హైదరాబాద్: సీబీఐ ఏజెంట్లుగా నమ్మించి, సోదాలు చేసి, 135 తులాల బంగారం చోరీ - ప్రెస్‌రివ్యూ

సీబీఐ

ఫొటో సోర్స్, Getty Images

సీబీఐ అధికారులమని చెప్పి, ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లోని లాకర్ నుంచి 135 తులాల బంగారు ఆభరణాలు, సుమారు రూ. 2 లక్షల నగదును దొంగలు ఎత్తుకుపోయినట్లు 'ఆంధ్రజ్యోతి' వెల్లడించింది.

హైదరాబాద్ గచ్చిబౌలిలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ చోరీ సంచలనం రేపింది.

మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం, నానక్‌రామ్ గూడ ఐటీ జోన్‌లోని జయభేరి ఆరెంజ్ కౌంటీ గేటెడ్ కమ్యూనిటీ సీ బ్లాక్‌లో ప్లాట్ నంబర్ 110లో రాజమండ్రికి చెందిన వెంకట సుబ్రహ్మణ్యం తన కుటుంబంతో ఉంటున్నారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న యన సోమవారం ఉదయం పనిమీద బయటకు వెళ్లారు.

ఇదే అవకాశంగా తీసుకున్న దొంగలు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సుబ్రమణ్యం ఇంటికి వెళ్లారు.

ఆసమయంలో వ్యాపారి భార్య, ముగ్గురు పిల్లలు, డ్రైవర్ ఉన్నారు.

కారులో వచ్చిన నలుగురు దొంగల్లో ఒకరు వాహనంలో ఉండగా, ముగ్గురు సుబ్రమణ్యం ఇంట్లోకి వెళ్లారు. తాము సీబీఐ ఏజెంట్లమని, సోదాలు చేయాలని వ్యాపారి భార్య భాగ్యలక్ష్మికి చెప్పి ఇంట్లోకి ప్రవేశించారు.

లాకర్ తాళాలు తెరిచి అందులో ఉన్న కేజీ 35 తులాల బంగారు ఆభరణాలు, సుమారు రూ. 2 లక్షల నగదును తీసుకెళ్లారు.

జరిగిన మోసాన్ని ఆలస్యంగా తెలుసుకున్న భాగ్యలక్ష్మి గచ్చిబౌలి పోలీసులకు సాయంత్రం ఫిర్యాదు చేశారని'' ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

ఫొటో సోర్స్, ntnews

ఫొటో క్యాప్షన్,

కిడ్నాపర్లు ఉపయోగించిన కారు

కిడ్నాప్ నుంచి చాకచక్యంగా తప్పించుకున్న యువతి

జగిత్యాల జిల్లా ధర్మపురిలో మంగళవారం పట్టపగలు ఓ యువతి (23)ని కిడ్నాప్‌నకు యత్నించిన ఘటన కలకలం రేపినట్లు 'నమస్తే తెలంగాణ' పేర్కొంది.

''ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిని దుండగులు కారులో బలవంతంగా తీసుకెళ్లారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకొన్న సీఐ కోటేశ్వర్‌.. చుట్టుపక్కల పోలీస్‌ స్టేషన్లకు సమాచారం అందించి అప్రమత్తం చేశారు.

కిడ్నాపర్ల కారు మొరాయించడంతో ధర్మపురి దాటి వెళ్లలేకపోయారు. కారును స్వాధినం చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ధర్మపురి సీఐ బిళ్ల కోటేశ్వర్‌ కథనం ప్రకారం, యువతి తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా ఆమె ఒంటరిగా ఇంటివద్ద ఉన్నది.

మధ్యాహ్నం సమయంలో సారంగాపూర్‌ మండలం రేచపల్లికి చెందిన మంగళారపు రాజేందర్‌, మరో ముగ్గురు యువతి ఇంటికి కారులో వచ్చారు.

