ఇండిగో: గాల్లో చక్కర్లు కొట్టిన విమానం.. ఐదు వేలు ఇవ్వాలన్న సిబ్బంది, కేసు వేస్తానన్న ఎమ్మెల్యే రోజా
విమానం ఎక్కిన దగ్గర్నుంచి లాండయ్యాక కూడా నాలుగు గంటల పాటు డోర్లు తీయకుండా, ఏం జరుగుతుందో చెప్పకుండా తమ ప్రాణాలతో ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది చెలగాటమాడారంటూ ఎమ్మెల్యే రోజా వీడియో విడుదల చేశారు.
ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం విమానాశ్రయంలో మంగళవారం ఉదయం 9.15 గంటలకు 35మంది ప్రయాణికులతో 6ఇ-7265 నంబరు ఇండిగో విమానం బయలుదేరింది.
ఇందులో టీడీపీ సీనియర్ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు జోగేశ్వరరావు, ఆర్కే రోజా తదితర ప్రముఖులు ఉన్నారు.
ఈ విమానం తిరుపతిలో 10.20 గంటలకు దిగాల్సి ఉంది. అక్కడ విమానాన్ని దించేందుకు ప్రయత్నించగా.. వైబ్రేషన్ రావడంతో సుమారు 20 నిమిషాలపాటు గాలిలోనే చక్కర్లు కొట్టింది.
మళ్లీ ల్యాండింగ్‌కు ప్రయత్నించగా.. అప్పుడూ సాధ్యం కాకపోవడంతో, కాస్త దూరం తీసుకుని వెళ్లి 20 నిమిషాల తర్వాత మళ్లీ ల్యాండింగ్‌కు ప్రయత్నించారు.
ఇలా మూడుసార్లు ప్రయత్నించినా ల్యాండింగ్‌కు వీలు కాలేదు. విమానం గాల్లోనే తిరుతుండటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందారు. కొంతమంది భయంతో పెద్దగా కేకలు వేశారు. సాంకేతిక లోపం వల్ల చిన్న సమస్య వచ్చిందని, కంగారు పడొద్దని పైలట్ ప్రయాణికులకు చెప్పారు.
తర్వాత తిరుపతి నుంచి బెంగళూరుకు విమానాన్ని మళ్లించినట్టు తెలియజేసి, బెంగళూరు వైపు వెళ్లారు. 12.15 నిమిషాలకు విమానాన్ని బెంగళూరు విమానాశ్రయంలో దింపారు.
సుమారు 2గంటలపాటు 35 మంది ప్రయాణికులు ప్రాణభయంతో గడిపారు.
బెంగళూరులో ల్యాండ్ కాగానే.. ప్రయాణికులంతా దాన్నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. అయితే విమానం తలుపులు తీసేందుకు సిబ్బంది అంగీకరించకపోవడంతో తీవ్ర అసహనానికి లోనయ్యారు.
ఆపరేషన్ చేయించుకున్నామని, ఇంతసేపు కూర్చోలేమని, కిందకు దిగాలని ప్రయాణికులు అడిగితే ప్రయాణికులు ఒక్కొక్కరూ రూ. 5వేల చొప్పున చెల్లించాలని విమాన సిబ్బంది డిమాండ్ చేశారు. రూ.5 వేలు చెల్లిస్తే సెక్యూరిటీ సమస్య ఉండదా? అని ప్రయాణికులు వాదించడంతో ఎట్టకేలకు కిందికి దిగేందుకు అనుమతి ఇచ్చారు.
విమానం తలుపులు తీసి విమానాశ్రయం లోపలికి పంపడానికి బస్సు ఎక్కించారు. ఆ బస్సులో కూడా అర గంటపాటు ఉంచారు. మళ్లీ గొడవ చేస్తే విమానాశ్రయం లోపలికి తీసుకువెళ్లారు.
అప్పటికి మధ్యాహ్నం అయింది. ప్రయాణికులకు కనీసం భోజన ఏర్పాట్లు చేయకుండా.. ఒక చిన్న డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్ ఇచ్చి చేతులు దులుపుకొన్నారు.
ఆతర్వాత అదే విమానం బెంగళూరు నుంచి 2.36 గంటలకు బయలుదేరి ప్రయాణికులను తిరుపతి చేర్చింది.
ఈ ఘటనపై ఆర్కే రోజా మాట్లాడుతూ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసిన ఇండిగోపై డిఫమేషన్ సూట్ వేస్తానని చెప్పారు.
విమానాన్ని మళ్లించిన ఎయిర్ లైన్స్ సిబ్బంది వ్యవహరించిన తీరు ఏమాత్రం బాగోలేదని యనమల రామకృష్ణుడు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
- మిస్ యూనివర్స్‌గా భారత యువతి హర్నాజ్
- ప్రధాని మోదీ ప్రారంభించనున్న కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రత్యేకతలేంటి
- భారత్‌కు తాలిబాన్ల ప్రశంసలు, మరింత సాయం కావాలని వినతి
- ఒమిక్రాన్: ‘బూస్టర్ డోస్’పై ఐసీఎంఆర్ నిపుణులు ఏమన్నారంటే..
- చెడ్డీ గ్యాంగ్: గుజరాత్ నుంచి వచ్చారు.. పగలు రెక్కీ, అర్థరాత్రి దోపిడీ
- మధులిక రావత్: సైనిక ఉద్యోగుల భార్యల సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షురాలు
- ‘నా కళ్లతో నేను ఒక్క వ్యక్తినే చూశా.. ఆయన కాలిపోతున్నారు’ - బిపిన్ రావత్ హెలీకాప్టర్ ప్రమాదం ప్రత్యక్ష సాక్షి
- బీబీసీ 100 మంది మహిళలు 2021 - మంజులా ప్రదీప్: దళిత మహిళల హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమకారిణి
- 12ఏళ్ల మిస్టరీ వీడినట్లేనా? బిట్ కాయిన్‌ను కనిపెట్టిన సతోషీ నకమోటో ఈయనేనా?
- అనకాపల్లి బెల్లం మార్కెట్లో వ్యాపారం ఎందుకు తగ్గుతోంది?
- తిరుపతి: 2015లో కుండపోత వర్షాలు పడినా రాని వరదలు ఇప్పుడెందుకొచ్చాయి?
- పల్నాడు: ఈ పేరు ఎలా వచ్చింది, పల్నాడు ఉత్సవాల వెనుక కథ ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)