వ్యవసాయ కుటుంబాల నెలసరి ఆదాయం రూ. 10 వేలు – ఆరేళ్లలో రైతుల ఆదాయం, అప్పులు ఎంత పెరిగాయి? - కేంద్ర ప్రభుత్వ తాజా సర్వే
- పృథ్వీ రాజ్
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
దేశంలో రైతుల ఆదాయాన్ని 2022-23 సంవత్సరానికల్లా రెట్టింపు చేస్తామంటూ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం 2016లో ప్రకటించింది. అందుకోసం వ్యవసాయ సంస్కరణలు చేపడుతూ 2020లో చేసిన మూడు వ్యవసాయ చట్టాలు వివాదాస్పదం కావటం, రైతుల ఉద్యమంతో వాటిని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉపసంహరించుకోవటం తెలిసిందే.
అయితే.. దేశంలో వ్యవసాయ కుటుంబాల ఆదాయం 2012-13 నుంచి 2018-19 మధ్య 58 శాతం పెరిగినట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సర్వే నివేదిక చెప్తోంది.
ఆ నివేదిక ప్రకారం.. 2012-13 వ్యవసాయ సంవత్సరంలో వ్యవసాయ కుటుంబాల సగటు నెలసరి ఆదాయం రూ. 6,426 గా ఉంటే.. 2018-19 నాటికి అది రూ. 10,218 కి పెరిగింది. అయితే.. ఇది వ్యవసాయ కుటుంబాలకు పంటసాగుతో పాటు ఇతరత్రా వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాల నుంచి వచ్చే మొత్తం ఆదాయం కావటం గమనార్హం.
మరోవైపు.. వ్యవసాయ అప్పులు కూడా ఆరేళ్లలో 59 శాతం పెరిగాయి. 2012-13లో వ్యవసాయ కుటుంబాల సగటు అప్పు రూ. 47,000గా ఉంటే.. 2018-19లో ఆ అప్పు రూ. 74,121కి పెరిగిపోయింది.
భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కుటుంబాల భూమి, పశుసంపద యాజమాన్యం, పరిస్థితి మదింపు కోసం నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) 2018-19 వ్యవసాయ సంవత్సరంలో భారతదేశంలో ఈ సర్వే నిర్వహించింది. అండమాన్ నికోబార్ మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో.. ఎంపిక చేసిన 5,940 గ్రామాల్లో 58,035 కుటుంబాలను రెండు పర్యాయాలు సర్వే చేసింది.
ఈ సర్వే నివేదికను తాజాగా విడుదల చేశారు. దీనికి ముందు 2013లో, దానికి ముందు 2003లో ఈ సర్వేలను నిర్వహించారు. గతంలో భూమి యాజమాన్యం, పశు సంపద యాజమాన్యం సర్వేలను విడివిడిగా నిర్వహించారు. ఈసారి ఈ రెండు సర్వేలను కలిపి చేపట్టారు.
వ్యవసాయ కుటుంబాల ఆదాయం, ఉత్పాదక ఆస్తులు, అప్పులు; వ్యవసాయ పద్ధతులు, సాంకేతిక అవగాహన, పరిజ్ఞానం అందుబాటు వంటి కీలక అంశాలకు సంబంధించి సూచీలను రూపొందించటం ఈ సర్వేల లక్ష్యమని వివరించింది.
అందులో.. దేశంలోనూ, రాష్ట్రాల్లోనూ ఉన్న గ్రామీణ కుటుంబాలు.. వారిలో వ్యవసాయ, వ్యవసాయేతర కుటుంబాల వివరాలు; వారి ఆధీనంలోని సాగు భూములు, పశు సంపద వివరాలు, వారి ఉపాధి వనరులు, ఆదాయం తీరుతెన్నులను సవివరంగా నివేదించింది.
