పేరెంటింగ్ సరే, షేరెంటింగ్ సంగతేంటి?

ఫొటో సోర్స్, Getty Images
చిన్నారుల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసే విషయంలో తల్లిదండ్రుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫొటోల పోస్టింగ్‌లో నియంత్రణ పాటిస్తున్నామని ఆఫ్‌కామ్ సర్వేలో పాల్గొన్న చాలా మంది తల్లిదండ్రులు తెలిపారు.
ఆఫ్‌కామ్ బ్రిటన్‌లో కమ్యూనికేషన్ వ్యవహారాల్లో వాచ్‌డాగ్‌గా పని చేస్తుంది.
పద్దెనిమిదేళ్ల లోపున్న పిల్లల వ్యక్తిగత గోప్యతను పరిరక్షించాలన్న ఆలోచనే షేరెంటింగ్‌కు కారణమని ఆఫ్‌కామ్ వివరించింది.
అయితే ప్రతి ఐదుగురు తల్లిదండ్రుల్లో ఒకరు కనీసం నెలలో ఒకసారైనా తమ పిల్లల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్టు తెలిపింది.
ఆ సంస్థ వార్షిక కమ్యూనికేషన్స్ మార్కెట్ నివేదికలో ఈ వివరాలున్నాయి.
యూగవ్ అనే సంస్థ ఏప్రిల్‌లో 1,000 మంది తల్లిదండ్రులతో నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది.
ఫొటో సోర్స్, Getty Images
సోషల్ నెట్‌వర్క్‌ల నుండి తమ పిల్లల ఫొటోలను దూరంగా ఉంచుతామని చాలా మంది తల్లిదండ్రులు చెప్తున్నారు
సోషల్ మీడియాలో షేరింగ్
- 56% మంది తల్లిదండ్రులు తమ పిల్లల ఫొటోలను పోస్ట్ చేయరు
- 70% మంది ఇతరుల ఫొటోలను వారి అనుమతి లేకుండా షేర్ చేయడం సరికాదని భావిస్తున్నారు
- 36% మంది వ్యక్తిగత ఫొటోలను ఫ్రెండ్స్, ఫాలోయర్స్ కు మాత్రమే పరిమితం చేయాలని బలంగా నమ్ముతున్నారు
- 50% మంది ఒకసారి ఫొటోలను పోస్ట్ చేసిన తర్వాత వాటిని నెట్ నుంచి పూర్తిగా తొలగించడం కష్టమని భావిస్తున్నారు
తమ పిల్లల ఫొటోలను ఆన్‌లైన్‌లో షేర్ చేయడం మంచిదా కాదా అన్న విషయంలో తల్లిదండ్రులు రెండుగా విడిపోయారని ఆఫ్‌కామ్ వినియోగదారుల గ్రూప్ డైరెక్టర్ లిండ్సే ఫసెల్ బీబీసీతో చెప్పారు.
కాగా.. ఫొటోలను షేర్ చేసే వారిలో 80% శాతం మందికి పైగా ఆ ఫొటోలను ఎవరు చూడొచ్చు.. అంటే, స్నేహితులు, కుటుంబ సభ్యులకు పరిమితం చేయాలనే విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు.
ఇక షేర్ చేయని వారిలో 87% మంది తమ పిల్లల జీవితాలను గోప్యంగానే ఉంచడం మంచిదని భావిస్తున్నారు. అలాగే తమ పిల్లలు వారి ఫొటోలు, వీడియోలను తాము అప్‌లోడ్ చేయడానికి ఇష్టపడరని 38 శాతం మంది చెప్పారు.
అయితే పిల్లలకు వారి ఫొటోలు, వీడియోలను ఆన్‌లైన్‌లో పెట్టడం ఇష్టమేనని వాటిని షేర్ చేసే వాళ్లలో 52% శాతం మంది తెలిపారు. ఇక తమ పిల్లలు పెద్దయ్యాక ఏమనుకుంటారనే విషయం గురించి ఆలోచించే వాళ్లు కేవలం 15% మంది ఉన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
సర్వేలో గుర్తించిన విషయాలను తల్లిదండ్రులు పరిగణనలోకి తీసుకోవాలని ఎన్ఎస్‌పీసీసీ చిల్డ్రన్స్ చారిటీ సూచిస్తోంది
ఇకపోతే, సోషల్ మీడియా, మేసేజింగ్ యాప్‌ల నియమ నిబంధనలను చదవకుండానే వాటిని అంగీకరిస్తుంటామని సర్వేలో పాల్గొన్న వారిలో చాలా మంది అంగీకరించారు.
