శ్రీనగర్‌లో పోలీసుల బస్సుపై తీవ్రవాదుల దాడి, ఇద్దరు పోలీసులు మృతి- Newsreel

కశ్మీర్ దాడి

ఫొటో సోర్స్, Bilal Bahadur

శ్రీనగర్‌లో పోలీసుల బస్సుపై సోమవారం సాయంత్రం దాడి జరిగింది. ఇందులో ఇద్దరు పోలీసులు చనిపోగా.. 12 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.

జమ్మూ కశ్మీర్‌లో శ్రీనగర్‌ పట్టణం శివార్లలోని జెవాన్ ప్రాంతంలో పోలీసు బస్సుపై దాడి జరిగింది.

ఇది తీవ్రవాదుల పనేనని అధికారులు చెబుతున్నారు. దాడి జరిగిన సమయంలో బస్సులో 14 మంది ఉన్నారు.

దాడి అనంతరం తీవ్రవాదులు చీకట్లో పారిపోయారని అధికారులు చెప్పారు.

ఫొటో సోర్స్, Mohsin Altaf

ఈ దాడిలో గాయపడిన వారందరినీ ఆస్పత్రికి తరలించినట్లు కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు.

కాల్పులు జరిగిన ప్రాంతంలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ దాడిపై ప్రధాని మోదీ ఆరా తీశారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.

ముగ్గురు తీవ్రవాదులు పోలీసుల బస్సుపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారని, చీకట్లో అక్కడి నుంచి తప్పించుకున్నారని ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

బ్రిటన్‌లో కోవిడ్-19 ఒమిక్రాన్ వేరియెంట్‌తో తొలి మరణం

బ్రిటన్‌లో కోవిడ్-19 ఒమిక్రాన్ వేరియెంట్‌ సోకి ఒక వ్యక్తి మరణించినట్లు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. ఒమిక్రాన్ కారణంగా బ్రిటన్‌లో నమోదైన తొలి మరణం ఇదే.

పశ్చిమ లండన్‌లోని పాడింగ్‌టన్ సమీపంలో ఒక వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంలో బోరిస్ జాన్సన్ ఈ విషయాన్ని వెల్లడించారు.

"ఒమిక్రాన్ కారణంగా ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ వేరియంట్ సోకి ఒక వ్యక్తి మరణించినట్లు నిర్థరణ అయింది. ఇది చాలా విచారకరం" అని ఆయన అన్నారు.

"కోవిడ్ వేరియంట్లలో ఇది తేలికపాటి వైరస్ అనే అపోహలను పక్కన పెట్టి, ఇది ఎంత వేగంగా వ్యాపిస్తున్నదో గమనించాలి. వెంటనే అదరికీ వ్యాక్సీన్ బూస్టర్ డోసులు అందించడమే ఉత్తమం." అని ఆయన చెప్పారు.

లండన్‌లో నమోదవుతున్న కరోనావైరస్ కేసులలో 40 శాతం ఒమిక్రాన్ కేసులే ఉన్నాయని, మంగళవారానికల్లా ఈ కేసులు 50 శాతం దాటిపోతాయని బోరిస్ జాన్సన్ తెలిపారు.

"రిస్క్ స్పష్టంగా కనిపిస్తోంది. లండన్‌లోనూ, దేశంలోని మరికొన్ని ప్రాంతల్లో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి." అని చెప్పారు.

దక్షిణాఫ్రికాలో కనుగొన్న కరోనావైరస్ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ను నవంబర్ 24న డబ్ల్యూహెచ్‌వో ధ్రువీకరించింది. దీన్ని ఆందోళనకర మ్యుటేషన్‌గా ప్రకటించింది. ఈ వేరియంట్ చాలా దేశాలకు వ్యాపించింది. అమెరికా, బెల్జియం, హాంకాంగ్, ఇజ్రాయెల్, జర్మనీ, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల్లో ఈ వైరస్‌ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత డిసెంబర్ 2న భారత్‌లో తొలి ఒమిక్రాన్ కేసును బెంగళూరులో గుర్తించారు. భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)