ఒమిక్రాన్: ‘బూస్టర్ డోస్’పై ఐసీఎంఆర్ నిపుణులు ఏమన్నారంటే..- ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
ఒమిక్రాన్ వేరియంట్ కోసం ప్రస్తుతం బూస్టర్ డోసు అవసరం లేదని ఐసీఎంఆర్ నిపుణులు చెప్పినట్లు ఆంధ్రజ్యోతి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
ఒమైక్రాన్ వేరియంట్ వల్ల తేలికపాటి కొవిడ్ ఇన్ఫెక్షన్లే సోకుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో టీకా బూస్టర్ (మూడో) డోసును హుటాహుటిన అందుబాటులోకి తేవాల్సిన అవసరమేం లేదని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్)కి చెందిన డాక్టర్ సమీరన్ పాండా స్పష్టం చేశారు.
కొవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య వ్యవధిలో మార్పులు చేయాల్సిన ఆవశ్యకత కూడా లేదని ఆయన తేల్చి చెప్పారు.
ఆదివారం ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారని ఆంధ్రజ్యోతి రాసింది.
కరోనా వ్యాప్తి స్థితిగతుల ఆధారంగా దేశ ప్రజలకు బూస్టర్ డోసును ఇవ్వాలా? వద్దా? అనే దానికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలను జాతీయ వ్యాక్సినేషన్ సాంకేతిక సలహా బృందం విశ్లేషించి ఓ ప్రకటన చేస్తుందన్నారు.
రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి మూడో డోసును అందించే అంశంపై త్వరలో ఓ నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు సమీరన్ పాండా చెప్పారు.
వయోజనులు అందరికీ టీకా రెండు డోసులను అందించడంతో సానుకూల ఫలితాలు వస్తున్నాయని, దాన్ని మరింత వేగవంతం చేయడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారని పత్రిక వివరించింది.
ఫొటో సోర్స్, Getty Images
ప్రతీకాత్మక చిత్రం
శ్వాస తీసుకుంటుండగానే ఊపిరితిత్తుల మార్పిడి
సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స చేశారని సాక్షి దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.
ఆ కథనం ప్రకారం.. దేశంలోనే తొలిసారిగా బ్రీతింగ్ లంగ్ (ఎక్స్‌వీవో ఆర్గాన్ పర్‌ఫ్యూజన్ సిస్టమ్) మార్పిడి శస్త్ర చికిత్సను ఆదివారం విజయవంతంగా నిర్వహించారు.
ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రి ఊపిరితిత్తుల మార్పిడి విభాగం డైరెక్టర్ డాక్టర్ సందీప్ అత్తావర్ వెల్లడించారు.
'మధ్య వయసున్న ఓ వ్యక్తి 2021 ఆగస్టు నుంచి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. రోజూ 10 లీటర్ల ఆక్సిజన్ తీసుకుంటున్నాడు.
ఆ వ్యక్తికి ఆదివారం ఉదయం కిమ్స్ వైద్య బృందం బ్రీతింగ్ లంగ్ మార్పిడి శస్త్ర చికిత్స చేసింది. ఈ పద్ధతిలో 'కోల్డ్ ఇష్కేమియా టైమ్'వల్ల వచ్చే దుష్ప్రభావాలు తగ్గి ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది.
దాతలు ఇచ్చిన ఊపిరితిత్తుల వినియోగం 30 శాతం ఎక్కువవుతూ రోగికి మరింత ఎక్కువ కాలం ప్రయోజనం ఉంటుంది'అని చెప్పారు.
అమెరికా, కెనడా, ఆస్ట్రియా లాంటి దేశాల్లోని అతి కొద్ది సంస్థల్లోనే ఈ పద్ధతుల ద్వారా ఊపిరిత్తుల మార్పిడి శస్త్ర చికిత్సలు చేస్తున్నారన్నారని ఆయన చెప్పినట్లు పత్రిక వివరించింది.
ఫొటో సోర్స్, Getty Images
రూ.4 లక్షల సామానుతో ఉడాయించారు
సామాను తరలింపు కోసం ట్రాన్స్‌పోర్ట్ బుక్ చేస్తే వారు ఇంట్లోని మొత్తం సామానంతా వ్యానులో తీసుకుని ఉడాయించడంతో కుటుంబం కట్టుబట్టలతో మిగిలిందని నమస్తే తెలంగాణ దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
ఈ ఘటన హైదరాబాద్‌లోని సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకొన్నది. మోతీనగర్‌లోని అవంతినగర్ ఈస్ట్‌లో నివాసముండే కిరణ్.. హైదరాబాద్‌లో ఎల్‌ఐసీ బ్రాంచ్ హెడ్‌గా పని చేస్తున్నారు.
