మమతా బెనర్జీ: "నేను బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తినే, బీజేపీ నుంచి క్యారెక్టర్ సర్టిఫికెట్ పొందాల్సిన అవసరం లేదు" - Newsreel

ఫొటో సోర్స్, NURPHOTO
గోవాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చురుగ్గా పాల్గొంటున్నారు.
ప్రతిపక్ష పార్టీలు ఏకమై బీజేపీని ఓడించాలని దాదాపు ప్రతి ప్రసంగంలోనూ విజ్ఞప్తి చేశారు.
గోవాలో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ బీజేపీపై విరుచుకుపడ్డారు.
"గోవాలో బీజేపీ అంతం కావాలని కోరుకుంటున్నాం. అలా జరగాలంటే అందరూ ఏకం కావాలి. మీరు హిందువా, ముస్లిమా, బ్రాహ్మణులా, కాయస్థులా అని ఎవరైనా అడిగితే జవాబు చెప్పడానికి సిగ్గనిపిస్తుంది. నేను మనిషిని."
"నేను బ్రాహ్మణ పరివారానికి చెందిన వ్యక్తినే. అందుకు, బీజేపీ నుంచి క్యారెక్టర్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు."
"నేను బీజేపీ నుంచి క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకోవాలా? నేను హిందువును కాదు, ముస్లింను కాదు, సిక్కును కాను, క్రైస్తవ మతానికి చెందను. నా పేరు, ఇంటి పేరు వంశ పారంపర్యంగా వచ్చినవి" అని ఆమె అన్నారు.
బీజేపీ నేతలు ఎన్నికలు వచ్చేసరికల్లా గంగానదిలో మునుగుతారని, ఉత్తరాఖండ్ వెళ్లి గుడిలో కూర్చుంటారని, కోవిడ్ కారణంగా ఎవరైనా మరణిస్తే ఆ గంగానదిలో వదిలేస్తారని, నదిని అపవిత్రం చేస్తున్నారని మమత ఘాటుగా విమర్శించారు.
ఫొటో సోర్స్, UGC
తిరుపతిలో ముగిసిన అమరావతి రైతుల పాదయాత్ర
'న్యాయస్థానం టూ దేవస్థానం' పేరుతో అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర మంగళవారం తిరుపతిలో ముగిసింది.
ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ నవంబర్ 1న తుళ్లూరులో ప్రారంభమైన ఈ పాదయాత్ర 45 రోజుల పాటు సాగింది. అమరావతి రైతులు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో సుమారు 400 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. తిరుపతి చేరుకున్న వారికి వివిధ పార్టీల నాయకులు స్వాగతం పలికారు.
అయితే, 'మీతో మాకు గొడవలు వద్దు, మీకు మా స్వాగతం, మాకు మూడు రాజధానులు కావాలి' అంటూ తిరుపతి ప్రజల పేరుతో పట్టణంలో చాలా చోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి. కొన్నిచోట్ల అమరావతి రైతులకు స్వాగతం పలుకుతున్న ఫ్లెక్సీల పక్కనే ఈ ఫ్లెక్సీలు కనిపించాయి.
ఫొటో సోర్స్, UGC
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో విద్యార్థులు ర్యాలీ తీశారు. కొన్ని చోట్ల మూడు రాజధానులకు మద్దతుగా పెట్టిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు.
ఫొటో సోర్స్, ugc
500 మంది అమరావతి రైతులకు టీటీడీ 300 రూపాయల టికెట్లను కేటాయించింది. వారు రేపు (బుధవారం) స్వామివారిని దర్శించుకుంటారు.
ఫొటో సోర్స్, Getty Images
ఇండోనేషియా భూకంపం: దక్షిణ సులవేసిలో 7.4 తీవ్రతతో భూకంపం, భయంతో పరుగులు పెట్టిన ప్రజలు
ఇండోనేషియాలోని సౌత్ సులవేసి ప్రావిన్స్ తీరంలో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ప్రజలు ఇళ్లు, భవనాలను ఖాళీ చేశారు.
స్థానిక కాలమానం ప్రకారం, మంగళవారం ఉదయం 10.30 సమయంలో భూకంపం సంభవించింది. ఇది తూర్పు నుసా టెంగ్గరా ప్రాంతంపై ప్రభావం చూపిందని అధికారులు తెలిపారు.
అయితే, ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాలు జరగలేదు. పెద్ద పెద్ద ప్రకంపనలు సంభవించినట్లు స్థానికులు తెలిపారు.
ఆ ప్రాంతానికి సునామీ హెచ్చరికలను ఎత్తివేశారు.
ప్రకంపనలు మొదలవ్వగానే ప్రజలు ఇళ్లు, ఆస్పత్రి భవనాల నుంచి బయటకు పరిగెత్తడం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో కనిపించింది.
ఒక స్థానిక మీడియా సంస్థ ప్రచురించిన ఫొటోల్లో, కొన్ని ఇళ్లు పాక్షికంగా కూలిపోయినట్లు తెలుస్తోంది.
