లేపాక్షి: ఇక్కడ రాతి స్తంభం నిజంగా గాల్లో వేలాడుతోందా?

  • బళ్ల సతీశ్, నవీన్ కుమార్ కందేరి, తులసి ప్రసాద్ రెడ్డి
  • బీబీసీ తెలుగు
లేపాక్షి

లేపాక్షి అంటేనే ఓ శిల్ప సౌందర్య మాలిక! అబ్బురపరిచే శిల్ప సంపదకే కాదు, ఔరా అనిపించే చిత్రకళా నైపుణ్యానికీ నిలయం ఈ సముదాయం.

సుమారు 400 ఏళ్ల పైగా చెక్కు చెదరని వర్ణ చిత్రాలూ, భారీ నంది విగ్రహం, ఏడు పడగల నీడన శివుడు.. ఇలాంటివెన్నో ఆకర్షణలు ఈ ఆలయం సొంతం.

దాదాపు 500 ఏళ్ల చరిత కలిగిన ఈ వీరభద్ర ఆలయం చుట్టూ ఎన్నో పౌరాణిక, చారిత్రక గాథలున్నాయి.

లేపాక్షి

భారీ నంది

లేపాక్షి అంటే ముందు గుర్తొచ్చేది భారీ నంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఏక శిలా నందిగా దీన్ని చెబుతారు. ఒకే రాయిని తొలిచి దీన్ని నిర్మించారు.

ఎంతో పెద్ద శిల్పం అయినా నంది మెడలో మువ్వల వంటి చిన్న విషయాల్లో కూడా ఎంతో శ్రద్ధ తీసుకుని చెక్కారు.

లేపాక్షి

15 అడుగుల ఎత్తు, 27 అడగులు పొడవు ఉంది ఈ నంది. అయితే ఈ నంది విగ్రహాన్ని ఎవరు చెక్కారు అన్న విషయం చరిత్రలో స్పష్టంగా నమోదు కాలేదని చరిత్రకారులు అంటున్నారు.

ఆరు బయట ఏడు పడగల నాగు కింద ఉన్న శివలింగం ఈ దేవాలయం మరో ప్రధాన ఆకర్షణ.

లేపాక్షి

ఫొటో సోర్స్, Getty Images

వందల ఏళ్లుగా చెక్కు చెదరని వర్ణ చిత్రాలు

లేపాక్షి గుడి లోపల తల ఎత్తి పైకి చూస్తే కనిపించే రంగు రంగుల బొమ్మలు మరో ప్రత్యేకత. ఈ గుడి పైకప్పుపై దాదాపు 500 ఏళ్ల నుంచి ఈ వర్ణ చిత్రాలున్నాయి.

ప్రధాన వీరభ్రద దేవాలయం పైకప్పుపై ఇవి కనిపిస్తాయి. వీటిలో పురాణ గాథలతో పాటూ నాటి సమకాలీన చిత్రాలున్నాయి. కృష్ణుని గాథలు, శివుని కళ్యాణం, శివుని 14 అవతారాలు ఇలా చాలా బొమ్మలున్నాయి. శివుని 15 అవతారాల చిత్రాలున్నాయి.

లేపాక్షి

ఇంత పెద్ద చిత్రాలు ఆసియాలో మరెక్కడా లేవని చరిత్రకారులు చెబుతారు. కింద నుంచి తల ఎత్తి చూస్తే కనిపించేలా వాటిని వేశారు.

‘‘ఆ రోజుల్లో చిత్రకారులు వాటిని ఎంతో కష్టపడి వేశారు. అజంతా వంటి చోట కనిపించే చిత్రాలివి. ఈ బొమ్మలు వేసేనాటికి విజయనగర కళలు గొప్ప దశలో ఉన్నాయి. వీటిలో పురాణాలు, ఇతిహాసాలతో పాటూ, అప్పటి సమకాలీన వస్త్రధారణ, జీవన పరిస్థితులు వంటివి కూడా కనిపించేలా వేశారు. సాధారణంగా దేవాలయాలు కట్టినప్పుడు శిల్పులు దేవుళ్లతో పాటూ సమకాలీన విశేషాలు చిత్రాలు, శిల్పాల్లో ఉట్టిపడేలా చూస్తారు. దానివల్ల మనకు విజయనగర కాలం నాటి సామాజిక విశేషాలు తెలుస్తున్నాయి’’ అని చరిత్రకారులు ఈమని శివనాగిరెడ్డి బీబీసీతో చెప్పారు.

లేపాక్షి

ఫొటో సోర్స్, Getty Images

పురాణం – చరిత్ర

వీరభద్రుడి గుడి ఉన్న కొండను కూర్మశైలం అంటారు. స్కంద పురాణంలో శివుడికి ముఖ్యమైన 108 క్షేత్రాల్లో ఒకటిగా లేపాక్ష్య పాపనాశనం పేరుతో ఈ ఊరి ప్రస్తావన ఉందని స్థానిక పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం అగస్త్య మహర్షి ఇక్కడ దేవాలయం నిర్మించారు.

చరిత్ర ప్రకారం 16 శతాబ్దంలో విజయనగరాన్ని అచ్యుతరాయలు పాలిస్తున్నప్పుడు ఆయన కోశాధికారి అయిన విరూపణ్ణ ఈ గుడి కట్టించారు. 1533లో గుడి ప్రతిష్ట జరిగినట్టు శాసనాలు చెబుతున్నాయి.