హైదరాబాద్ నుంచి వైజాగ్ బదిలీ కావటంతో ఇంట్లో సామాను తరలింపు కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేశారు. ఈ నెల 5న ఉర్మి లాజిస్టిక్స్ ప్యాకర్స్ అండ్ మూవర్స్‌ను బుక్ చేసుకొన్నారు.
మరుసటి రోజు ముగ్గురు వ్యక్తులు ఇంటికొచ్చి సామానంతా చూసి రూ. 12,980 ఖర్చు అవుతుందని చెప్పి రూ.వెయ్యి అడ్వాన్స్‌గా తీసుకొన్నారు.
6వ తేదీ మధ్యాహ్నం ఇంట్లోని సామానంతా బాక్సుల్లో సర్ది, టీవీ, ఫ్రిజ్, బెడ్లు, వంటసామగ్రి, పల్సర్ బైక్‌ను వ్యాన్‌లో ఎక్కించారు.
భార్య, కూతురితో కలిసి కిరణ్ వైజాగ్‌కు బస్సులో వెళ్లారు. బస్సులో వెళ్తుండగానే.. ట్రాన్స్‌పోర్ట్‌కు రూ.27 వేలు చెల్లించాలని కిరణ్‌కు మెసేజ్ వచ్చింది.
కంగారుతో వ్యాన్‌లోని వ్యక్తికి ఫోన్ చేయగా, ఆ పాత కొటేషన్ తమకు గిట్టుబాటు కాదని, రూ.27 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
మీ సామానును మీరు దింపుకోవాలంటే అడిగిన డబ్బు ఇవ్వాలని, లేకుంటే సామాను గోడౌన్‌కు వెళ్తుందని, అక్కడ వారం పాటే ఉంటుందని, గోడౌన్ చార్జీల కింద రోజుకు రూ.3 వేలు అదనంగా చెల్లించాలని మోసగాళ్లు చెప్పటంతో కిరణ్ ఖంగుతిన్నారు.
గూగుల్ పే, ఫోన్ పేలో డబ్బు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని, నగదు ఇస్తానని చెప్తే నగర శివారులోని ఓ ప్రాంత గూగుల్ లొకేషన్ షేర్ చేసి రమ్మనటంతో భయంతో వెళ్లలేదని బాధితుడు తెలిపారు.
తనకు కాల్ చేసిన ఫోన్ నంబర్‌కు ఫోన్ చేస్తే హర్యానా అని కనిపిస్తున్నదని, హిందీలో మాట్లాడుతున్నారని, సామాను గురించి మాత్రం చెప్పటం లేదని వాపోయారు.
వ్యాన్‌లో దాదాపు రూ.4 లక్షల విలువైన సామాను ఉన్నదని, ఐదు రోజులు గడిచినా ఆ మోసగాళ్ల ఆచూకీ లేకుండా పోయిందని ఆయన ఆందోళన చెందుతున్నారని పత్రిక వివరించింది.
ఫొటో సోర్స్, NASTASIC
ఉపగ్రహాల ద్వారా గంజాయి సాగు గుర్తింపు
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి సాగు గుట్టు తెలుసుకోడానికి అధికారులు అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారని ఈనాడు దిన పత్రిక కథనం ప్రచురించింది.
గంజాయి కట్టడి చర్యల్లో భాగంగా అధికారులు అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు. సాగు వివరాలు తెలుసుకునేందుకు ఏకంగా రిమోట్ సెన్సింగ్ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.
సాగు ప్రాంతాన్ని కచ్చితంగా గుర్తించటం ద్వారా పంటను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లో ఉపగ్రహ పరిశీలన జరిపారు.
తెలంగాణలో పెద్దగా గంజాయి సాగవుతున్నట్లు తేలకున్నా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అది 16వేల ఎకరాల్లో ఉన్నట్లు వెల్లడయిందని పత్రిక చెప్పింది.
ఒడిశాలోనూ ఏపీ మాదిరే గంజాయి సాగు చేస్తున్నట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా సరఫరా అవుతున్న గంజాయిలో దాదాపు మూడొంతులు ఆంధ్ర ఒడిశా సరిహద్దు(ఏవోబీ) ప్రాంతంలో పండుతున్నదే అని అంచనా. నాణ్యమైన శీలావతి రకమూ ఇక్కడే సాగవుతోంది.
