1971 భారత్-పాక్ యుద్ధం: పాకిస్తాన్ భూభాగంలో కూలిన విమానం నుంచి బయటపడిన ఇండియన్ పైలట్ తాను పాకిస్తానీనని ఎలా నమ్మించారు, చివరకు ఎలా దొరికిపోయారు

  • రేహాన్ ఫజల్
  • బీబీసీ ప్రతినిధి
జవహర్‌లాల్ భార్గవ్

ఫొటో సోర్స్, JAWAHAR LAL BHARGAV

ఫొటో క్యాప్షన్,

ఫ్లైట్ లెఫ్టినెంట్ జవహర్‌లాల్ భార్గవ్

1971 డిసెంబర్ 5న ఉదయం 9.20కి ఫ్లైట్ లెఫ్టినెంట్ జవహర్‌లాల్ భార్గవ్ ఉన్న మారుత్ విమానం పాకిస్తాన్ నయాఛోర్ ప్రాంతంలో బాంబులు వేయడానికి కిందికి డైవ్ చేసింది.

సరిగ్గా అదే సమయంలో యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్ నుంచి దూసుకొచ్చిన బుల్లెట్ ఆయన విమానానికి తగిలింది.

కాక్‌పిట్‌లో రెడ్ లైట్స్ వెలిగాయి. విమానం కుడి ఇంజన్ ఫెయిలైంది. ఆయన వెంటనే దాడి ప్రయత్నం ఆపేసి భారత్ తిరిగివెళ్లాలని ప్రయత్నించారు. దిగువన విశాలంగా సింధ్ ఎడారి కనిపిస్తోంది.

విమానం నేలకు సమీపిస్తోంది అని అర్థం కాగానే ఆ యువ పైలట్ దేవుడిని తలచుకుని, తన బలమంతా ఉపయోగించి ఎజెక్షన్ బటన్ నొక్కాడు.

1971 భారత్-పాక్ యుద్ధం గురించి ఇటీవలే ప్రచురితమైన '1971 చార్జ్ ఆఫ్ ద గూర్ఖాస్' రచయిత రచనా బిష్ట్ ఆనాటి ఆ ఘటనను వివరించారు.

ఎజక్షన్ బటన్ నొక్కిన సెకన్లలోనే ఆయన విమానం నుంచి బయటకు దూకేశారు. కొద్ది సెకన్లలోనే ఆయన నేల మీద పడ్డారు. అంతకంటే ముందే విమానం నేలకూలింది.

విమానంలోని బాంబులు ఏ క్షణమైనా పేలవచ్చనుకున్న భార్గవ్ తన పారాచూట్ ఇసుకలో పూడ్చిపెట్టి వేగంగా అక్కడనుంచి బయటపడే ప్రయత్నం చేశారు. అక్కడ్నుంచి వెళ్లే ముందు తన పైలెట్ సర్వైవల్ కిట్‌ తీసుకున్నాడు.

ఆ కిట్‌లో ఒక స్లీపింగ్ బ్యాగ్, స్టవ్, చాక్లెట్, చిన్న కత్తి, కంపాస్, 100 ఎంఎల్ నీళ్ల బాటిళ్లు నాలుగు ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ

పటౌడీ పేరు గుర్తొచ్చి మన్సూర్ అలీ ఖాన్ అని చెప్పాను

కానీ, భార్గవ్‌కు కిట్‌లో ఆ సమయంలో అత్యంత ముఖ్యమైన మ్యాప్ మాత్రం దొరకలేదు. దాంతో ఆయన తన కంపాస్ సాయంతో తూర్పుగా నడవాలని, సరిహద్దు దాటి భారత్ చేరుకోడానికి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు.

భార్గవ్ తన వాచీలో టైంను పాకిస్తాన్ సమయం ప్రకారం సెట్ చేసుకున్నారు. పాకిస్తానీలకు దొరికితే తానొక పాకిస్తాన్ వైమానిక దళ అధికారినని, తన పేరు మన్సూర్ అలీ ఖాన్ అని చెప్పాలని మనసులో ఆయన అనుకున్నారు.

