మోదీ ప్రభుత్వంపై రైతుల విజయం.. ఏడాది పోరాటంలో 7 కీలక ఘట్టాలు
దిల్లీ సరిహద్దుల్లో ఏడాదికి పైగా సాగిన రైతుల పోరాటం చివరకు విజయవంతంగా ముగిసింది.
గత ఏడాది సెప్టెంబర్‌లో పార్లమెంటు ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవడంతో పాటు.. ఎంఎస్‌పీపై కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వటంతో రైతులిప్పుడు ఇంటిదారి పట్టారు.
ఈ ఉద్యమాన్ని దేశ చరిత్రలోనే సుదీర్ఘకాలం పాటు సాగిన అతి పెద్ద ఉద్యమంగా భావిస్తున్నారు.
రైతు ఉద్యమంలో పాల్గొంటున్నవారిని ఆందోళన జీవులంటూ పార్లమెంటు సాక్షిగా ఎద్దేవా చేసిన ప్రధాని మోదీ.. చివరకు టీవీ ముందుకొచ్చి రైతులకు క్షమాపణలు చెబుతూ చట్టాలను రద్దు చేసేంత వరకు సాగిన ఏడాది కాలంలో ఎన్నో నాటకీయ పరిణామాలు... మరెన్నో కీలక మలుపులు...
1. సంప్రదింపులు, చర్చలు లేకుండానే చట్టాలు
సంక్షిప్తంగా.. ఏపీఎంసీ బైపాస్ చట్టం, కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం, ఎసెన్షియల్ కమోడిడీస్ చట్టం - అని పిలిచే ఈ మూడు చట్టాల పుట్టుకే చాలా గందరగోళం... రైతు సంఘాలతో సంప్రదింపులు లేవు.. ఓ వైపు కరోనా మహమ్మారి విలయతాండవం... అయినా సరే.. ప్రభుత్వం ముందుగా జూన్ 2020లో ఆర్డినెన్సుల రూపంలో అమల్లోకి తెచ్చి.. ఆ తర్వాత సెప్టెంబర్‌లో పార్లమెంటులో చర్చ లేకుండానే వాటిని చట్టాలుగా చేయటం వివాదాస్పదం అయ్యింది.
మెజారిటీ ప్రజల బతుకు దెరువుతో ముడిపడి ఉన్నవి కాబట్టి బిల్లులను పార్లమెంట్ సెలెక్ట్ కమిటీకి పంపి, ఆ తరువాత తగిన నిర్ణయం తీసుకోవాలన్న ప్రతిపక్షాల మాటలను పెడచెవిన పెట్టిందన్న అపవాదును మూటగట్టుకుంది మోదీ ప్రభుత్వం.
అలా ఈ చట్టాల మంచిచెడ్డలు అటుంచి, ముందుగా ప్రభుత్వం అనుసరించిన ప్రక్రియే ప్రశ్నార్థకంగా మారిపోయింది.
2. రాజుకున్న రైతుల పోరు
సాగు చట్టాలపై రైతు సంఘాల ఆందోళనలు క్రమంగా తీవ్రరూపం దాల్చాయి.
దిల్లీ బాట పట్టిన పంజాబ్, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల రైతులను సరిహద్దుల్లోనే నిలిపివేశారు.
వారిపై లాఠీచార్జి, టియర్ గ్యాస్, వాటర్ కేనన్స్.. ఇలా రకరకాల రూపాల్లో బలప్రయోగానికి దిగారు పోలీసులు.
దాంతో సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ బార్డర్లు రైతుల ధర్నా స్థలాలుగా మారిపోయాయి.
మరోవైపు.. అక్టోబరు 2020 నుంచి జనవరి 2021 మధ్య రైతు సంఘాలకూ, కేంద్రానికి మధ్య 11 విడతలు చర్చలు జరిగాయి. అయినా పరిష్కారం దొరకలేదు.
ఇంతలో సాగు చట్టాల అమలుపై స్టే విధించిన సుప్రీం కోర్టు, ఒక కమిటీని నియమించింది.
