కోవిడ్డెంగీ అంటే ఏంటి? తెలంగాణలో ఏం జరుగుతోంది? మీరు తెలుసుకోవాల్సిన 6 అంశాలు

  • సురేఖ అబ్బూరి
  • బీబీసీ ప్రతినిధి
కోవిడ్, డెంగీ లక్షణాలు కనపడిన వెంటనే చికిత్సకు వెళ్లడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

కోవిడ్, డెంగీ లక్షణాలు కనపడిన వెంటనే చికిత్సకు వెళ్లడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.

కోవిడ్‌లోని కొత్త వేరియంట్ ఓమిక్రాన్ నెమ్మదిగా మన దేశంలోనూ, రాష్ట్రాలకు పాకుతుంటే, తెలంగాణలో కోవిడ్‌తో జతకట్టి వస్తున్న డెంగీ కూడా ఇప్పుడు భయపెడుతోంది. కోవిడ్ వచ్చిన రోగులకు డెంగీ కూడా ఉండటంతో రెండిటికి చికిత్స డాక్టర్లకు ఇబ్బందిగా మారుతోంది.

కోవిడ్, డెంగ్యూ వైరస్‌లు మనిషి శరీరంలోకి చేరే మార్గాలు వేర్వేరు. కోవిడ్ శ్వాస ద్వారా శరీరంలోకి చేరుతుండగా, దోమల కారణంగా డెంగీ ఫీవర్ సోకుతుంది. అయితే ఇప్పుడు ఇవి రెండు ఒకే సమయంలో కలిసి దాడి చేస్తే ప్రమాదకరం కావచ్చని డాక్టర్లు చెబుతున్నారు. దీనినే కోవిడ్డెంగీ అంటున్నారు.

మరి ఈ కోవిడ్డెంగీ గురించి మనం తెలుసుకోవాల్సి ఆరు అంశాలేంటి?

సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం ఒక ప్రముఖ డయాగ్నొస్టిక్ సెంటర్ నుంచి తీసుకున్న వివరాల ప్రకారం గత మూడు నెలలలో 29,200 టెస్టులు చేయగా, వాటిలో 1700 డెంగీ కేసులు బయట పడ్డాయి. అందులో 46 కేసులలో కోవిడ్, డెంగీ రెండూ ఉన్నట్లు తేలింది.

అయితే ప్రస్తుత కాలంలో చాలామందిలో కోవిడ్ లక్షణాలున్నా కూడా టెస్టులు చేయించుకోవడం లేదని డాక్టర్లు చెబుతున్నారు. అయితే, కోవిడ్ డెంగీ రెండూ ఉన్నప్పటికీ, సరైన సమయంలో చికిత్స అంది, ప్రాణనష్టం కలగడం లేదు. కానీ, నిర్లక్ష్యం చేయడం ప్రాణాంతకం కావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

డెంగీ వైరస్ ఎర్ర, తెల్ల రక్త కణాలను దెబ్బతీస్తుంది

1.అసలు కోవిడ్డెంగీ అంటే ఏంటి ?

న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం చెప్పినదాని ప్రకారం...‘‘కోవిడ్, డెంగీ రెండూ ఒకేసారి శరీరంపై దాడి చేస్తే దానినే కోవిడ్డెంగీ అంటారు. రెండూ వైరల్ ఇన్ఫెక్షన్లు కావడంతో ఇవి రోగ నిరోధక శక్తి పై దాడి చేస్తాయి. ప్రస్తుతానికి ఈ రెండింటికీ ఎలాంటి మందూ లేకపోయినా, లక్షణాలనుబట్టి వైద్యం చేస్తున్నారు. వర్షాకాలంలో డెంగీ ఎక్కువగా విజృంభిస్తుంది. ఇప్పుడు దానికి కోవిడ్ మహమ్మారి కూడా దానికి తోడవడంతో గత కొన్నివారాలుగా ఈ రెండింటితో బాధ పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది’’

2. డెంగీ , కోవిడ్ ఒకేసారి ఎలా వస్తున్నాయి? గత ఏడాది కూడా కోవిడ్ డెంగీ వచ్చిందా ?

ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ డాక్టర్ శ్యామల అయ్యర్ ఇలా అన్నారు. ''గత ఏడాది లాక్‌డౌన్ నిబంధనలు ఉండడంతో డెంగీ కేసులు అంతగా కనపడలేదు. ఈ ఏడాది కోవిడ్ నిబంధనలు సడలించడం, ప్రజలు బయట తిరగడం, వాతావరణంలో మార్పులు, అకాల వర్షాలు వీటి కారణంగా డెంగీ కేసులు గత ఏడాది కంటే పెరిగాయి. వీటికి తోడు కోవిడ్ కూడా డెంగీతో పాటు కలిసి దాడి చేసే అవకాశం ఎక్కువ అయ్యింది''

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

కోవిడ్డెంగీ వ్యాధి లక్షణాలు గుర్తించడం చాలా ముఖ్యం

3 . లక్షణాలు ఎలా ఉంటాయి ? ఎప్పుడు టెస్టులు చేయించుకోవాలి ?

