తెలంగాణ: 7 ఏళ్ల బాలుడికి ఒమిక్రాన్.. హైదరాబాద్‌లో అడుగుపెట్టకుండా మరో విమానంలో వెళ్లిపోయాడు

  • బళ్ల సతీశ్
  • బీబీసీ ప్రతినిధి
ఒమిక్రాన్ వేరియంట్

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికీ ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధరణ అయినట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

విమానాశ్రయంలో విదేశాల నంచి వచ్చే వారిలో కొందరికి కరోనా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. వాటిని జీనోమ్ సీక్వెన్స్ కోసం ల్యాబుకు పంపుతున్నారు.

ఆ క్రమంలో కెన్యా నుంచి వచ్చిన 24 ఏళ్ల మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయింది.

ఈ నెల 12వ తేదీన ఆమె హైదరాబాద్ వచ్చి, టోలిచౌకి ప్రాంతంలో ఉన్నారు.

మంగళవారం రాత్రి ఒమిక్రాన్ నిర్ధారణ కావడంతో, ఆమెను గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

ఆమెతో కలిసిన కుటుంబ సభ్యులు, 33 ఏళ్ల వ్యక్తి, 70 ఏళ్ళ తండ్రిని కూడా ఐసోలేషన్ లో ఉంచి, వారి శాంపిళ్లు సేకరించినట్టు తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస రావు తెలిపారు.

వీడియో క్యాప్షన్,

డెల్టా, ఒమిక్రాన్‌ల మధ్య తేడా ఏమిటి?

ఇక 12వ తేదీన సోమాలియా నుంచి వచ్చిన మరో వ్యక్తికి కూడా నిర్ధారణ అయింది.

అతనూ టోలిచౌకి ప్రాంతంలో ఉంటున్నట్టు నిర్ధారించుకున్న అధికారులు ప్రస్తుతం అతణ్ణి ఐసోలేట్ చేసే పనిలో ఉన్నారు.

అతణ్ణి కలిసిన వారిని కూడా ట్రేస్ చేస్తామని అధికారులు ప్రకటించారు.

7 ఏళ్ల బాలుడికి ఒమిక్రాన్

హైదరాబాద్‌లో చేసిన పరీక్షల్లో మరో 7 ఏళ్ల బాలుడికి కూడా ఒమిక్రాన్ నిర్ధారణ అయినప్పటికీ, ఆ బాలుడు నగరంలో అడుగు పెట్టలేదు.

విదేశాల నుంచి వచ్చి విమానాశ్రయంలోనే మరో విమానం మారి కోలకతా వెళ్లాడు.

అతనిది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కావడంతో, అక్కడి అధికారులకు సమాచారం ఇచ్చారు తెలంగాణ అధికారులు.

ప్రస్తుతం నిర్ధారణ అయి తెలంగాణలో ఉన్న రెండు కేసుల్లోనూ పేషెంట్లు రిస్క్ లేని దేశాల నుంచే వచ్చినట్టు శ్రీనివాస రావు మీడియాకు తెలిపారు.

తెలంగాణ, హైదరాబాద్‌లో ఉంటోన్న ఎవరికీ ఒమిక్రాన్ రాలేదు

తెలంగాణ, హైదరాబాద్‌లో నివాసం ఉంటోన్న వారికి ఇప్పటి వరకూ ఎవరికీ ఒమిక్రాన్ రాలేదని ప్రజారోగ్య అధికారులు తెలిపారు.

ఆందోళన చెందవద్దనీ, కానీ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పరీక్షల పెంచుతున్నట్టు ప్రకటించారు. ఆసుపత్రులను సన్నద్ధం చేస్తున్నట్టు తెలిపారు.

యూకేలో ఒక్క కేసు తప్ప మరెక్కడా ఒమిక్రాన్ వల్ల మరణాలు జరగలేదని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు అన్నారు. కోవిడ్ నిబంధనలను అందరూ పాటించాలని ఆయన సూచించారు.

ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చే వారిలో కొంత శాతం రాండమ్ గా పరీక్షలు చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో 5396 మందికి పరీక్షలు చేయగా, వారిలో 18 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. వారిలో 15 మందికి ఒమిక్రాన్ నెగిటివ్ రాగా, ముగ్గురిలో ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చింది. వారిలో ఇద్దరు హైదరాబాద్ లో ప్రవేశించారు.

ఒమిక్రాన్ వచ్చిన ఇద్దరిలో ఎలాంటి లక్షణాలూ లేవని చెప్పారు. ఇది గాలి ద్వారా సోకుతుందని ఆయన చెప్పారు. కిటికీలు, తలుపులూ తెరచి ఉంచాలనీ, మాస్కులు పెట్టుకోవాలనీ ఆయన సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)