో బీజేపీకి తెలిసొచ్చింది. ఎవరికైనా తన పరిధి తనకు తెలిస్తేనే ఆ తర్వాత ఏం అవసరం, ఏం చేయాలన్న విషయాలు తెలుస్తాయని సీనియర్ జర్నలిస్ట్ అదితి చెప్పారు.

మరోవైపు, ఈ ఉద్యమం ద్వారా బీజేపీ ఏం సాధించిందో తెలుసుకోవాలంటే ముందుగా ఏం కోల్పోవాల్సి వచ్చిందనే కోణంలో చూడాలని సీనియర్ జర్నలిస్ట్ పూర్ణిమా జోషి అభిప్రాయపడ్డారు.

"వ్యవసాయం విషయంలో కేంద్రంపై రైతుల్లో చాలా ఆగ్రహం ఉంది. వ్యవసాయ చట్టాలు అనేవి ఒక సమస్య మాత్రమే. పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లో చెరకు రైతుల సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. చెరకు కనీస మద్దతు ధరను రూ.25 పెంచడం వల్ల వారికి వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. దానితో పోలిస్తే పంట పండించడానికి అయ్యే ఖర్చు మరింత పెరిగింది. యూపీలోని ఆగ్రా ప్రాంతంలో బంగాళాదుంపలు సాగు చేసే రైతులు పుట్టెడు కష్టాల్లో ఉన్నారు.

ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఒకప్పుడు రూ.1200 ఉన్న ఎరువుల బస్తా ఇప్పుడు రూ.1700 - 1800లు పలుకుతోంది. ఈ అంశాలన్నీ కలిసి రైతుల ఉద్యమానికి కారణమయ్యాయి. ఈ ఉద్యమం ఎంత ఎక్కువకాలం కొనసాగితే బీజేపీ అంత ఎక్కువ నష్టపోయేది.

సుమారు ఏడాది తర్వాత ఇప్పుడు రైతుల ఉద్యమం ముగుస్తోంది. దాంతో ఎంతోకొంత నష్టం జరక్కుండా బీజేపీ ఇప్పుడు జాగ్రత్తపడిందని చెప్పొచ్చు. సాగు చట్టాలపై పట్టుదలతో ఏడాదిలో బీజేపీ సాధించింది ఇదే" అని సీనియర్ జర్నలిస్ట్ పూర్ణిమా జోషి వివరించారు.

ఫొటో సోర్స్, ANI

బీజేపీ కోల్పోయింది ఏమిటి?

ఇక బీజేపీ ఏం కోల్పోయిందనే విషయాన్ని రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి ఆర్థికపరమైన నష్టం. రెండోది రాజకీయంగా జరిగిన నష్టం.

ఆర్థిక నష్టానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటులో కొన్ని లెక్కలు చెప్పింది.

వివాదాస్పద సాగు చట్టాలు ఎంతో మంచివని చెబుతూ, వాటి ప్రచారం కోసం కేంద్ర ప్రభుత్వం 7 కోట్ల 25లక్షల రూపాయలు ఖర్చు చేసింది. అది కూడా ఈ ఏడాది ఫిబ్రవరి వరకే.

దీనితో పాటు కేంద్ర వ్యవసాయ శాఖలోని రైతు సంక్షేమ విభాగం రూ. 67 లక్షలు ఖర్చు చేసి మూడు ప్రమోషనల్ వీడియోలు, రెండు ఎడ్యుకేషనల్ వీడియోలు రూపొందించింది.

అంటే ఈ సాగు చట్టాల ప్రచారం కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు 8 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.

ఇక దిల్లీ సరిహద్దుల్లోని టోల్ ప్లాజాల దగ్గర రైతులు నెలల తరబడి ఆందోళనలు నిర్వహించారు.

రైతుల ఆందోళన కారణంగా చాలా టోల్ ప్లాజాల్లో టోల్ టాక్స్ వసూలు కాలేదని పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి చెప్పారు.

దీంతో రోజుకు 1 కోటీ 80 లక్షల రూపాయల నష్టం వచ్చినట్లు తెలిపారు. ఫిబ్రవరి 11 వరకు రూ.150 కోట్ల నష్టం వచ్చినట్లు లోక్‌సభలో చెప్పారు.