అలాగే.. గ్రామీణ భారతంలో ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ, ఇతర సామాజిక వర్గాల కుటుంబాలు ఎన్ని ఉన్నాయి తదితర వివరాలనూ క్రోడీకరించారు. ఎస్ఏఎస్ 2019 నివేదికలోని 7 ముఖ్యాంశాలివీ....
డాక్టర్ తవ్వా వెంకటయ్య.. వ్యవసాయ కూలీ
1. వ్యవసాయ కుటుంబాల సగటు నెలసరి ఆదాయం రూ. 10,218 వేలు
వ్యవసాయ కుటుంబాల సగటు నెలసరి ఆదాయం 2018-19 సంవత్సరంలో రూ. 10,218గా ఉందని ఎస్ఏఎస్ 2019 సర్వే చెప్పింది. వ్యవసాయ ఖర్చులను తీసేసి ఈ ఆదాయాన్ని లెక్కించారు. అయితే.. సొంత పరికరాలు, యంత్రాలు, విత్తనాలు, కుటుంబ సభ్యుల శ్రమను కూడా తీసివేస్తే.. నెలసరి ఆదాయం రూ. 8,337 గా ఉన్నట్లు ఆ నివేదిక వివరించింది.
2012-13లో వ్యవసాయ కుటుంబ సగటు నెలసరి ఆదాయం రూ. 6,426గా ఉంది. ఇందులో సాగు ద్వారా వచ్చిన ఆదాయం కేవలం రూ. 3,081 (47.95%) మాత్రమే. మిగతా మొత్తం పశుపోషణ, కూలీ పనులు, వ్యవసాయ సంబంధిత వ్యాపారాల ద్వారా వచ్చే ఆదాయం. అంటే.. వీటన్నిటికన్నా కూడా వ్యవసాయం మీద వచ్చే ఆదాయం తక్కువ.
ఈ నేపథ్యంలో 2018-19 సర్వే ప్రకారం.. వ్యవసాయ కుటుంబ సగటు నెలసరి ఆదాయం రూ. 10,218గా ఉంది. అంటే.. 2012-13తో పోలిస్తే రైతుల సగటు నెలసరి ఆదాయం ఆరేళ్లలో రూ. 3,792 పెరిగినట్లు అవుతుంది.
వాస్తవానికి.. 2018-19 సర్వే చెప్తున్న వ్యవసాయ కుటుంబాల సగటు నెలసరి ఆదాయం 10,218 రూపాయల్లో.. పంట ఉత్పత్తి నుంచి లభించిన ఆదాయం కేవలం రూ. 3,798 మాత్రమే. ఆదాయంలో దీని వాటా 37.2% మాత్రమే. వ్యవసాయ కుటుంబ ఆదాయంలో కూలీలు, వేతనాల వాటా - రూ. 4,063 ఎక్కువగా ఉంది.
ఈ విధంగా చూస్తే.. వ్యవసాయ కుటుంబ సగటు నెలసరి ఆదాయంలో.. పంట ఉత్పత్తి ఆదాయం వాటా ఆరేళ్లలో 47.95 శాతం నుంచి 37.2 శాతానికి తగ్గింది. వ్యవసాయేతర ఆదాయం వాటా 59.82 శాతం నుంచి 62.8 శాతానికి పెరిగింది.
అలాగే.. వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం 2012-13లో 3,071 రూపాయలుగా ఉంటే.. 2018-19 నాటికి 3,798 రూపాయలకు పెరిగింది. అంటే.. ఆరేళ్లలో రైతుల సగటు నెలసరి వ్యవసాయ ఆదాయం మొత్తంగా పెరిగింది రూ. 727 మాత్రమే. ఆ లెక్కన ఏడాదికి సగటున రూ. 122 పెరిగినట్లు అవుతుంది.
2. తెలుగు రాష్ట్రాల వ్యవసాయ ఆదాయాల మధ్య తేడా...
ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య వ్యవసాయ కుటుంబాల ఆదాయాల్లో అంతరం కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ కుటుంబాల సగటు నెలసరి ఆదాయం రూ. 10,480గా ఉంటే.. తెలంగాణలో అది రూ. 9,203గా ఉంది. అంటే ఏపీ కన్నా తెలంగాణలో ఈ ఆదాయం దాదాపు పది శాతం తక్కువగా ఉంది.
అయితే.. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ కుటుంబ ఆదాయంలో పంట ఉత్పత్తి ఆదాయం కేవలం రూ. 2,734గా ఉంటే.. తెలంగాణలో అది రూ. 4,937గా ఉండటం విశేషం. ఏపీలో కూలీ ఆదాయం అధికంగా రూ. 4,849 గా ఉంటే.. తెలంగాణలో అది రూ. 2,961 గా ఉంది.
ఇదిలావుంటే.. ఎస్ఏఎస్ 2019 సర్వే ప్రకారం.. వ్యవసాయ కుటుంబాలకు గల భూమి విస్తీర్ణాన్ని బట్టి ఆయా కుటుంబాల ఆదాయాల్లో చాలా తేడాలున్నాయి. అతి తక్కువ భూమి ఉన్న కుటుంబాల సగటు నెలసరి ఆదాయం రూ. 7,500 గా ఉంటే.. పది హెక్టార్లకు పైబడి ఉన్న కుటుంబాల సగటు నెలసరి ఆదాయం రూ. 61,000 వరకూ ఉంది.
దేశంలోని ప్రతి పది వ్యవసాయ కుటుంబాల్లో దాదాపు తొమ్మిది కుటుంబాలు.. భూమిలేని, చిన్న, సన్నకారు వ్యవసాయ కుటుంబాలే కావటం గమనార్హం. అంటే.. వీరి దగ్గర 2 హెక్టార్ల (సుమారు 5 ఎకరాలు) కన్నా తక్కువే సాగు భూమి ఉంది. వారి సగటు నెలసరి ఆదాయం రూ. 9,700.
ఇక 2 హెక్టార్ల నుంచి 10 హెక్టార్ల వరకూ (5 ఎకరాల నుంచి 25 ఎకరాల వరకు) సాగు భూమి ఉన్న కుటుంబాలు కేవలం 12 శాతం ఉండగా.. వారి సగటు నెలసరి ఆదాయం సుమారు రూ. 35,000 గా ఉంది.
సింఘు బోర్డర్‌లో వ్యవసాయ చట్టాల రద్దును హర్షిస్తూ రైతుల సంబరాలు
3. రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఆదాయాల్లో భారీ తేడాలు...
రాష్ట్రాల మధ్య కూడా సగటు నెలవారీ వ్యవసాయ ఆదాయాల్లో చాలా తేడాలున్నాయి. బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో వ్యవసాయ ఆదాయాలు.. జాతీయ సగటు కన్నా తక్కువగా ఉన్నాయి.
పంజాబ్ (రూ. 26,701), హరియాణా (రూ. 22,841) రాష్ట్రాల్లో అతి ఎక్కువ ఆదాయాలు నమోదైతే.. జార్ఖండ్ (నెలకు రూ. 4,958), ఒడిశా (నెలకు రూ. 5,112) రాష్ట్రాల్లో అతి తక్కువ ఆదాయాలు నమోదయ్యాయి.
4. ఒక్కో వ్యవసాయ కుటుంబానికి రూ. 74,000 అప్పులు
దేశంలోని వ్యవసాయ కుటుంబాల్లో సగానికి సగం (50.2 శాతం) అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాయని ఎస్ఏఎస్ సర్వే 2019 చెప్తోంది. మొత్తం వ్యవసాయ కుటుంబాలను కలిపి చూస్తే.. ఒక్కో కుటుంబానికి సగటున రూ. 74,121 అప్పు ఉంది. ఈ అప్పుల్లో సగానికి పైగా అప్పులు వ్యవసాయ అవసరాల కోసం చేసినవే.
