అలీ అక్బర్: ఈ కేరళ సినీ దర్శకుడు ఇస్లాం వదిలి, హిందూ మతం ఎందుకు స్వీకరిస్తున్నారు

  • ఇమ్రాన్ ఖురేషీ
  • బీబీసీ కోసం
హిందూ మతం స్వీకరిస్తున్న అలీ అక్బర్

ఫొటో సోర్స్, FACEBOOK/ALIAKBAR

ఫొటో క్యాప్షన్,

హిందూ మతం స్వీకరిస్తున్న అలీ అక్బర్

కేరళకు చెందిన సినీ దర్శకుడు అలీ అక్బర్ ఇస్లాం వదిలి హిందూ మతం స్వీకరించాలని నిర్ణయించారు. ఆయన తన పేరు రామసింహన్‌గా మార్చుకుంటున్నట్లు ప్రకటించారు.

జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినపుడు కొందరు స్పందించిన తీరుకు బాధపడి తాను హిందూ మతం స్వీకరించినట్లు అలీ అక్బర్ చెప్పారు.

జనరల్ రావత్ చనిపోయారనే వార్తకు కొందరు సోషల్ మీడియాలో నవ్వుతున్న ఎమోజీలు పోస్ట్ చేయడంపై అలీ అక్బర్ విచారం వ్యక్తం చేశారు. ఆయన దీనిపై బీబీసీతో మాట్లాడారు.

"బిపిన్ రావత్ చనిపోయిన తర్వాత చాలా మంది నవ్వుతున్న ఎమోజీలు పెట్టారు. అది చాలా దారుణమైన విషయం. మనం సోషల్ మీడియాలో అలాంటివి పోస్ట్ చేసిన వారి పేర్లు చూడచ్చు. వారందరూ ముస్లింలే. మతమే అన్నిటికంటే ప్రాధాన్యమనుకుని ఎలా జీవించగలం. నా దృష్టిలో మతం మూడో నంబర్‌లో ఉంటుంది, మొదటి, రెండో స్థానాలలో దేశమే ఉండాలి" అన్నారు.

కశ్మీర్ అంశంలో తీవ్రవాదులకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టినందుకే ఆయన చనిపోయినపుడు కొందరు ముస్లింల నుంచి అలాంటి స్పందన వచ్చిందని 59 ఏళ్ల అలీ అక్బర్ భావిస్తున్నారు.

"అలాంటి పోస్టులు చేసినవారికి వ్యతిరేకంగా ఏ ముస్లిం నేత కూడా నోరు విప్పలేదు. అలా పోస్ట్ చేయకండి అని చెప్పలేదు. కేరళలో ఇస్లామిక్ ఉద్యమం ఇప్పుడు ఇస్లామిక్‌లా లేదు. వాళ్లు ఇప్పుడు కేరళను ఒక ఇస్లామిక్ రాష్ట్రంగా మార్చాలని అనుకుంటున్నారు. కొందరు నేతలు ఆ మాటను బహిరంగంగా చెబుతున్నారు" అని కూడా అలీ అక్బర్ ఆరోపించారు.

అక్బర్ తాను '1921 ఫ్రమ్ రివర్ టు రివర్' అనే చిత్రం రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పారు. ఆ సమయంలో మలబార్ ప్రాంతంలో బ్రిటన్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు నిజానికి మత ఘర్షణలని, అందులో ముస్లింలు హిందువులను ఊచకోత కోశారని ఆయన తన చిత్రం ద్వారా చూపించాలని అనుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఎన్నో ఘటనల ప్రస్తావన

"వాళ్లు(ముస్లిం నేతలు) గత ఏడాది నుంచీ నా వెంటపడ్డారు. సమాజానికి నిజం తెలియడం వాళ్లకు ఇష్టం లేదు. నేను ఇప్పుడు ఈ సినిమాను పూర్తి చేశాను. ఆ చిత్రాన్ని వచ్చే నెలలో రిలీజ్ చేయబోతున్నాను" అని అలీ అక్బర్ తెలిపారు.

సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసిన అలీ అక్బర్ "నాకు పుట్టినపుడు వేసిన బట్టలను నేను ఇప్పుడు వదిలేస్తున్నాను. ఈ రోజు నుంచి నేను భారతీయుడిని, భారత్‌కు వ్యతిరేకంగా నవ్వుతున్న వేలాది ఎమోజీలను పోస్ట్ చేసినవారికి ఇది నా సమాధానం" అన్నారు.

అయితే వీడియోపై స్పందనలు రావడంతో తర్వాత ఆయన దాన్ని తొలగించారు. ఇస్లాం వదిలేయాలనుకునేలా తనకు బాధ కలిగించిన ఎన్నో ఘటనలను అక్బర్ ప్రస్తావించారు.