మన్సూర్ అలీ ఖాన్ అనే పేరు అనుకోవడం వెనక ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? అని ప్రస్తుతం పంచ్‌కులాలో ఉంటున్న ఎయిర్ కమాడోర్ జవహర్‌లాల్ భార్గవ్‌ను నేను అడిగాను.

దానికి ఆయన "మా నాన్న నవాబ్ ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీ దగ్గర పనిచేసేవారు. నేను ఆయన కొడుకు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ(భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్)తో క్రికెట్ ఆడాను. మేమిద్దరం రంజీ ట్రోఫీలో మా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించాం. పటౌడీ దిల్లీకి, నేను పంజాబ్‌కు ఆడాం. పటౌడీ పేరు నుంచే నాకు మన్సూర్ ఖాన్ అనే పేరు చెబుదామనే ఐడియా వచ్చింది" అని చెప్పారు.

భార్గవ్ దగ్గర 300 పాకిస్తానీ రూపాయలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ మీద దాడి చేయడానికి వెళ్లే ప్రతి భారత పైలెట్‌కూ అప్పట్లో పాకిస్తాన్ కరెన్సీ ఇచ్చేవారు.

ఫొటో సోర్స్, PENGUIN

ఒంటెలు తాగే మురికి నీళ్లే దప్పిక తీర్చాయి

భార్గవ్ నడవడం మొదలుపెట్టినపుడు కనుచూపు మేరలో ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు. మూడు కిలోమీటర్లు నడవగానే, ఎండకు ఆయన గొంతు తడారిపోయింది. దగ్గరున్న బాటిళ్లలో నీళ్లు అయిపోయాయి. చుక్క నీళ్లు కూడా లేవు. అప్పుడే, ఆయనకు గుట్టల మీద ఒక ఊరు కనిపించింది. ఆయన ఒక గుడిసె ముందు నిలబడ్డాడు. అక్కడ ధోతీ, కుర్తాలో ఉన్న ఒక గడ్డం మనిషి ఉన్నాడు.

ఆనాటి ఘటనలను జవహర్‌లాల్ భార్గవ్ గుర్తు చేసుకున్నారు.

"నేను వంగి ఆయనకు ఆదాబ్ అన్నాను. ఆయన వాలేకుం అస్సలాం అన్నాడు. చాలా కాన్ఫిడెంట్‌గా నేను పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ లెఫ్టినెంట్ మన్సూర్ అలీ ఖాన్‌ని అన్నాను. నా విమానం కూలిపోయింది. తాగడానికి నీళ్లు కావాలి అని అడిగాను. ఆయన నీళ్లు లేవన్నారు. నాకు దగ్గర్లో ఉన్న సిమెంట్ తొట్టిలో కొన్ని నీళ్లు కనిపించాయి."

"ఆయన అవి ఒంటలు తాగే నీళ్లు... కావాలంటే తాగచ్చు అన్నారు. ఇప్పుడు ఆర్ఓ కాలం వచ్చింది. మీరు నమ్మలేరు.. నేను ఆ మురికి నీళ్లు తాగడంతోపాటూ.. తర్వాత తాగడానికి నాలుగు బాటిళ్లలో నింపుకొన్నాను కూడా. ఆ సాయం చేసిన ఆయనకు నా గురించి ఎవరికీ చెప్పద్దని 20 రూపాయలు ఇచ్చాను" అని చెప్పారు.

ఫొటో సోర్స్, JAWAHAR LAL BHARGAV

ఫొటో క్యాప్షన్,

తన మారుత్ విమానంతో ఫ్లైట్ లెఫ్టినెంట్ జవహర్‌లాల్ భార్గవ్

గ్రామస్థులు భార్గవ్‌ను ఊళ్లోకి తీసుకెళ్లారు

భార్గవ్ అక్కడివారిని ఈ ఊరి పేరు ఏంటి అని అడిగారు. వాళ్లు పిరానీ అన్నారు. అది వినగానే భార్గవ్ కాళ్ల కింద నేల కదులుతున్నట్లు అనిపించింది. ఎందుకంటే ఆయన అప్పటివరకూ ఆ ఊరిని భిటాలా అనుకున్నారు. అంటే, ఆయన భారత్ వైపు వెళ్లకుండా వ్యతిరేక దిశలో పాకిస్తాన్ వైపు లోపలికి వెళ్తున్నారు.