మొత్తం అప్పుల్లో దాదాపు 70 శాతం బ్యాంకులు, కోఆపరేటివ్ సొసైటీలు, ప్రభుత్వం వంటి వ్యవస్థాగత సంస్థల నుంచి తీసుకున్నవి కాగా.. 20 శాతం పైగా అప్పులు వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకున్న అప్పులు.
అప్పులున్న వ్యవసాయ కుటుంబాల్లో 82.9 శాతం కుటుంబాలు.. 2 హెక్టార్లకన్నా తక్కువ భూమి ఉన్న కుటుంబాలే కావటం గమనార్హం.
వరదలు, కరవును తట్టుకునే వ్యవసాయం ఇదీ..
ఇక మొత్తం 28 రాష్ట్రాల్లో 11 రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబాల సగటు అప్పులు జాతీయ సగటు కన్నా అధికంగా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలన్నింట్లోనూ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లో వ్యవసాయ కుటుంబాల సగటు అప్పు 1 లక్ష కన్నా ఎక్కువే ఉంది.
అప్పుల్లో కూరుకుపోయిన వ్యవసాయ కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ (93.2%), తెలంగాణ (91.7%) రాష్ట్రాల్లోనే అత్యధికంగా ఉన్నాయి. ఆ తర్వాత మూడో స్థానంలో (69.9% వ్యవసాయ కుటుంబాలు) కేరళ నిలిచింది.
అలాగే.. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ కుటుంబాల సగటు అప్పు దేశంలోనే అత్యధికంగా రూ. 2,45,554 గా ఉంది. తెలంగాణలో వ్యవసాయ కుటుంబాల సగటు అప్పు రూ. 1,52,113 గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో 47 శాతం అప్పులు, తెలంగాణలో 50 శాతం అప్పులు వడ్డీ వ్యాపారుల నుంచి చేసినవే కావటం విశేషం.
5. దేశంలో దాదాపు 10 కోట్ల వ్యవసాయ కుటుంబాలు - 90 శాతం చిన్న రైతులే...
దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో మొత్తంగా 17 కోట్ల 24 లక్షల 43 వేల కుటుంబాలు ఉన్నాయి. వీటిలో 54 శాతం వ్యవసాయ కుటుంబాలు (9 కోట్ల 30 లక్షల 94 వేలు) ఉంటే.. 46 శాతం వ్యవసాయేతర కుటుంబాలు (7 కోట్ల 93 లక్షల 50 వేలు) ఉన్నాయి.
మొత్తం 9.31 కోట్ల వ్యవసాయ కుటుంబాలు ఉండగా.. వాటిలో ప్రతి 10 కుటుంబాల్లో దాదాపు 9 కుటుంబాలకు ఉన్న భూమి 2 హెక్టార్లకన్నా తక్కువే.
అలాగే.. ప్రతి మూడు వ్యవసాయ కుటుంబాల్లో రెండు కుటుంబాలకు గల భూమి 1 హెక్టారుకన్నా తక్కువగానే ఉంది.
6. ఒక్కో కుటుంబానికి ఉన్న సగటు భూమి 0.876 హెక్టార్లు...
దేశంలో వ్యవసాయ కుటుంబాలకు సగటున 0.876 హెక్టార్ల భూమి ఉంది. మొత్తం వ్యవసాయ కుటుంబాల్లో 2.6 శాతం కుటుంబాలకు భూమి లేదు. వ్యవసాయేతర కుటుంబాలకు సగటున 0.086 హెక్టార్ల భూమి ఉంటే.. భూమి లేని కుటుంబాలు 14.8 శాతంగా ఉన్నాయి.
మొత్తంగా గ్రామీణ కుటుంబాల్లో చూస్తే.. ఒక్కో కుటుంబానికి సగటున 0.512 హెక్టార్ల భూమి ఉంది. భూమి లేని గ్రామీణ కుటుంబాల శాతం 8.2 శాతంగా ఉంది.
