Delhi Air Pollution: దిల్లీలో ఉంటున్నారా? మీ ఆయుర్దాయం 10 ఏళ్ళు తగ్గిపోతున్నట్లే..

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచంలోనే అత్యధిక వాయు కాలుష్యంతో నిండిన నగరం దిల్లీ. ఇక్కడ వాయు కాలుష్యం వల్ల ప్రజల ఆయుర్దాయం 10 ఏళ్ళు తగ్గిపోతోందని యూఎస్ రీసెర్చ్ గ్రూప్ చేసిన అధ్యయనం తెలిపింది.
ప్రస్తుతం దేశంలో ఉన్న వాయు కాలుష్యం స్థాయిల వల్ల భారతీయుల సగటు ఆయుర్దాయం 5 ఏళ్ళు తగ్గుతోందని ఈ అధ్యయనం పేర్కొంది.
దేశంలో 130 కోట్ల మంది ప్రజలు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన సురక్షిత స్థాయి 5µg/m³ కంటే అధిక వాయు కాలుష్యం ఉన్న ప్రదేశాల్లోనే నివాసం ఉంటున్నారు.
భారతదేశంలో వాయు కాలుష్యం కారణంగా ఏటా కొన్ని లక్షల మంది మరణిస్తున్నారు.
చలికాలంలో మంచుతో పాటు పిఎమ్ 2.5 స్థాయిలు (గాలిలో ఉన్న కాలుష్య కణాల సంఖ్య) అత్యంత ప్రమాదకర రీతిలో పెరిగిపోతున్నాయి. ఇవి ఊపిరితిత్తులను బ్లాక్ చేసి రకరకాల జబ్బులకు కారణమవుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుతం ఉన్న కాలుష్య స్థాయిలను చూస్తుంటే, ఉత్తర భారతదేశంలో సుమారు 51 కోట్ల జనాభా (దేశ జనాభాలో 40% మంది) తమ ఆయుర్దాయంలో సగటున 7.6 సంవత్సరాలను కోల్పోతున్నారని యూనివర్సిటీ ఆఫ్ చికాగోలోని ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ (ఈపీఐసీ) నిర్వహించిన ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ సూచిస్తోంది.
కాలుష్యాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకానికి అనుగుణంగా తగ్గించగలిగితే ఉత్తర్ ప్రదేశ్‌లోని సుమారు 24 కోట్ల మంది ప్రజల ఆయుర్దాయం 10 ఏళ్ళు పెరుగుతుంది.
2013 నుంచి ప్రపంచంలో సుమారు 44 శాతం కాలుష్యం ఒక్క భారతదేశం నుంచే వెలువడుతున్నట్లు పేర్కొంది. ప్రపంచంలోనే కాలుష్యం అధికంగా ఉన్న దేశాల్లో భారత్ రెండవ స్థానంలో ఉంది.
భారత జనాభాలో 63% మందికి పైగా మంది దేశంలో నిర్దేశించిన వాయు కాలుష్య ప్రమాణాలు దాటిన ప్రదేశాల్లోనే నివసిస్తున్నారని నివేదిక చెప్పింది. దేశంలో 40µg/m³ స్థాయిని సురక్షిత స్థాయి అని చెబుతారు. 2019లో భారతదేశంలో గాలిలోని సూక్ష్మధూళి కణాల సాంద్రత 70.3 µg/m³గా ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం.

ఫొటో సోర్స్, Getty Images
"మార్స్ నుంచి గ్రహంతర వాసులు భూమిపైకి వచ్చి ఏదైనా మత్తు పదార్ధాలను స్ప్రే చేసి భూమిపై నివసించే వారి ఆయుర్దాయం రెండేళ్లు తగ్గేలా చేస్తే అది అంతర్జాతీయంగా అత్యవసర పరిస్థితి విధించేందుకు దారి తీస్తుంది" అని నివేదిక అధ్యయనకారులు మైఖేల్ గ్రీన్ స్టోన్ చెప్పారు.
"ప్రపంచంలో చాలా చోట్ల ఇలాంటి పరిస్థితే ఉంది. కాకపొతే, ఆ మత్తు పదార్ధాన్ని గ్రహాంతరవాసులు కాకుండా మనమే స్వయంగా చల్లుతున్నాం" అని మైఖేల్ అన్నారు.
గాలిలో ఉన్న ఈ కాలుష్యం మానవ జీవితానికి పెను ముప్పుగా పరిణమిస్తోందని ఈపీఐసీ చెబుతోంది. 1998 నుంచి ఈ కాలుష్యం 61.4% పెరిగి ప్రజల ఆయుర్దాయంను మరింత తగ్గిస్తోంది. ఇది పొగ తాగడం కంటే కూడా మరింత హానికరం. ఇది ఆయుర్దాయాన్ని మరో 2.5 సంవత్సరాలు తగ్గిస్తుంది.
"గత రెండు దశాబ్దాలుగా భారత్‌లో పెరిగిన పారిశ్రామికీకరణ, ఆర్థికాభివృద్ధి, విపరీతంగా పెరిగిన శిలాజ ఇంధనాల వాడకం వాయు కాలుష్యం పెరిగేందుకు దారి తీశాయి. భారత్‌లో రోడ్లపై ప్రయాణించే వాహనాల సంఖ్య నాలుగింతలు పెరిగింది" అని ఈ నివేదిక చెబుతోంది.
కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కూడా ఈ నివేదిక విశ్లేషించింది. వాయు కాలుష్యంపై పోరాటంలో భాగంగా గాలిలో ఉండే ప్రమాదకర సూక్ష్మధూళి కణాల కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో 2019 జాతీయ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్‌సీఏపీ) చేపట్టింది కేంద్ర ప్రభుత్వం.
ది నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్‌సీఏపీ ) గాలిలోని హానికారక కాలుష్య కణాలను 20-30% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
"భారతదేశం కాలుష్య స్థాయిలను పెరగకుండా చూడగలిగితే, ప్రజల ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది" అని నివేదిక తెలిపింది. "కాలుష్యం స్థాయిలు 25% తగ్గితే, సగటు జాతీయ ఆయుర్దాయం 1.4 ఏళ్ళు దిల్లీలో 2.6 ఏళ్ళు పెరుగుతాయి" అని చెప్పింది.
సముద్ర మట్టానికి 13వేల అడుగుల ఎత్తులోని హిమాలయ పర్వత గ్రామాలకు నీరు చేరుతోందా?
ఇవి కూడా చదవండి:
- ప్రయాగ్‌రాజ్ హింస: బుల్డోజర్లతో కూల్చేసిన ఈ ఇంటిలో ఉండే జావెద్ మొహమ్మద్ ఎవరు?
- పెట్రోల్, డీజిల్ ఆదా చేసే ట్రిక్స్‌లో అపోహలు, 5 వాస్తవాలు
- సెక్స్ కోసం మహిళను మగాడు బలవంతం చేస్తే అది రేప్... మరి అదే పని ఒక మహిళ చేస్తే
- ఇంటర్నెట్ ద్వారా ఆదాయం.. ఎంత సేపు బ్రౌజ్ చేస్తే అంత సంపాదించగలిగితే ఎలా ఉంటుంది?
- బ్లడ్ గ్రూప్స్ గురించి మీకేం తెలుసు... వాటిలో చాలా అరుదుగా దొరికే రక్తం రకాలు ఏంటి?
- కసార్ దేవి: హిమాలయాల ఒడిలో ఉన్న ఈ ప్రాంతానికి ప్రపంచం నలుమూలల నుంచి మేధావులు ఎందుకు వస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)