3. హింసకు దారి తీసిన రిపబ్లిక్ డే పరేడ్
2021 జనవరి 26న దేశ రాజధానిలో రైతులు నిర్వహించిన ట్రాక్టర్ మార్చ్ హింసాత్మకంగా మారింది. ఒక రైతు చనిపోయాడు.
పోలీసు వలయాన్ని ఛేదించుకొని ఎర్రకోటపైన సిక్కు మతానికి చెందిన నిషాన్ సాహిబ్ అనే జెండాను ఎగురవేయడం, అనేక మంది రైతులు పాల్పడ్డ హింసలో పోలీసులకు గాయాలు కావడంతో ఉద్యమ భవిష్యత్తుపై అనుమానాలు తలెత్తాయి.
ఇదే అదనుగా.. రైతుల ఉద్యమంలో ఖలీస్తానీలు చొరబడ్డారనే ఆరోపణలను ప్రభుత్వం, ప్రభుత్వ అనుకూల సంస్థలు ప్రచారాన్ని హోరెత్తించాయి. ఉద్యమం ఒక దశలో బలహీనపడ్డట్టు కనిపించింది.
అయితే, ఘాజీపూర్ బార్డర్ నుంచి వెనక్కి మళ్లుతున్న రైతులపై బీజేపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారనే ఆరోపణలు రావటం... రైతు నేత రాకేశ్ తికాయత్ మీడియా ముందుకొచ్చి కన్నీళ్లు పెట్టుకున్న ఘటన... అలా పోరాటానికి మళ్లీ కొత్త ఊపిర్లు అందాయి.
4. రణరంగాన్ని తలపించేలా దిల్లీ సరిహద్దులు
రిపబ్లిక్ డే రోజున దిల్లీలో జరిగిన హింసను సాకుగా చూపుతు రైతులు ధర్నాలు చేస్తున్న సింఘూ, ఘాజీపుర్, టిక్రీ సరిహద్దుల్లో భారీగా పోలీసులు మోహరించారు.
ముళ్లకంచెలు, కాంక్రీట్ దిమ్మెలు, ఇనుప బారీకేడ్లతో పాటు చుట్టూ ఇనుప మేకులు బిగించి ధర్నా స్థలాలకు మీడియా గానీ, మరెవరూ గానీ వెళ్లకుండా దిగ్బంధించారు. వాటి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ధర్నా స్థలాల్లో ఇంటర్నెట్ సేవలతో పాటు నీళ్లు, కరెంటును కూడా బంద్ చేశారని కూడా రైతులు ఆరోపించారు.
అయినా సరే... రైతులు వెనక్కి తగ్గలేదు. పట్టుదలతో తమ పోరాటాన్ని కొనసాగించారు. అక్కడే తాత్కాలిక బసలు ఏర్పాటు చేసుకొని గజగజ వణికించే ఉత్తరాది చలి, మండే వేసవిని, వర్షబీభత్సాన్ని తట్టుకొని నిలబడ్డారు.
5. అంతర్జాతీయ మద్దతు - గ్రెటా 'టూల్ కిట్' వివాదం
రైతుల ఉద్యమానికి మద్దతుగా సెలబ్రిటీ సింగర్ రియానా, పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ చేసిన ఒక ట్వీట్స్ వివాదంగా మారాయి.
నిరసనలు ఎలా చేయాలి... ఎవరికి విజ్ఞప్తులు ఇవ్వాలి... ప్రజలను ఎలా మొబిలైజ్ చేయాలి వంటి విషయాలతో కూడిన ఒక టూల్ కిట్‌ను 2021 ఫిబ్రవరి 3న ట్వీట్ చేశారు గ్రెటా.
దాంతో... ఇది భారతదేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న అంతర్జాతీయ కుట్రగా ప్రభుత్వం చెప్పుకొచ్చింది.
