బీబీసీ ఆన్‌లైన్ వార్తల్లో విశ్వసనీయత, పారదర్శకత కోసం చేస్తున్న కృషి ఇదీ...
ఇంటర్నెట్లో ఉండే వార్తా కథనాల్లో ఏవి విశ్వసనీయమైనవో గుర్తించలేని అయోమయ పరిస్థితి నెలకొంది. దీనిని దృష్టిలో ఉంచుకొని, మా వెబ్‌సైట్లో మీరు చదివే, చూసే కంటెంట్ ఎంత విశ్వసనీయమైనదో మీకు వివరించే ప్రయత్నం ఇది. ఆన్‌లైన్ వార్తల్లో విశ్వసనీయత, పారదర్శకత కోసం బీబీసీ చేస్తున్న కృషి గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు.
విశ్వసనీయమైన వార్తాకథనాలు అందించే సంస్థగా బీబీసీకి బ్రిటన్లో, ప్రపంచవ్యాప్తంగా పాఠకుల్లో, వీక్షకుల్లో పేరుంది. మా టీవీ, రేడియో సర్వీసుల్లాగే మా వెబ్‌సైట్ కూడా కచ్చితమైన, నిష్పాక్షికమైన, స్వతంత్రమైన జర్నలిజం చేయడానికి కృషి చేస్తోంది.
మా ఎడిటోరియల్ మార్గదర్శకాలు ఇవీ...
"మా కంటెంట్‌పై మా పాఠకులకు, వీక్షకులకు ఉన్న నమ్మకమే మేం చేసే ప్రతి పనిలో మమ్మల్ని నడిపిస్తుంది. మేం స్వతంత్రంగా, నిష్పాక్షికంగా, నిజాయతీగా ఉంటాం. కచ్చితత్వం, నిష్పాక్షికత విషయంలో అత్యున్నత ప్రమాణాలను పాటించడానికి మేం కట్టుబడి ఉన్నాం. తెలిసిగాని, తెలియకుండాగాని పాఠకులను, వీక్షకులను మేం తప్పుదోవ పట్టించం."
"మా విశ్వసనీయతలో నిష్పాక్షికత, దానికి మేం కట్టుబడి ఉండే తీరు అత్యంత ప్రధానమైనవి. మేం ప్రతి అంశాన్ని అన్ని రకాల అభిప్రాయాలు, ఆలోచనలను ప్రతిబింబించేలా నిష్పాక్షికంగా అందిస్తాం. నిజానిజాలన్నీ నిష్పాక్షికంగా పరిగణనలోకి తీసుకుంటాం."
ఇంటర్నెట్‌లోని వార్తాకథనాల్లో ఏవి నమ్మాలో, ఏవి నమ్మకూడదో గుర్తించలేని అయోమయ పరిస్థితి నెలకొని ఉంది. బీబీసీ జర్నలిజం తీరు ఎలా ఉంటుందో మీరు మరింత వివరంగా తెలుసుకోవాలనుకొంటున్నారని మాకు తెలుసు.
ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొనే, బీబీసీ న్యూస్ వెబ్‌సైట్లో మీరు చదివే, చూసే సమాచారం ఎలాంటిదో మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడి నుంచి ఎవరు సమాచారం అందిస్తున్నారు, వార్తాకథనం ఎలా అందిస్తున్నాం లాంటి వివరాలు తెలియజేస్తున్నాం. బీబీసీ న్యూస్ విశ్వసనీయమైనదని మీ అంతట మీరు తెలుసుకొనేందుకు మా ఈ ప్రయత్నం తోడ్పడుతుంది.
సెర్చ్ ఇంజిన్లు, సోషల్ మీడియా వేదికలు కూడా గుర్తించేందుకు వీలుగా మా సమాచారాన్ని అందిస్తున్నాం. సమాచారానికి ఆధారమేమిటనేది గుర్తించేందుకు ఇది తోడ్పడుతుంది.
బీబీసీ జర్నలిస్టులకు నిర్దేశించే ప్రమాణాలు ఇవీ...