అలాగే ఫొటోలు, వీడియోలను ఒకసారి అప్‌లోడ్ చేసిన తర్వాత నెట్ నుంచి వాటిని చెరిపివేయడం సులభం కాదని సగం మంది ఒప్పుకున్నారు.
ఈ సర్వేలో గుర్తించిన విషయాలను తల్లిదండ్రులు పరిగణనలోకి తీసుకోవాలని ఎన్ఎస్‌పీసీసీ చిల్డ్రన్స్ చారిటీ విజ్ఞప్తి చేసింది.
"ఒక ఫోటో లేదా వీడియోను అప్‌లోడ్ చేసిన ప్రతిసారీ అది ఆ చిన్నారికి సంబంధించిన డిజిటల్ ఆనవాళ్లను సృష్టిస్తుంది. అవి ఆ చిన్నారి పెద్దయ్యాక కూడా అనుసరిస్తాయి" అని ఒక అధికార ప్రతినిధి పేర్కొన్నారు.
"ఒక చిన్నారి ఫొటోలు లేదా వీడియోలను పోస్ట్ చేసే ముందు ఆ చిన్నారి అనుమతి కోరడం చాలా ముఖ్యం. "
"ఇక మరీ చిన్న పిల్లల విషయంలో అయితే వారి ఫొటోలు లేదా వీడియోలను మీరు పోస్ట్ చేస్తే వారు సంతోషిస్తారా, లేకపోతే ఇబ్బందిపడతారా అనేది ఆలోచించండి. కచ్చితంగా తెలియకపోతే పోస్ట్ చేయకపోవడం ఉత్తమం" అని ఆ అధికార ప్రతినిధి వివరించారు.
ఫొటో సోర్స్, Getty Images
సెల్ఫీ తీసుకునే వారిలో దాదాపు సగం మంది వాటిని పోస్ట్ చేసే ముందు యాప్‌ల ద్వారా ఎడిట్ చేస్తున్నారు
సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసే ఫొటోల విషయంలో జనం తీసుకునే జాగ్రత్తలను కూడా ఈ అధ్యయనం పరిశీలించింది.
సెల్ఫీకి మెరుగులు
- సెల్ఫీలు తీసుకునే వారిలో 61% మంది అవి కచ్చితంగా ప్రతిబింబిస్తాయని చెప్తున్నారు
- 44% మంది సెల్ఫీలను పోస్ట్ చేసే ముందు ఎడిట్ చేస్తారు
- 27% మంది ఫొటోలు తమ జీవితాన్ని మరింత ఆసక్తికరంగా చేస్తాయని అంటున్నారు
- 29% మంది 1-2 నిమిషాలు ఎడిటింగ్‌కు వెచ్చిస్తారు
- 17% మంది 2 నిమిషాల కన్నా ఎక్కువ సమయం వెచ్చిస్తారు
సర్వేలో పాల్గొన్న వారు తాము పోస్ట్ చేసిన ప్రతి సెల్ఫీ కోసం ఆరు ఫొటోలు తీసుకున్నారు.
అదీగాక, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, ఫేస్‌బుక్కుల్లో ఉన్న ఫిల్టర్లతో పాటు ముఖ సౌందర్యాన్ని పెంపొందించే అనేక యాప్‌లకు చాలా ప్రజాదరణ ఉంది. సెల్ఫీ తీసుకునే వారిలో దాదాపు సగం మంది వాటిని పోస్ట్ చేసే ముందు ఈ యాప్‌ల ద్వారా ఎడిట్ చేయడానికి కనీసం నిమిషమైనా వెచ్చిస్తున్నారు.