ఈ కుట్రకు వ్యతిరేకంగా భారతీయులంతా ఒక్కటిగా ఉండాలంటూ #IndiaAgainstPropaganda అనే హాష్ ట్యాగ్‌తో సచిన్ తెందూల్కర్ నుంచి అక్షయ్ కుమార్ వరకు ఎందరో ప్రభుత్వ అనుకూల సెలబ్రిటీలు ట్వీట్లు చేశారు.
6. లఖీంపుర్ ఖేరీలో చిందిన రక్తం
అక్టోబరు 3న ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖీంపుర్ ఖేరీ జరిగిన హింసలో ఎనిమిది మంది చనిపోయారు. వీరిలో నలుగురు రైతులు, ముగ్గురు బీజేపీ కార్యకర్తలున్నారు.
లఖీంపుర్ ఖేరీ జిల్లాలోని టికునియాలో ఉత్తర్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం పర్యటన సందర్భంగా చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ నిరసనకు దిగిన రైతుల పైనుంచి కార్లు తోలించారు.
ఇందులో ఒక కారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాది. అతడు ముగ్గురు రైతులను కారుతో తొక్కించి, హత్యల చేశాడని భారతీయ కిసాన్ యూనియన్ ఆరోపించింది. ఈ కేసులో అనేక మలుపులు, మరెన్నో ఒత్తిళ్ల తరువాత చివరకు ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేశారు పోలీసులు.
ఫొటో సోర్స్, Getty Images
2021 డిసెంబర్ 10వ తేదీన సింఘు బోర్డర్ నుంచి సంచి పట్టుకుని వెనుదిరిగి వెళుతున్న వృద్ధ రైతు
7. చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామంటూ మోదీ ప్రకటన
చివరకు నవంబరు 19... గురునానక్ జయంతి రోజున మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించారు ప్రధాని మోదీ. రైతులకు క్షమాపణ కూడా చెప్పారు.
అన్నట్లుగానే, డిసెంబరు 1న చట్టాలను మళ్లీ ఎలాంటి చర్చా లేకుండానే రద్దు చేసింది పార్లమెంటు.
యూపీ, పంజాబ్ సహా రానున్న పలు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ప్రభుత్వం వెనక్కి తగ్గిందనేది కొందరి విశ్లేషణ.
ఓ వైపు మండిపోతున్న ధరలు, పెరిగిపోతున్న నిరుద్యోగం, ముందే మందగించిన ఆర్థికవ్యవస్థపై కోవిడ్ మహమ్మారి దెబ్బ... ఇలాంటి సమస్యలు వచ్చే ఎన్నికల్లో విజయావకాశాలపై ప్రభావం చూపించవచ్చన్న ఊహాగానాల మధ్య ఈ చట్టాలను వెనక్కి తీసుకోవడం ద్వారా మోదీ సరైన దిశగానే పావులు కదిపారని మరి కొందరి విశ్లేషణ.
ఇవి కూడా చదవండి:
- భారత్‌లో బిట్ కాయిన్‌కు అధికారిక ఆమోదం అంటూ మోదీ ట్విటర్ ఖాతా ట్వీట్.. అసలు కారణం చెప్పిన పీఎంవో
- టోర్నడో బీభత్సం.. అమెరికాలో 70 మందికి పైగా మృతి
- జనరల్ బిపిన్ రావత్ అనంతరం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయ్యేదెవరు, అర్హతలేమిటి
- ఈ సినీ దర్శకుడు ఇస్లాం వదిలి హిందూ మతం స్వీకరించడానికి, బిపిన్ రావత్ మరణానికి సంబంధం ఏమిటి
- అంకోర్ సామ్రాజ్యం అభివృద్ధి, అంతం రెండిటికీ నీరే కారణమా
- బుద్ధుడి గురించి ఈ విషయాలు తెలుసా?
- ఆంధ్రప్రదేశ్ పరిస్థితి 'అప్పు చేసి పప్పుకూడు...'లా మారిందా? 11 ప్రశ్నలు - జవాబులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)