కోవిడ్ డెంగీ కాంబినేషన్‌లో వచ్చినప్పుడు అవి రెండు వచ్చాయని తెలుసుకోవడానికే సమయం పడుతుంది. క్రాస్‌ ఇన్ఫెక్షన్స్ ఉంటాయని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

ఈ అంశంపై పల్మనాలజిస్ట్ డాక్టర్‌ వ్యాకరణం నాగేశ్వర్ పలు సూచనలు చేశారు. ''కోవిడ్‌ లక్షణాలు, డెంగీ లక్షణాలు వేరువేరుగా ఉంటాయి. కోవిడ్ ఉంటే జ్వరం, జలుబు దగ్గు వంటి లక్షణాలు కనపడతాయి. డెంగీ లో తీవ్రమైన జ్వరం, ఒళ్లునొప్పులు, వాంతులు, తలనొప్పి లాంటి లక్షణాలు ఉంటాయి'' అన్నారు నాగేశ్వర్.

అయితే, ఈ కాలంలో ఈ రెండు వైరల్ వ్యాధులు కాక వాతావరణంలో మార్పుల కారణంగా కూడా జలుబు, దగ్గు రావచ్చని ఆయన అన్నారు.

''మనం గుర్తు పెట్టుకోవాల్సింది HDFC - అంటే హెడేక్, డిస్ప్‌నియా, ఫీవర్, కాఫ్ (తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం, దగ్గు). ఇవి ఉన్నప్పుడు కోవిడ్, డెంగీ రెండు పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఎందుకంటే కేవలం ఒక్క టెస్ట్‌లో పాజిటివ్ వచ్చింది కదా అని దానికే చికిత్స ఇస్తే , శరీరంలో ఉండే ఇంకో వ్యాధి ముదిరిపోవచ్చు. ఇవి రెండువ్యాధులు రెండువైపుల పదును ఉన్న కత్తిలాంటివి'' అని నాగేశ్వర్‌ హెచ్చరించారు.

ఒకటి లేదా రెండు రోజులకు పైగా ఇలాంటి లక్షణాలు తగ్గకుండా కొనసాగితే వెంటనే చికిత్స తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు .

4. ఎవరు ఈ రెండింటి బారినపడే అవకాశం ఎక్కువ ?

వృద్ధులు, మధుమేహం ఉన్నవారు, రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ అయినవారు, రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు డెంగీ కోవిడ్ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువని డాక్టర్ నాగేశ్వర్ అన్నారు. అయితే కోవిడ్డెంగీ రాకుండా ఉండాలంటే కోవిడ్ నిబంధనలు తప్పక పట్టించడంతో పాటు, దోమలు వ్యాప్తి చెందకుండా శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

వ్యాధి లక్షణాలు బయటపడిన వెంటనే చికిత్స ప్రారంభించాల్సి ఉంది

5. ఎలాంటి చికిత్స ఉంటుంది ?

ఈ వ్యాధికి చికిత్స గురించి ఫిజిషియన్ డాక్టర్ నవోదయ్ బీబీసీతో మాట్లాడారు. ''నిజానికి, ఇప్పటిదాకా ఈ రెండిటికి సరైన చికిత్స లేదు. కోవిడైనా, డెంగీ అయినా వాటి లక్షణాలను దృష్టిలో పెట్టుకొనే ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అయితే రెండూ రోగ నిరోధక శక్తిని దెబ్బతీస్తాయి. రెండింటికీ సరైన సమయంలో చికిత్స మొదలుపెట్టడమే కీలకం. కోవిడ్ లక్షణాలు బయట పడడానికి 15 రోజులు కూడా పట్టవచ్చు. అయితే టెస్టులలో కోవిడ్ పాజిటివ్ ఉంది కదా అని డెంగీ టెస్టు చేయించక పొతే, డెంగీ ముదిరిపోయే అవకాశం ఉంది. అలానే డెంగీ ఉంది కదా అని కోవిడ్ రాదనుకుంటే పరిస్థితులు తీవ్రరూపం దాల్చవచ్చు. డాక్టర్ల పరివేక్షణలో చికిత్స తీసుకోవడం ముఖ్యం''

6.మనం ఏం చేయాలి ?

వైద్య నిపుణులు చెప్పినదాని ప్రకారం, డెంగీ తెల్ల, ఎర్ర రక్తకణాలపై ప్రభావం చూపుతుండగా, కోవిడ్ ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. కోవిడ్ ప్రభావం లేదనుకుని నిర్లక్ష్యంగా తిరగడం మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే ఈ జ్వరాలు సొంత వైద్యంతో తగ్గిపోతాయనుకోవడం, తగ్గే వరకు వేచి చూడటం మంచిది కాదని కూడా వారు హెచ్చరిస్తున్నారు. ఆందోళన చెందకుండా, సరైన సమయంలో చికిత్స తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

వీడియో క్యాప్షన్,

దోమలపై గాంబూషియా చేపలతో విశాఖ అధికారుల యుద్ధం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)