విజయనగరం: ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఒమిక్రాన్ కేసు.. విశాఖపట్నంలో ఐసోలేషన్‌లో 30 మంది
- లక్కోజు శ్రీనివాస్
- బీబీసీ కోసం

ఫొటో సోర్స్, Getty Images
ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైంది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం వీరనారాయణం గ్రామంలో ఈ కేసు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ ధ్రువీకరించింది.
ఐర్లాండ్ నుంచి ముంబయి వచ్చిన ఓ ప్రయాణికుడికి మొదట ముంబయిలో కోవిడ్ పరీక్ష చేయగా, ఫలితం నెగటివ్ వచ్చింది. దాంతో, ఆయన ముంబయి నుంచి విమానంలో విశాఖపట్నం చేరుకున్నారు.
విశాఖపట్నం విమానాశ్రయంలో మళ్లీ నమూనాలు ఇచ్చి స్వగ్రామానికి వెళ్లారు. అయితే గ్రామంలో కూడా ఆయన నమూనాలు సేకరించి విజయనగరంలో పరీక్ష చేయించారు.
ఈ పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత అతడి నమూనాలను హైదరాబాద్ పంపి పరీక్ష చేయించగా, అది ఒమిక్రాన్ వేరియంట్ అని నిర్ధరణైంది.
ఆయన్ను ప్రస్తుతం విశాఖపట్నంలో ఐసొలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఫొటో సోర్స్, Getty Images
నాలుగు రోజుల క్రితం జీనోమ్ సీక్వెన్సింగ్‌కు....
ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారందరికి ఒమిక్రాన్ వేరియంటే వచ్చిందంటూ వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి.
రెండు రోజుల క్రితం కూడా శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్ కేసు బయటపడిందంటూ సోషల్ మీడియాలో కలకలం రేగింది.
అయితే అందులో నిజం లేదంటూ జిల్లా వైద్యశాఖ అధికారులు ఖండించారు. కానీ ఆదివారం విజయనగరానికి చెందిన ఒక వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ రిపోర్టు వచ్చిదనే విషయాన్ని ఆ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి అరుణకుమారి తెలిపారు.
విజయనగరం జిల్లా వీరనారాయణం గ్రామానికి చెందిన వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ రావడంతో అతని శాంపిల్స్ సేకరించారు.
వాటిని ఒమిక్రాన్ నిర్ధరణ పరీక్షల కోసం నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌కు పంపించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల అనంతరం ఇవాళ ఆయన ఒమిక్రాన్ పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది.
ప్రస్తుతం బాధితుడు విశాఖపట్నం మధురవాడ ప్రాంతంలో ఉండటంతో.. ఆయనను, ఆయనతో పాటు మరో 30 మందిని ఐసోలేషన్‌లో ఉంచి వైద్యం అందిస్తున్నారు. ప్రజలు అందరూ మాస్కులు ధరించాలని వైద్యాధికారులు తెలిపారు.
ఫొటో సోర్స్, Getty Images
ఒమిక్రాన్ జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు
ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాము ఇప్పటికే విడుదల చేసిన గైడ్ లైన్స్ పాటించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అలాగే కొత్త వేరియంట్‌పై కేంద్రం ఎయిర్ పోర్టులకు గైడ్ లైన్స్ కూడా విడుదల చేసింది. ఒమిక్రాన్ ప్రభావం ఉన్న దేశాల నుంచి వచ్చినవారికి, టెస్టింగ్ తప్పనిసరి అని కేంద్రం ప్రకటించింది.
వ్యాక్సిన్‌తో సంబంధం లేకుండా విమానాశ్రయాల్లో టెస్టింగ్స్ తప్పనిసరి చేసింది. ఈ పరీక్షల్లో పాజిటివ్ వస్తే, బాధితులను ఎయిర్ పోర్టు నుంచే నేరుగా క్వారంటైన్‌కు తరలించాలని స్పష్టం చేసింది.
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసి, నెగిటివ్ వస్తేనే ఎయిర్ పోర్టు నుంచి బయటకు వెళ్లడానికి అనుమతించాలని ఆదేశించింది.
ఆర్టీపీసీఆర్‌లో పాజిటివ్ వచ్చిన వ్యక్తుల శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపాలని కేంద్రం సూచించింది.
ఫొటో సోర్స్, Getty Images
రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒమిక్రాన్ విషయంలో పాటించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేసింది.
కేంద్ర ప్రభుత్వం, డబ్ల్యూహెచ్‌వో విడుదల చేసిన గైడ్‌లైన్స్ ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించింది.
అలాగే బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించకపోతే రూ.100 జరిమానా, మాస్కులు లేకుండా షాపులు, వాణిజ్య ప్రదేశాల్లోకి అనుమతిస్తే యాజమాన్యానికి రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకూ జరిమానా విధించనున్నారు.
దీనితోపాటూ నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలను రెండు రోజులు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారి సమాచారాన్ని 8010968295 నంబరుకు తెలియజేయాలని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అలాగే ప్రజలందరూ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి చేయాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- NFTs : బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో పనిచేసే ఈ డిజిటల్ అసెట్స్ గురించి తెలుసా? - డిజిహబ్
- ఒక బాలిక యదార్థ గాధ: "నా చేతులు పట్టుకుని అసభ్యంగా... నేను వారికి అభ్యంతరం చెప్పలేక.."
- ఖాళీగా గడపడం ఎలా? ఇలా ఆలోచించడం వల్ల ఆనందం ఆవిరైపోతోందా?
- పాకిస్తాన్: ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఆ దేశాన్ని అప్పుల్లో ముంచిందా
- 26/11 ముంబయి దాడులు: పాకిస్తాన్లో ఈ కేసు దర్యాప్తు ఎంతవరకూ వచ్చింది?
- ఇమ్రాన్ ఖాన్ పాలనలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎందుకు పతనమవుతోంది?
- ఫోర్బ్స్ మ్యాగజైన్: అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో ఒడిశా ఆశావర్కర్ మతిల్దా..
- పాకిస్తాన్లో పెరుగుతున్న ధరలు... 'తక్కువ తినమని' ప్రజలకు మంత్రి సలహా
- పరాగ్ అగర్వాల్ ట్విటర్ సీఈవో అయితే, పాకిస్తాన్ ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శిస్తున్నారు? సుష్మా స్వరాజ్ వీడియోను ఎందుకు ట్వీట్ చేస్తున్నారు?
- మోదీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలపై ఎందుకు యూ-టర్న్ తీసుకుందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)