వచ్చీరాగానే యువతిని బలవంతంగా కారులో తీసుకెళ్లారు. ధర్మపురి అంబేద్కర్‌ చౌక్‌ వద్దకు రాగానే కారు మొరాయించింది.

దీంతో ఇద్దరు దుండగులు కారు దిగి కమలాపూర్‌ రోడ్డు వైపు గల ఓ ఫంక్షన్‌ హాల్‌ వరకు కారును తోసుకుంటూ వెళ్లారు.

డ్రైవర్‌ కూడా కారు దిగి ఇంజిన్‌ను చెక్‌ చేస్తుండగా.. యువతి చాకచక్యంగా తప్పించుకున్నది.

కేకలు వేస్తూ రోడ్డు పక్కన ఉన్న ఇండ్లల్లోకి పరుగెత్తింది. దీంతో దుండగులు కారును అక్కడే వదిలేసి పారిపోయినట్లు'' నమస్తే తెలంగాణ తెలిపింది.

ఫొటో సోర్స్, PA Media

కోహ్లి, సఫారీలతో వన్డే సిరీస్ ఆడతాడా.. లేదా?

భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ నుంచి తప్పుకుంటున్నాడా అనే అంశంపై విపరీతంగా చర్చలు మొదలయ్యాయని 'సాక్షి' పేర్కొంది.

''కోహ్లి,వన్డే సిరీస్‌లో ఆడటం లేదనే వార్తలు రావడంతో మంగళవారం ఉదయం నుంచి పలు రకాల కథనాలు వినిపించాయి.

సఫారీ గడ్డపై మూడు టెస్టుల సిరీస్ ముగిసిన తర్వాత కోహ్లి విశ్రాంతి కోరుకుంటున్నాడని సమాచారం.

తనతో పాటు ప్రయాణించే భార్య, కూతురు కోసం ఆటకు కొంత విరామం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది.

జనవరి 19, 21, 23 తేదీల్లో ఈ వన్డేలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

పైగా కోహ్లి ఇప్పటివరకు విరామం విషయంలో తమను అడగలేదని బోర్డు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

కోహ్లి కూతురు పుట్టిన రోజైన జనవరి 11 నుంచి కేప్‌టౌన్‌లో అతను మూడో టెస్టు ఆడబోతున్నాడు. కాబట్టి విరామానికి అది కారణం కాకపోవచ్చు. ఈ మ్యాచ్ కోహ్లి కెరీర్‌లో 100వది కానుందని'' సాక్షి రాసుకొచ్చింది.

ఫొటో సోర్స్, KCR/FB

ఫొటో క్యాప్షన్,

ఫైల్ ఫొటో

స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ

తమిళనాడు సీఎం స్టాలిన్‌తో సీఎం కేసీఆర్ మంగళవారం భేటీ అయ్యారని 'వెలుగు' కథనం పేర్కొంది.

''సాయంత్రం కుటుంబసమేతంగా వెళ్లిన సీఎంకు చెన్నై నివాసంలో స్టాలిన్ కుటుంబసభ్యులు ఘనస్వాగతం పలికారు. అంతా కాసేపు ముచ్చటించారు.

తర్వాత కేసీఆర్, స్టాలిన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాలపై చర్చించారని కేంద్రంలో బీజేపీ తీరు, రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధాలపై మాట్లాడుకున్నారని సమాచారం.

తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులు, నదులు అనుసంధానంపై కేసీఆర్ వివరించినట్లు తెలిసింది.

చెన్నై సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో నీటి కొరత ఉందని, గోదావరి-కావేరి అనుసంధానాన్ని కోరినట్లు తెలిసింది.

కేసీఆర్ మరో రెండ్రోజులు తమిళనాడులో పర్యటిస్తారని, ఆస్పత్రిలో ఉన్న మాజీ గవర్నర్ నరసింహన్ కుటుంబ సభ్యులను బుధవారం పరామర్శిస్తారని'' వెలుగు తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)