అలాగే, చాలాసార్లు, చాలా ప్రదేశాల్లో రైతులు రైళ్లను అడ్డుకున్నారు. రైతుల ఆందోళన కారణంగా గతేడాది చివరినాటికి రైల్వే శాఖకు సుమారు 2400 కోట్ల రూపాయల నష్టం వచ్చింది.

దీనితో పాటు రైతులను ప్రసన్నం చేసుకునేందుకు కేంద్రం ఈసారి అవసరం లేకున్నా మరింత ఎక్కువ గోధుమలు, వడ్లు కొనుగోలు చేసిందని కొందరు వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఇది ఒకరకంగా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు నష్టమేనని వారు అంటున్నారు.

కానీ ఆర్థికంగా కంటే రాజకీయంగా బీజేపీకి జరిగిన నష్టం గురించే ఎక్కువగా చర్చిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అకాలీ దళ్ ఈ ఏడాది ఎన్డీఏ నుంచి తప్పుకుంది. అకాలీ దళ్.. ఎన్డీఏలో ఎంతోకాలంగా మిత్రపక్షంగా ఉంది. బీజేపీ-అకాలీ దళ్‌ పార్టీలు పంజాబ్‌లో కలిసి పోటీ చేసేవి.

ఈ చట్టాల వల్ల పంజాబ్‌లో బీజేపీ పట్టు మరింత సడలిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

'రైతుల్లో బీజేపీ తన నమ్మకాన్ని కోల్పోయింది. ఏడాది పాటు తమతో ఇలా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. ఎందరో రైతులు చనిపోయారు. పంటలు నాశనమైపోయాయి. ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చిందని వాళ్లు ఆవేదన చెందుతున్నారు' అని సీనియర్ జర్నలిస్ట్ అదితి చెప్పారు.

అలాగే వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న తీరు కూడా మోదీ లిబరల్ ఇమేజ్‌ను దెబ్బతీసిందని ఆమె చెప్పారు. చట్టాలను కేంద్రం ఉపసంహరించుకుంది. కానీ కనీస మద్దతు ధరకు గ్యారెంటీ ఇవ్వలేదని ఆమె గుర్తు చేశారు.

ఇప్పుడు కనీస మద్దతు ధరతో పాటు ప్రజలు ఇతర సమస్యలు అంటే ద్రవ్యోల్బణం, వంట నూనెలు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వంటి వాటిపై కూడా గొంతెత్తడం మొదలుపెడతారు. అప్పుడు బీజేపీకి ఒక విభిన్న రాజకీయ వాతావరణం ఏర్పడుతుంది. అది పరిస్థితిని మరింత దిగజారుస్తుంది.

"పార్లమెంటులో ఈ చట్టాలను ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం, వాటిని ఉపసంహరించుకున్న పద్దతి బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అతిపెద్ద పొరపాటు.

అంటే పరిస్థితిని బీజేపీ సరిగా అంచనా వేయలేకపోయింది. అలాగే రైతుల శక్తిని గుర్తించలేకపోయింది. ఫలితంగా ఏడాది తర్వాత మోదీ సర్కార్ రైతుల ముందు లొంగిపోవాల్సి వచ్చింది. ఇది మోదీ ఇమేజ్‌ను బాగా దెబ్బతీసింది" అని సీనియర్ జర్నలిస్ట్ పూర్ణిమా జోషి చెప్పారు.

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో ఓటమి, మరికొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కారణం రైతుల ఉద్యమమేనని కొందరు చెబుతున్నారు.

కానీ వచ్చే ఏడాది జరగబోయే ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలే బీజేపీకి అసలు సిసలైన పరీక్షగా నిలవబోతున్నాయి. ఈ ఎన్నికల లోపు నష్ట నివారణ చర్యలను బీజేపీ తీసుకోగలదా?

వీడియో క్యాప్షన్,

రాజ్యాంగం ఇచ్చిన గిరిజన హక్కులు కోల్పోతున్న గిరిజనులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)