బీబీసీకి చాలా కాలం కిందటి నుంచే ఎడిటోరియల్ మార్గదర్శకాలు ఉన్నాయి. వీటిని మా కంటెంట్ అంతటికీ వర్తింపజేస్తాం. మా జర్నలిస్టులకు ఇవి ప్రమాణాలను నిర్దేశిస్తాయి. మా న్యూస్‌రూమ్‌లో బీబీసీ మార్గదర్శకాలు మమ్మల్ని ఎలా నడిపిస్తాయో మీకు సులభంగా అర్థమయ్యేందుకు వివరాలను ఈ పేజీలో పొందుపరిచాం.
మిషన్ స్టేట్‌మెంట్: నిష్పాక్షిక, అత్యున్నత ప్రమాణాలతో కూడిన కంటెంట్‌తో పాఠకులకు, వీక్షకులకు సమాచారం చేరవేయడం, అవగాహన పెంచడం, వినోదం అందించడం, ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయడం బీబీసీ మిషన్. పూర్తి వివరాలను బీబీసీ చార్టర్‌లో చూడొచ్చు.
యాజమాన్యం, నిధులు, గ్రాంట్లు: మా ఎడిటోరియల్ స్వతంత్రతను ప్రభావితం చేయగల ప్రయోజనాలుగానీ, వ్యవహారాలుగానీ మాకు లేవు. వీటితోపాటు రాజకీయ, వాణిజ్య ఒత్తిళ్లుగానీ, వ్యక్తిగత ప్రయోజనాలుగానీ మా నిర్ణయాలను ప్రభావితం చేయవు. ఈ విషయంలో పాఠకులు, వీక్షకులు ధీమాగా ఉండొచ్చు. బ్రిటన్‌లో, ప్రపంచవ్యాప్తంగా బీబీసీ న్యూస్‌కు నిధులు ఎలా అందుతాయనే వివరాలను 'బీబీసీ చార్టర్ ఆన్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ బీబీసీ'లో చూడొచ్చు.
బీబీసీ ఏర్పాటైన తేదీ: బీబీసీ 1922 అక్టోబరు 18న ఏర్పాటైంది. బీబీసీ చరిత్ర వివరాలను ఈ లింక్‌లో చూడొచ్చు.
ఎథిక్స్ పాలసీ: బీబీసీ ఎడిటోరియల్ విలువలను, విధానాలను బీబీసీ ఎడిటోరియల్ మార్గదర్శకాలు సూచిస్తాయి. మా కంటెంట్ అంతా వీటికి లోబడి ఉంటుంది.
భిన్నత్వ విధానం: భిన్నత్వానికి బీబీసీ ఎలా కట్టుబడి ఉందో ఈ లింక్‌లో చూడొచ్చు.
సిబ్బంది విషయంలో భిన్నత్వం: సిబ్బంది విషయంలో భిన్నత్వాన్ని పెంచడానికి బీబీసీ ఎలా కృషి చేస్తోందో ఈ నివేదికలో చూడొచ్చు.
దిద్దుబాట్లు(కరెక్షన్స్): కచ్చితత్వానికి బీబీసీ కట్టుబడి ఉంది. పొరపాట్ల దిద్దుబాటుకు సంబంధించిన విధానాన్ని ఎడిటోరియల్ మార్గదర్శకాల్లోని సంబంధిత సెక్షన్లలో చూడొచ్చు.
సరైన సోర్సుల నుంచి సేకరించిన, బలమైన ఆధారమున్న సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు నిర్ధరించుకున్న తర్వాత స్పష్టమైన, నిర్దిష్టమైన భాషలో పాఠకులకు, వీక్షకులకు అందిస్తాం. మాకు తెలియని విషయాన్ని తెలియదని నిజాయతీగా చెబుతాం. ఆధారాల్లేని ఊహాగానాలకు చోటు ఇవ్వం. ఆధారాలతో నిర్ధరించుకోలేని ఆరోపణలు, వాదనలు, ఇతర ఫ్యాక్ట్స్, కంటెంట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు, ఆ ఆరోపణలు, వాదనలు, ఇతరత్రా ఎవరివో చెబుతాం.
మేం ఎప్పుడైనా పొరపాటు చేస్తే అంగీకరిస్తాం. చేసిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకోవడాన్ని ప్రోత్సహిస్తాం.
ఏదైనా ఆర్టికల్‌ను విషయ దోషం వల్ల ఎడిట్ చేస్తే, ఆర్టికల్‌లో మార్పు లేదా దిద్దుబాటు జరిగిందని పాఠకులకు సూచించేందుకు ఆర్టికల్ చివర్లో మార్పు జరిగిన తేదీతో సహా నోట్ రాస్తాం. ఎడిటోరియల్ అర్థం మారని, విషయ దోషంలేని సందర్భాల్లో మార్పు చేయాల్సి వస్తే - ఉదాహరణకు పేరు స్పెల్లింగ్ తప్పుగా వచ్చినప్పుడు- నోట్ లేకుండానే మార్పు చేస్తాం.
ఏదైనా పరిమిత కాలం మాత్రమే ఉంచాల్సిన కంటెంట్‌ను తప్ప ఆన్‌లైన్లో ఉంచిన ఏ కంటెంటూ మేం సాధారణంగా తొలగించం. అది శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. న్యాయపరమైన కారణాలు, వ్యక్తిగత భద్రతకు ముప్పు ఉన్నప్పుడు లేదా ఎడిటోరియల్ ప్రమాణాలు తీవ్రమైన ఉల్లంఘనకు గురై సంబంధిత కంటెంట్ తొలగించడం తప్ప మరో మార్గం లేనప్పుడు మాత్రమే కంటెంట్ తొలగిస్తాం.
వెరిఫికేషన్/ఫ్యాక్ట్ చెకింగ్ ప్రమాణాలు: బీబీసీ కచ్చితత్వం, వెరిఫికేషన్ విధానం కచ్చితత్వానికి సంబంధించిన బీబీసీ ఎడిటోరియల్ మార్గదర్శకాల్లో ఉంది.
వివరాలులేని సోర్సులు: పేర్లు, ఇతర వివరాలు వెల్లడికాని సోర్సుల వినియోగానికి సంబంధించిన బీబీసీ విధానం బీబీసీ ఎడిటోరియల్ మార్గదర్శకాల్లో ఉంది.
చర్య తీసుకోదగిన ఫీడ్‌బ్యాక్: ఫిర్యాదుల పరిష్కార విధానం బీబీసీ ఫిర్యాదుల ఫ్రేమ్‌వర్క్‌లో ఉంది.
నాయకత్వం: వార్తల విభాగాన్ని నడిపించే సీనియర్ ఎగ్జిక్యూటివ్ బృందం వివరాలు ఈ లింక్‌లో ఉన్నాయి.
జర్నలిస్ట్ నైపుణ్యాలు
ఒరిజినల్ రిపోర్టింగ్‌తో ఇచ్చే బీబీసీ కథనాలకు వాటిని అందించే జర్నలిస్టుల 'బైలైన్' (పేరు) ఉంటుంది. ఆరోగ్యం, వాణిజ్యం, పర్యావరణం, సైన్స్, టెక్నాలజీ తదితర సబ్జెక్టుల్లో ప్రత్యేక నైపుణ్యాలున్న జర్నలిస్టులు రాసిన కథనాలకు బైలైన్లు ఎక్కువగా వస్తుంటాయి.
బీబీసీ న్యూస్ గాదరింగ్, బీబీసీ బ్రాడ్‌కాస్ట్ ఔట్‌పుట్ బృందాలు, వార్తాసంస్థలు, ఇతర సోర్సుల నుంచి సేకరించిన సమాచారంతో అందించే సాధారణ వార్తాకథనాలకు, బీబీసీ బృందంలోని పలువురు జర్నలిస్టులు కలిసి పనిచేసి రాసిన వార్తాకథనాలకు బైలైన్లు ఉండవు.
బీబీసీ కంటెంట్: ఆరు రకాలు
వార్తల రిపోర్టింగ్‌కు, అభిప్రాయాలకు మధ్య తేడా పాఠకులకు స్పష్టంగా తెలిసేలా బీబీసీ న్యూస్ కంటెంట్ అందిస్తుంది. కంటెంట్‌కు సంబంధించిన ఆరు కేటగిరీలకు వేర్వేరు లేబుళ్లు ఉంటాయి. ఈ లేబుళ్లను కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు, ఇలాంటి ఇతర సాధనాలు గుర్తించగలవు.
వార్తలు: రిపోర్టర్ నేరుగా తెలుసుకున్న లేదా గమనించిన ఫ్యాక్ట్స్ ఆధారంగా; లేదా సంబంధిత విషయ పరిజ్ఞానమున్న సోర్సుల నుంచి సేకరించిన సమాచారంతో అందించే కంటెంట్ ఈ విభాగం కిందకు వస్తుంది.
విశ్లేషణ: బీబీసీ జర్నలిస్టు లేదా బీబీసీ వెలుపలి నిపుణులు ఎవరైనా తమకున్న సమగ్రమైన పరిజ్ఞానంతో అందించే కంటెంట్ ఈ విభాగం కిందకు వస్తుంది. సంక్లిష్టమైన వర్తమాన అంశాలు, ట్రెండ్స్ మీకు అర్థమయ్యేలా చూసేందుకు విశ్లేషణాత్మక కథనాలు అందిస్తాం.
ఆడియన్స్ నుంచి సేకరించడం: పాఠకులు, వీక్షకుల నుంచి నేరుగా స్పందన తెలుసుకొనేందుకు ఉద్దేశించిన కంటెంట్.
ఎక్స్‌ప్లైనర్: వార్తలు, ఆయా పరిణామాల వెనక నేపథ్యాలను, కారణాలను స్పష్టంగా వివరించే కంటెంట్.
అభిప్రాయం: బీబీసీ న్యూస్ నిష్పాక్షికంగా ఉంటుంది, తన సొంత అభిప్రాయాలు ఏవీ పాఠకులతో పంచుకోదు. కొన్ని సందర్భాల్లో వెలుపలి నిపుణుల వ్యక్తిగత అభిప్రాయాలను బీబీసీ పబ్లిష్ చేస్తుంది. సమాచారం, వాస్తవాల ఆధారంగా సదరు వ్యాసకర్తకు కలిగిన ఆలోచనలు, వ్యాసకర్త సూచనలు ఇందులో ఉంటాయి.
సమీక్ష: ఏదైనా ఈవెంట్, సినిమా, కళాకృతి లాంటి అంశాలపై విమర్శనాత్మక దృష్టితో కూడిన 'ఫస్ట్-హ్యాండ్' అభిప్రాయం.
రెఫరెన్సులు
ఆయా అంశాలపై తగిన సోర్సుల నుంచి సేకరించిన, గట్టి ఆధారాలున్న, నిర్ధరించుకున్న సమాచారాన్ని స్పష్టమైన భాషలో అందిస్తాం. మాకు తెలియని విషయాలను తెలియవని నిజాయతీగా చెబుతాం. ఆధారాల్లేని ఊహాగానాలను మా కంటెంట్‌లో నివారిస్తాం.
బీబీసీ న్యూస్ కవరేజీలో ఏదైనా ముఖ్యమైన అంశానికి ఒకే ఒక్క సోర్సుపై ఆధారపడితే వీలైనంత వరకు సంబంధీకులకు క్రెడిట్ ఇస్తాం. అవసరమైన చోట అధికారిక నివేదికలు, గణాంకాలు, ఇతర సమాచార సోర్సులకు లింక్స్ ఇస్తాం. మేం అందించే సమాచారాన్ని ఆ లింక్స్‌లో మీరే స్వయంగా చూసి తెలుసుకొనేందుకు మేం ఈ ఏర్పాటు చేస్తాం.
అదనపు సమాచారాన్ని, సోర్సు మెటీరియల్, లేదా అవగాహనతో రాసిన కామెంట్‌ను తెలుసుకొనేందుకు వీలుగా అవసరమైన చోట ఆయా థర్డ్-పార్టీ వెబ్‌సైట్ల లింక్స్ కూడా ఇస్తాం.
మెథడాలజీ
సంక్లిష్టమైన పరిశోధనాత్మక కథనాలు, డేటా జర్నలిజం ప్రాజెక్టులు లాంటి లోతైన అంశాలను మీరు అర్థం చేసుకొనేందుకు తోడ్పాటు అందిస్తాం. ఆయా కథనాల్లో అంతర్లీనంగా ఉన్న డేటాను, సమాచారాన్ని విశ్లేషించిన తీరును, హెచ్చరికలు, మినహాయింపులు, అధ్యయన విధానం, శాంపిల్ పరిమాణం, మార్జిన్స్ ఆఫ్ ఎర్రర్, డేటాను సేకరించిన కాలం, పద్ధతి లాంటి వివరాలను మీకు అర్థమయ్యేలా విడమర్చి చెబుతాం.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)