దాంతో, దిశ మార్చుకున్న భార్గవ్ మళ్లీ నడక మొదలెట్టారు. కాసేపటికి కాస్త విశ్రాంతి తీసుకుందామని గుంటలా ఉన్న ఒక ప్రాంతంలో పడుకున్నారు. చీకటి పడ్డాక ముందుకు వెళ్లాలనుకున్నారు. భార్గవ్ కళ్లు మూతలుపడగానే కొంతమంది ఆయన్ను చూసేశారు. తర్వాత ఆయన కళ్లు తెరిచేసరికి ఆయన చుట్టూ ముగ్గురున్నారు. మీరెవరు అని అడిగారు.

భార్గవ్ వాళ్లకు మళ్లీ నా పేరు మన్సూర్ అలీ ఖాన్, ఫ్లైట్ లెఫ్టినెంట్‌నని చెప్పాడు. భిటాలా దగ్గర భారత సైన్యం నా విమానం కూల్చేసింది అన్నారు. దాంతో మా ఊరికి వెళ్దాం రండి అని తీసుకెళ్లారు.

కానీ వాళ్లతో వెళ్లడం ఇష్టం లేని భార్గవ్ నన్ను కరాచీకి తీసుకెళ్లడానికి మా హెలికాప్టర్ రాబోతోంది అన్నారు. కానీ, గ్రామస్థులు వినలేదు. వాళ్లు ఆయనతో మీరు భారత్ వైపు వెళ్తున్నారు, మీరు మాతోపాటూ మా ఊరికి రండి అన్నారు.

భార్గవ్ వాళ్లను మనం సరిహద్దుకు ఎంత దూరంలో ఉన్నాం అని అఢిగాడు. గ్రామస్థులు దాదాపు 15 కిలోమీటర్లు అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో భార్గవ్ వాళ్ల వెనక నడిచారు.

ఫొటో సోర్స్, JAWAHAR LAL BHARGAV

ఫొటో క్యాప్షన్,

జవహర్‌లాల్ భార్గవ్

నేను ఉంటోంది రావల్పిండి

ఊళ్లోకి వెళ్లగానే భార్గవ్‌ను ఒక జనపనార మంచం మీద పడుకోబెట్టారు. అప్పటికి ఆ ఊరి స్కూల్ హెడ్ మాస్టర్ అక్కడికి చేరుకున్నాడు. ఆయన్ను రకరకాల ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు.

"మీరు పాకిస్తాన్‌లో ఎక్కడ ఉంటారు అనగానే.. నేను కాన్ఫిడెంట్‌గా రావల్పిండి అని చెప్పాను. ఆయన రావల్పిండిలో ఎక్కడ అని మళ్లీ అడిగారు. నాకు ఆ నగరం గురించి ఏం తెలీదు. మాల్ రోడ్ అని చెప్పాను. లక్కీగా రావల్పిండిలో మాల్‌రోడ్ ఉందట. తర్వాత నేను ఆయనతో ఇక్కడేదైనా పోలీస్ స్టేషన్ ఉందా అన్నాను. అక్కడ చాలా దూరాల వరకూ పోలీస్ స్టేషన్ లేదని తెలీగానే నాకు ప్రాణం వచ్చింది"

"ఆయన మీ గురించి రేంజర్స్‌కు సమాచారం పంపించాను అన్నారు. దాంతో నేను, వాళ్లిక్కడికి రావడానికి ఎంత సమయం పడుతుందని అడిగా. ఆయన నాలుగు గంటలు పట్టచ్చు అన్నారు. నేను ఊపిరి పీల్చుకున్నా. ఆలోపే వాళ్లు నాకోసం టీ పెట్టారు. కానీ, అప్పటికే నాకు వీపు నొప్పి మొదలయ్యింది".