గ్రామీణ కుటుంబాల్లో ఒక హెక్టారుకన్నా తక్కువ భూమి గల వారే అత్యధికంగా 76.5 శాతంగా ఉంది. పది హెక్టార్ల కన్నా ఎక్కువ భూమి ఉన్నవారి శాతం 0.01 శాతంగా ఉంది.
7. వ్యవసాయ కుటుంబాల్లో ఓబీసీలే అధికం...
దేశంలో మొత్తం 17.24 కోట్లకు పైగా ఉన్న గ్రామీణ కుటుంబాల్లో అత్యధికంగా 7.66 కోట్ల కుటుంబాలు (44.4 శాతం) ఓబీసీ కుటుంబాలేనని ఎస్ఏఎస్ 2019 సర్వే చెప్తోంది.
ఆ సర్వే ప్రకారం.. వ్యవసాయ కుటుంబాల్లో 45.8 శాతం ఓబీసీ కుటుంబాలున్నాయి. వ్యవసాయేతర కుటుంబాల్లో కూడా 42.8 శాతం ఓబీసీలే.
అలాగే.. మొత్తం గ్రామీణ కుటుంబాల్లో 2.11 లక్షలకు పైగా ఎస్‌టీ కుటుంబాలు, 3.73 కోట్లకు పైగా ఎస్‌సీ కుటుంబాలు ఉన్నాయి. ఇతర సామాజిక వర్గాల కుటుంబాలు 3.73 కోట్లుగా ఉన్నాయి.
ఇక తెలుగు రాష్ట్రాల్లో.. ఆంధ్రప్రదేశ్‌లో 94.61 లక్షల గ్రామీణ కుటుంబాలు ఉంటే.. అందులో ఓబీసీలు 45.8 శాతం, ఎస్‌సీలు 23.9 శాతం, ఇతరులు 22.2 శాతం, ఎస్‌టీలు 8.1 శాతం కుటుంబాలు ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 48.99 లక్షల గ్రామీణ కుటుంబాలు ఉండగా.. అందులో ఓబీసీలు 57.4 శాతం, ఎస్‌సీలు 25.5 శాతం, ఎస్‌టీలు 9.2 శాతం, ఇతరులు 7.9 శాతం కుటుంబాలు ఉన్నాయి.
తెలంగాణ: ‘చనిపోవాలనుకున్నోడే వ్యవసాయం చేయాలి, నా దృష్టిలో..”’
ఇవి కూడా చదవండి:
- కోవిడ్డెంగీ అంటే ఏంటి? తెలంగాణలో ఏం జరుగుతోంది? మీరు తెలుసుకోవాల్సిన 6 అంశాలు
- భారత్కు తాలిబాన్ల ప్రశంసలు, మరింత సాయం కావాలని వినతి
- తెలంగాణ: 7 ఏళ్ల బాలుడికి ఒమిక్రాన్.. హైదరాబాద్లో అడుగుపెట్టకుండా మరో విమానంలో వెళ్లిపోయాడు
- ఒమిక్రాన్: ‘బూస్టర్ డోస్’పై ఐసీఎంఆర్ నిపుణులు ఏమన్నారంటే..
- పుష్ప-సమంత: ‘ఊ అంటావా మావా..’ పాట ఐటెం సాంగ్ పంథాను తిరగరాస్తుందా? ‘మగ బుద్ధి’ గురించి చంద్రబోస్ ఏమన్నారు?
- సర్దార్ పటేల్: ‘రాజులను అంతం చేయకుండా, రాజ్యాలను అంతం చేసిన నాయకుడు’
- హైదరాబాద్: సీబీఐ ఏజెంట్లుగా నమ్మించి, సోదాలు చేసి, 135 తులాల బంగారం చోరీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)