అప్పుడే పుట్టిన శిశువుల్లో కామెర్లు ప్రమాదకరమా? కళ్లు పచ్చగా ఉంటే బాక్సులో పెట్టాలా? ఎండలో పెడితే సరిపోతుందా?
- డాక్టర్ శిరీష పాటిబండ్ల
- బీబీసీ కోసం

ఫొటో సోర్స్, Getty Images
నవజాత శిశువుల్లో అతి సాధారణంగా కనిపించే సమస్య పుట్టు కామెర్లు. పుట్టిన మొదటి వారంలో ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని పుట్టు కామెర్లు అంటాం.
ఈ విషయంలో నేను రెండు రకాలుగా ప్రవర్తించే మనుషుల్ని తరచుగా చూస్తుంటాను.
ఒకరేమో, బిడ్డ కళ్లు కాస్త పచ్చగా కనిపించగానే ఇంటిల్లిపాదీ హైరానా పడి పోయి, పొద్దుటే ఆస్పత్రి ముందు ప్రత్యక్షమవుతారు. కాఫీలు, టిఫిన్లు కూడా చేయరు. ఇటు నన్నూ చేయనీయరు. ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు. నేను పరిగెత్తుకుంటూ వెళ్లలేదని గుర్రుగా చూస్తూ గుడ్ మార్నింగ్ చెప్తారు నా ఓపీ రూంలో.
మరికొందరేమో.. పిల్లాడికి ఎండ చూపించీ చూపించీ... తీరికగా రెండో వారంలో తీసుకొస్తారు.
ఈ విధంగా ఒకే సమస్యని ఈ రెండు రకాలుగా చూసేవాళ్లతోనూ డాక్టర్లకు చిక్కే. అందుకే వీళ్ళందరికీ పుట్టు కామెర్ల గురించి పట్టుబట్టి మరీ చెప్తుంటాను.
పుట్టు కామెర్లు పెద్దవాళ్లలో వచ్చే కామెర్లకు పూర్తిగా భిన్నమైనవి. చెప్పాలంటే ఇది అసలు రోగమే కాదు.
నవజాత శిశువులు అందరిలోనూ ఈ కామెర్లు ఉంటాయి. ఎటొచ్చీ, ఒక స్థాయికి మించి ఉండటమే ప్రమాదానికి దారి తీస్తుంది.
పెద్దవాళ్లలో వచ్చే పచ్చకామర్లు లివర్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి. అతిగా మద్యం సేవించడం, మందుల సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఇతర కారణాలు. ఇవి ఒక్కోసారి ప్రాణాంతకం కూడా.
పసిపిల్లల్లో వచ్చే కామెర్లు దాదాపుగా లివర్ ఇమ్మెచ్యూరిటీ వల్ల వస్తాయి. అరుదుగా తల్లి ద్వారా సంక్రమించే ఇన్ఫెక్షన్ల వల్లగాని, జన్యుపరమైన జబ్బుల వల్ల కానీ రావచ్చు.
కానీ గుర్తుపెట్టుకోండి, అలాంటి పిల్లల్లో కామెర్లతోపాటు జబ్బుకు సంబంధించి ఇతర లక్షణాలు కనపడతాయి.
పుట్టు కామెర్లలో పిల్లలు పసుపు పచ్చగా కనిపించినా తల్లి పాలు తాగుతూ హుషారుగా ఉంటారు.
ఫొటో సోర్స్, GETTY IMAGES
నొప్పి లేని ఫోటోథెరపీ వైద్యం ద్వారా బిడ్డకు పచ్చకామెర్లు తగ్గించవచ్చు
హుషారుగా ఉంటే సమస్య ఏమిటి?
అప్పుడే పుట్టిన పిల్లల్లో లివర్ ఇంకా అంతగా పరిపక్వత చెంది ఉండదు. అందువల్ల శరీరంలో తయారయ్యే బిలిరుబిన్ అనే పదార్థాన్ని విసర్జించే ప్రక్రియ కాస్త మందకొడిగా ఉంటుంది.
ఆపైన రక్తంలో జరిగే మార్పులు మామూలు కంటే ఎక్కువ ఉండటం వలన ఈ బిలిరుబిన్ పసిపిల్లల్లో పెద్దవాళ్ళ కంటే ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది.
మొత్తానికి ఉత్పత్తి ఎక్కువ, విసర్జించేది తక్కువ. తద్వారా శరీరంలో బిలిరుబిన్ మోతాదు ఈ పసిపిల్లల్లో ఎక్కువగా ఉంటుంది.
ఒకింత ఎక్కువ ఉండటం వలన ఇన్ఫెక్షన్లు రాకుండా పసిపిల్లలను ఇది రక్షిస్తుంది అని కూడా కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి.
కానీ, ప్రతి ఇద్దరు నవజాత శిశువుల్లో ఒకరికి, అంటే 50 శాతం పిల్లల్లో ఈ పుట్టు కామెర్లు మోతాదుకు మించి వస్తాయి.