ఫొటో సోర్స్, JAWAHAR LAL BHARGAV

ఫొటో క్యాప్షన్,

జవహర్‌లాల్ భార్గవ్(కుడి వైపు చివర)

హఠాత్తుగా పాకిస్తానీ రేంజర్లు వచ్చేశారు

సాయంత్రం 7.40 అయ్యింది. ఫ్లైట్ లెఫ్టినెంట్ భార్గవ్ అక్కడనుంచి ఎలా తప్పించుకోవాలా అని ప్లాన్ వేస్తున్నారు. తన దగ్గర కత్తి, నాలుగు నీళ్ల బాటిల్స్ మాత్రమే ఉంచుకున్న ఆయన తన కిట్‌లో ఉన్న మిగతా వస్తువులన్నీ ఊళ్లో పిల్లలకు పంచేశారు.

అప్పుడే నలుగురు పాకిస్తాన్ రేంజర్లు ఆ గుడిసెలోకి అడుగుపెట్టారు. వాళ్ల లీడర్ నాయక్ ఆవాజ్ అలీ. భార్గవ్ మరోసారి వాళ్లకు తన పాత కథను వినిపించారు. నా పేరు పేరు మన్సూర్ అలీ ఖాన్ అని, బాత్రూం వెళ్లాలని అన్నారు.

ఆవాజ్ అలీ ఆయన వెంట ఇద్దరు సాయుధ రేంజర్లను పంపించారు. భార్గవ్ ఒక్క క్షణం పారిపోవాలని ఆలోచించారు. కానీ, ఆ రోజు పౌర్ణిమ. వెన్నెల పట్ట పగల్లా ఇసుక నేలల్లో పరుచుకుని ఉంది. ఇద్దరు రేంజర్ల దగ్గర ఆటోమేటిక్ రైఫిళ్లు ఉన్నాయి. పారిపోయే ప్రయత్నం చేస్తే వాళ్లు తనపై కాల్పులు జరుపుతారని ఆయనకు అర్థమైంది. దాంతో భార్గవ్ తిరిగి గుడిసెలోకి వచ్చేశారు.

ఫొటో సోర్స్, JAWAHAR LAL BHARGAV

రేంజర్ కల్మా చదవాలని చెప్పాడు

పాకిస్తాన్ రేంజర్ల మధ్య తను గడిపిన ఆ రోజును భార్గవ్ గుర్తు చేసుకున్నారు.

"నేను గుడిసెలోకి వచ్చేసరికే ఆవాజ్ అలీ నేను అంతకు ముందు పిల్లలకు పంచేసిన వస్తువులన్నీ తెప్పించుకుని పరిశీలిస్తున్నారు. అప్పుడే ఆయన నా చాకు మీద 'మేడిన్ ఇండియా' అని రాసుండడం చూశారు. నా వాచీ చూశారు. అందులో పాకిస్తాన్ టైమ్ సెట్ చేసుంది. 'మీరు భారతీయుడని మాకు అనుమానంగా ఉంది' అన్నాడు.

అయినా నేను తొణక్కుండా 'మీరు మీ ఆఫీసర్లను పిలిపించండి అన్నా'. ఆయన 'నేనే ఆఫీసర్‌ని' అన్నాడు. నేను ఆయనతో 'మీరు ఆఫీసర్ కాదు నాయక్' అన్నాను."

"ఆవాజ్ అలీ నాకు చివరి పరీక్ష పెట్టాడు. 'సరే మీరు ముస్లిం అయితే మాకు కల్మా చదివి వినిపించండి అన్నాడు. కల్మా అంటే ఏంటో నేనెప్పుడూ వినలేదు. వాళ్లను బోల్తా కొట్టించడానికి నేను ఆఖరి ప్రయత్నం చేశా. 'కల్మా చదివి చాలా రోజులైంది, నాకు గుర్తు కూడా రావడం లేదు. నా వీపులో కూడా నొప్పిగా ఉంది' అన్నా.