అలాగే జనం తమ సొంత సెల్ఫీ-పోర్ట్రెయిట్ల గురించి తాము ఏమనుకుంటున్నారు, ఇతరుల సెల్ఫీల గురించి ఏమనుకుంటున్నారు అనే దాని మధ్య సంబంధం లేదని ఈ నివేదిక చెప్తోంది. తమ సెల్ఫీలు తమను ఖచ్చితంగా ప్రతిఫలిస్తాయని సర్వేలో పాల్గొన్న 61% మంది చెప్పారు. అయితే ఇతరులు తమ జీవితాలకు అందంగా మెరుగులద్ది చూపిస్తున్నారని 74% మంది పేర్కొన్నారు.
ఫేస్‌బుక్ వర్సెస్ యూట్యూబ్
ఫేస్‌బుక్ (3.97 కోట్లు) కన్నా యూట్యూబ్‌లో (4.20 కోట్లు) ఎక్కువ మంది బ్రిటన్లు ఉన్నప్పటికీ ఫేస్‌బుక్‌కే జనం ఎక్కువ అలవాటుపడుతున్నట్లు ఈ నివేదిక సూచిస్తోంది. ఆండ్రాయిడ్ పరికరాల కోసం ఆఫ్‌కామ్ 2016 వేసవిలో ఒక స్మార్ట్‌ఫోన్ ట్రాకింగ్ యాప్‌ను విడుదల చేసి, 1,200 మంది వలంటీర్ల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించింది.
సర్వేలో పాల్గొన్న వారు రోజులో 11.7 సార్లు ఫేస్‌బుక్ యాప్ ఉపయోగించినట్లు అందులో వెల్లడైంది. దీనికి విరుద్ధంగా యూట్యూబ్‌ను 2.6 సార్లు మాత్రమే ఉపయోగించినట్లు తేలింది.
ఫొటో సోర్స్, YURI KADOBNOV/AFP/Getty Images
సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసే ఫొటోల విషయంలో జనం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తేలింది
ఈ నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు
- ట్యాబ్లెట్ కలిగివున్న వారి సంఖ్య తొలిసారిగా తగ్గింది. ఆ తగ్గుదల వార్షికంగా 1% ఉందని, ఇది లెక్కలోకి తీసుకోవాల్సినంత అంశం కాకపోవచ్చునని ఆఫ్‌కామ్ పేర్కొంది.
- 55 ఏళ్ల వయసులోపు ఉన్నవారిలో దాదాపు 40% మంది ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న టీవీ కలిగివున్నారు. గేమ్స్ కన్‌సోల్, సెట్-టాప్ బాక్స్ లేదా డాంగల్‌తో అనుసంధానమై ఉండటం లేదా అందులో అంతర్నిర్మిత సామర్థ్యం ఉండటం దీనికి కారణం. బ్రిటన్లు ఒకే టెలివిజన్ కార్యక్రమానికి చెందిన పలు ఎపిసోడ్లను ఒకేసారి చూసేలా ఇది ప్రోత్సహిస్తోంది.
- సర్వేలో పాల్గొన్న వారిలో 9% మంది తాము సినిమాలు, టీవీలు షోలను టాయిలెట్‌లోనూ చూసినట్లు చెప్పారు. అంతే శాతం మంది వాటిని గార్డెన్‌లో వీక్షించినట్లు తెలిపారు.
- ప్రధానమైన సోషల్ నెట్‌వర్క్‌లలో గత ఏడాది స్నాప్‌చాట్ అత్యధికంగా వృద్ధి చెందింది. కొత్తగా 31 లక్షల మంది యూకే సభ్యులు చేరడంతో దీనిని వినియోగిస్తున్న బ్రిటన్ల సంఖ్య 1.03 కోట్లకు పెరిగింది. అయినప్పటికీ ఈ యాప్ పింటరెస్ట్, లింక్‌డ్ఇన్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ల కన్నా వెనుకబడే ఉంది.
- బ్రిటిష్ వయోజనుల్లో 88% మంది ఇప్పుడు ఇంటివద్ద ఇంటర్నెట్ కనెక్షన్ కలిగి ఉన్నారు. అయితే ఇంటర్నెట్ అనుసంధానం లేని వారిలో కేవలం 1% మంది మాత్రమే 2017లో ఆన్‌లైన్ సదుపాయం పొందాలని భావిస్తున్నారు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి.)