కెంటకీ టోర్నడో: 70 మందికిపైగా మృతి, ప్రాణనష్టం 100 దాటొచ్చంటున్న గవర్నర్ - Newsreel

టోర్నడో కారణంగా పట్టాలు తప్పిన రైలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

టోర్నడో కారణంగా పట్టాలు తప్పిన రైలు

అమెరికాలోని కెంటకీలో భీకర సుడిగాలులకు(టోర్నడో) 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఆ రాష్ట్ర గవర్నర్ ఆండీ బెషీర్ వెల్లడించారు.

మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని.. 100 దాటొచ్చని ఆయన అన్నారు.

కెంటకీ రాష్ట్ర చరిత్రలోనే ఇవి అత్యంత విధ్వంసకర టోర్నడోలని ఆయన తెలిపారు.

అమెరికాలోని అనేక రాష్ట్రాలలో టోర్నడోలు విధ్వంసం సృష్టిస్తుంటాయి.

తాజా టోర్నడోల కారణంగా ఇల్లినాయిస్‌లోని ఓ అమెజాన్ గోదాం పైకప్పు కూలిపోయి కార్మికులు అక్కడ చిక్కుకుపోయారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

టోర్నడో తాకిడికి పైకప్పు ఎగిరిపోయిన భవనం

టోర్నడో విరుచుకుపడిన సమయంలో కెంటకీలోని మేఫీల్డ్‌లో ఒక కొవ్వొత్తుల పరిశ్రమలో 100 మందికిపైగా చిక్కుకుపోయారని 'న్యూయార్క్ టైమ్స్' తెలిపింది.

వారిలో కొందరి ప్రాణాలకు ప్రమాదమేర్పడవచ్చని గవర్నర్ అన్నారు.

పైకప్పులు కూలిపోవడం వల్ల ఎంతమంది చనిపోయారు, గాయపడ్డారనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

అయితే, ప్రాణనష్టం భారీగా ఉండొచ్చని స్థానిక అధికారులు, అత్యవసర విభాగాల వారు చెబుతున్నారు.

బెంగళూరు చేరుకున్న సాయితేజ మృతదేహం, రేపు స్వగ్రామంలో అంత్యక్రియలు

తమిళనాడు కున్నూరు సమీపంలో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన చిత్తూరు జిల్లా కురబలకొట మండలం రేగడపల్లెకు చెందిన సాయితేజ మృతదేహం బెంగళూరుకు చేరుకుంది.

మృతదేహం ఆదివారం ఆయన స్వగ్రామం రేగడపల్లెకు చేరుకుంటుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు.

ఆదివారం ఉదయం 9 గంటలకు రేగడ పల్లెలో సైనిక లాంఛనాలతో సాయితేజ దహన క్రియలు జరుగుతాయని తెలిపారు.

సాయితేజ మృతదేహం ప్రస్తుతం బెంగళూరులోని యల్హంక ఎయిర్ పోర్టులో ఉంది. దిల్లీ నుంచి తీసుకొచ్చిన మృతదేహాలతో మొదట కోయంబత్తూరు చేరుకున్న ప్రత్యేక విమానం అక్కడ రెండు మృతదేహాలను అప్పగించిన తర్వాత బెంగళూరు చేరుకుంది.

ఫొటో క్యాప్షన్,

బెంగళూరు విమానాశ్రయంలో సైనిక వందనం

సాయితేజ తమ్ముడు మహేశ్ అభ్యర్థన మేరకు మృతదేహాన్ని బెంగళూరులోనే ఉంచి రేపు ఉదయం అంత్యక్రియలకు నేరుగా చిత్తూరు జిల్లాకు తీసుకురానున్నారు.

మరోవైపు, ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సాయి తేజ కుటుంబానికి 50 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)