అలా రావడానికీ కారణాలున్నాయి. ముఖ్యంగా తల్లి తగినంత నీరు తీసుకోకపోవడం, బిడ్డకు తగినంత పాలు పట్టకపోవడం.. దీనివల్ల బిడ్డ డీహైడ్రేట్ అవుతుంది. పేగు కదలిక తగినంతగా ఉండదు. అందువల్ల బిలిరుబిన్ విసర్జన తగ్గుతుంది.
తల్లీబిడ్డల రక్తం గ్రూపులు వేరు వేరు అయి ఉండటం కూడా మరొక ఒక ముఖ్య కారణం(ABO incompatibility).
ఇలా కొన్ని కారణాల వల్ల బిడ్డ శరీరంలో బిలిరుబిన్ నార్మల్ కంటే ఎక్కువగా ఉత్పత్తి అవ్వడమో, లేక నిలిచిపోవడమో జరుగుతుంది.
అదంతా బిడ్డ కంటి పొరలకూ, చర్మానికీ పట్టి బిడ్డ కళ్ళు, శరీరం పసుపుపచ్చగా మారతాయి. సగటున అయిదవరోజు బిడ్డలో ఈ జాండీస్ ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మూడో రోజు నుంచి మూడో వారం వరకు కూడా కొనసాగుతాయి.
బిడ్డ బరువు, మెచ్యూరిటీ, ఇతర రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి బిలిరుబిన్ ప్రమాద స్థాయికి చేరుకుందో, లేదో వైద్యులు పరీక్షించి చెబుతారు. అలాగే, ఎప్పుడు ట్రీట్మెంట్ అవసరమో చెప్తారు.
ఫొటో సోర్స్, GETTY IMAGES
బిడ్డ శరీరంలో బిలిరుబిన్ ఉత్పత్తి ఎక్కువగా ఉండడం వల్ల బిడ్డ కంటి పొరలకూ, చర్మానికీ పట్టి కళ్ళు, శరీరం పసుపుపచ్చగా మారతాయి
బిలిరుబిన్ పెరిగితే ప్రమాదం ఏమిటి?
రక్తంలో ఒక లెవెల్ దాటిందంటే బిలిరుబిన్ మెదడుకు కూడా చేరుతుంది. మొదటగా, కామెర్లు ఎక్కువైన పసిపిల్లలు ఎక్కువ మగతగా ఉంటారు. పాలు తాగడానికి నిరాకరిస్తారు.
జాండీస్ ఎక్కువయ్యేకొద్దీ మరింత డల్‌గా అవ్వడం, ఫిట్స్ రావడం, కోమాలోకి పోవడం, ఒక్కోసారి మరణించడం కూడా జరుగుతుంది.
బిలిరుబిన్ వలన ఎన్కెఫలోపతి అనే శాశ్వత సమస్య వస్తుంది. బిడ్డ ప్రాణాలతో ఉన్నా అవిటి బిడ్డలాగే ఉండిపోతాడు.
అందుకే సకాలంలో గుర్తించి ఫోటోథెరపీ (UV light therapy) అనే సులభమైన, చవకైన పద్ధతి ద్వారా ఈ కామెర్లను తగ్గించి సేఫ్ జోన్ లెవెల్‌కి తీసుకు రావాలి.
ఏమాత్రం ఆలస్యమైనా ఒక్కోసారి బిడ్డకు రక్తమార్పిడి చేసి మరీ రక్తంలోని బిలిరుబిన్ తగ్గించాల్సి వస్తుంది. ఇది చాలా వ్యయప్రయాసలతో కూడుకున్న చికిత్స. ఇన్ఫెక్షన్లతో బాటు దీర్ఘకాలిక సైడ్ ఎఫెక్టుల ప్రమాదం కూడా ఉన్న చికిత్స ఇది. అంత శ్రమ పడినా దెబ్బ తిన్న మెదడు భాగాన్ని మాత్రం వెనక్కు తేలేం.
యాభై శాతం నవజాత శిశువులకు ఫోటోథెరపీ అవసరమయ్యేంత పుట్టుకామెర్లు వస్తాయి. దీన్ని గుర్తించడం చాలా సులభం.
అనుభవజ్ఞులైన పిల్లల వైద్యులైతే ఎంత శాతం జాండీస్ ఉండి ఉంటుందో కంటితో చూసే చెప్పగలరు. లేదా చిన్న రక్త పరీక్ష అవసరమవుతుంది.
దీనికి వైద్యం (ఫోటోథెరపీ) కూడా బిడ్డకు నొప్పి కలిగించేది కాదు. దాదాపు ఎటువంటి సైడ్ ఎఫెక్టులూ లేనిది. చిన్న పట్టణాలలో సైతం అందుబాటులో ఉంటుంది. ఏమంత ఖరీదు కూడా కాదు.