"నేను పుట్టి పెరిగింది ఒక గ్రామంలో అక్కడ ఎక్కువగా క్రిస్టియన్లు ఉంటారు. అక్కడ ఒక పెద్ద చర్చి కూడా ఉంది. అక్కడి కొందరు ఛాందస ముస్లింలు గ్రామం పేరును ఇరితిపేట నుంచి అరువీధురగా మార్చాలని అనుకుంటున్నారు. అది ఒక క్రిస్టియన్ ప్రాంతం కాబట్టి వాళ్లు దాని పేరు మార్చాలనుకుంటున్నారు" అన్నారు.

వీడియో క్యాప్షన్,

రంజాన్ మాసంలో హిందువుల ఉపవాస దీక్ష

కేరళలో ఇస్లామీకరణ ఉద్యమం 1970వ దశకంలో ప్రారంభమయ్యిందని, గల్ఫ్ దేశాల నుంచి వచ్చే డబ్బును కూడా దానికోసం ఖర్చు చేస్తున్నారని ఈ దర్శకుడు ఆరోపిస్తున్నారు.

"కానీ, ప్రభుత్వం దీనికి బాధ్యులైనవారిపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. నేను పదేళ్ల క్రితం కువైట్‌లో ఉంటున్నప్పుడు దీనిపై ఫిర్యాదు చేశాను. అప్పుడు కూడా నేను వీరి 'లవ్ జిహాద్, హలాల్ జిహాద్' గురించి హెచ్చరించాను" అన్నారు.

"మిగతా మతాల వారు ముస్లింలతో కలిసి కూర్చోవడం, మాట్లాడడం కూడా మానేసే ఒక రోజు వస్తుంది అని నేను హెచ్చరించాను. ప్రస్తుతం ఎలాంటి వాతావరణం ఏర్పడిందంటే.. ముస్లింలను అనుమానాస్పదంగా చూస్తున్నారు. మా మతంలో ఎవరైనా తప్పు చేస్తే, దానికి అగ్ర నేతలు బాధ్యత వహించాలి. దానికి వ్యతిరేకంగా వారు ప్రచారం చేయాలి. కానీ, ఇక్కడ నాయకత్వం వైపు నుంచి ఏ జవాబుదారీతనం లేదు."

అలీ అక్బర్.. క్రిస్టియన్ అయిన ఆయన భార్య లూసీ అమ్మ వచ్చే వారం ఆర్య సమాజం ద్వారా కొత్త మతంలో రిజిస్టర్ చేసుకోడానికి సిద్ధమవుతున్నారు. మరో 20 రోజుల్లో హిందూ మతం స్వీకరించాలని వారు భావిస్తున్నారు.

తనకు 30, 25 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారని, వారు ముస్లింలని అక్బర్ చెప్పారు. పిల్లలు మేజర్లు కాబట్టి వారికి నచ్చిన మతాన్ని వారు ఎంచుకోవచ్చని అన్నారు.

వీడియో క్యాప్షన్,

రెండేళ్లుగా అమర్‌నాథ్ యాత్ర రద్దు

హిందూ మతమే ఎందుకు

"ఎందుకంటే హిందుత్వం ఒక మతం కాదు, ఒక సంస్కృతి. ఒక మనిషిగా ఉండవచ్చు. ఎందుకంటే భగవంతుడు మన లోపలే ఉంటాడు. దేవుడిని మనలోనే చూసుకోవడం అనేది అత్యున్నతం" అన్నారు.

ఆయన తన పేరును రామ సింహన్ అని పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. కేరళలో ఇస్లాం వదిలి హిందూ మతం స్వీకరించిన మొదటి వ్యక్తి రామ సింహన్ అని ఆయన చెప్పారు.

"కేరళలో హిందూ మతం స్వీకరించిన మొదటి ముస్లిం రామసింహన్. ఆగస్టు 1947న భారత్‌కు స్వాతంత్ర్యం రావడానికి కొన్ని రోజుల ముందే అతడిని హత్య చేశారు" అన్నారు అలీ అక్బర్.

గతంలో ఇస్లామిస్టులపై చేసిన వ్యాఖ్యలతో అక్బర్ వివాదాల్లో నిలిచారు.

మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్ ఇస్లాం మతం స్వీకరించడాన్ని ఉదాహరణగా చూపుతూ ముస్లింలు హిందువులను మతం మారేలా ప్రేరేపిస్తున్నారని ఆయన 2018లో కామెంట్ చేశారు. దీంతో ఆయనపై దాడి కూడా జరిగింది.

అంతకు ముందు మదరసాలో ఉన్న సమయంలో మతపెద్దలు తనను వేధించారని ఆయన ఆరోపించారు.

‘‘మీరు ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అనుసరిస్తున్నారని మీ విమర్శకులు అంటున్నారు’’ అని బీబీసీ ఆయన స్పందన కోరింది.

"నేను ఆ భావజాలాన్ని అనుసరించలేను. ఆర్ఎస్ఎస్ భారత సాంస్కృతిక శాఖ. ఆర్ఎస్ఎస్‌లో ఒక ముస్లిం వేదిక కూడా ఉంది. అది ఒక జాతీయవాద సంస్థ" అని కొన్నిరోజుల్లో రామ సింహన్‌గా మారనున్న అలీ అక్బర్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)