జావా ద్వీపంలో ప్రధానమైన మౌంట్ సెమెరు అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగిన 10 రోజుల తరువాత ఈ భూకంపం సంభవించింది. ఆ అగ్నిపర్వతం బద్దలవ్వడం వలన 46 మంది ప్రాణాలు కోల్పోయారు.
పసిఫిక్ మహాసముద్రంలో అగ్నిపర్వతాలు, ఫాల్ట్ లైన్ల వంపు అని పిలిచే "రింగ్ ఆఫ్ ఫైర్"పై ఈ ద్వీప సమూహం ఉన్నందున ఇండోనేషియాలో భూకంపాలు సర్వసాధారణం.
ఫొటో సోర్స్, BBC/preveen
మెదక్ స్థానంలో విజేత యాదవ రెడ్డి
తెలంగాణ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం
తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.
మొత్తం 12 స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేయగా 6 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
ఎన్నికలు జరిగిన మిగతా ఆరు స్థానాలను కూడా టీఆర్ఎస్ గెలుచుకుంది.
ఈ ఆరు స్థానాలకు డిసెంబర్ 10న పోలింగ్ జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు, ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరిగాయి.
పోటీ జరిగిన మొత్తం 6 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందారు.
ఫొటో సోర్స్, ugc
ఎల్ రమణ
విజయం సాధించిన అభ్యర్థులు
కరీంనగర్: (2 స్థానాలు)
ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో రెండు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు భానుప్రసాద్ రావ్, ఎల్.రమణలు విజయం సాధించారు.
మొత్తం 1320 ఓట్లు పోల్ కాగా, వాలిడ్ అయిన 1303 ఓట్లలో భాను ప్రసాద్ రావ్‌కు 585, ఎల్గందుల రమణకు 479 ఓట్లు రావడంతో మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఇద్దరూ విజయం గెలుపొందారు.
మెదక్: మెదక్ స్థానంలో మొత్తం 1018 ఓట్లు పోలవగా టీఆర్ఎస్ అభ్యర్థి వంటేరు యాదవ రెడ్డి 762 ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి తూర్పు నిర్మలకు 238 ఓట్లు వచ్చాయి.
ఫొటో సోర్స్, BBC/praveen
ఆదిలాబాద్ ఎమ్మెల్సీ విజేత దండె విఠల్
ఆదిలాబాద్: ఆదిలాబాద్ స్థానానికి మొత్తం 860 ఓట్లకు గాను టీఆర్ఎస్ అభ్యర్థి దండె విఠల్ 742 ఓట్లతో విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి పెందూర్ పుష్పారాణికి 75 ఓట్లు పడ్డాయి.
నల్గొండ: నల్గొండలో మొత్తం 1230 ఓట్లు పోలవగా, టీఆర్ఎస్ అభ్యర్థి ఎం.సీ.కోటి రెడ్డి 917 ఓట్లతో విజయం సాధించారు.
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో పోలైన మొత్తం 738 ఓట్లకు 480 ఓట్లు సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు గెలుపొందారు.
ఫొటో సోర్స్, ugc
ఎం.సి. కోటిరెడ్డి
అన్ని ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకోవడంపై తెలంగాణ సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తం చేసారు.
తెలంగాణలో టీఆర్ఎస్ తిరుగులేని రాజకీయశక్తి గా మరోసారి నిరూపితం అయ్యిందన్నారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికైన పార్టీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి:
- భారత్‌కు తాలిబాన్ల ప్రశంసలు, మరింత సాయం కావాలని వినతి
- NFTs : బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో పనిచేసే ఈ డిజిటల్ అసెట్స్ గురించి తెలుసా? - డిజిహబ్
- మోదీ ట్విటర్ ఖాతా హ్యాక్.. భారత్‌లో బిట్ కాయిన్‌కు అధికారిక ఆమోదం అంటూ ట్వీట్
- అఫ్గానిస్తాన్‌లో అమెరికా వైఫల్యానికి కారణం ఎవరు.. బుష్, ఒబామా, ట్రంప్ లేదా బైడెన్?
- ఈ సినీ దర్శకుడు ఇస్లాం వదిలి హిందూ మతం స్వీకరించడానికి, బిపిన్ రావత్ మరణానికి సంబంధం ఏమిటి
- ‘ఆవు పేడ చిప్’ను ఫోన్‌కు అతికిస్తే, రేడియేషన్ రాదా?
- ఈ ఆవు ఎత్తే దాని ప్రాణాలను కాపాడింది... ఎలాగో తెలుసా?
- గండికోట: సీమకు శిల కళ
- ధోనీ ఎవరికీ భయపడడు ఎందుకు?
- రైతుల ఉద్యమం వాయిదాపడింది.. కానీ మోదీ ఇమేజ్ పెరిగిందా.. తగ్గిందా
- ఆంధ్రప్రదేశ్ పరిస్థితి 'అప్పు చేసి పప్పుకూడు...'లా మారిందా? 11 ప్రశ్నలు - జవాబులు
- బైజూస్: మెరుపు వేగంతో వృద్ధి వెనుక ‘చీకటి నిజం’.. ఆందోళనలో కస్టమర్లు, ఉద్యోగులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)