త్వరగా గుర్తించగలిగినప్పుడు, ఒక పూట లేదా ఒక రోజులో పుట్టు కామెర్లు ఏమీ ప్రాణాంతకం కాదు. అందుకే అంత హైరానా పడాల్సిన పని లేదు. పొద్దుటి ఎండలో ఉంచడం పెద్ద ఫలితాన్నివ్వదు.
కానీ ఒక్కొక్క రోజూ గడిచేకొద్దీ కామెర్లు ఎక్కువవుతాయి. అప్పుడు అత్యవసర పరిస్థితి నెలకొంటుంది. 'గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చినట్లు’ అవుతుంది.
ఫోటోథెరపీ దాటి రక్తమార్పిడి లాంటి క్లిష్ట పరిష్కారాలు వెతుక్కోవలసివస్తుంది. ఆ సదుపాయం అన్నిచోట్లా అన్నిసార్లూ అందుబాటులో ఉండకపోవచ్చు.
చాలా కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈ కామెర్లు కేవలం పుట్టు కామెర్లు కాకుండా ఇతర వ్యాధుల వల్ల వచ్చేవి కూడా ఉంటాయి.
కంజెనిటల్ థైరాయిడ్, బిలియరి అట్రీసియా, TORCH ఇన్ఫెక్షన్లు మొదలైనవి ఇందుకు కొన్ని కారణాలు. త్వరగా గుర్తించడం ద్వారా అటువంటి వ్యాధులకూ చాలా వరకు ఉపశమనం దొరుకుతుంది.
అందుకే, పుట్టు కామెర్ల విషయంలో ఆదుర్దా అవసరం లేదు, కానీ అలసత్వం మంచిది కాదు.
పుట్టిన బిడ్డకు మొదటి మూడు రోజులూ, అయిదవరోజు, ఏడవరోజు పిల్లల డాక్టరుకు చూపించాలి.
3 నుంచి 5వ రోజులోపు బ్లడ్ గ్రూపు, బిలిరుబిన్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్ తప్పక చేయించాలి.
డాక్టర్లు ఏవైనా అదనపు టెస్టులు సూచిస్తే, ఎందుకని అడిగి తెలుసుకోవటం మీ హక్కు. అంతేగాని చేయించకుండా స్వంత నిర్ణయాలు తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించకండి.
ఎందుకంటే, మీ పిల్లల ఆరోగ్యం వారి హక్కు. కానీ దాన్ని వారు మీ ద్వారా మాత్రమే నెరవేర్చుకోగలుగుతారు.
(వైద్యపరమైన విషయాలను సులభంగా వివరించడానికి రాసిన కథనం. రచయిత వైద్యురాలు.)
ఇవి కూడా చదవండి:
- తరతరాలుగా అమ్మమ్మలు, నానమ్మలు చేసే సంప్రదాయ మసాజ్ రహస్యం కనిపెట్టిన అమెరికా పరిశోధకులు
- బిడ్డ పుట్టిన నిమిషం లోపే బొడ్డు తాడు కత్తిరిస్తే ఏమవుతుంది
- హెరాయిన్: ఒకనాటి ఈ దగ్గు మందు మత్తు మందుగా ఎలా మారింది... చరిత్రలో ఏం జరిగింది?
- తల్లిపాలు తాగిన పిల్లల్లో ఎక్కువ తెలివితేటలు ఉంటాయా... పాలిచ్చే తల్లి మద్యం తాగవచ్చా?
- పళ్లు ఎంతసేపు తోముకోవాలి? రెండు నిమిషాలు బ్రష్ చేస్తే చాలా? సైన్స్ ఏం చెబుతోంది?
- 'నా పాపను బయోవేస్ట్ అన్నారు. ఆ మాటకు నా గుండె పగిలింది‘
- 'వృద్ధాప్యం ఒక వ్యాధి, దాన్ని నయం చేయవచ్చు' -హార్వర్డ్ శాస్త్రవేత్త డేవిడ్ సింక్లెయిర్
- గర్భిణులు కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగితే.. పిల్లలు ఎర్రగా పుడతారా
- కాన్పు నొప్పులను తట్టుకొనేందుకు వీఆర్ హెడ్సెట్
- గర్భస్థ శిశువుల చేతుల్లో తొండల మాదిరి కండరాలు... పుట్టిన తరువాత ఏమై పోతున్నాయి...
- అండ దానం: ‘కొన్ని కుటుంబాల ఆశలు నామీదే ఉన్నాయి’
- అంతరిక్షంలో ఎక్కువ ఇబ్బంది పడేది పురుషులా.. మహిళలా?
- సరోగసీ నియంత్రణ బిల్లు: ఈ బిల్లు ఎందుకు అవసరం?
- యోని గురించి తెలుసుకోవాల్సిన అయిదు ముఖ్యమైన విషయాలు
- అఫ్గానిస్తాన్: తాలిబాన్ పాలనలో బిడ్డకు జన్మనివ్వడం అంటే ఎలా ఉంటుంది..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)