దేశంలో గంజాయి వాడకం పెరగడంపై విమర్శలు వెల్లువెత్తడంతో అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. సాగు ఎక్కడుందో కచ్చితంగా తెలుసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఆంధ్రప్రదేశ్‌లో అయితే అధికారులు 40 మంది సిబ్బందికి ద్విచక్రవాహనాలు ఇచ్చి గంజాయి సాగవుతున్న ప్రాంతాలకు రహస్యంగా పంపారని ఈనాడు రాసింది.
వారు స్థానికంగా మరికొంత సమాచారం సేకరించడంతో పాటు వీలైతే ఫోన్ ద్వారా గంజాయి పంట ఫొటో తీసేవారు. సాధ్యం కాకపోతే అక్కడ నుంచి అధికారులతో ఫోన్‌లో మాట్లాడేవారు.
ఫోన్ ద్వారా తీసిన ఫొటో, మాట్లాడిన ఫోన్‌కాల్ ప్రకారం జీపీఎస్ ఆధారంగా పంట సాగవుతున్న ప్రాంతాన్ని అంచనా కట్టారు. సేకరించిన సమాచారమంతా జాతీయ రిమోట్ సెన్సింగ్ విభాగానికి పంపారు.
పంట సాగవుతున్న ప్రాంతాలకు సంబంధించి తాము సేకరించిన సమాచారం ప్రకారం అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ఉపగ్రహ ఛాయాచిత్రాలు పంపమని కోరారు.
వీరు కోరినట్లే ఉపగ్రహం ద్వారా ఏవోబీ ప్రాంతాన్ని ఆకాశం నుంచి జల్లెడ పట్టారు. గంజాయి ఎక్కడెక్కడ సాగవుతుందో ఫొటోలు సేకరించారు. వీటి ఆధారంగా సుమారు ఎంత విస్తీర్ణంలో పంట సాగవుతోందో లెక్కగట్టారు.
దీని ప్రకారం ఏవోబీ ప్రాంతంలో ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలోనే ఆ పంట ఉన్నట్లు తేటతెల్లమైంది. ఉపగ్రహ సమాచారం ఆధారంగా ఆంధ్రప్రదేశ్ అధికారులు గంజాయి పంటను ధ్వంసం చేయడం మొదలుపెట్టారు.
కచ్చితంగా ఎక్కడెక్కడ సాగవుతుందో తెలియడంతో క్షేత్రస్థాయి సిబ్బంది పని సులువైంది. సాగు దశలోనే పంటను తొలగించడంతో రాబోయే రోజుల్లో గంజాయి సరఫరా తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు.
ఈ ప్రయోగం విజయవంతం అవుతుండటంతో ఇకముందూ ఇదే పద్ధతిని అనుసరించాలని అధికారులు భావిస్తున్నారని ఈనాడు వివరించింది.
ఇవి కూడా చదవండి:
- భారత్‌కు తాలిబాన్ల ప్రశంసలు, మరింత సాయం కావాలని వినతి
- NFTs : బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో పనిచేసే ఈ డిజిటల్ అసెట్స్ గురించి తెలుసా? - డిజిహబ్
- మోదీ ట్విటర్ ఖాతా హ్యాక్.. భారత్‌లో బిట్ కాయిన్‌కు అధికారిక ఆమోదం అంటూ ట్వీట్
- అఫ్గానిస్తాన్‌లో అమెరికా వైఫల్యానికి కారణం ఎవరు.. బుష్, ఒబామా, ట్రంప్ లేదా బైడెన్?
- ఈ సినీ దర్శకుడు ఇస్లాం వదిలి హిందూ మతం స్వీకరించడానికి, బిపిన్ రావత్ మరణానికి సంబంధం ఏమిటి
- ‘ఆవు పేడ చిప్’ను ఫోన్‌కు అతికిస్తే, రేడియేషన్ రాదా?
- ఈ ఆవు ఎత్తే దాని ప్రాణాలను కాపాడింది... ఎలాగో తెలుసా?
- గండికోట: సీమకు శిల కళ
- ధోనీ ఎవరికీ భయపడడు ఎందుకు?
- రైతుల ఉద్యమం వాయిదాపడింది.. కానీ మోదీ ఇమేజ్ పెరిగిందా.. తగ్గిందా
- ఆంధ్రప్రదేశ్ పరిస్థితి 'అప్పు చేసి పప్పుకూడు...'లా మారిందా? 11 ప్రశ్నలు - జవాబులు
- బైజూస్: మెరుపు వేగంతో వృద్ధి వెనుక ‘చీకటి నిజం’.. ఆందోళనలో కస్టమర్లు, ఉద్యోగులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)