ఆవాజ్ అలీ నాతో 'సరే నేను కల్మా చదువుతుంటా.. మీరు నాతోపాటూ చెప్పండి' అన్నాడు. నేను చెప్పలేనన్నాను. నేను దాన్ని తప్పుగా చదివితే ఊళ్లో వాళ్లంతా కలిసి నామీద దాడి చేస్తారేమో అనిపించింది."

ఫొటో సోర్స్, JAWAHAR LAL BHARGAV

ఫొటో క్యాప్షన్,

జవహర్‌లాల్ భార్గవ్(మధ్యలో)

భారత పైలట్‌నని ఒప్పుకున్న భార్గవ్

దాంతో భార్గవ్ తమను బోల్తా కొట్టిస్తున్నాడని ఆవాజ్ అలీకి అర్థమైంది. ఆయన తన రైఫిల్ బట్‌తో నేలమీద గట్టిగా కొడుతూ "నువ్వెవరో చెప్పు లేదంటే, నీ దగ్గర నిజం చెప్పించడానికి నాకు చాలా పద్ధతులు తెలుసు" అన్నాడు.

ఇక తన ఆటలు సాగవని భార్గవ్‌కు అర్థమైంది. "నేను భారత ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ లెఫ్టినెంట్ జవహర్‌లాల్ భార్గవ్. మీరు నన్ను ఏం చేయాలనుకున్నా చేసుకోవచ్చు" అని ఆయన వారికి చెప్పారు.

"కానీ, అప్పటికే గ్రామస్థులకు నామీద సానుభూతి ఏర్పడింది. వాళ్లు రేంజర్లతో 'మేం ఆయనకు భోజనం పెట్టకుండా పంపించం' అన్నారు. తర్వాత నాతో 'మీరు పెద్ద మాంసం తింటారా, చిన్న మాంసం తింటారా' అని అడిగారు"

"పెద్దది, చిన్నది ఏంటో నాకు అర్థం కాలేదు. వాళ్లు నాకు వివరంగా చెప్పాక నేను పెద్ద మాంసం తిననని వారికి చెప్పా. దాంతో వాళ్లు నాకోసం చికెన్ కర్రీ, అన్నం చేశారు. వంట చేస్తున్నప్పుడు చుట్టూ అన్ని సమస్యలు ఉన్నా నేను మంచం మీద హాయిగా నిద్రపోయా. రాత్రి 11 గంటలకు నన్ను ఎవరో నిద్రలేపి భోంచేయండి అన్నారు."

ఫొటో సోర్స్, JAWAHAR LAL BHARGAV

కళ్లకు గంతలు కట్టి ఒంటెపై కూర్చోపెట్టారు

భోజనం తర్వాత పాక్ రేంజర్లు భార్గవ్‌ను ఒంటె మీద కూర్చోపెట్టారు. కళ్లకు గంతలు కట్టి, రెండు చేతులకు సంకెళ్లు వేశారు. భారత సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో పాకిస్తానీ రేంజర్ల చేతికి చిక్కినందుకు ఆయన మనసులోనే తనను తాను తిట్టుకుంటున్నారు.

వారంతా మూడు ఒంటెల మీద వెళ్తున్నారు. మధ్యలో ఉన్న ఒంటె మీద ఫ్లైట్ లెఫ్టినెంట్ భార్గవ్ ఉన్నాడు. దాన్ని రేంజర్ మొహబ్బత్ అలీ నడిపిస్తున్నాడు. తర్వాత రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో వాళ్ల మీదుగా విమానాల గర్జిస్తూ దూసుకెళ్లాయి.

భార్గవ్ వెంటనే ఒంటెలను కింద కూర్చునేలా చేయాలని వాళ్లను అలర్ట్ చేశారు. లేదంటే భారత విమానాలు వాటిని లక్ష్యంగా చేసుకుంటాయని చెప్పాడు.

