నార్వే: ఎవరెంత సంపాదిస్తున్నారో, ఎంత పన్ను కడుతున్నారో ఇట్టే తెలుసుకోవచ్చు

  • 7 అక్టోబర్ 2017
నార్వే దేశంలో జీతాలు ప్రభుత్వ ఉద్యోగుల జీతం Income Tax Transparency Norway salary Image copyright Getty Images

బీబీసీలోని టాప్ యాంక‌ర్ల‌కు ఎంతెంత జీతాలు ఉంటాయో ఈ మ‌ధ్య‌నే బ్రిటీష్‌ పేప‌ర్లు బ‌య‌ట‌పెట్టాయి. అయితే, బ్రిట‌న్‌లోని మిగ‌తా టీవీల్లోని యాంక‌ర్ల జీతాలు ఎంత‌నేది ఇంకా దాపరికమే. మ‌న దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో టీవీ యాంక‌ర్లు, జర్నలిస్టుల జీతాలు ఎంత‌నేది కూడా ర‌హ‌స్య‌మే.

కానీ, నార్వేలో మాత్రం ఇలాంటి ర‌హ‌స్యాలేమీ లేవు. ఎవ‌రెవ‌రికి ఎంతెంత జీతం అందుతోంద‌నేది ఎవ‌రైనా తెలుసుకోవ‌చ్చు. దీనివ‌ల్ల పెద్ద‌గా స‌మ‌స్య‌లేమీ రావ‌టం లేదు.

నార్వేలో 1814వ సంవ‌త్స‌రం నుంచే ఎవ‌రెంత సంపాదిస్తున్నారు, ఆస్తులు ఏమేం ఉన్నాయి, ఎంత ప‌న్ను క‌డుతున్నార‌నేది అంద‌రూ తెలుసుకునే అవ‌కాశం ఉంది. గతంలో ఈ సమాచారాన్ని ఒక పుస్త‌కంలో రాసి ప‌బ్లిక్ లైబ్ర‌రీలో పెట్టేవాళ్లు. 2001వ సంవత్సరం నుంచి ఈ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పెడుతున్నారు.

చాలా మందికి ఈ సమాచారం తెలుసుకోవటం సరదా అయ్యింది. అలా తెలుసుకున్న సమాచారాన్ని కొందరు ఫేస్‌బుక్‌లో పెట్టేస్తున్నారు.

నార్వే ప్ర‌జ‌లు ఆదాయ‌పు ప‌న్ను చాలా ఎక్కువ‌గా చెల్లిస్తారు. వాళ్లు స‌గ‌టున 40.2 శాతం పన్ను కడుతుంటే బ్రిటీష్ ప్ర‌జ‌లు కట్టేది 33.3 శాతం. అంత మొత్తం ప‌న్ను క‌డుతున్న‌ప్పుడు మిగ‌తావాళ్లు ఏం చేస్తున్నార‌నేది తెలుసుకోవాలనుకోవటం సహజమే.

చిత్రం శీర్షిక 2001కి ముందు ఏడాదికి ఒక‌సారి ముద్రించే.. ఆదాయం, ప‌న్ను స‌మాచారం ఉండే ఇలాంటి పెద్ద‌, బండ పుస్త‌కాలల్లో స‌మాచారం వెతికేందుకు ఎంతో మంది యువ‌కులు, ప్ర‌జ‌లు బారులు తీరేవాళ్ల‌ు.

జీతాల్లో తేడాలు చాలా తక్కువ

ప‌న్నుల వ్య‌వ‌స్థ‌పైన‌, ప్రభుత్వం చేసే ఖర్చుపైన ప్రజలకు న‌మ్మ‌కం, విశ్వాసం కలగాలంటే అంతా పారదర్శకంగా ఉండాలి కదా! ఈర్ష్య, అసూయ‌ల వ‌ల్ల వ‌చ్చే స‌మ‌స్య‌ల కంటే ఈ పార‌ద‌ర్శ‌క విధాన‌మే బాగుందని అంతా అంటున్నారు.

చాలా ఆఫీసుల్లో ఇత‌ర ఉద్యోగులు ఎంతెంత సంపాదిస్తున్నారో అక్క‌డ ప‌నిచేసే వాళ్ల‌కి తెలుస్తుంది. ప‌లు రంగాల్లో ఉమ్మ‌డి ఒప్పందాల ద్వారానే జీతాల‌ను నిర్ణ‌యిస్తారు. జీతాల్లో తేడాల‌నేవి చాలా త‌క్కువ‌.

అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌ను బ‌ట్టి చూస్తే ఆడ-మ‌గ జీతాల వివ‌క్ష కూడా త‌క్కువే. ఒకే ప‌నికి స‌మాన వేత‌నం విష‌యంలో వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం 144 దేశాల్లో నార్వేకు మూడో ర్యాంకు ఇచ్చింది.

కాబ‌ట్టి, ఫేస్‌బుక్‌లో పెట్టే పోస్టుల వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఇబ్బందిలేదు.