విరూపణ్ణతో పాటూ ఆయన సోదరుడు వీరన్న పాత్ర కూడా నిర్మాణంలో ఉంది. అయితే తన డబ్బు సరిపోక ప్రజలు పన్ను కట్టిన డబ్బుతో రాజు అనుమతి లేకుండా ఈ గుడి నిర్మించాడనే వాదన ప్రచారంలో ఉంది.

తరువాత విషయం రాజుకు తెలియడంతో అచ్యుతరాయలు విరూపణ్ణను శిక్షించాడనీ, అందుకే ఇక్కడ కల్యాణ మండపం సగంలో ఆగిపోయింది అని చెబుతారు. ఈ కథకు శాసనాలు లేవు. నోటి మాటగానే ప్రచారంలో ఉంది.

లేపాక్షి

ఫొటో సోర్స్, aptourism

వేలాడే స్తంభం రహస్యం ఏంటి?

లేపాక్షిలో ఒక వేలాడే స్తంభం గురించి బాగా ప్రచారం ఉంది. కానీ చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం వాస్తవంగా ఇది వేలాడే స్తంభం కాదు. కాలక్రమంలో ఆ స్తంభం కింద భూమి కుంగడం వల్ల స్తంభం పాక్షికంగా గాల్లో ఉన్నట్టు కనిపిస్తుంది.

లేపాక్షి

ఫొటో సోర్స్, aptourism

‘‘కాలక్రమంలో ఆ స్తంభం కింద ఉన్న రాతి పలక కదలడంతో స్తంభం కొద్దిగా గాల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ స్తంభం కొద్ది భాగం భూమిని ఆనుకునే ఉంటుంది. పేపర్ కానీ, బట్ట కానీ ఆ స్తంభం కింది నుంచి పూర్తిగా లాగలేరు. కొందరు దీన్ని వేలాడే స్తంభంగా ప్రచారం చేయడం అపోహ’’ అని ఈమని శివనాగి రెడ్డి అన్నారు.

కానీ స్థానికులు మాత్రం అది నిజంగా వేలాడే స్తంభమేనని అంటారు.

లేపాక్షి

‘‘ఆ స్తంభం ఒకప్పుడు పూర్తిగా వేలాడుతూ ఉండేది. దాన్ని బ్రిటిష్ వారు పరిశోధన కోసం కదిల్చినప్పుడు కొంచెం ఒరిగి నేలను తాకింది. లేకపోతే అది మొత్తం పైకప్పుకు వేలాడేది’’ – ఇది స్థానికులు, గైడ్స్ చెప్పే మాట.

వీడియో క్యాప్షన్,

గుడిమల్లం: విశిష్ట లింగాకారంతో పూజలందుకుంటున్న ప్రాచీన ఆలయం

లేపాక్షి అంటే?

లేపాక్షి అనే పదానికి పేరు ఎలా వచ్చింది అనే దానిపై రకరకాల కథలున్నాయి. రాముడు జటాయు పక్షిని ‘‘లే పక్షీ’’ అని పిలిచాడు కాబట్టి ఈ ఊరు లేపాక్షి అయిందని ఒక కథనం.

ప్రభుత్వ డబ్బుతో అనుమతి లేకుండా గుడి కట్టినందుకు అచ్యుత రాయలు, విరూపణ్ణ కళ్లు పీకించారని ఒక కథనం.

లేపాక్షి

ఫొటో సోర్స్, aptourism

మరో కథనం ప్రకారం, అచ్యుతరాయలు శిక్ష వేయడానికి ముందే, విరూపణ్ణ తన కళ్లు పీక్కుని ఆ గుడి గోడకు విసిరికొట్టాడనీ, దీంతో లేపము, అక్షి కలసి లేపాక్షి అనే పేరు వచ్చిందని మరో కథనం.

తన కుమారుడికి మాటలు వస్తే గుడి కట్టిస్తానని విరూపణ్ణ మొక్కుకున్నాడనీ, ఈ కొండపై తన కొడుకు తిరుగుతుండగా మాటలు వచ్చాయి కాబట్టి, అక్కడి మహిమ గుర్తించి గుడి కట్టించారని ఒక కథనం ఉంది.

అయితే గుడి కట్టక ముందు, నంది శిల్పం చెక్కక ముందే ఈ గ్రామానికి లేపాక్షి అనే పేరు ఉన్నట్టు చరిత్రకారులు చెబుతున్నారు.

వీడియో క్యాప్షన్,

రామప్పగుడి: ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన ఈ ఆలయం ప్రత్యేకతలేంటి?

శిల్పాలు - మండపాలు

లేపాక్షి సముదాయంలో మూడు ప్రాకారాలు, మూడు ప్రధాన ఆలయాలు, మూడు ఉప ఆలయాలు, ఒక అర్థ మండపం, నాట్యం మండపం ఉన్నాయి.

వీరభద్రునితో పాటూ విష్ణు, శివ, దుర్గా దేవిల గుళ్లు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. అద్భుత శిల్పాలు చెక్కిన స్తంభాలు అనేకం ఉన్నాయి.

ఒక గోపురం కాలక్రమంలో దెబ్బతింది. ఒక కళ్యాణ మండప నిర్మాణం సగంలో ఆగిపోయింది. ఒక కళ్యాణ మండపం పూర్తి చేయలేదు. ఆ మండపం గోడపై ఒక చోట ఇనుము రంగులో ఉన్న చారలను విరూపణ్ణ కళ్ళ నుంచి కారుతున్న రక్తం అని భక్తులు నమ్ముతారు. దానిపై శాస్త్రీయ పరిశోధనలు జరగలేదు.

ఎత్తైన ప్రాకారంలో అనేక ఇతర మండపాలు, గోపురాలు, శిల్పాలు చెక్కిన స్తంభాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)