కానీ, అప్పుడే రేంజర్స్ మరో దళం అక్కడికి చేరుకుంది. వారిలో ఒకరు భార్గవ్‌తో మీరు ఆర్మీ యూనిఫాంలో ఎందుకు లేరని అడిగారు. దానికి భార్గవ్ తన సూట్ బరువుగా ఉండడంతో దాన్ని తీసి ఇసుకలో పాతిపెట్టేశానని చెప్పారు.

"ఆరోజు నేను గూఢచారినేమో అని ఆ రేంజర్‌కు అనుమానం వచ్చింది. ఆయన ఆవాజ్ అలీతో పంజాబీలో 'వీడిని కాల్చి చంపెయ్' అన్నారు. నేను వెంటనే 'నన్ను కాల్చి చంపాలనుకుంటే నా కళ్లకున్న పట్టీ విప్పేయమన్నాను'. దాంతో ఆవాజ్ అలీ తమకు అలాంటి ఉద్దేశం లేదని నాకు భరోసా ఇచ్చాడు."

ఫొటో సోర్స్, JAWAHAR LAL BHARGAV

ఫొటో క్యాప్షన్,

జవహర్‌లాల్ భార్గవ్ ఎయిర్ కమాడోర్‌గా రిటైర్ అయ్యారు

పాకిస్తానీ అధికారి మంచి మనసు

ఐదు రోజులు ఆగకుండా ప్రయాణించిన తర్వాత ఫ్లైట్ లెఫ్టినెంట్ భార్గవ్‌ను కరాచీలోని పాకిస్తానీ వైమానిక దళం స్థావరానికి తీసుకెళ్లారు. ఆ దారిలో ఆయన పాకిస్తాన్ ఆర్మీ కెప్టెన్ ముర్తాజాను కలిశారు.

ఆయన భార్గవ్ కళ్లకు కట్టిన గంతలు, సంకెళ్లు తీయించారు. సిగరెట్ ఇచ్చారు. షేవింగ్ చేసుకోడానికి తన షేవింగ్ కిట్ కూడా ఇచ్చారు. భార్గవ్‌కు తను ఒక ఖైదీనని అనిపించకుండా చేశాడు.

చివరికి, డిసెంబర్ 12న భార్గవ్‌ను విమానంలో రావల్పిండిలోని యుద్ధ ఖైదీల క్యాంపుకు తీసుకెళ్లారు. అక్కడ అంతకు ముందే 12 మంది భారత పైలెట్లు యుద్ధ ఖైదీలుగా ఉన్నారు.

క్రిస్మస్ రోజున ఆ క్యాంప్ కమాండర్ వాళ్లందరికోసం ఒక కేక్ తెప్పించారు. దానిని అందరిలోకీ సీనియర్ అధికారి అయిన వింగ్ కమాండర్ కోఎల్హో కట్ చేశారు.

అప్పటికే పాకిస్తాన్ సైనికులు ఢాకాలో భారత ఆర్మీ ముందు లొంగిపోయారనే విషయం తెలిసింది. భార్గవ్, ఆయన సహచరులు పాకిస్తాన్ జైల్లో ఏడాదిపాటు ఉన్నారు.

ఫొటో సోర్స్, JAWAHAR LAL BHARGAV

అడ్డంకుల తర్వాత విడుదల

1972 నవంబర్ 30న లాయల్‌పూర్ జైల్లో ఉంటున్న భారత యుద్ధ ఖైదీలు అందరికీ మీకు ఇచ్చిన పాకిస్తాన్ ఖాకీ యూనిఫాం వేసుకోమని చెప్పారు.

వారిని ఒక స్పెషల్ ట్రైన్‌లో లాహోర్ తీసుకెళ్లారు. డిసెంబర్ 1న వారిని బస్సుల్లో ఎక్కించి వాఘా బోర్డర్ దగ్గరికి తీసుకొచ్చారు.

అవతలి వైపు భారత సరిహద్దు లోపల పాకిస్తానీ యుద్ధ ఖైదీలను తీసుకొచ్చారు. రెండు దేశాలూ యుద్ధ ఖైదీలను మార్చుకున్నాయి. భారత తన యుద్ధ ఖైదీలను వాఘా బోర్డర్‌కు వంద మీటర్ల లోపల ఉన్న ఒక టెంట్‌లో ఉంచింది.

మొట్టమొదట సైనికులు సరిహద్దు దాటారు. ఆ తర్వాత అధికారుల వంతు వచ్చింది. చివర్లో భారత పైలెట్లు సరిహద్దు వైపు వెళ్తున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఒక పాకిస్తాన్ అధికారి భారత పైలెట్లను అప్పగించడం లేదని చెప్పారు. భార్గవ్ ఆ రోజును గుర్తు చేసుకున్నాడు.

"అక్కడ బ్యాండ్ మోగుతోంది. డాన్సులు వేస్తున్నారు. ఒక అధికారి మా దగ్గరకు వచ్చి మీరు తిరిగి వెళ్లడం లేదని చెప్పారు. మాకు గుండె బద్దలైనట్టు అనిపించింది. కానీ, మీ విడుదల గురించి నేరుగా అధ్యక్షుడు భుట్టోతో మాట్లాడుతున్నామని ఆయన మాకు చెప్పారు. అసలు అక్కడ ఏం జరిగిందంటే.. భారత పశ్చిమ ప్రాంతంలో పట్టుబడిన పాకిస్తానీ యుద్ధ ఖైదీలు అందర్నీ తిరిగి అప్పగించింది. కానీ పాకిస్తానీ పైలెట్లను మాత్రం విడుదల చేయలేదు. కానీ, భుట్టో మాత్రం భారత పైలెట్లను స్వదేశానికి పంపించాలని నిర్ణయించారు' అని చెప్పారు.

కానీ, తర్వాత రోజు భారత ఆర్మీ చీఫ్ శామ్ మానెక్ షా స్వయంగా తన విమానంలో పాకిస్తానీ పైలెట్లను తీసుకుని పాకిస్తాన్ చేరుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

అప్పటి భారత ఆర్మీ చీఫ్ శామ్ మానెక్ షా

అమృత్‌సర్, దిల్లీలో అద్భుత స్వాగతం

11.30కు భారత పైలెట్లు వాఘా బోర్డర్ దాటారు. అక్కడ పంజాబ్ ముఖ్యమంత్రి జ్ఞానీ జైల్ సింగ్ వారిని ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు.

ఇండియన్ ఆర్మీ నల్ల అంబాసిడర్ కార్ పైలట్లను భారత వైమానికదళం అమృత్‌సర్ బేస్‌కు తీసుకెళ్లింది.

అక్కడ వాళ్లు ఏడాది తర్వాత మంచి వేడి వేడి భోజనం తిన్నారు. బీర్ తాగారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు అమృత్‌సర్ కంపెనీ బాగ్‌లో యుద్ధ ఖైదీలందరికీ పౌర సన్మానం జరిగింది.

తర్వాత ఆ పైలట్లను ఆవ్రో విమానంలో దిల్లీ పాలం ఎయిర్ పోర్టుకు తీసుకొచ్చారు. అక్కడ ఎయిర్ చీఫ్ పీసీ లాల్ వారికి వారి బంధువులతో కలిసి స్వాగతం పలికారు.

అక్కడ కలిసిన తన నాలుగేళ్ల కొడుకు అంకుల్ అని పిలిచినపుడు భార్గవ్‌కు కన్నీళ్లు ఆగలేదు. ఏడాదికే అతడు తన తండ్రి ముఖాన్ని గుర్తుపట్టలేకపోయాడు. కానీ, భార్గవ్‌ పాకిస్తాన్‌లో అరెస్ట్ కావడానికి అసలు కారణం అయిన కల్మా ఇప్పుడు అతడికి కంఠతా వచ్చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)