చిత్రం శీర్షిక 2015లో నార్వే ప్ర‌ధాన‌మంత్రి ఎమా సోల్బ‌ర్గ్ 1,573,544 క్రోన‌ర్ (రూ. కోటీ 25 ల‌క్ష‌లు) సంపాదించారు. ఆమె ఆస్తుల విలువ 2,054,896 క్రోన‌ర్(రూ. కోటీ 63 ల‌క్ష‌లు). ఆమె 677,459 క్రోన‌ర్ (రూ.54 ల‌క్ష‌లు) ప‌న్ను చెల్లించారు.

ఐడీ ఇవ్వకుండా సమాచారం తెలుసుకోలేరు

అయితే, ఒకప్పుడు మాత్రం.. త‌మ స్నేహితులు, పొరుగువాళ్లు, స‌హోద్యోగుల జీతాల వివ‌రాల్లోకి తొంగిచూసేందుకు ప్ర‌జ‌లు ఒక‌టికి రెండుసార్లు ఆలోచించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చాలామంది ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెచ్చారు.

ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అందులోని స‌మాచారాన్ని చూడాలంటే ఎవ‌రైనా స‌రే త‌మ నేష‌న‌ల్ ఐడీ నంబ‌ర్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. ఐడీ నంబ‌ర్ ఇవ్వ‌కుండా స‌మాచారాన్ని తెలుసుకునే అవ‌కాశం ఇప్పుడు లేదు.

"మీ స‌మాచారాన్ని ఎవ‌రెవ‌రు వెతుకుతున్నారో తెలుసుకునే అవ‌కాశం 2014లో ల‌భించింది" అని నార్వే ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్ ఉన్న‌తాధికారి మాన్స్ క్రిస్టియ‌న్ హోల్టే చెప్పారు.

నార్వేలో జ‌నాభా 52 ల‌క్ష‌లు. అందులో ప‌న్ను చెల్లించేవాళ్లు 30 ల‌క్ష‌లు. ఎలాంటి ఆంక్ష‌లూ లేన‌ప్పుడు ప్ర‌తిఏటా 1.65 కోట్ల సార్లు ఈ స‌మాచారాన్ని వెదికేవాళ్లు. ఇప్పుడు ఏటా 20 ల‌క్ష‌ల సార్లు వెదుకుతున్నారు.

గతంలో నిబంధనలేమీ లేవు కాబట్టి ఇష్టం వచ్చినట్లు వెతికేవాళ్లు. ఇలా ధనవంతుల సమాచారాన్ని నేరస్తులు తెలుసుకుని, వాళ్లని టార్గెట్ చేసేవాళ్లు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి.

త‌మ స్నేహితులు, కుటుంబ స‌భ్యులు, ప‌రిచ‌య‌స్తుల స‌మాచారాన్ని చూడ‌లేద‌ని తాజాగా చేసిన స‌ర్వేలో 92 శాతం మంది ప్ర‌జ‌లు చెప్పారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక నేరస్తులు ఈ సమాచారాన్ని తెలుసుకుని ధనవంతుల్ని టార్గెట్ చేసేవాళ్లు.

అందరి వివరాలు వెతకమంటున్న ప్రభుత్వం

ఈ ప‌న్ను జాబితాలు ప్ర‌జ‌ల నిక‌ర ఆదాయం, నిక‌ర ఆస్తులు, వాళ్లు చెల్లించిన ప‌న్నుని మాత్ర‌మే చెబుతాయి. ఎవ‌రికైనా భారీగా ఆస్తులు ఉంటే, జాబితాలో చూపించిన దానికంటే వారి ఆదాయం ఎక్కువ కావొచ్చు. ఎందుకంటే స‌హ‌జంగానే ఆస్తుల ప‌న్ను విలువ కంటే మార్కెట్ విలువ చాలా ఎక్కువ క‌దా!

ఇలా పారదర్శకంగా ఆదాయం, ఆస్తులు, పన్ను చెల్లింపుల సమాచారం ఇవ్వటం వల్ల సమస్యలు కూడా ఉన్నాయి.

త‌క్కువ ఆదాయం ఉన్న కుటుంబాల‌కు చెందిన పిల్ల‌ల్ని వాళ్ల క్లాస్‌మేట్సే వెక్కిరిస్తుంటారు. ఆదాయాన్ని వెతికి చూసే అవ‌కాశం ఉండ‌టం వ‌ల్ల‌నే ఇలా జరుగుతోంది.

అంద‌రి స‌మాచారాన్ని ప్ర‌జ‌లు వెతకాలని, అప్పుడే ప‌న్ను ఎగ‌వేసేవాళ్లు ఎవ‌రో తెలుస్తుందని నార్వే ఆదాయపు పన్ను విభాగం ఉన్నతాధికారులు అంటున్నారు. ప‌న్ను ఎగ్గొడుతున్నార‌న్న అనుమానం వ‌స్తే త‌మ‌కు చెప్పాల‌ని ప్ర‌జ‌ల్ని వారు ప్రోత్స‌హిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్ లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం