Hacked: నరేంద్ర మోదీ ట్విటర్ ఖాతా హ్యాక్.. భారత్‌లో బిట్ కాయిన్‌కు అధికారిక ఆమోదం, వాటిని కొని ప్రజలకు పంచి పెడుతున్నామంటూ ట్వీట్

మోదీ

ఫొటో సోర్స్, Twitter

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్సనల్ ట్విటర్ అకౌంట్ నుంచి చేసిన ట్వీట్ ఇది. రాత్రి 2.11 నిమిషాలకు ఒకటి, 2.15 నిమిషాలకు మరొక ట్వీట్ చేశారు.

చట్టబద్ధంగా చెల్లుబాటయ్యే కరెన్సీగా బిట్‌కాయిన్‌ను భారత్ అధికారికంగా ఆమోదించిందని ఈ ట్వీట్ల సారాంశం.

అంతేకాదు.. 500 బిట్‌కాయిన్లను భారత్ కొనుగోలు చేసిందని, వాటిని ప్రజలందరికీ పంపిణీ చేస్తోందని కూడా ఈ ట్వీట్‌లో చెప్పారు.

త్వరపడండి అంటూ ఒక లింక్ కూడా ట్వీట్‌కు జత చేశారు. అయితే, ఆ లింక్ స్కామ్ కావొచ్చని అనుమానిస్తున్నారు.

ఈ ట్వీట్లను కొన్ని నిమిషాల్లోనే మోదీ ట్విటర్ అకౌంట్ నుంచి డిలీట్ చేశారు. కానీ ఈ ట్వీట్ల స్క్రీన్ షాట్లు వైరల్‌ అయ్యాయి. ట్విటర్‌లో #Hacked ట్రెండ్ అవుతోంది.

ఫొటో సోర్స్, BJP

ప్రధానమంత్రి కార్యాలయం ఏం చెప్పింది?

ప్రధాని వ్యక్తిగత ట్విటర్ అకౌంట్ నుంచి ఈ ట్వీట్లు రాగానే ప్రధానమంత్రి కార్యాలయం- పీఎంవో వివరణ ఇచ్చింది.

ఈ ట్వీట్లు నరేంద్ర మోదీ చేసినవి కాదని వివరణ ఇస్తూ ఆదివారం తెల్లవారుజామున 3.18 నిమిషాలకు పీఎంవో ట్వీట్ చేసింది.

మోదీ ట్విటర్ అకౌంట్ కొద్దిసేపు ట్యాంపరింగ్‌కు గురైందని ప్రకటించింది. దీన్ని ట్విటర్ దృష్టికి తీసుకెళ్లామని, వెంటనే ప్రధాని ట్విటర్‌ అకౌంట్‌ను సెక్యూర్ చేశారని తెలిపింది. ఆ సమయంలో చేసిన ట్వీట్ల గురించి పట్టించుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

వీడియో క్యాప్షన్,

బిట్‌కాయిన్ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది?

ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ అకౌంటే ట్యాంపరింగ్‌కు గురికావడంతో ట్విటర్ యూజర్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

'ఇక ఎట్టకేలకు మనందరికీ 15లక్షలు రాబోతున్నాయి.. కాకపోతే క్రిప్టో కరెన్సీలో' అంటూ BeardedBanker16 అనే యూజర్ కామెంట్ చేశారు.

‘ఈ హ్యాకర్ ఎవరో మోదీ 15 లక్షల ఐడియాని ఫాలో అయ్యాడు’ అంటూ SOseetarama అనే ట్విటర్ యూజర్ కామెంట్ చేశారు.

ప్రధాని మోదీ లాంటి వాళ్ల అకౌంట్‌కే రక్షణ లేదు. ఇక మన పరిస్థితి ఏంటని బాలాజీ గుప్తా ప్రశ్నించారు.

'మీ అకౌంట్‌ను హ్యాక్ చేసేంత ధైర్యం ఎవరికుంటుంది సార్' అంటూ @bashashameer10 ట్వీట్ చేశారు.

ఫొటో1: క్రిప్టో ప్రజల హార్డ్‌వర్క్.. ఫొటో2: వెంటనే స్పందించిన పీఎంవో అంటూ దుర్గేశ్ తివారీ కామెంట్ చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయిందని నిర్ధరణ అయిందంటూ రాజకీయ విశ్లేషకులు తెహసీన్ పూనవాలా ట్వీట్ చేశారు.

2020 సెప్టెంబర్‌లో కూడా ప్రధాని నరేంద్ర మోదీ పర్సనల్ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ను గుర్తు తెలియని ఒక గ్రూప్ హ్యాక్ చేసింది.

ప్రధాని మోదీకి ట్విటర్‌లో 7కోట్ల 30 లక్షల మందికి పైగా ఫాలోయర్లు ఉన్నారు. ట్విటర్‌లో ఎక్కువ మంది ఫాలోయర్లు ఉన్న రాజకీయ నాయకుల్లో మోదీ ఒకరు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)